In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Sunday, November 22, 2020

భగవద్గీత 5. 2- కర్మ యోగము - కర్మ సన్యాస యోగము




అర్జునుడు 5వ అధ్యాయం మొదటలో కర్మ యోగము మరియు కర్మ సన్యాస యోగములలో తనకు ఏది శ్రేయస్కరమో చెప్పమని శ్రీ కృష్ణుని అర్ధించాడు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు కర్మ యోగమే అర్జునుడికి మంచిది అని బోధ చేశారు. ఈ రెండు దారులు కల్యాణదాయకములే అని చెపుతూ కర్మ యోగము అభ్యాస యోగ్యమైనదని అందుకే అది శ్రేయస్కరమని చెప్పడం జరిగింది.

శ్రీ భగవానువాచ ! 

సన్యాసః కర్మయోగశ్చ  నిశ్శ్రేయసకరావుభౌ !

తయోస్తు కర్మసన్న్యాసాత్  కర్మ యోగో విశిష్యతే !!

కర్మ సన్యాసము, కర్మ యోగము అను ఈ రెండును పరమ కల్యాణదాయకములే. కాని ఈ రెండింటిలోను కర్మ సన్యాసము కంటే కర్మ యోగము సాధన యందు సుగమ మగుట వలన శ్రేష్టమైనది.  


మనకు ఈ రెండు దారులలో ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి అంటే ఈ రెండిటి మధ్య బేధాలు తెలుసుకోవాలి. ఆ బేధాలను అర్ధం చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్ధం అవుతుంది.

 

కర్మ యోగి సాధన సమయమున కర్మలు, కర్మఫలములు, పరమాత్మ, తానూ వేర్వేరని భావించి, కర్మ ఫలమందు ఆసక్తిని త్యజించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయును. 

 

కర్మ సన్యాస యోగి (సాంఖ్య యోగి- ఇక్కడ సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్ధం) మాయ వల్ల ఉత్పన్నమైన గుణముల వల్ల మనస్సు ఇంద్రియాలు, శరీరం ద్వారా జరిగే క్రియలన్నిటియందు కర్తృత్వం వదిలి కేవలం సర్వవ్యాపి, సచ్చిదానంద పరమాత్మ యందె భావస్థితుడై ఉండును. ఇక్కడ కర్మ సన్యాస యోగి కర్మలు చేస్తున్నాడు అని కూడా అనలేము. 

 

కర్మ యోగి తన కర్మలకు తననే కర్తగా భావించును. 

సాంఖ్య యోగి తనను కర్తగా భావించడు. 

 

కర్మ యోగి తన కర్మలను భగవంతునకు అర్పణ చేయును. 

సాంఖ్య యోగి మనస్సు, ఇంద్రియముల ద్వారా జరిగే అహంకార రహిత క్రియలను కర్మలుగా భావించడు. 

కర్మ యోగి పరమాత్మను తనకంటే వేరుగా భావించును.

సాంఖ్య యోగి సర్వదా పరమాత్మ యెడ అబేధ భావముతో ఉండును. 

 

కర్మ యోగి ప్రకృతిని, ప్రకృతి యందలి పదార్థముల ఉనికిని అంగీకరించును. 

సాంఖ్య యోగి బ్రహ్మము తప్ప వేరే ఉనికిని చూడజాలడు. 

 

కాని రెండు దారులు చివరకు ఒకటే చోటకు చేరతాయి. అంటే కర్మ యోగి కూడా చివరకు కర్మ సన్యాస యోగి అవుతాడు. కాని రజో తమో గుణాలపై పట్టు సాధించాలి అంటే కర్మ యోగము తప్పదు. చివరకు సత్వ గుణం కూడా వదిలితే కాని కర్మ సన్యాస యోగం కుదరదు. ఇక్కడ సత్వ గుణం అంటే మంచి చేయాలి, అందరికి సహాయ పడాలి అనే కర్తృత్వ భావన. ఇది కూడా ఒక పెద్ద సంసారం అయ్యి కూర్చుంటుంది. అలా అని మంచి పనులు చేయకూడదని కాదు. మన ముందుకు సహాయం అర్ధించి వచ్చిన ఏ ప్రాణికైనా ఆ పరిస్థితులను బట్టి సహాయ పడటం ధర్మం. 

మనమే కల్పించుకొని మరల ఈ ఆధ్యాత్మిక దారినుండి ప్రక్కకు వెళ్ళకూడదు అని గురువులు చెప్తారు. మన కర్మానుసారంగా ఒక వృత్తిలో ఉన్నాము. రోజు చేసే పనులే స్వార్థరహితంగా చేయడమే సేవ అని పెద్దలు చెప్తారు.


ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః!