In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, July 22, 2015

చైతన్యము



బాబా బోధించిన సత్యాలను అర్ధం చేసుకుంటూ నానా చేతులు జోడించి బాబా! శుద్ధచైతన్యము అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అని అడిగారు.

దానికి బాబా ఈ విధముగా సమాధానం ఇచ్చారు.
నానా! ఇది జగత్తుకు ఆధారమైనది, చరాచర సృష్టి అంతా వ్యాపించి ఇంకా ఏదైతే మిగిలి ఉన్నదో, ఎందులో సర్వం చివరకు లయం అవుతుందో, అన్నింటికి మూలమైనదేదో అదే శుద్ధ చైతన్యము. కంటికి కనబడే యీ జగత్తు రూపంలో ప్రకాశించేదంతా నారాయణుడే! ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే ఎలాంటి అంతరాయం లేకుండా అందరిలో ఉన్నాను అనే అనుభవరూపంలో సాక్ష్యం  ఇస్తున్నది. ఇది ప్రతిక్షణం అనుభవమవుతూ ఉన్నది.

ఆ చైతన్యం ఎక్కడ ఉంది అని అడిగావు. అది ఎక్కడ లేదో చెప్పు. ఎంత వెదికినా ఆ చైతన్యం లేని చోటే లేదు. కనబడేదంతా చైతన్యమే. అది నామరూప రహితమైనది. గాలి ఎలాగైతే రంగు మొదలైన గుణరూపాలకతీతమో, చైతన్యం కూడా అలాంటిదే. ఇది ఎప్పటికీ మరువవద్దు.

చైతన్యం అంటే బ్రహ్మవేత్తలు, వృక్షకోటి, జీవకోటి, జంతుకోటి, ఇవన్నీ ఆ చైతన్యం యొక్క రూపాలే. చూచేవాడు, చూడబడేవి, చూపు కనిపించడం, తెలుసుకోవడం, ప్రకాశించడం, వాటన్నింటికీ మూలకారణము చైతన్యం.

ఈ చైతన్యం సర్వవ్యాపి, దుఃఖరహితము, సత్యజ్ఞానానందరూపము. మీరందరూ ఆ చైతన్యానికి భిన్నంగా లేరు. ఆ చైతన్య స్వరూపమే బ్రహ్మము.

అప్పుడు నానా చేతులు జోడించి 

బాబా! ఓ సద్గురు! 
బ్రహ్మము సర్వ వ్యాపకము క్లేశరహితము, ఆనందరూపమని మీరు చెప్తున్నారు మరి ఒక్కటి అయిన బ్రహ్మము ఇన్ని రూపాలకి ఎట్లా వర్తిస్తుంది. అన్నింట్లో కూడా ఆనంద స్వరూపమైన ఈ చైతన్యము ఉన్నదన్నారు మరి ఈ జగత్తతంతా ఎందుకు దుఃఖపూరితమై ఉన్నది. పుట్టుగుడ్డి సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించ గలడు? అలాగే శుద్ధచైతన్యము, మిధ్యయైన ఈ జగత్తులో ఎలా ఇమిడి ఉండగలదు? ఆత్మచైతన్యం అంటే దాని ఏకత్వానికి నష్టం కలుగుతున్నది. ఎందుకంటే ఆత్మలు అనేకాలు, కాని భిన్న శరీరాలు ఉన్నాయి కదా. నా ఈ సందేహాన్ని నివృత్తి చెయ్యవలసినది" అని ప్రార్ధించాడు.

అప్పుడు సాయినాధుడు 'ఓ నానా! నీవిక్కడే పొరబడుతున్నావు. శాంతచిత్తుడవై సావధానముగా వినుము. తెలుపు, నలుపు, పసుపు, ఊదా, రాగి, కెంపు, ఆకుపచ్చ, నేరేడు మొదలగు రంగులు నీళ్ళలో వేరువేరుగా కలిపి వివిధ ప్రాంతాలలో ఉంచితే వేర్వేరు రంగులలో కనబడతాయి. కాని వాటిలో ఉన్న నీరు మాత్రం ఒక్కటే.  రాగి రంగుతో కలిస్తే రాగిగా, పసుపు రంగులో కలిస్తే పసుపు రంగుగా గోచరిస్తాయి. మిశ్రమ రంగులు కూడ నీళ్ళ నుండి విడగొడితే అవి విడిపోతాయి గాని నీరు మాత్రము అలాగే ఉంటుంది. అలాగే ఆత్మ కాడా ఒక్కటే. హృదయాలు అనేకం, హృదయం ఆత్మ కలిసి ఉన్నపుడే సుఖదుఃఖాలు కలుగుతాయి. ఇది తెలుసు కొనుము.

ఆత్మకు భేదము లేదు. అది అందరకు ఒక్కటే. ఇది సత్యం. సుఖదుఃఖాలు కూడా ఖచ్చితంగా హృదయానికి సంబంధించిన ధర్మాలు. ఆత్మ కలిస్తేనే హృదయానికి చైతన్యం కల్గుతుంది.

ఈ చైతన్యం త్రిగుణాత్మకమైనది. ఈ మూడు గుణాలను పారమార్ధిక, వ్యవహారిక మరియు ప్రతిభాసికాలు అని చెప్తారు. నారాయణా! దేహము ఒక్కటే అయినా, అది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనే మూడు అవస్థలను ఎలా భరిస్తుందో, ఈ ఆత్మ కూడా అంతే. 

పారమార్ధిక చైతన్యము గల ఆత్మను సాధువులోనే దర్శించవచ్చు.

వ్యవహారికులు : శాస్త్ర ప్రకారమున ఏది వదిలిపెట్టవచ్చు, ఏది వదలకూడదు అనే విచక్షణతో వ్యవహరించిన వారు వ్యవహారికులు.

ప్రతిభాసకులు : ఎవరు అసత్యమును సత్యమనుకుంటారో, ఎవరి బుద్ది అజ్ఞానముతో కప్పబడి ఉంటుందో వారిని ప్రతిభాసకులంటారు.

ప్రతిభాసకులు, అజ్ఞానులు, వ్యవహారికులు, సజ్జనులు, పారమార్ధికులు, సంతులు అయినా అందరికి ఆధారము ఆత్మయే. దీనికి ఉదాహరణ బాబా ఈవిధంగా చెప్పారు. 

రాజు, అధికారి, రాజమాత. ఈముగ్గురికి ఆధారమైనవి రాజ్యాంగా శాసనము. అయినా ఈ ముగ్గిరిలో తారతమ్యాలున్నాయి. రాజు సింహాసనముపై కూర్చుంటాడు. ఏనుగు అంబారీపై విహరిస్తాడు. తన ఇష్టానుసారంగా సంచరిస్తూ ఉంటాడు. రాజాజ్ఞననుసరించి అధికారులు మెలగుతారు. ఆ రాజాజ్ఞను పాటించడమే సేవకుల పని? వాళ్ళ ఇష్టాలతో పనిలేదు. రాజ్యాంగ శాసనపరిధిలోనే ప్రజలందరూ నడుస్తారు. రాజరికం, అధికారయంత్రాంగం, సేవకులు, ప్రజలందరూ వేరైనప్పటికి అందరిని ఒకే త్రాటిపైన  నడిపించేదే రాజ్యాంగ శాసనము. ఒక రాజు మరణించినా రాజశాసనము చావలేదు. దాని వలననే రాజ్యాదికారము లభిస్తుంది. ఆ రాజశాసనాన్ని విక్రయించలేము. కాని దాని వలన అన్నీ లభిస్తాయి. ఏ రాజశాసనం వల్ల రాజు గద్దెపై కూర్చుంటాడో దాని వలననే సేవకులు వింజామరలు వీస్తుంటారు. రాజు ఆ శాసనాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఉంటే ఆ రాజ్యంలోని అధికారులు కొంత శాసనాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. దాని కంటే తక్కువగా సేవకులు, అంతకంటే తక్కువగా ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఆత్మ బ్రహ్మములో కలిసి ఏకరూపమైన వారికి బ్రహ్మము పూర్తిగా లభిస్తుంది.

అప్పుడు నానా ఇలా ప్రశించడం జరిగింది.
బాబా! రాజశాసనము ఇన్ని భాగాలుగా ఎలా మారుతుంది. అట్లు విభజించడం వలన దాని నిరవయత్వమునకు భంగము వాటిల్లుతుంది కదా?

అప్పుడు బాబా, 
నానా!  రాజశాసనము ఖచ్చితంగా అభేధ్యమైనది. కాని అది విభజించబడినట్లు కనబడుతూ వుంటుంది. అదే న్యాయము చైతన్యానికి కూడా వర్తిస్తుంది. దానిని విడగొట్టలేము. కాని దాన్ని గ్రహించేవారు తనకు ఎంతకావాలో అంతే తీసుకుంటారు.
కుండ చిన్నదైన, పెద్దదైన, అనేక రకములుగా వున్న వాటి నీటిలో ఆకాశము కనబడుతుంది. నదిలోని నీటిలో కనబడే ఆకాశమే, కుండలోనూ వివిధ పరిమాణాలలో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశము విభజించబడలేదు కదా. అలాగే ఆత్మ యొక్క స్థితి కూడా.  
ఈ జగత్తంతా మాయ. ఈ మాయ మరియు బ్రహ్మము కలసి ఏకమై ఈ బ్రహ్మండ రచన సాగింది.  




|| ఓం శ్రీ సాయిరాం ||

Wednesday, July 8, 2015

సాధన



సాయి కృప అపారమైనది. అందుకే నానా చందోర్కరును షిర్డికి రప్పించుకొని మరీ రక్షించారు. ఆయనతో ఉన్న జన్మజన్మల సంబంధాన్ని చెప్పి ఆయనను సరియైన దారిలో నడిపించారు. ఒకసారి నానా చందొర్కరు, బేరే, నానా సాహెబ్ నిమోర్కరు, లక్ష్మణ్ మారుతి  మొదలైన వారు అందరు బాబా వద్ద కూర్చుని ఉన్నారు. అప్పుడాయన బాబాని ప్రార్ధించి ఆయనను బోధచేయమని అర్ధించడం జరిగింది. అప్పుడు బాబా సాధన చతుష్టయం గురించి చెప్పడం జరిగింది.


ఈ సాధన చతుష్టయంలో సంపన్నులమైనప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. తన్నుతాను ఉద్ధరించుకొనటానికి శుద్ధమైన వస్తువును సాధించటానికి ఎన్నుకునే ఉపాయాలు, ప్రయత్నాలే సాధన.

ఈ సాధన నాలుగు రకాలు:
1) నిత్యానిత్యవస్తు వివేకము:
బ్రహ్మసత్యము : జగన్మిద్య అనే భావం ధృడమవడమే నిత్యానిత్యవివేక జ్ఞానము.  ఈ నిత్యానిత్య వివేకాన్ని బయట పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి కొందరు తమ మూర్ఖత్వము బయటపెట్టుకుంటారు. కొందరు జట్లు జట్లుగా భిక్ష చేస్తూ పండరీపురం పోతారు. కాని ఒక్కడైన హరి చాలుననుకున్నవాడు లేడు. హరి ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎట్లా ఉంటాడు? ఈ విషయాలు ఎవరికి తెలుసు? ఇలా యాత్రలు చేసేవారు నిజమైన హరిభక్తులు కారు.

కొందరు ఎన్నో గ్రంధాలు ఎంతో చక్కగా చదువుతారు. ఇతరులకు ఉపదేశాలిస్తారు. కాని వారి అంతరంగము పరిశుద్దం కానంత వరకు వాటి వల్ల ఏమి ప్రయోజనం? వారు జ్ఞాన సరోవరంలోని కప్పల వంటివారు.  వాదం రూపంలో నున్న బురదను సేవిస్తూ మకరందాన్ని వదిలేస్తారు.

2) వైరాగ్యం :
ఎవరు పరనింద చేస్తారో వాళ్ళు బురదలో పడి ఉంటారు. వాళ్ళకు వివేకం రాదు. వాదోపవాదాలు, పరనిందా ప్రసంగాలు చేసేవారు బ్రహ్మజ్ఞానానికి పనికిరారు. ఇహ, పరలోకాలకు సంభందించిన విషయాలలో ఆశ లేకుండా ఉన్నవాడే వైరాగ్యం మూర్తీభవించినవాడు. నానా ఇది నిశ్చలంగా సత్యమని తెలుసుకో.

3) శమదమాధిషట్కము:
నానా! శమ, దమ, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ మరియు సమాదానాలనే ఆరింటిని శమదమాధిషట్కము అంటారు.

శమము: ఇంద్రియ విషయముల యందు మనోనిగ్రహము కలిగి ఉండటమే శమము అంటారు.

దమము : ఒకవేళ కొన్ని విషయాల యందు ఆసక్తి కలిగిన వెంటనే ఆ చాంచల్యాన్ని బలవంతంగా అణిచివేయటమే దమము అంటారు.

తితీక్ష : మనకు ప్రారబ్ధవశాన ప్రాప్తించిన వాటిని ఓర్పుగా సహించటమే తితీక్ష.

ఉపరతి : మాయాజాలంలో చిత్తం చిక్కు పడక, కాంత, కనకములు, సంతానము, ఆప్తులు వీళ్ళంతా మిధ్య అని గ్రహించడం ఉపరతి అంటారు.

శ్రద్ధ : దృడ విశ్వాసముతో మెలగడం శ్రద్ధ అని అంటారు.

సమాధానం : సుఖదుఃఖాలను సమభావముతో చూస్తూ అంతరంగంలో ఎలాంటి తడబాటు లేక నిశ్చలంగా ఉండటమే సమాధానము.

4) ముముక్షత్వము : మనస్సులో బలంగా మోక్షేఛ్ఛ కలిగి ఇతరం తలచక అపరోక్ష జ్ఞానానికి కావలసిన బాటకోసం వెదికేవాడు ముముక్షువు. ముముక్షువుకు ఏ లక్షణములుంటాయో దాని పేరు ముముక్షత్వము.

మోక్షమంటే వైకుంఠం, కైలాసం కాదు. మోక్షం చాలా కష్టతరమైనది. దాన్ని చేరే మార్గము చాలా దుర్లభమైనది. నానా గమనించు! జగత్తుకు మూలమైనట్టి శుద్ధచైతన్యంతో తాదాత్మ్యం చెందడమే పురుషార్ధము. ఇది లేకపోతే మిగిలినదంతా నిరుపయోగము అని బాబా చెప్పారు.




|| ఓం సాయిరాం ||