Wednesday, September 30, 2015

హేమద్‌పంత్- 2



Play Audio





ఒకసారి గురువు మనజీవితంలోకి ప్రవేశిస్తే మన జీవన విధానం మారటం ప్రారంభమవుతుంది. అదే హేమద్‌పంత్ విషయంలో కూడా జరగబోతుంది.  తను బాబా దర్శనం అయిన తర్వాత వాడాకు వెళ్ళి స్నానాదులు పూర్తి చేసిన తరువాత బాలసాహేబ్ భాటే తో గురువు యొక్క అవసరాన్ని గురించి వాదం జరిగింది. భాటే గురువు అవసరం ఎంతైన ఉంది అని వాదించారు. కాని హేమద్ దానికి వ్యతిరేకంగా స్వప్రయత్నం ఎంతో అవసరం అని ఇది లేకపోతే గురువు మాత్రం ఏం చేయగలడు? ఇలా వాదోపవాదాలతో వాడాలో వాతావరణం వేడెక్కింది. అలా ఈ వాదం ఎటూ తేలక మేము మసీదుకి వెళ్ళాము, అప్పుడు బాబా వాడాలో ఏం జరుగుతుంది, ఆ వాదోపవాదాలు దేనికోసం? మరి ఈ హేమద్‌పంత్ అంటున్నది ఏమిటి? అప్పుడు బాబా యొక్క సర్వజ్ఞత్వం నాకు బోధపడింది. ఎక్కడో వాడాలో జరిగిన వాగ్వివాదం ఆయనకు తెలిసింది. ఇదే రోజున అన్నాసాహేబ్ దాబోల్కర్‌కి బాబా హేమద్‌పంత్ అనే నామకరణం చేయడం జరిగింది. ఈ విధంగా బాబా హేమద్‌లోని రజోగుణాన్ని నియంత్రించి ఆయనలో మార్పును తీసుకువచ్చి సరళమార్గంలో నడిపించారు.
  
                ఈ సంఘటన తరువాత హేమద్‌పంత్ ఈ విధంగా నిశ్చయించుకున్నారు. నేను వాదాభిమానం అనే దుస్వభావాన్ని త్యాగం చేసుకోవటానికే నాకీ "హేమద్‌పంత్" అనే బిరుదు వచ్చింది. నేను జీవితాంతం నిరభిమానంగా వినమ్రుడనై ఉండాలన్న విషయాన్ని నిరంతరం నాకు జ్ఞాపకం చేయటానికే నాకీ పేరు వచ్చింది. అని సచ్చరితలో చెప్పారు.

                ఈ విషయాన్ని మన జీవితానికి చాలా చక్కగా అన్వయించుకోవచ్చు. మనము మన అహంకారానికి బానిసలము. ఈ సృష్టిలో వాగ్వివాదాలకు చోటు లేదు. నాకు తెలిసిందే సత్యము అని ప్రతి ఒక్కరి భావనలో ఉంటుంది. మన పూర్వజన్మ వాసనలను బట్టి ఈ జన్మలో నేర్చుకున్న వాటిని బట్టి మన ఆలోచనా శక్తి వ్యక్తమవుతుంది. ఈ భావనలే మనచుట్టూ ఉండే ప్రపంచాన్ని మార్చాలని వాటిని మనకు తగ్గట్టుగా ఉంచుకోవాలని ప్రయత్నాలు చేస్తాయి. ఈ ప్రయత్నంలో మనకు ఎదురుదెబ్బలు తగులుతాయి. ఇవే దుఃఖానికి కారణమవుతాయి. ఈ సత్యాన్ని మనకు అర్ధం అయ్యేట్లు చెప్పగలిగేవి ఒక్క గురువు మాత్రమే. అందుకే గురువు అవసరం చాటి చెప్పడానికే పరమాత్ముడు అవతారం తీసుకున్నప్పుడు ఈ గురుధర్మాన్ని పాటించాడు. కృష్ణుడిగా సందీపుని, రాముడుగా వశిష్ట మహార్షిని గురువుగా తీసుకొని మనకు ఆదర్శం అయ్యారు. అలా అని వారు పురుష ప్రయత్నం మానలేదు. వశిష్ట గీతలో రాముడుకు, వశిష్టుడు ఈ పురుష  ప్రయత్నం గురించి ప్రత్యేక బోధచేస్తారు. మనము కూడా కష్టపడాలి. అంతా గురువే చెయ్యాలని కూర్చుని మన ప్రయత్నం లేకపోతే మనం ఈ పయనంలో ఎదురు దెబ్బలు తింటాము.

                హేమద్‌పంత్ అనే వజ్రాన్ని బాబా తన దగ్గరకు రప్పించుకున్నారు. కాని ఆ వజ్రానికి సానబెట్టి మెరుగులు దిద్ది దాన్ని ప్రకాశవంతం చేయాలి. పరమ గురువులకు ఒకసాధకుడికి అడ్డువచ్చె విక్షేపాలు అన్ని స్పష్టంగా కనబడతాయి. అవి ఆ సాధకుడికి తెలియకపోవచ్చు. కాని వాటిని కనక సరిదిద్దకపోతే అవి ఆ సాధకుడిని అదాఃపాతళానికి తొక్కేస్తాయి. బాబా తన భక్తులను గృహస్థ ఆశ్రమంలోనే ఉంచి వారిని ముందుకు నడిపించేవారు. దీనిలో భాగంగానే హేమద్‌పంత్‌ని కూడా ఉద్ధరించడం జరిగింది. మనలో పొంచి ఉన్న ఈ శత్రువులను తరిమికొట్టాలి.

                సాఠే అనే ఒక పెద్దమనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు. మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఎవరో షిరిడికి వెళ్ళమని చెపితే వచ్చి బాబాను దర్శించాడు. గురు చరిత్ర పారాయణం చేశాడు. ఆ ఏడవ రోజు స్వప్నంలో బాబా గురుచరిత్రను వివరిస్తునట్లుగా చూశాడు. ఈ విషయం దీక్షిత్‌కు చెప్పగా అక్కడే ఉన్న హేమద్ మనసులో కలవరం మొదలయింది. ఈ సాఠే ఒక్కసారి పారాయణం చెయ్యగానే బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. కాని నేను 40 ఏళ్ళుగా చేస్తున్నా నాకు ఎన్నడు ఇటువంటి అదృష్టము కలగలేదు అని అనుకున్నాడు. ఇది పసిగట్టిన బాబా హేమద్‌ను 15 రూపాయల దక్షిణ తెమ్మని శ్యామా ఇంటికి పంపించారు. ఆ తరువాత శ్యామా చెప్పే మాటలను జాగ్రత్తగా వినమన్నారు. ఆ తరువాత కథ మనము చదివిందే. శ్యామా 15 నమస్కారాలు దక్షిణగా ఇచ్చి రాధాభాయి దేశ్‌ముఖ్ కథ చెప్పారు. ఈ సంఘటన ద్వారా బాబా హేమద్‌కి చాలా విషయాలు నేర్పించారు. అవి ఏమిటో మనము ఇప్పుడు పరిశీలిద్దాము.

                మొట్టమొదటగా హేమద్‌కు ఆ రోజు ఒక నియమ భంగం కలిగింది. ఆయన రోజు భాగవతం పారాయణం చేస్తారు. కాని ఆ రోజు బాబా గోష్టిలో పాల్గొనాలి అని పారాయణం చేయకుండా మశీదుకు వెళ్తారు. శ్యామా ఇంటిలో ఉన్న భాగవత పుస్తకంలో సరిగ్గా అదే పుటను చూపించి తను ఎక్కడైతే పారాయణం ఆపాడో అక్కడే మరల చదివిస్తారు. ఇదే బాబా మనకు బోదిస్తున్న విషయం. మనము చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. మన ఆలోచనలు మనల్ని బానిసలుగా మార్చుకోకూడదు. తరువాత రాధాభాయి కథను మసీదులో బాబాకు హేమద్ వినిపిస్తాడు. అప్పుడు సాయి హేమద్‌కు ఈ విధంగా బోధచేస్తారు.

                ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఈ సమ్యక్ విజ్ఞానం ధ్యానం ద్వారానే సంభవం. ధ్యానమే ఆత్మనుష్టానం. దీని ద్వారా మనలోని చిత్తవృత్తులు అన్ని సమాధాన పడ్తాయి.ముందుగా నువ్వు ఈ సర్వ ఈషణలు  నుండి ముక్తుడవు అవ్వాలి. (ఇక్కడ ఈషణలు అంటే మనకు జీవితంలో కలిగే కోరికలు, తపనలు, ప్రేమానురాగాలు). తర్వాత సర్వ భూతస్థ ఆత్మను ధ్యానించాలి. (అంటే నిరాకార ధ్యానం) అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇది కనక కష్టమైతే నా ఈ సగుణ రూపాన్ని ధ్యానించు. ఇలాచేస్తే నీ మనసు ఏకాగ్రమవుతుంది. నువ్వు బ్రహ్మంతో ఏకమవుతావు. అని చక్కని బోధ బాబా హేమద్‌కు చేయడం జరిగింది. ఆ తరువాత బాబా వీటన్నింటిని చక్కగా శ్రవణ మన్న నిధి ధ్యానాల ద్వారా మహదానందాన్ని పొందవచ్చు అని చెప్పారు.

                సద్గురువులు మనకు ఎన్నోవిషయాలు చెప్పవచ్చు కాని అవి మన నిజజీవితంలోకి అన్వయించుకుంటేనే అవి మనకు ఉపయోగపడ్తాయి. ఇక్కడ రాధాభాయి కథ ద్వారా శ్రద్ధ, సబూరి అనే గొప్ప మంత్రాల్ని బాబా మనకు ఇచ్చారు. మనకు ఉపనిషత్తులు అన్ని బాగా తెలియవచ్చు. కాని నిజజీవితంలో మార్పులు రాకపోతే ఆ జ్ఞానం మనల్ని ముందుకు తీసుకువెళ్ళదు. ఇక్కడ హేమద్‌పంత్ యొక్క అంతర్ శత్రువులను బాబా వెలికి తీసుకువచ్చి ఒక్కొక్కటిగా పారద్రోలి, తను ముందు ముందు చేయించబోయే సత్కర్మలకు సిద్ధం చేసారు. ఈ సందర్భంలోనే బాబా చాలా సూక్తులు వినిపించారు. పూర్వజన్మ బంధనం లేనిదే ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి మనిషి, పశువు, పక్షి ఏదైనా నిన్ను చేరవస్తే చీ కొట్టి తరిమేయకు. నీవద్దకు ఎవరు వచ్చినా తగినట్లుగా ఆదరించు. దాహార్తులకు మంచినీళ్ళు ఇవ్వు, ఆకలిగా ఉన్నవారికి అన్నము పెట్టు. వస్త్రాలు లేని వారికి దుస్తులు ఇవ్వు. అనాశ్రితులకు  ఆశ్రయమివ్వు ఇలా చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు. ఒకరు నిన్ను దానం అడుగుతారు ఇస్తే ఇవ్వు అంతేకాని వారిని నిందించవద్దు. ఇతరులు నిన్ను మాటలతో గాయపరుస్తారు. ఆ నిందలను నువ్వు ఓర్పుతో భరిస్తే నీకు అపరిమితమైన ఆనందం అనుభూతమవుతుంది. ఈ లోకం అడ్డదిడ్డంగా పోవచ్చు, కాని మనం మాత్రం తడబడరాదు. మనం మననేలపై స్థిరంగా నిలచి ఈ విశ్వక్రీడను తిలకిస్తూ ఉండాలి. నీకూ నాకూ మధ్యన ఉండే గోడను పూర్తిగా కూల్చివేయి. అప్పుడు మనకు దారి ఏర్పడుతుంది. నీవు నేను అన్న భావనే ఈ అడ్డుగోడ అని చక్కని ఉపదేశాన్ని బాబా చెప్పారు. ఇక్కడే బాబా పరనింద  కూడా  వద్దు అని చెప్పారు.


                మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అంటే పూజలు, ధ్యానాలు కన్నా మనజీవితంలో బాబా చెప్పిన మార్పులు రావాలి. అవి రాకుండా మనకు బ్రహ్మా జ్ఞానానికి కావలసిన అర్హత రాదు. అందుకే బాబా తన భక్తులను ముందుగా ఈ విషయంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించేవారు. కాని మనం ఆయన మీద నమ్మకం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము.

  
ఓం శ్రీ సాయి రాం !

No comments:

Post a Comment