మానవులుగా మనకు జీవితములో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుఅవుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు వచ్చిన కష్టాలలోనుంచి బయటపడతామా లేదా అన్న నిరాశ మనలను ఎంతగానో బయపెడుతుంది. సరే ఇది మనకు చాలతేలికగా అర్ధం అయ్యే విషయం.
కాని ఇంకో కష్టం ఉంది.
ఈ కష్టం మనకు తెలియకుండా మింగేస్తుంది. మనకు బాధ కలిగినట్లు కూడా తెలియదు. కాని చాలా నష్టం జరిగి పోతుంది.
అది ఏమిటి అంటే, మాయ.
ఈ మాయ ఏ రూపంలో అయినా రావచ్చు. దీనికి కారణం అహంభావన. ఈ అహంలోనుంచే చాలా కష్టాలను కోరి తెచ్చుకుంటాము. ఇది మొట్టమొదట మంచిదే అనిపిస్తుంది కాని మనకు తెలియకుండా ఊభిలోకి కూరుకు పోయేట్లు చేస్తుంది. మనం చాలా మంచి పనే చేస్తున్నాము అని అనుకుంటాము. మనకు దైవ అనుగ్రహం కూడా ఉండచ్చు. అయినా ఇక్కడ కూడా ఈ మాయ మనలను వదలదు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనలో మనస్తాపం కలుగుతుంది అంటే మనం మాయలో పడ్డట్టే.
మన గమ్యం మనకు తెలిసినప్పుడు,
మనము బాబానే మనకు సర్వం అని భావించినప్పుడు,
ఆయనమీద పూర్తిగా భారమంతా వేసినప్పుడు,
ఆయనే మన దైవమని నమ్మినప్పుడు,
ఆ పరమగురువే మన సద్గురువుగా సాక్షాత్కారించినప్పుడు,
అయన అనుగ్రహమే మనకు లభించినప్పుడు,
ఇక చింత ఎందుకు?
ఇంక భయం దేనికి ?
మరి దిగులు అవసరమా!
బాబా ఈ మాయ గురుంచి ఈ విధంగా చేప్పారు.
"నేను ఇల్లు వాకిలి లేని ఫకీరుని, ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా వేధిస్తుంది. నేను మరిచిపోయినా అది నన్ను మరవకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది. అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా ఎగరకొట్టేస్తుంది. మరి నేనెంత? హరి ప్రసన్నుడు అయితే అది విచ్ఛిన్నం అవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు".
ఇట్లా చెప్పి సాయి మరి కొన్ని విషయాలను కూడా చెప్పారు.
ఎల్లప్పుడూ "సాయి! సాయి !" అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను.
ఈ నా మాటలయందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామగ్రి కాని, అష్టోపచార, షోడశోపచార పూజలు కాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి యున్న చోటే నా నివాసం".
ఈ మాటలు ఎంతటి వారికైనా ఊరట కలిగిస్తాయి.
ఇక్కడ మనకు బాబా నేర్పించాలనుకున్నది ఏంటి?
మనం సృష్టి, స్థితి, లయల గురించి విన్నాము. బ్రహ్మ అనే మనసు సృష్టి చేస్తే, విష్ణువనే స్థితి దాన్ని వర్తమానంలో ఉంచితే, శంకరుడు లయ కారుడు అయి దాన్ని అంతం చేయాలి.
మనం ఒక ఆలోచనుకు ప్రాణం పోస్తాము, దానికి ఒక కార్య రూపం ఇస్తాము. కాని దాని పర్యవసానం మనం అనుకున్నట్లుగా లేక పొతే మనకు బాధ కలుగుతుంది. మన పురాణాలు పరిశీలిస్తే మనకు చాలా స్పష్టంగా అర్ధం అయ్యే విషయం ఏమిటి అంటే దేవుళ్ళు కూడా చాలా వ్యతిరేక పరిస్తితులను ఎదురు కోవాల్సి వచ్చింది. వాటిని వాళ్ళు కూడా మానవరూపంలోనే అనుభవించి మనకు ఆదర్శప్రాయులు అయ్యారు.
బాబా కూడా ఒక శరీరంలో ఉండి ఈ మాయను ఎలా అధిగమించాలొ మనకు నేర్పారు. అయన నన్ను కూడా మాయ పట్టుకుంది అని చెప్పారు. అయన పరబ్రహ్మ స్వరూపము. ఆయన మాయకు అతీతుడు. ఆయన మన స్థాయికి వచ్చి మాట్లాడితే తప్ప మనకు అర్ధం కాదు. ఒక్కో సారి సాయి నేను ఇది చేసాను, అట్లా ఉన్నాను అని చెప్తారు. అయన నిరాకారుడు, నిర్గుణుడు, మరియు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన చెప్పినవన్నీ మన కోసం.
ఇక్కడ బాబా హరిని తలుచుకోమని చెప్పడంలో అర్ధం ఏమిటి?
హరి అంటే స్థితి కారుడు - స్థితి అంటే వర్తమాన కాలం.
మనం కష్టాలలో ఉన్నప్పుడు మనం దేవుడ్ని తలుచుకుంటాము. ఇది మనకు కొంత ఊరట కలిగిస్తుంది. కాని మనం వర్తమానంలో ఉండము. దీని వల్ల మన ఆశాసౌధాలు కూలిపోయాయని బాధపడ్తాము. అంటే జరిగిపోయిన కాలం లోకి జారుకుంటాము. ఇంతే కాక భవిష్యత్తులో మనం అనుకున్నవిధంగా జరగకపోవచ్చని దిగులు చెందుతాము. కాని హరి అనే వర్తమానంలో ఉండము. వర్తమానం మనలను కార్యోన్ముఖులను చేస్తుంది. వర్తమానంలో ఉండి ఆలోచిస్తే మనకు దారి దొరుకుతుంది. ఒక్కో సారి ఈ కష్టం మనలను మింగేస్తుందా అని అనిపించవచ్చు. కాని ఈ సృష్టిలో ప్రతి దానికి లయం ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. అలాగే కష్టాలు కూడా.
ఈ చిన్న ప్రవచనంలో బాబా ఎంతో చక్కటి నిగూడ అర్ధాన్ని వివరించారు. అందుకే ఆయన చేతల గురువు. మాటల గురువు కాదు. సద్గురువులు ఎప్పుడూ తమ శిష్యుల ఉన్నతిని మాత్రమె కోరుకుంటారు. వారిని ప్రతి జన్మలో రక్షిస్తూనే ఉంటారు.
ఓం శ్రీ సాయి రాం!