In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, September 30, 2015

హేమద్‌పంత్- 2



Play Audio





ఒకసారి గురువు మనజీవితంలోకి ప్రవేశిస్తే మన జీవన విధానం మారటం ప్రారంభమవుతుంది. అదే హేమద్‌పంత్ విషయంలో కూడా జరగబోతుంది.  తను బాబా దర్శనం అయిన తర్వాత వాడాకు వెళ్ళి స్నానాదులు పూర్తి చేసిన తరువాత బాలసాహేబ్ భాటే తో గురువు యొక్క అవసరాన్ని గురించి వాదం జరిగింది. భాటే గురువు అవసరం ఎంతైన ఉంది అని వాదించారు. కాని హేమద్ దానికి వ్యతిరేకంగా స్వప్రయత్నం ఎంతో అవసరం అని ఇది లేకపోతే గురువు మాత్రం ఏం చేయగలడు? ఇలా వాదోపవాదాలతో వాడాలో వాతావరణం వేడెక్కింది. అలా ఈ వాదం ఎటూ తేలక మేము మసీదుకి వెళ్ళాము, అప్పుడు బాబా వాడాలో ఏం జరుగుతుంది, ఆ వాదోపవాదాలు దేనికోసం? మరి ఈ హేమద్‌పంత్ అంటున్నది ఏమిటి? అప్పుడు బాబా యొక్క సర్వజ్ఞత్వం నాకు బోధపడింది. ఎక్కడో వాడాలో జరిగిన వాగ్వివాదం ఆయనకు తెలిసింది. ఇదే రోజున అన్నాసాహేబ్ దాబోల్కర్‌కి బాబా హేమద్‌పంత్ అనే నామకరణం చేయడం జరిగింది. ఈ విధంగా బాబా హేమద్‌లోని రజోగుణాన్ని నియంత్రించి ఆయనలో మార్పును తీసుకువచ్చి సరళమార్గంలో నడిపించారు.
  
                ఈ సంఘటన తరువాత హేమద్‌పంత్ ఈ విధంగా నిశ్చయించుకున్నారు. నేను వాదాభిమానం అనే దుస్వభావాన్ని త్యాగం చేసుకోవటానికే నాకీ "హేమద్‌పంత్" అనే బిరుదు వచ్చింది. నేను జీవితాంతం నిరభిమానంగా వినమ్రుడనై ఉండాలన్న విషయాన్ని నిరంతరం నాకు జ్ఞాపకం చేయటానికే నాకీ పేరు వచ్చింది. అని సచ్చరితలో చెప్పారు.

                ఈ విషయాన్ని మన జీవితానికి చాలా చక్కగా అన్వయించుకోవచ్చు. మనము మన అహంకారానికి బానిసలము. ఈ సృష్టిలో వాగ్వివాదాలకు చోటు లేదు. నాకు తెలిసిందే సత్యము అని ప్రతి ఒక్కరి భావనలో ఉంటుంది. మన పూర్వజన్మ వాసనలను బట్టి ఈ జన్మలో నేర్చుకున్న వాటిని బట్టి మన ఆలోచనా శక్తి వ్యక్తమవుతుంది. ఈ భావనలే మనచుట్టూ ఉండే ప్రపంచాన్ని మార్చాలని వాటిని మనకు తగ్గట్టుగా ఉంచుకోవాలని ప్రయత్నాలు చేస్తాయి. ఈ ప్రయత్నంలో మనకు ఎదురుదెబ్బలు తగులుతాయి. ఇవే దుఃఖానికి కారణమవుతాయి. ఈ సత్యాన్ని మనకు అర్ధం అయ్యేట్లు చెప్పగలిగేవి ఒక్క గురువు మాత్రమే. అందుకే గురువు అవసరం చాటి చెప్పడానికే పరమాత్ముడు అవతారం తీసుకున్నప్పుడు ఈ గురుధర్మాన్ని పాటించాడు. కృష్ణుడిగా సందీపుని, రాముడుగా వశిష్ట మహార్షిని గురువుగా తీసుకొని మనకు ఆదర్శం అయ్యారు. అలా అని వారు పురుష ప్రయత్నం మానలేదు. వశిష్ట గీతలో రాముడుకు, వశిష్టుడు ఈ పురుష  ప్రయత్నం గురించి ప్రత్యేక బోధచేస్తారు. మనము కూడా కష్టపడాలి. అంతా గురువే చెయ్యాలని కూర్చుని మన ప్రయత్నం లేకపోతే మనం ఈ పయనంలో ఎదురు దెబ్బలు తింటాము.

                హేమద్‌పంత్ అనే వజ్రాన్ని బాబా తన దగ్గరకు రప్పించుకున్నారు. కాని ఆ వజ్రానికి సానబెట్టి మెరుగులు దిద్ది దాన్ని ప్రకాశవంతం చేయాలి. పరమ గురువులకు ఒకసాధకుడికి అడ్డువచ్చె విక్షేపాలు అన్ని స్పష్టంగా కనబడతాయి. అవి ఆ సాధకుడికి తెలియకపోవచ్చు. కాని వాటిని కనక సరిదిద్దకపోతే అవి ఆ సాధకుడిని అదాఃపాతళానికి తొక్కేస్తాయి. బాబా తన భక్తులను గృహస్థ ఆశ్రమంలోనే ఉంచి వారిని ముందుకు నడిపించేవారు. దీనిలో భాగంగానే హేమద్‌పంత్‌ని కూడా ఉద్ధరించడం జరిగింది. మనలో పొంచి ఉన్న ఈ శత్రువులను తరిమికొట్టాలి.

                సాఠే అనే ఒక పెద్దమనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు. మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఎవరో షిరిడికి వెళ్ళమని చెపితే వచ్చి బాబాను దర్శించాడు. గురు చరిత్ర పారాయణం చేశాడు. ఆ ఏడవ రోజు స్వప్నంలో బాబా గురుచరిత్రను వివరిస్తునట్లుగా చూశాడు. ఈ విషయం దీక్షిత్‌కు చెప్పగా అక్కడే ఉన్న హేమద్ మనసులో కలవరం మొదలయింది. ఈ సాఠే ఒక్కసారి పారాయణం చెయ్యగానే బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. కాని నేను 40 ఏళ్ళుగా చేస్తున్నా నాకు ఎన్నడు ఇటువంటి అదృష్టము కలగలేదు అని అనుకున్నాడు. ఇది పసిగట్టిన బాబా హేమద్‌ను 15 రూపాయల దక్షిణ తెమ్మని శ్యామా ఇంటికి పంపించారు. ఆ తరువాత శ్యామా చెప్పే మాటలను జాగ్రత్తగా వినమన్నారు. ఆ తరువాత కథ మనము చదివిందే. శ్యామా 15 నమస్కారాలు దక్షిణగా ఇచ్చి రాధాభాయి దేశ్‌ముఖ్ కథ చెప్పారు. ఈ సంఘటన ద్వారా బాబా హేమద్‌కి చాలా విషయాలు నేర్పించారు. అవి ఏమిటో మనము ఇప్పుడు పరిశీలిద్దాము.

                మొట్టమొదటగా హేమద్‌కు ఆ రోజు ఒక నియమ భంగం కలిగింది. ఆయన రోజు భాగవతం పారాయణం చేస్తారు. కాని ఆ రోజు బాబా గోష్టిలో పాల్గొనాలి అని పారాయణం చేయకుండా మశీదుకు వెళ్తారు. శ్యామా ఇంటిలో ఉన్న భాగవత పుస్తకంలో సరిగ్గా అదే పుటను చూపించి తను ఎక్కడైతే పారాయణం ఆపాడో అక్కడే మరల చదివిస్తారు. ఇదే బాబా మనకు బోదిస్తున్న విషయం. మనము చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. మన ఆలోచనలు మనల్ని బానిసలుగా మార్చుకోకూడదు. తరువాత రాధాభాయి కథను మసీదులో బాబాకు హేమద్ వినిపిస్తాడు. అప్పుడు సాయి హేమద్‌కు ఈ విధంగా బోధచేస్తారు.

                ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఈ సమ్యక్ విజ్ఞానం ధ్యానం ద్వారానే సంభవం. ధ్యానమే ఆత్మనుష్టానం. దీని ద్వారా మనలోని చిత్తవృత్తులు అన్ని సమాధాన పడ్తాయి.ముందుగా నువ్వు ఈ సర్వ ఈషణలు  నుండి ముక్తుడవు అవ్వాలి. (ఇక్కడ ఈషణలు అంటే మనకు జీవితంలో కలిగే కోరికలు, తపనలు, ప్రేమానురాగాలు). తర్వాత సర్వ భూతస్థ ఆత్మను ధ్యానించాలి. (అంటే నిరాకార ధ్యానం) అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇది కనక కష్టమైతే నా ఈ సగుణ రూపాన్ని ధ్యానించు. ఇలాచేస్తే నీ మనసు ఏకాగ్రమవుతుంది. నువ్వు బ్రహ్మంతో ఏకమవుతావు. అని చక్కని బోధ బాబా హేమద్‌కు చేయడం జరిగింది. ఆ తరువాత బాబా వీటన్నింటిని చక్కగా శ్రవణ మన్న నిధి ధ్యానాల ద్వారా మహదానందాన్ని పొందవచ్చు అని చెప్పారు.

                సద్గురువులు మనకు ఎన్నోవిషయాలు చెప్పవచ్చు కాని అవి మన నిజజీవితంలోకి అన్వయించుకుంటేనే అవి మనకు ఉపయోగపడ్తాయి. ఇక్కడ రాధాభాయి కథ ద్వారా శ్రద్ధ, సబూరి అనే గొప్ప మంత్రాల్ని బాబా మనకు ఇచ్చారు. మనకు ఉపనిషత్తులు అన్ని బాగా తెలియవచ్చు. కాని నిజజీవితంలో మార్పులు రాకపోతే ఆ జ్ఞానం మనల్ని ముందుకు తీసుకువెళ్ళదు. ఇక్కడ హేమద్‌పంత్ యొక్క అంతర్ శత్రువులను బాబా వెలికి తీసుకువచ్చి ఒక్కొక్కటిగా పారద్రోలి, తను ముందు ముందు చేయించబోయే సత్కర్మలకు సిద్ధం చేసారు. ఈ సందర్భంలోనే బాబా చాలా సూక్తులు వినిపించారు. పూర్వజన్మ బంధనం లేనిదే ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి మనిషి, పశువు, పక్షి ఏదైనా నిన్ను చేరవస్తే చీ కొట్టి తరిమేయకు. నీవద్దకు ఎవరు వచ్చినా తగినట్లుగా ఆదరించు. దాహార్తులకు మంచినీళ్ళు ఇవ్వు, ఆకలిగా ఉన్నవారికి అన్నము పెట్టు. వస్త్రాలు లేని వారికి దుస్తులు ఇవ్వు. అనాశ్రితులకు  ఆశ్రయమివ్వు ఇలా చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు. ఒకరు నిన్ను దానం అడుగుతారు ఇస్తే ఇవ్వు అంతేకాని వారిని నిందించవద్దు. ఇతరులు నిన్ను మాటలతో గాయపరుస్తారు. ఆ నిందలను నువ్వు ఓర్పుతో భరిస్తే నీకు అపరిమితమైన ఆనందం అనుభూతమవుతుంది. ఈ లోకం అడ్డదిడ్డంగా పోవచ్చు, కాని మనం మాత్రం తడబడరాదు. మనం మననేలపై స్థిరంగా నిలచి ఈ విశ్వక్రీడను తిలకిస్తూ ఉండాలి. నీకూ నాకూ మధ్యన ఉండే గోడను పూర్తిగా కూల్చివేయి. అప్పుడు మనకు దారి ఏర్పడుతుంది. నీవు నేను అన్న భావనే ఈ అడ్డుగోడ అని చక్కని ఉపదేశాన్ని బాబా చెప్పారు. ఇక్కడే బాబా పరనింద  కూడా  వద్దు అని చెప్పారు.


                మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అంటే పూజలు, ధ్యానాలు కన్నా మనజీవితంలో బాబా చెప్పిన మార్పులు రావాలి. అవి రాకుండా మనకు బ్రహ్మా జ్ఞానానికి కావలసిన అర్హత రాదు. అందుకే బాబా తన భక్తులను ముందుగా ఈ విషయంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించేవారు. కాని మనం ఆయన మీద నమ్మకం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము.

  
ఓం శ్రీ సాయి రాం !

Wednesday, September 23, 2015

హేమద్‌పంత్- 1


Play Audio



మానవుడు తరించడానికి ఎన్నో మార్గాలు ఉండవచ్చు. ఈ మానవ జీవితం ఎన్నో లక్షల జన్మల తరువాత మనకు సంప్రాప్తించ వచ్చని మన శాస్త్రాలు చెప్తాయి. ఈ వచ్చిన జీవితాన్ని సార్ధకం చేసుకోమని ఎందరో మహానుభావులు బోధించారు. పరమాత్మే గురువుగా వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మహానుభావుల చరిత్రలు చదవడం అనేది ఒక తేలికైన మార్గం. వీరి గురించి తెలుసుకుని ఆ గ్రంథాలు పారాయణం చేయడం ముక్తికి సోపానం. సాయి పరమాత్ముని చరిత్ర ఎందరి జీవితాలలోనో మార్పులు తీసుకువచ్చి వారిని ముక్తి మార్గంలో నడిపించడం జరిగింది. అటువంటి చరిత్రను రాయడానికి సాయినాధుడు స్వయంగా హేమడ్‌పంత్‌ని ఎన్నుకోవడం అనేది ఆయన పూర్వ జన్మల పుణ్యఫలం. మనకు ఒకసారి పారాయణం చేస్తేనే ఫలితం వ్యక్తమవుతుంటే, హేమద్‌పంత్ గారు సాయి సచ్చరితను అందరికి అందించడం వలన ఆయనకు తప్పక బాబా సద్గతిని ప్రసాధించి ఉంటారు. 

సచ్చరితలాంటి ఉత్తమ గ్రంథాలను పారాయణం చేయడమే కాకుండా దాన్ని ఇతరులకు సాయి ప్రసాదంగా పంచగలిగితే ఎంత అదృష్టమో మనం వేరే చెప్పనక్కరలేదు. మనం ఎంతో ధనాన్ని మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటాము. కాని ఇటువంటి మంచిపనులకు మన ధనాన్ని ఉపయోగించగలగడం కూడా అదృష్టమే. మనం కావ్యాలు, గ్రంథాలు రాయలేకపోవచ్చు, కాని వాటిని మనం పారాయణం చేయవచ్చు. అలాగే వాటిని వేరే ఎవరికైనా బహుకరించవచ్చు. ఇటువంటి కోవకే చెందిన ఈ సాయి సచ్చరితను మనకిచ్చిన ఆ మహానుభావుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.  

జననం, కుటుంబ వివరాలు, ఉధ్యోగ వివరాలు
హేమద్‌పంత్ గారి అసలు పేరు అన్నాసాహేబ్ దాబోల్కర్. ఆయన 1859 లో పేద ఆర్యగౌడ కుటుంబంలో జన్మించారు. ఆయన ధానా జిల్లాలో ఒక గ్రామంలో జన్మించారు. ఆయన తాత, తండ్రి ఇంకా ఇతర తరాలవారు ఆచార సంపన్నులు. మిక్కిలి దైవభక్తి గల కుటుంబం. ఆయన ప్రాథమిక విద్య వారి గ్రామంలోనే అయ్యింది. తరువాత పూనాలో 5వ తరగతి వరకు చదివి ఇంగ్లీషు (ఆంగ్ల భాష) నేర్చుకున్నారు. ఆయన ఆర్ధిక పరిస్థితి సరిగా లేక ఇక ఆ పైన చదువు చడవడం కష్టం అయింది. తరువాత బడిపంతులుగా వాళ్ళ ఊరిలోనే ఉధ్యోగంలో చేరతారు. కాని ఆయనలో కష్టపడే మనస్థత్వం, పట్టుదల ఉండదంతో ఆయన స్వంతంగా మరాఠి భాషలో, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాధించారు. ఆయన తెలివితేటలు చూసి ఆయనకు గ్రామాధికారి ఉద్యోగం ఇస్తారు. తరువాత ఒక గుమస్తాగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి ఒక మెజిట్రేట్‌గా రిటైర్ అవుతారు. ఇలా ఎంత మందికి సాధ్యపడుతుంది. ఉన్నత విద్య లేకుండా ఉన్నత అధికారిగా ఎదగడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆయనకు ఒక కుమారుడు, 5 గురు కూతుళ్ళు ఉన్నారు. అందరికి చక్కగా పెళ్ళిళ్ళు అయి సాయికృపతో సుఖ సంతోషాలతో ఉన్నట్టు చెప్తారు.

తొలిదర్శనానికి అడ్డంకులు
మనలో కొంతమందికి రజో గుణము ఎక్కువ పాళ్ళలో ఉంటుంది. మనకి జీవితంలో పైకి ఎదగాలి అనే పట్టుదల ఉంటుంది. అలానే మనము చేసే పనులలో కూడా, మన అహంకారము బయటపడుతూ ఉంటుంది. నేను దీన్ని కష్టపడి చేసాను. నా చేతుల మీదగానే ఇది జరగాలి అన్న భావనలు స్పష్టంగా వ్యక్తమవుతాయి. హేమద్‌పంత్ జీవితాన్ని చూస్తే ఆయన కేవలం 5వ తరగతి వరకు చదివినా కష్టపడి ఉన్నత అధికారి పదవికి ఎదిగాడు. తనలో పాతుకు పోయిన ఆలోచనలే బాబా తొలి దర్శనానికి అడ్డుగా నిలిచాయి. ఆయన పూర్వజన్మ పుణ్యం వల్ల నానా చందోర్కర్ మరియు ధీక్షిత్ ఆయనకు స్నేహితులు అయ్యారు. నానా బాబా గురించి ఎన్నోసార్లు హేమద్‌పంత్‌కు చెప్పారు. ధీక్షిత్ కూడా బాబా యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. కాని హేమద్‌పంత్‌లో ఏమి చలనం లేదు. బాబా పట్ల నమ్మకం రాలేదు. కాని వాళ్ళు చెప్పడంతో షిర్డి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. అంతలో ఒక స్నేహితుడి కుమారుడు జబ్బునపడ్డాడు. ఎంత వైద్యం చేయించినా ప్రయోజనం లేక చివరకు ఆ స్నేహితుడు తన గురువు దగ్గరకు వెళ్తాడు. ఆ గురువు సమక్షంలో ఆయన కుమారుడు ప్రాణాలు వదులుతాడు. ఇదంతా చూసి హేమద్‌పంత్ షిర్డి ప్రయాణాన్ని నిలిపివేస్తాడు. కొన్ని రోజుల తరువాత మరల వెళ్దామని అనుకుంటే దీక్షిత్ కుమార్తె చనిపోతుంది. ఇది చూసి బాబా తన స్నేహితుడి కుమార్తెను రక్షించలేదని గురువుల వల్ల ఏమి ఉపయోగం అని నిరుత్సాహ పడతాడు. ఈ విధంగా రెండోసారి కూడా షిర్డి వెళ్ళలేక పోతాడు.

మనలో ఉన్న వాసనలు ఒక జన్మలోనివి కావు. ఎన్నోజన్మల నుండి మనల్ని వెంటాడి వేదిస్తాయి. వాటికి మనం బానిసలు అవుతాము. మనము జీవితంలో ఖచ్చితంగా ఉన్నామని భావిస్తాము. కాని ఈ భావాల వెనుక అహంకారం ఉంటుంది. ఇవి మనల్ని మోసంచేస్తాయి. మనం ఆదర్శంగా, ధర్మంగా ఉన్నామని భావిస్తాము. కాని దీనిలో రజో గుణం మెండుగా ఉంటుంది. ఈ రజో గుణమే మన ప్రగతికి అడ్డుపడుతుంది. గురుకృపకు దూరం చేస్తుంది. మనము సత్వ గుణంతో మసలుకొని గురువులకు శరణాగతి చెయ్యనిదే వారి అనుగ్రహం మనకు లభించదు. ఒకవేళ వారు మనల్ని కరుణించినా మనము తప్పులు చేస్తూనే ఉంటాము. కాని గురువు మాత్రము ఓపికగా మన వెంట ఉండి మనల్ని రక్షిస్తారు. కాని మన మూర్ఖత్వంతో మన పయనానికి మనమే అడ్డుగా నిలబడతాం. హేమద్‌పంత్ సదాచార సంపన్నుడు. నిత్యము భక్తితో దైవాన్ని పూజిస్తారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణం చేసారు. గురు చరిత్రను కూడా చాలాసార్లు చదవారు కాని గురువుల పట్ల అవగాహన ఏర్పడలేదు.

ఇక మూడోసారి నానాచందోర్కర్ స్వయంగా హేమద్‌పంత్‌కు హిత బోధ చేసారు. ఒకసారి నానా బొంబాయి వెళ్ళి కొంచెం సమయం ఉండడంతో హేమద్‌పంత్‌ని కలిసారు. ఆయన షిర్డి వెళ్ళడానికి ఎందుకు సంశయిస్తున్నాడో తెలపమని ఒత్తిడి చేస్తాడు. అప్పుడు హేమద్, గురువు పట్ల తన ఆలోచనలు వ్యక్తం చేస్తాడు. అప్పుడు నానా ఈ విధంగా చెప్తారు. నేను నీ లాగే దేన్ని గుడ్డిగా నమ్మేవాడిని కాదు. కాని సాయి అందరిలాంటి వాడు కాదు. సాయి చేసిన లీలలు, మహిమలు నన్ను పూర్తిగా మార్చాయి. ఆయన సమక్షంలో అమితమైన ఆనందం కలుగుతుంది. మన కర్మలు అడ్డుపడితే మనము మహాత్ముల దర్శనం చేసుకోలేము. కాని నీవు తప్పకుండా బాబాని కలవాలి అని ప్రేరేపించారు. ఇది కూడా బాబా లీలే.  నానా ద్వారా హేమద్‌పంత్‌లో మార్పు తీసుకువచ్చారు.

తొలిదర్శనం
సత్సంగము కలగడం కూడా అదృష్టమే. దీనికి పూర్వజన్మ పుణ్యం కావాలి. హేమద్‌పంత్‌కి నానా, ధీక్షిత్‌లతో పరిచయం కూడా అట్లాంటిదే. నానా చందోర్కర్ మాటలు హేమద్‌కి ఎంతో నచ్చాయి. ఇక షిర్డి ప్రయాణము తప్పలేదు. బాబా పిలుపు వచ్చింది. బాబా పిలవకుండా మనము షిర్డికి వెళ్ళలేము. బాబా తొలిదర్శనము చాలా విచిత్రంగా జరుగుతుంది. హేమద్‌పంత్ బొంబాయి నుండి దాదర్‌కి వెళ్ళి అక్కడ నుండి మన్మాడ్  మెయిల్ ఎక్కవచ్చని బావించి దాదర్కు టిక్కెట్ తీసుకొనెను. కాని దాదర్‌లో మన్మాడ్ మెయిల్ ఆగదని హేంద్‌పంత్‌కి తెలియదు. అప్పుడు ఒక ఫకీర్ వచ్చి ప్రయాణం ఎక్కడకు అని ఆడిగి, నీవు దాదర్‌లో దిగకుండా బోరిబందరు వెళ్లమని అతడు సలహా ఇచ్చాడు. ఈ సలహా పాటించడం వలన షిర్డికి వెళ్ళే అదృష్టం కలిగింది. ఇదే హేమద్‌కి తొలిదర్శనం. కాని గురువు వేరువేరు రూపాలలో వచ్చినప్పుడు మనం కనుగొనలేము. మనలో గురువు సర్వవ్యాపి అన్న భావన దృడంగా లేకపోతే ఇది సాధ్యపడదు.

హేమద్ తరువాత రోజు ఉదయం 9-10 గంటల మధ్య షిర్డి చేరతారు. అక్కడ బాపుసాహేబ్‌ధీక్షిత్ హేమద్ కోసం ఎదురు చూస్తున్నారు. అది 1910వ సంవత్సరం, అప్పుడు యాత్రికులు బస చేయడానికి సాథే వాడ మాత్రమే ఉన్నది. టాంగా దిగగానే బాబాను చూడవలెనన్న ఆరాటం పెరిగింది. ఇంతలో తాత్యాసాహేబ్ నూల్కర్ మసీదు నుండి వచ్చి బాబా వాడా చివర ఉన్నారు. త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి అని చెప్పారు. వెంటనే హేమద్ పరుగున వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసారు. ఈ దర్శనాన్ని గురించి హేంద్‌పంత్ ఈ విధంగా చెప్పారు.

నాకు పట్టలేనంత ఆనందం కలిగింది.  ప్రత్యక్షంగా సాయిబాబాను చూసి వారి దర్శనంతో నేను దన్యుణ్ణి అయ్యాను, నా నయనాలు సజలమయ్యాయి. ఎన్నడూ కనీవినీ ఎరుగనట్టి మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పికలు హరించిపోయాయి. ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణ స్పర్శ వారితో సంభాషణ ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. ఈ అనుభూతి నానా సాహేబ్ చెప్పిన దాని కంటె అధికంగా ఉంది , మాటల్లో వ్యక్త పరచలేనిది. ఇది అపరోక్షానుభూతి.  

అప్పటి నుండి ఈ నూతన జీవితం, ఇటువంటి సత్సంగప్రాప్తి, అంగ ప్రత్యంగ సుఖానుభూతి ఎవరి కారణంగా లభించాయో వారి ఉపకారానికి నేను నిరంతరం ఋణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్ధం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు మరియు బంధువులు. వారికంటే దగ్గరి బందువులు లేరని మనసులో అనుకున్నాను. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువల్ల కేవలం చేతులు జోడించి వారి పాదాలపైన నా శిరసును ఉంచుతున్నాను. సాయి దర్శన లాభంతో నా మనో సంశయం తొలగిపోయింది. అంతేకాదు సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది. సాయి యొక్క ధర్శనంతో చిత్తవృత్తి మారిపోయింది. అంతే కాదు పూర్వకర్మలు కూడా నశించబడతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని విశిష్టత. వారి కృపావలోకనంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ స్పర్శ వల్ల మానస సరోవరంలో హంసనై పోయాను. సాయి మహాత్ములు సాధువులలో శ్రేష్ఠులు, పరమ యోగి, పరమ హంస. పాపతాపాలను  నశింపచేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు వారి సమాగమంతో నేను అత్యంత పునీతుణ్ణి అయ్యాను. నా అనేక పూర్వజన్మల పుణ్యం వల్ల ఈ సాయి మహరాజ్ కలిశారు. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకలసృష్టి సాయి మయమనిపిస్తుంది. అని చాలా చక్కగా వర్ణించారు.


ఈ తొలిదర్శన అనుభూతిని ఎంతో చక్కగా హేమద్‌పంత్ మనకు అందించారు. ఇది కేవలం సాయికృప ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మనలో కూడా ఇటువంటి అనుభూతి కలగాలి. ఈ అనుభూతి బాబా తప్పకుండా ప్రసాదిస్తారు . కాని దానికి తగిన అర్హత మనము సంపాదించాలి. 

ఆయన మనలను అడిగిన ఈ అర్హత ఏమిటి? 
శ్రద్ధ, సబూరి అనే రెండు విషయాలను అర్ధం చేసుకోవాలి. వాటిని మన జీవితంలోకి ఆహ్వానించాలి.  అవే మన జీవితం కావాలి. మనము బాబా మీద  అమితమైన శ్రద్ధతో ఉండగలిగితే ఇటువంటి అనుభూతిని సాయి తప్పక ప్రసాదిస్తారు.

ఓం శ్రీ సాయి రాం !

Thursday, September 10, 2015

శ్రేయం - ప్రియం



Play Audio




ప్రియమైనవన్నీ శ్రేయం కాకపోవచ్చు. అలానే శ్రేయమైనది మనకు ప్రియం కాకపోవచ్చు. 

ఈ శ్రేయ, ప్రియాల మధ్య మన జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది. మన వ్యక్తిత్వానికి ఒక రూపం ఆపాదిస్తుంది. ఒక్కోసారి ఈ వ్యక్తిత్వం సమాజం కోసమా అన్నట్లు ఉంటుంది.  దీని వెనుక ఒక మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనకు ఇష్టమైనవి అంటే ప్రియమైనవి మనము మన కుటుంబం కోసం, సమాజం కోసం మనం అణిచిపెట్టుకోవచ్చు. కాని దీని మూలంగా మనిషిలో ఒక అసంతృప్తి మొదలవుతుంది. దీనిలో నుంచి నిర్లిప్తత, బాధ, దుఃఖము కలగవచ్చు. లోకంలో చాలా మంది పరిస్థితి ఇదే అవ్వచ్చు. కాని కొంత మంది ఇదేమి లెక్కచేయకుండా, వాళ్ళకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించవచ్చు. వీరు బయటకు అన్ని సుఖాలను అనుబవిస్తున్నట్లు మనకు అనిపించవచ్చు. కాని వారిలో ఒక అబద్రత బావం ఉంటుంది. ఈ అబద్రతా భావమే వారిని తప్పుదోవ పట్టేట్లు చేస్తుంది. వారిని వివేకహీనులుగా, మందబుద్ధులుగా మారుస్తుంది.

చీకటి వెలుగులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నా, అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి. అలానే శ్రేయ-ప్రియాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఏది నిజమో ఏది కాదో తేల్చుకోలేని పరిస్థితి. మానవులుగా మనం ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని అర్ధంచేసుకోలేక పోతున్నాము. మన ఋషులు చూపించిన మార్గాన్ని మనము ఎప్పుడో వదిలేశాము. అందుకే మానవ జీవితం మరింత దుర్భరమైపోతుంది. అందరం క్షణిక సుఖాల కోసం పరుగులు తీస్తూ ఉంటాము. ప్రియమైన వాటి కోసం పరుగులు తీసే మనసు గలవారు స్వార్ధంతో పతనమైపోతారు. అందుకే ఈ రెండింటి మధ్య బేధం తెలుసుకోవాలి. మన జీవితాల్ని  మార్చుకోవాలి. సాయి చేసిన ప్రతి బోధలో ఈ తత్వం కనిపిస్తుంది.

శ్రేయాలు ఏవి? ప్రియాలు ఏవి?
ఈ రెండింటిని మానవులు బాగా తెలుసుకున్నా, స్వతంత్ర బుద్ధి కలవారవటం వలన రెండింటిలో దేనిని గ్రహించాలి అన్నది వారి ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ రెండూ లభించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవటం కష్టం.
 శ్రేయం వివేక రూపమైతే, ప్రియం అవివేక రూపం.
 శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానికి సంబంధించినవి. ప్రియాలు అజ్ఞానికి సంబంధించినవి. ప్రియాలు వివేకులను ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు. మరి శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు. ఇంద్రియ విషయ సుఖాలపై కోరిక ప్రభలంగా ఉన్నంత వరకు, వివేక వైరాగ్యాలు లేనంతవరకు ప్రియాలే మధురంగా ఉంటాయి. నీళ్ళు, పాలు కలిసిపోయినట్లు ఈ శ్రేయ, ప్రియాలు కలిసిపోయి ఉంటాయి. కేవలం ధీరులు, బుద్ధిమంతులు మాత్రమే శ్రేయాన్ని ఆపేక్షిస్తారు. మానస సరోవరంలోని హంస పాలను మాత్రమే సేవించి నీటిని వదిలేస్తుంది. అలానే వివేకవంతులు శ్రేయాన్ని మాత్రమే గ్రహించి ప్రియానికి విముఖంగా ఉంటారు. కాని మందబుద్ధులు శరీరం, సంతానం, ధనం, గౌరవం మొదలగు యోగ క్షేమాల వెంటబడి ఒక్క ప్రియాలనే సాధించుకుంటారు.

మనం శ్రేయాన్ని తెలివిగా గ్రహించడం, ప్రియంలో ఉన్న అనర్ధాన్ని అర్ధం చేసుకోవడమే పురుషార్ధం.
  
శ్రేయం - ప్రియం. సరే ఈ చిక్కుముడిని విప్పడం ఎలా, ఏది శ్రేయమో ఏది ప్రియమో అర్ధంచేసుకోవడం ఎలా, మనం అసలు ఈ విషయం ఎందుకు అర్ధంచేసుకోవాలి.

ప్రపంచం యొక్క చక్రభ్రమణం అంతుపట్టనిది. అహర్నిశలూ ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. అంటే మానవుడు త్రితాపాలను అనుభవిస్తూ సహిస్తూ ఉంటాడు. దానివలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ, విసిగిపోయి వానిని తొలంగించుకోవడానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతాడు. భరించలేని భవచక్ర భ్రమణంలో పడి నలిగిపోతూ ఉంటాడు. ఈ భ్రమణం ఆగటానికి ఏఏ సాధనాలు ఉన్నాయని అన్వేషిస్తాడూ. గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్ధం అనేది ఉదయిస్తుంది. ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ తరువాత ఏవైన ప్రతిబంధకాలు కలిగితే వానిని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఇక్కడే పురుషార్ధాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి. కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకొని శ్రేయాల కొరకే పోరాడాలి. మన శాస్త్రాలు సాధన చతుష్టయంలో నిత్యానిత్య వస్తు వివేకం గూర్చి చెప్పడం జరిగింది. ఏది నిజమో ఏది అశాశ్వతమో తెలుసుకోవాలి. ఈ విచక్షణ రావాలి అంటే దైవము మరియు గురుకృప కావాలి. మన పుణ్యము, సదాచారము, సత్సంగము మనలను ఆ దారిలో నడిపిస్తాయి.
స్వప్నంలో బంగారపు వడగళ్ళవాన పడుతుంది. అవసరానికి పనికివస్తుందని అత్యంత శ్రమతో వానిని మూటకట్టుకునే ప్రయత్నం చేస్తే మెలుకువ రాగానే అవి మాయమైపోతాయి. కనిపించే వాటిని కనిపించని వాటిని అనుభవించాలన్న తృష్ణ, కోరిక ప్రతిబంధకం అవుతుంది. ముందు వీనిని సమూలంగా తీసివేయాలి.
మన బుద్ధికి అందని దానిని, నిత్యమైన దానిని, నాశనంలేని దానిని మనం చూడలేము. కాని ఈ వివేకాన్ని ఒక్క సాయి లాంటి గురువు మాత్రమే ఇవ్వగలరు. కామక్రోధాలనే మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని కలుగనివ్వవు. మన వివేకాన్ని దెబ్బతీస్తాయి. కర్పూరం కనుక దీపంతో వెలిగిస్తే చాలు అదే కర్పూరం దీపమై వెలుగుతుంది. అలానే మనం వివేకంతో శ్రేయాన్ని ఆశ్రయిస్తే మనలో జ్ఞానదీపం వెలుగుతుంది. ఒక్కసారి ఈ దీపం వెలిగితే, మనలోని వివేక వైరాగ్యాలు ఈ ప్రియాలు అనే చీకటిని తొలగిస్తాయి. నిశ్చలమైన మనసుతో ఆత్మానుసంధానం చేసే వాడొక్కడే జ్ఞానసంపన్నుడు.  
అంతఃకరణంలోని కలవరం కారణంగా, ఎప్పుడూ అశాంతిగా ఉండేవారు, ఇంద్రియలోలత్వం వలన మనసులో ఆందోళన పడేవారు, జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. సదాచారంతో శాస్త్రాలను తెలుసుకొని శ్రేయాన్ని ఆశ్రయించిన వాడు మనసులో సంతృప్తిని కలిగి ఉంటాడు. మనసు ఎప్పుడూ చెడుగా ఉన్నవారికి శాంతి ఉండదు. వారికి పరబ్రహ్మ ప్రాప్తికలగదు. జనన మరణాల చక్రం తప్పదు. 

మంచివి మరియు శ్రేయమైన అంటే విహితకర్మలు చేయకపోతే చిత్తశుద్ధి జరగదు.
 

చిత్తశుద్ధిలేక జ్ఞానసంపాదన సంభవం కాదు.
  

పరిశుద్ధమైన అంతః కరణంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై ,
 సాధన సంపత్తి లభించినచొ  ఈ శరీరమందే మోక్ష ప్రాప్తికలుగుతుంది. 

సాయి మనలను ఈ మార్గంలో నడిపించడానికే వచ్చారు.
 

సాయిని
 నమ్ముకున్నచో మనకు ఏవి మంచివో అంటే ఏది శ్రేయమో అదే ఇస్తారు. 

మనల్ని ప్రియమైన మరియు దుఃఖ కారకము అయిన వాటినుండి రక్షిస్తారు. ఇది కేవలం సాయిలాంటి సద్గురువులకే సాధ్యపడుతుంది. అందుకే మనము సాయి చెప్పిన మార్గంలో నడవాలి. శ్రద్ధ సభూరిలే మన సుగుణాలు కావాలి.





ఓం శ్రీ సాయి రామ్ !   

Wednesday, September 2, 2015

ఆత్మదర్శనము

Play Audio

మనము మన చిత్తాన్ని శుద్ది చేసుకొని, సాధన చతుష్టయాన్ని (అంటే వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి మరియు ముముక్షత్వము) బాగా అలవరుచుకుని, ఈ జ్ఞాన భూమికలలో మొట్టమొదటిది రెండవది అయిన శుబేఛ్ఛ మరియు విచారణలను పెంపొందించుకొని గురువు అనుగ్రహము పొందితే అప్పుడు తురీయస్థితికి చేరాలంటే పరమగురువుల అనుగ్రహం తప్పక ఉండాలి. దానికి ఎంతో కృషి చెయ్యాలి. అదే ప్రతి మానవుని యొక్క ముఖ్య లక్ష్యము. మనలో ఈ బ్రహ్మ జిజ్ఞాస బాగా రావాలి. బాబా ఎప్పుడూ మనలను ఈ దారిలో తీసుకువెళ్ళాలని, మనము దాన్ని తప్ప వేరే ఏదీ కోరుకోకూడదని బాబా ఉద్దేశ్యము. కాని ఆయన మన ప్రాపంచిక కోరికలు కూడా తీరుస్తూ మనల్ని ఒక్కోమెట్టు ఎక్కిస్తూ ఉంటారు.

ఈ బ్రహ్మము గురించి తెలుసుకోవడానికి మనము ఏం చేయాలి అనే విషయాలను బాబా సాయి సచ్చరితలో 16,17 అధ్యాయాలలలో చెప్పడం జరిగింది.

సంపన్నుడు మరియు లోభి అయిన ఒకరు బాబాని బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వమని అడగటం జరిగింది. ఈ సంఘటనలో బాబా చాలా చమత్కారంగా అయిదు రూపాయల కోసం ఒక కుర్రవాడిని పంపించడం జరుగుతుంది. కాని 5 రూపాయలు దొరకవు. ఈ సంపన్నుడి దగ్గర చాలా ధనం ఉన్నా, ఆయన దానిని ఇచ్చేందుకు సిద్దంగా లేడు. ఇక్కడ బాబా ఆ సంపన్నుని అడ్డుపెట్టుకుని మనందరకు జ్ఞానభోధ చేసారు.

బాబా అడిగిన ఆ అయిదు ఏమిటి ?
1) పంచప్రాణాలు
2) పంచ జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు
3) మనస్సు
4) బుద్ధి
5) అహంకారము.

బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టమున్న వారికి అది  వెంటనే లభిస్తుంది. కించిత్తయిన విరక్తి లేని వారికి, ఎవరైనా ఈ బ్రహ్మ తత్వోపదేశం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? 

ఉత్తమ అధికారులు బ్రహ్మజ్ఞాన బోధనను గ్రహిస్తారు. కాని సంప్రదాయానికి బద్దులైన  మధ్యమాదికారులకు క్రమక్రమంగా బోధించాలి. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన మార్గం లేదు. అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలై పోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది.

నేనే బ్రహ్మను అనే జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మ స్వరూపంలో విలీనమైపోయినప్పుడు, అదే విశ్వాభాస విసర్జన అని శ్రుతి చెప్తుంది. ఆత్మజాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతియై సృష్టి అంతా భస్మమై పోతుంది.



|| ఓం సాయిరాం ||