In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Sunday, October 25, 2015

మహాల్సాపతి- 3 (బాబా రక్షణ కవచం)



Play Audio


బాబా రక్షణ కవచం
1. బాబా పది రూపాయల రూపంలో అనుగ్రహం
మహల్సాపతి, అతని కుటుంబం చాలాసార్లు ఆహారం లేక పస్తులు ఉండవలసి వచ్చేది. అట్లా ఒకసారి వారి కుటుంబం చాలా రోజులు ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే బాబా మహల్సాపతి భార్యకు నేనే మీ ఇంటికి వస్తున్నాను కాదనకండి అని చెప్పారు. అదే సమయంలో దీక్షిత్ గారు 10 రూపాయలు మహల్సాపతి గారికి ఇవ్వ నిశ్చయించి బాబా దగ్గరకు వచ్చి బాబా దాన్ని పంపించమంటారా అని అడగ్గా, బాబా పంపించు అన్నారు. ఆయన ఎవరికి, ఏమిటి అని కూడా చెప్పలేదు బాబాకి సర్వము తెలుసు. అప్పుడు మహల్సా కుటుంబం దాన్ని స్వీకరించడం జరిగింది. బాబాయే ఆ రూపంలో వచ్చారని వారు భావించి, దానిని తీసుకోవడం జరిగింది.

2. రెండు పాముల గురించి హెచ్చరిక
అప్పట్లో షిర్డి గ్రామంలో చాలా పాములు ఉండేవి. ఒకసారి సాయంత్రం సమయంలో మహల్సాపతి ద్వారకామాయి నుండి ఇంటికి వెళ్ళబోతున్నాడు, అప్పుడు బాబా "మహల్సా నీకు ఇద్దరు దొంగలు ఎదురవుతారు" అని చెప్పారు. అట్లానే మహల్సాపతికి రెండు పాములు కనిపించాయి. ఒకటి ద్వారకామాయికి దగ్గరలో, ఇంకొకటి ప్రక్కనున్న ఇంటి దగ్గర కనిపించాయి.

            మరొకసారి బాబా మహల్సాపతితో ఇట్లా చెప్పారు. "నీవు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు దీపంతో రా! నీవు ఒక దొంగను చూస్తావు." అట్లానే మహల్సాపతి దీపం తీసుకుని బయలుదేరాడు. అతని ఇంటి బయట ఒక పాము కనిపించింది. ఇలా బాబా మహల్సాను హెచ్చరించడం జరిగింది.

3. మహల్సాపతిని నడుము వాల్చవద్దని హెచ్చరిక
ఒకసారి బాబా మహల్సాపతిని ఈ విధంగా హెచ్చరించారు. "నీ వీపుని నేలకు మాత్రము ఆనించవద్దు." ఈ హెచ్చరికను మరిచి మహల్సాపతి, చక్కగా బర్ఫీని తిని, మత్తు వచ్చి నడుము వాలుస్తాడు. అంతలో స్పృహ కోల్పోతాడు. నిద్రలో మాట్లాడుతు కాళ్ళు అలాగే చాపుకొని పడుకుంటాడు. అతనికి మళ్ళా స్పృహ వచ్చిన తరువాత అతని కాళ్ళని మడవలేకపోతే, అతని కూతుళ్ళు మర్ధన చేస్తారు. అప్పుడు నడవగలిగి బాబాదగ్గరకు వచ్చినప్పుడు బాబా "అరే నీకు పడుకోవద్దని చెప్పాను కదా!" అని అన్నారు.


4. మహల్సా కుటుంబ రక్షణ
ఒకసారి బాబా ఈ విధంగా హెచ్చరించడం జరిగింది. ఖండోబా దగ్గర అనర్ధం జరగబోతుంది. కాని నేను ఉన్నాను బయపడాల్సిన పనిలేదు. అప్పుడు మహల్సాపతి భార్య, పిల్లలు అందరూ ఒకసారే జబ్బున పడతారు. అది సుమారు 1908 వ సంవత్సరం అప్పటికే చాలా మంది యాత్రికులు షిర్డి రావడం ప్రారంభించారు. అట్లానే చాలా మంది వైద్యులు కూడా రావడం జరిగింది. వారు ఆ జబ్బులకు వైద్యం చేస్తానన్నారు, కాని బాబా నేను చూచుకుంటాను అని ధైర్యం చెప్పారు. అట్లానే ఆ వ్యాధులను నయంచేసారు.

            ఒకసారి మహల్సాపతి భార్య తన పుట్టింటికి వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడ ఉన్నప్పుడు, ఆమె గొంతులో గడ్డతో బాధపడింది. ఆ విషయం భర్తతో చెప్పడానికి వీలు పడలేదు. కాని బాబా మహల్సాతో ఇట్లా చెప్పారు. "నీ భార్యకు గొంతులో గడ్డ వచ్చింది. దాన్ని నేనుతప్ప ఎవరు తీసివేయలేరు, నేను దాన్ని తీసివేస్తాను".  ఇవన్ని మహల్సాకు తెలియక సరే బాబా అని ధైర్యంగా ఉన్నాడు. తరువాత ఆయనకు ఉత్తరం ద్వారా ఈ విషయం తెలిసింది. అది తగ్గిపోయిన విషయం కూడా అందులో ఉంది.

మహల్సాపతి - వియ్యంకుల దగ్గర అవమానం
ఒకసారి మహల్సాపతి వియ్యంకుల దగ్గర నుంచి వారి ఊరికి రమ్మని కబురు వచ్చింది. అప్పుడు బాబా దగ్గరకు వచ్చిన మహల్సాపతిని బాబా హెచ్చరించారు. వారు నిన్ను అవమానించటానికే పిలుస్తున్నారు. మహల్సా బీదతనాన్ని వారు చులకనగా తీసుకుని ఎన్నోపరాభవాలకు గురిచేశారు. అట్లానే బాబా హెచ్చరించినా మహల్సాపతి అతని స్నేహితుడితో కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఆయన వెళ్ళే సమయానికి వారందరూ బోజనం చేసి మహల్సాపతిని అవమానిస్తారు.  తరువాత మహల్సాపతి బాబా దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్తారు.

అస్తినా గ్రామంలో గొడవ
ఒకసారి రామ్‌భావ్ హర్డె అనే సాయి భక్తుడు, మహల్సాపతిని వారి గ్రామమైన అస్తినా గ్రామానికి మహల్సాపతి పురాణము చదివేందుకు ఆహ్వానించారు. బాబా దగ్గర సెలవ తీసుకునేందుకు వస్తే, బాబా అక్కడకు వెళ్ళొద్దని, అక్కడ గొడవ, కొట్లాట జరుగుతుంది అని చెప్పారు. కాని పిలిచిన తరువాత వెళ్ళకుండా ఉంటే మంచిది కాదని మహల్సాపతి వెళ్తాడు. అక్కడ కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు మాట మాట మీరి, కొట్లాటకు దిగుతారు. కర్రలతో కొట్టుకుంటారు. పురాణము చదవటానికి వచ్చినవారంతా పలాయనం చిత్తగిస్తారు. మహల్సాపతి కూడా చేసేదేం లేక తిరిగివస్తాడు.

పండరిపురంలో విఠ్ఠల దర్శనం
ఒకసారి మహల్సాపతికి స్వప్నంలో ఖండోబా కనిపించి పండరిపురం వెళ్ళమని చెప్పటం జరిగింది. కాని ఆయన బీదతనం వల్ల ఆ ప్రయాణం కష్టమనిపించింది. ఎట్లాగో ఒక సంపన్నుల కుటుంబం ద్వారా  ఆయన పండరిపురం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పూజారులకు డబ్బులు ఇస్తేకాని ప్రవేశం దొరికేటట్లుగా లేదు. మహల్సాపతి దగ్గర డబ్బులేదు. ఆ జనంతో అట్లానే నడుస్తూ ఉన్నాడు. ఇంతలో అందరికి మహల్సాపతి ముఖము ఖండోబా లాగా కనిపించి, వారందరు ప్రక్కకు తొలగి మహల్సాపతిని లోపలకు పంపడం జరిగింది. అట్లా అతనికి విఠ్ఠల దర్శనం అయింది.
   
ఓం శ్రీ సాయి రామ్!

Wednesday, October 21, 2015

మహాల్సాపతి - 2



Play Audio

బాబా మూడురోజుల సమాధి
సాయిబాబా శరీరాన్ని వదలడానికి ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కాని మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. శరీరధర్మాన్ని సహించటానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. మసీదులోని సభా మండపంలో ఒక మూలన ఉన్న స్థలాన్ని వ్రేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి. మహల్సాపతితో మూడురోజుల వరకూ నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు.



            "నా సమాధి పై రెండు జండాలు ఉంచండి" అని చెప్పుతూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. ఆకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు  నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఆ విధంగా జరిగితే, అందరికి నోట మాట రాలేదు. బాబా యొక్క శ్వాసకాని, నాడికాని ఆడటంలేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కాని సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. మహల్సాపతి అతిజాగరుతతో అహర్నిశలూ సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. సమాధిని  త్రవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయటానికి ఎవరికి ధ్యైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి, గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు.

            మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుంచి క్రిందకు దించలేదు. ప్రాణాలు పోయాయని తెలుసు కాని, ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని "మూడు రోజులు ఉంచండి" అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాస ఉచ్వాసలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్ని చలన రహితమయ్యాయి. ఏదీ కదిలే సూచన లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలులేదు. వాక్కు ధృడ మౌనం వహించినట్లుంది. మరల ఎలా స్పృహకు వస్తారు అని అందరికి చింత పట్టుకుంది. రెండు రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహరాలేదు, మౌల్విముల్లా ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పాకులకర్ణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి, బాబా తన ధామానికి చేరుకున్నారు. కనుక వారి శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అని నిశ్చయించారు.

            అయితే ఇంత తొందర పనికిరాదు. కొంతసేపు ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు. వారిమాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది? అంతా ఎంత తెలివిలేనివారు అని అన్నారు. వారిని సరియైన వేళలో సమాధి చేయడానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి. భక్తులందరిని పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించు కుంటూనే మూడు రోజులు గడిచిపోయాయి.

            తరువాత మూడు గంటల ప్రాంతంలో బాబాలో చైతన్యం కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాస ఉచ్వాసలు మొదలయ్యాయి. పొట్టకూడా కదల సాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూచాడు. సాయిబాబా కూడా తలను ఆడించారు. మౌల్వీలు ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా, తన నిర్ణయాన్ని ఏ కాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది.

            మహల్సాపతి ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా, గురువాక్య పరిపాలన చేసి తన నమ్మకాన్ని ఏమాత్రము సడలనివ్వకుండా మనందరికి గొప్ప ఉపకారం చేశారు. ఈ సేవ కేవలం మహల్సాపతి గారు మాత్రమే చేయగలరు. దీనివలన బాబా యొక్క బోధలు, లీలలు మనందరికి లభ్యం అయ్యాయి. 1886 నుంచి 1918 వరకు బాబా నిరవధికంగా ఎంతో మంది భక్తులను సంరక్షించడం జరిగింది. మహల్సా గనక ఈ ప్రయత్నంలో విఫలం అయితే అన్న ఆలోచన కూడా మనము జీర్ణించుకోలేము.


ఇటువంటి బాధ్యతనే ఇంకోసారి బాబా మహల్సాపతికి అప్పచెప్పడం జరిగింది.

నిగోజ్‌పాటిల్ భార్యను రక్షించే ప్రయత్నం
ఒకసారి మహల్సాపతి రోజూ మాదిరిగా, తన ప్రక్కను పరచి పడుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు బాబా మహల్సాపతితో ఇలా అన్నారు. " రా! ఈ రోజు మనము ఒకరిని రక్షించాలి. ఒక భయంకరమైన రోహిల్లా(ప్లేగువ్యాధి) నిగోజ్‌పాటిల్ భార్యను తీసుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అల్లా నామస్మరణలో ఉంటాను. నన్ను ఎవరు ఇబ్బంది పరచకుండా చూసే బాధ్యత నీది" అని చెప్పారు.    

            అప్పుడు మహల్సా మేలుకొని జాగ్రత్తగా ఎవరు అటువైపు రాకుండా చూస్తున్నారు. ఇంతలో అక్కడి మామల్తాదారు అతని మనుషులతో రావడం జరిగింది. వారు బాబా దర్శనం కోసం వచ్చారు. కాస్తంత ఊదీ తీసుకుని వెళ్ళాలని వారి అభీష్టం. మహల్సా ఎంత నివారించిన వారు అతని మాట లెక్కచేయలేదు. కాని వాళ్ళు ఊదీ అయినా తీసుకువెళ్తాము అని ద్వారకామాయిలో ప్రవేశించడం జరిగింది. అప్పుడు బాబా సమాధికి భంగం వాటిల్లింది. బాబాకు బాగా కోపం వచ్చింది.

            "అరే భగత్ నీకు భార్య పిల్లలు ఉన్నారు, ఎందుకు అర్ధం చేసుకోలేదు, నీకు నిగోజ్‌పాటిల్ పరిస్థితి తెలుసు ఇప్పుడు నేను చేసే పనిలో భంగం వాటిల్లింది. పాటిల్ భార్య చనిపోయింది. సరే ఏం జరిగిందో అదీ మన మంచికే, కాని ఇంక ఎప్పడూ  ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకో" అని హెచ్చరించడం జరిగింది.


            ఆ తరువాత మహల్సా దాదాపు నలబైఏళ్ళు బాబా జరిపిన లోక కళ్యాణంలో భాగంగా నిలిచారు. ప్రతిరోజు వారు నిద్రించకుండా బాబా గుండెలపై చేయి ఉంచి భక్తులను సంరక్షించడం జరిగింది. అటువంటి మహానుభావుడైన మహల్సాపతి గురించి విన్నా చదివినా, అది మన పూర్వజన్మ పుణ్యం.

ఓం శ్రీ సాయి రామ్ !

Wednesday, October 14, 2015

మహల్సాపతి - 1



Play Audio


సాయినాధుడు ఆర్త రక్షణుడై సదా తన భక్తులను రక్షిస్తూ ఉంటాడు. కాని ఆయన సాకారుడై షిర్డిలో పాంచ భౌతిక శరీరంతో తన రక్షణ బాధ్యతను నిర్వర్తించడం జరిగింది. అందరు నిద్రించే సమయంలో మరియు ఇతర సమయాల్లో తనను నమ్మినవారిని కంటికి రెప్పలా కాపాడుకునే పరమ దైవం సాయి. ఇలా సాయి నిర్వర్తించిన స్థితికారత్వ బాధ్యతలలో పాలుపంచుకుని కొన్ని సంవత్సరాల పాటు ఆయనతో కలిసి జీవించిన మహానుభావులలో మొట్టమొదటి వారు మహల్సాపతి.

            ధర్మార్ధ కామమోక్ష మార్గంలో ఎప్పుడూ దారి తప్పకుండా, సాయి చూపిన శ్రద్ధ, సబూరి దారిలో నడుస్తూ సాయిని తప్ప ఏమి కోరుకోకుండా మనందరికి మార్గదర్శిగా నిల్చిన పరమ భక్తుడు, భక్త మహల్సాపతి. అటువంటి భక్తుడి గురించి విన్నా, చదివినా మన జన్మ ధన్యమైపోతుంది. ఈ మహానుభావుడు ఎన్ని కష్టాలు ఎదురైన ధర్మాన్ని తప్పకుండా, ఎంత అవసరమైనా అర్ధానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, కోరికలను నియంత్రించుకొని, సాయి తప్ప (అంటే మోక్ష మార్గంతప్ప) మరేమి ఈ జీవితంలో అవసరంలేదు అని నిరూపించిన భక్తమహల్సాపతి ఎంతటి ఆదర్శమూర్తియో! మహల్సా అంటే అమ్మ పార్వతి, మహల్సాపతి అంటే పరమశివుడు. అందుకే ఆయన ఖండోబా దేవుని తన జీవితం అంతా పూజించడం జరిగింది. ఆయన సాయిని గురువుగా నమ్మి ఆయనే తన ఖండోబా అని తలచి నిత్యపూజలు నిర్వర్తించిన గొప్పమహానుభావుడు.
  
            మహల్సాపతి కోపర్‌గాం తాలూకా లోని షిర్డి గ్రామానికి చెందిన సదాచార సంపన్నుడు. ఆయన ఆ గ్రామంలోని చిన్న వీధి బడిలో ప్రాధమిక విద్యను మాత్రమే అభ్యసించిన వ్యక్తి. ఆయనకు కంసాలి వృత్తి వంశపరంగా ప్రాప్తించింది. ఆయన వంశం ఆనాటి బ్రాహ్మణులకు ఏ మాత్రం తగ్గకుండా ఆచారవ్యవహారములను ఆచరించే కుటుంబం. ఆయనకు 7 1/2 ఎకరాల భూమి, ఒక మట్టి గోడల ఇల్లు ఉండేవి. ఆ భూమికి నీరులేక పంటలు కూడా పండేవి కావు. వారు ఖండోబాగా కొలువై వున్నా పరమ శివుని ఆలయాన్ని చూసుకుంటూ జీవనం సాగించేవారు. ఆయనకు ఎటువంటి ఆదాయం ఉండేది కాదు. షిర్డి గ్రామంలో ఆయన వృత్తికి తగ్గట్లు ఆభరణాలు చేయించుకునేవారు చాలా తక్కువ. ఖండోబా ఆలయం కూడా మట్టిగోడలతో ఒకమాదిరిగా శిధిలావస్థలో ఉండేది. ఆయన ఖండోబాను పూర్తిగా నమ్మి, ఒక గురువు కోసం ఎదురు చూస్తూ జీవిత లక్ష్యం అయిన మోక్షం కోసం పరితపిస్తూ ఉండేవారు. ఆయన షిర్డి గ్రామానికి ఎటువంటి సాధుపుంగవులు, ఫకీరులు వచ్చిన వారిని ఆదరించి వారికి సేవ చేసేవారు. కాశీరాం షిండే మరియు అప్పాబిల్ ఆ సాధు సంతులకు అవసరం అయిన ధన, వస్తు సాయం చేసేవారు. ఈ రకంగా వారు ముగ్గురు షిర్డి గ్రామంలో తమ ధర్మాచరణను కొనసాగించేవారు.


            సాయి పదహారేళ్ళ వయసులో వచ్చినప్పుడు కూడా, మహల్సాపతి ఆ బాలుడు దివ్య సంపన్నుడు అని గ్రహించి సేవించినాడు. మరల సాయి చాంద్ పాటితో పెళ్ళి బృందముతో వచ్చినపుడు ఆయనను "రా సాయి" అని పిలిచి మనందరికి సాయి అనే దివ్య నామాన్ని ప్రసాదించటం జరిగింది. అది సుమారు 1872 వ సంవత్సరంలో జరిగి ఉండవచ్చునని మనకి చరిత్ర చెబుతుంది. సాయి ఖండోబా ఆలయాన్ని చూసి ఆహా ఈ ఆలయం నాలాంటి ఫకీరుకు అనువైన స్థలం కదా అన్నప్పుడు మహల్సాపతి ముస్లిం ఫకీరునకు అది సరియైన స్థలం కాదని సాయితో చెప్పడం జరిగింది. అప్పుడు వద్దన్నా మహల్సాపతి తరువాత సాయితో కలసి మసీదులో ఎన్నో ఏళ్ళు నిద్రించడం జరిగింది. ఆయన ముస్లింలు ఖండోబా విగ్రహాలు పగలకొట్టెదరని బయపడ్డాడు.

            అప్పుడు ముస్లింలకు, హిందువులకు భగవంతుడొక్కడే, కాని నువ్వు అభ్యంతరం తెలుపుతున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను" అని సాయి వెళ్ళడం జరిగింది. మొదట్లో అందరు సాయిని ఒక పిచ్చి ఫకీరుగా చూడడం జరిగింది. కాని మహల్సాపతి సాయిలో ఉన్న గొప్పతనం గుర్తించడం జరిగింది. బాబా ఎప్పుడూ పరమ వైరాగ్యంతో ఉండేవారు. ఆయన త్రిగుణాతీతుడై కాంతాకనకాలకు అతీతంగా బ్రహ్మస్థితిలో ఉండేవారు. మహల్సాపతి కూడా చాలా వైరాగ్యంతో బాబాని గురువుగా భావించి శ్రద్దా భక్తులతో పూజించేవాడు. బాబాను పూజించినవారిలో మహల్సాపతి మొట్టమొదటి వాడు. ఆయన ప్రతిరోజు ద్వారకామాయికి వెళ్ళి బాబాని పూలతో పూజించి  బాబా కాళ్ళకి, మెడకు గంధం రాసి, పాలను సమర్పించేవారు. అప్పట్లో నానాసాహెబ్‌ డెంగ్లే కూడా ఈ ప్రయత్నం చేస్తే బాబా, నానాను అక్కడవున్న స్తంబానికి పూజచేయమని చెప్పడం జరిగింది. ఆ తరువాత కొన్ని రోజులకు దగ్గుభాయి సహాయంతో ఆయన కూడా బాబాకు సేవచేయడం జరిగింది.

            మహల్సాపతి సాయితో ఎంతో సన్నిహితంగా ఉండడం జరిగింది. ఆయనకు ఎటువంటి సంపాధన లేక, తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో, విసుగు చెంది వున్నప్పుడు, ఖండోబా ఆయనకు రెండు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖండోబా ఉత్సవ విగ్రహాలను తన ఇంటికి తీసుకువెళ్ళి పూజలు జరిపించడం మరియు ఆయన కంసాలి వృత్తిని వదలమని చెప్పడం. ఇలా పూర్తివైరాగ్యంతో, బాబాతో ఒక రోజు చావడిలో మరొక రోజు ద్వారకామాయిలో నిద్రించడం జరిగింది. అది 1896వ సంవత్సరం, బాబా ఒక రోజు మహల్సాపతికి ఇట్లాచెప్పడం జరిగింది. "అరె భగత్: ఈ ఫకీరు మాట కొంచం విను, నా మాటలు సత్యం, నువ్వు ఎప్పుడూ ఇక్కడే నిద్రపోతావు ఇక నుంచి ఇంటి దగ్గర నిద్రపో. నీకు ఒక కొడుకు పుడతాడు" అయినా మహల్సాపతి బాబాను వదలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. తరువాత అతని స్నేహితుడు అయిన కాశిరాం ఒత్తిడితో ఇంటి దగ్గర నిద్రపోవడానికి ఇష్టపడతాడు. 1896 జన్మాష్టమికి ఆయన ఇంటిదగ్గర నిద్రపోవడం మొదలుపెట్టాడు, సరిగ్గా ఒక సంవత్సరంలో చక్కటి కొడుకు పుట్టడం జరిగింది. ఆయనకు కొడుకు పుట్టిన తరువాత మరల బాబాతో నిద్రించడం జరిగింది.

            మహల్సాపతి తన దగ్గర ఉన్న ఒక దుప్పటిని పరిచేవాడు. బాబా చెక్కపై పడుకోకుండా ఉన్న రోజు, ఈ దుప్పటిపై నిద్రించేవారు. ఒక ప్రక్క మహల్సాపతి ఇంకో పక్క బాబా నిద్రించేవారు. మహల్సాపతికి చాలా కష్టమైన భాద్యత అప్పగించడం జరిగింది. బాబా భక్తులను రక్షించే ప్రక్రియలో యోగనిద్రలో ఉండేవారు. అప్పుడు మహల్సాపతి బాబా గుండెలపై చేతిని ఉంచాలి. బాబా ఇట్లా చెప్పారు "నువ్వు కూర్చుని నిద్రపోకుండా, నా గుండెపై చేతిని ఉంచవలెను, నేను భగవంతుని నామస్మరణలో ఉంటాను, అది నీకు నా గుండె చప్పుడు ద్వారా తెలుస్తుంది. మామూలు నిద్ర కనుక వస్తే, నన్ను లేపే బాధ్యత నీది, అప్పుడు నా గుండె చప్పుడు మారుతుంది. ఈ విధంగా బాబా మరియు మహల్సాపతి ఇద్దరూ నిద్రించేవారు కాదు. వారు లోక కళ్యాణం కోసం రాత్రంతా భగవధ్యానంలో ఉండటం జరిగేది.


            మహల్సా గొప్ప పుణ్యాత్ముడు తన ఇంద్రియాలను చాలా వరకు తన ఆధీనంలో ఉంచుకున్న దివ్యాత్ముడు. ఆకలిని కూడా జయించిన జితేంద్రియుడు. ఎవ్వరి దగ్గరి నుంచి ఏమి ఆశించేవాడు కాదు. బాబా ఇస్తానన్నా, తీసుకునేవాడు కాదు. బాబా ఇలా అనేవారు అరె భగత్! ఈ మూడు రూపాయలు తీసుకో కొద్ది రోజుల్లో నీవే ఇంకొకరికి సహాయపడే స్థితి కలిగి ఉంటావు. నీ జీవితము సుఖప్రదం అవుతుంది." అప్పుడు మహల్సాపతి, "బాబా ఇవన్ని నాకు వద్దు నీ పాదాలను పూజించడం తప్ప నాకింకేమి అక్కరలేదు"  అని అనేవాడు.  మహల్సా అప్పటికే జ్ఞానవంతుడు.
   

ఓం శ్రీ సాయి రామ్ !

Wednesday, October 7, 2015

హేమద్‌పంత్- 3



Play Audio

సచ్చరితకు శ్రీకారం

సాయి తొలిదర్శనం తరువాత హేమద్‌పంత్ అత్యంత ఆనందాన్ని పొంది ఎనలేని మనశ్శాంతిని పొందాడు. బాబాకు ఎవరిచేత ఏ సేవ చేయించుకోవాలో బాగా తెలుసు. 1911 డిసెంబర్ నెలలో హేమద్‌పంత్‌కి ప్రేరణ కలిగి మరల షిరిడికి రావడం జరిగింది. ఈ సారి ప్రయాణంలో ఉన్న ప్రత్యేకత హేమద్‌పంత్‌కి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడు. సర్వ మానవాళిని ఉద్ధరించే సమయం ఆసన్నమైనది. షిరిడి ప్రజలు కలరా వ్యాధితో భయాంధోళనకు గురి అవుతున్న సమయం. అప్పుడే హేమద్‌పంత్ షిరిడికి రావడం జరిగింది. వెంటనే బాబా దర్శనం కోసం మశీదుకు వెళ్ళాడు హేమద్‌పంత్. అదే సమయంలో బాబా గోధుమలు విసిరేందుకు కూర్చుని ఉన్నారు. ఆయన గోదుమలు విసురుతూ ఉంటే హేమద్‌పంత్‌లో ఏదో తెలియని అనుభూతి. ఉత్తమమైన కీర్తి గలవారి గుణాలను వర్ణించడం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది. వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక మను త్రితాపాలతో బాధపడేవారు, తమ ఆత్మహితాన్ని ఆత్మానందాన్ని కోరుకునేవారు, సాయిచరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మసాక్షాత్కారానుభూతి పొందగలరు.


               
ఇలా మనసులో కలిగిన ప్రేరణలతో సాయి మహారాజ్ యొక్క గాధను రచించాలి అని భావించాడు. ఈ సత్సంకల్పమే భక్తుల పాలిట వరమైంది. బాబా హేమద్‌లో ఈ ప్రేరణ కలిగించి లోకానికి మహోపకారం చేశారు. ఈ అమరమైన, అద్భుతమైన ఆలోచనా తరంగాల్లో నుంచి శ్రీ సాయి సచ్చరిత అనే అమృతం ఉద్భవించింది.

                సాయిలీలలు రాయాలన్న కోరికను హేమద్ ఎవరికి చెప్పలేదు. 5 సంవత్సరముల తరువాత 1916లో మరల సాయి చరిత్ర రాయాలనే ఆలోచన తీవ్రమైంది. తరువాత శ్యామా ద్వారా బాబా దగ్గర నుండి అనుమతి పొంది 1917 లో గ్రంధ రచన ప్రారంభిస్తారు. సాయి మహాసమాధి నాటికి అంటే 1918 విజయదశమికి కేవలం 2 అధ్యాయాలు మాత్రమే రచించారు. 1929 వ సంవత్సరం వరకు 52 అధ్యాయాలు రాయడం జరిగింది. 

హేమద్‌పంత్ ఈ గ్రంథరచన చేస్తూ సాయియే దీని రచయిత అని చక్కటి భావాలను వ్యక్తం చేస్తారు.
                
శ్రీ సాయితో నా సహవాసం అంత ఎక్కువేమి కాదు. అతని నిజతత్వం నేనసలు ఎరుగను. నిజానికి నా మనసులో అవిశ్వాసమే ఉంది. నిర్భయంగా పరిశోధనాత్మకంగా పరిశీలించే దృష్టి నాకు లేదు. నేను అనన్య భావనతో ఉపాసన చేయలేదు. క్షణం మాత్రం నేను సాయి భజన చేసింది లేదు. అయినా ఈ నా చేతులతో తన చరిత్రను సాయి తనే రాయించుకున్నారు. ఇదంతా సాయికి నాపై ఉన్న అవ్యాజ్యమైన కరుణయే సుమా! సాయినాధుడు తన కార్యాన్ని ఫలవంతం చేసుకోవటానికి నన్ను వాడుకున్నారు. నన్ను ధన్యుడుని చేశారు. అని ఎంతో చక్కగా రాశారు.
  



బాబా మహాసమాధి తరువాత హేమద్ జీవితం
హేమద్ 1916లో తను స్వయాన కట్టించుకున్న ఇంటిలో నుంచే సచ్చరిత రాయడం జరిగింది. ప్రతిరోజు ఆయన కార్యక్రమం నియమబద్ధంగా ఉండేది. ఉదయం స్నాన సంధ్యలు పూర్తిచేసుకుని గురుచరిత్రను, శ్రీ విష్ణుసహస్ర నామం పఠించే వారు. ఆయనకు ఏకనాథ భాగవతంలోని శ్రీకృష్ణ నిధానమనే అధ్యాయాన్ని చాలా ప్రేమతో చదివేవారు. ఈ నియమాలన్ని పాటిస్తూ షిరిడి సంస్థానం శ్రీసాయిలీలా మాస పత్రికకు సంబంధించిన పనులన్ని చేస్తూ తన కార్యక్రమాలన్ని ఒక డైరీలో రాసి ఉంచేవారు.

                ఎవరైన పేదవాడు లేదా శ్రీమంతులు తనను కలుసుకోవడానికి వస్తే తమ సమయాన్ని వెచ్చించి చాలా ప్రేమతో మాట్లాడేవారు. వారు ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉండేవారు. పేద విద్యార్ధుల చదువు కోసం వారు చాలా సహాయం చేసేవారు. ఎవరైన ఏదైనా అడిగితే వారు ఎప్పుడు లేదనే వారు కాదు. వారు పేదరికం నుండి పైకి రావడం వలన పేదల కష్టాలను తెలుసుకొని మరీ సహాయం చేసేవారు. ఎవరైన వస్తే వారిని భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేవారు కాదు. ఈ విధంగా హేమద్‌పంత్ ప్రాపంచికంగా ఉంటూనే పరమార్ధాన్ని కూడా చక్కగా సాధించారు. వారు 1929 జూలై 15వ తారీఖున మధ్యాహ్నం తమ స్వంత ఇంటిలో శరీరాన్ని వదిలివేశారు. వారి మరణం ఏ యోగులకో సంభవించే మరణంలాగా సంభవించిందని చెప్పబడింది.

               


హేమద్‌పంత్ లాంటి మహానుభావుల గురించి శ్రవణం చేసే అదృష్టం మనకు కలిగినందుకు మనము కూడా పుణ్యాత్ములమే ఆ సాయి కృప మనపై ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశిస్తూ ఈ సత్సంగాన్ని సంపన్నము చేద్దాము.

ఓం శ్రీ సాయి రామ్ !