In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Thursday, December 29, 2016

Gita- Sugita



Om Paarthaya pratibodhitaam Bhagavatha narayanena swayam
Vyasena gradhitaam puraana muninaa madhye Mahabharatam!
Advaitaamruta varshineem Bhagavathee ashtadasaa adyaayineem.
Amba twamanusandadhaami Bhagavadgeete bhavadwashineem !!

This verse is from Gita dyana. The Lord himself gave Bhagavad-Gita. Arjuna was just a pretext and through him the entire mankind benefited when Lord Krishna gave Bhagavadgita to rescue people from daily mundane life, conflicts of everyday life, and to motivate people to reach their destination that is self-realization. This was given in 18 chapters and Vyasa compiled this beautifully. Lord Krishna showed Arjuna the universal secret and how to reach that highest state by sadhana. The universal soul (Paramatma) is the only one that exists and we are all part of that and understanding this Paramaatma is the main goal of teachings of Bhagavad-Gita.  

Sri Shirdi Sai reiterated the concepts of Bhagavad-Gita by living not just by preaching.  He showed us how to maneuver this conflict ridden life. He also showed the means to have a balanced life even in the mist of conflict. So we surrender to our Samardha Sadguru Sri Sainath Maharaj, so that we can get his blessings to understand the real meaning of this great scripture and incorporate into our daily life.

The great epic Mahabharata praises Bhagavad-Gita as “Sarva Saasthramayi Geeta”. Truly this is a masterpiece and is the essence of all Upanishads.  This teaches the discipline that we all need in our life so that all our ducks are in a row. That’s why the saying goes as “Gita Sugita”. The Bhagavad-Gita teaches us the way of life, goal of life and how to reach that goal. If we adopt this great scripture as our guide we do not need anything else in our lives. In Varaaha Purana, Lord Maha Vishnu says “Gita is my abode, I depend on this, and this helps me with my job as preserver of all the worlds”. What other words do we need to praise the greatness of this incredible Scripture.

Mahabharata is also called as Panchama Veda” that is 5th veda. Lord Krishna elegantly crafted the essence of all the Upanishads in the form of Bhagavad-Gita so that we do not have to scramble for the ultimate knowledge. Mahabharata has 18 Parvas (chapters) and Bhagavadgita is also compiled in 18 chapters.  This came directly from the Lord himself. So many great minds wrote the commentary on Bhagavad-Gita so that we can understand the meaning. They paved the way for us and we will continue to travel in the similar path which is time tested. We will pray to all those great souls to give us the strength, endurance and give us their blessings. 

Great Scholars say that there is nothing that you cannot find in Mahabharata. Everything is available in Mahabharata. Righteousness was given a major role in the epic. Bhishma, Drona and Karna followed the Dharma to the best of their ability. They tried to be righteous in their own way.  Unfortunately they were on the wrong side of the equation. They were assisting ADHARMA (Unrighteousness) and this got him in trouble. In a similar way lot of people think that they are living better and they are good people. We do not harm anyone, we do not expect from other people and we try to live as righteously as possible. So what’s wrong in this? But question is why do we suffer still? We are crippled sometimes with opposites of life. We face conflict in our life constantly. Is this good or bad for me? Is this the right thing to do or not? To choose between two good things also creates conflict. We are totally disabled at times with these issues. That means we are not perfect or not in balance with the nature. We are not in balance with our surroundings. We have to know more about this life and we cannot blindly follow other people who also do not have a clue about this life. We can face these difficulties or pairs of life with patience only with right knowledge. So this right knowledge is given to us through Bhagavad-Gita.

The Mahabharata war took place for 18 days and on the 10th day the great Bhisma fell to the ground. Then Sanjaya came back from Kurukshetra to King Dhrutharaashtra in Hastinapura to convey the bad news. That really depressed the King but he had some hope left. So he wanted to know the whole story of war from the beginning. This is how Bhagavad-Gita started and there are close to 700 verses in this great scripture. The whole scripture can be divided into three segments. First 6 chapters were described as Karma Yoga, next 6 as Bhakti Yoga and last 6 chapters as Jnana yoga. Vedas can be roughly told as Karma Kanda, Upaasana Kanda and Jnana Kanda. No matter how much we are good at performing the ritualistic karmas and pujas without Jnana (knowledge) we cannot attain the salvation. This knowledge is called as Yogam.

Yogam means the merge with the absolute. How did we take birth? Where did we come from? Why we got caught up in this birth death cycle? How do we get out of this? All these questions are answered with clarity in Bhagavad-Gita.


Bhagavad-Gita helps us to navigate the conflict ridden ocean of life. It teaches us to convert regular action to karma yoga, regular devotion to Bhakti Yoga. Then we develop proper intellect so that we become eligible to attain the knowledge that is Jnana. When we do sadhana with right Jnana then we will experience the truth. This sadhana is then called Jnana Yoga. But there are so many obstacles in the path. In the last chapters of Bhagavad-Gita we learn how to untangle ourselves from these so called Gunas (qualities), characters, and vasanas (impressions). Such is the greatness of this gospel of God.  



 OM SRI SAMARDHA SAINATH MAHARAJ KI JAI!

Wednesday, December 28, 2016

భగవద్గీత - సుగీతా





ఓం పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం 
వ్యాసేన గ్రథితామ్ పురాణ మునినా మధ్యే మహాభారతం !
 అద్వైతామృత వర్షిణీమ్ భగవతీమష్టాదశాధ్యాయినీమ్ 
అమ్బ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం !!

భగవంతుడే స్వయంగా చెప్పిన శాస్త్రమే భగవద్గీత. సర్వ మానవాళిని ఈ భవసాగరంనుంచి రక్షించడానికి శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునిని అడ్డుగా పెట్టుకొని భగవద్గీతను చెప్తే, దాన్ని వ్యాస భగవానుడు గ్రంధస్తం చేయడం జరిగింది. ఈ గీత పద్దెనిమిది అధ్యాయాలతో సర్వ ఉపనిషత్తుల సారాన్ని మనకు అందించిన ఏకైక శాస్త్రము. భగవంతుడు ఒక్కడే అని, ఉన్నదంతా ఆ విరాట్ స్వరూపమే అని, ఆ అధ్బుత చైతన్యమే మనమని తెలియచెప్పే శాస్త్రమే భగవద్గీత. 

సాయినాథుడు షిర్డీవాసుడై, జ్ఞానేశ్వరీ అని పిలవబడే ఈ భగవద్గీతను కేవలం చదవడమే కాకుండా, దాన్ని మన జీవితంలో ఎలా అవలంబించాలో చేసి చూపించిన పరమ గురువు. ఆ పరమ గురువు ఆశీస్సులతో మన మందరము ఈ భగవద్గీతను అనుసరించడానికి ప్రయత్నిద్దాము. 

"సర్వ శాస్త్రమయీ గీతా" అని మహాభారతంలో చెప్పడం జరిగింది. ఈ గీతనే సుగీతా అన్నారు. మనకు జీవన విధానాన్ని, జీవన లక్ష్యాన్ని, దాన్ని చేరుకొనే మార్గాన్ని చూపించిన అద్భుతమైన శాస్త్రము. ప్రతిఒక్కరు గీతను విని, అర్ధం చేసుకొంటె వేరే శాస్త్రాల అవసరమే లేదు. శ్రీ మహా విష్ణువే స్వయంగా వరాహ పురాణంలో ఇలా చెప్పారు. నేను గీతను ఆశ్రయించి ఉంటాను. గీతయే నా నివాసము. పాలనకర్తగా పాలించుటకు నాకు ఉపయోగపడే సాధనమే గీతా జ్ఞానము అని చెప్పారు. 

మహాభారతము పద్దెనిమిది పర్వాలతో పంచమవేదంగా పిలవబడుతుంది. అలానే భగవద్గీత కూడా పద్దెనిమిది అధ్యాయాలతో మనకు అందించటం జరిగింది. వేదాలకు చివరిభాగంలో ఉన్న ఉపనిషత్తుల సారమంతా రంగరించి శ్రీకృష్ణ భగవానుడు గీత రూపంలో ఇచ్చి మనలను కరుణించారు. మహానుభావులు ఎందరో ఈ గ్రంథరాజానికి భాష్యం వ్రాసి మనకు అర్ధం అయ్యేలా చేశారు. వారందరూ చూపిన మార్గంలో మనం కూడా ప్రయాణిద్దాము. ఈ ప్రయాణంలో వారందరి ఆశీస్సులు మనపై ఉండాలని ప్రార్థిద్దాము. 

మహాభారతం నుంచి చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి. భారతంలో లేనిదంటూ ఏమీ లేదని మన పెద్దలు చెప్తారు. భారతంలో ధర్మానికి పెద్దపీట వేశారు. భీష్మ, ద్రోణ, కర్ణులు వారికి తెలిసిన ధర్మాన్ని వారు పాటించారు. వారిలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. కానీ వారు అధర్మాన్ని ఆశ్రయించారు. అలానే మనం కూడా ధర్మంగానే బతుకుతున్నాము అని అనుకుంటాము. నేనెవరికి అన్యాయం చేయడం లేదు, ఒకరి సొమ్ము తినడం లేదు. కాబట్టి నేను న్యాయంగానే బతుకుతున్నాను అని మనం అనుకోవచ్చు. కాని మనమెందుకు సుఖ దుఃఖాలతో సతమతం అవుతున్నాము. జీవితంలో ఈ ఒడిదుడుకులను ఒక్కోసారి తట్టుకోలేక పోతున్నాము అంటే మనం ఇంకా తెలుసుకోవాల్సినదేదో ఉంది అని అర్ధం చేసుకోవాలి. మనం నిజాన్ని అర్ధం చేసుకొంటే కాని ఈ ద్వంద్వాలను మనం సంయమనంతో ఎదుర్కోగలుగుతాము. 

మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. పదోరోజు భీష్ముల వారు పడటం జరిగింది. అప్పడు సంజయుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఈ విషయం చెప్పగా, అప్పటి దాకా జరిగిన యుద్ధం అంతా విపులంగా చెప్పమని ధృతరాష్ట్రుడు కోరడం జరిగింది. అలా భగవద్గీత శ్లోకం మొదలవుతుంది. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని మూడు షడ్గాలుగా విభజిస్తే, మొదటి ఆరు అధ్యాయాలు కర్మ యోగంగా, తరువాత ఆరు భక్తి యోగంగా, చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాన యోగంగా చెప్తారు. వేదాలలో కర్మ కాండ, ఉపాసనా కాండ మరియు జ్ఞాన కాండ అనే మూడు భాగాలు ఉన్నాయి. జీవితంలో సర్వ కర్మలు ఆచరించినా, ఎంత ఉపాసన చేసినా, మానవుడు సరియైన జ్ఞానం లేకుండా తన గమ్యాన్ని చేరుకోలేడు. ఈ జ్ఞానమే యోగం అంటారు. 

యోగం అంటే కలయిక అనే అర్ధం ఉంది. మనం ఎక్కడనుంచి వచ్చామో, ఈ సంసారమనే భవ బంధంలో మనం ఎలా ఇరుక్కు పోయామో, మనకు మనంగా ఎలా మిగిలిపోతామో తెలుసుకొనే జ్ఞానమే ఈ భగవద్గీత. అందుకే కర్మను కర్మ యోగంగా, భక్తిని భక్తి యోగంగా మార్చుకోవాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, అనుసరించి, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అది జ్ఞాన యోగం అవుతుంది. 

ఇవన్ని ఆచరించడానికి మనకు అడ్డుపడే పరిస్థితులనుంచి, గుణాలనుంచి ఎలా తప్పించుకొని ముందుకు సాగాలో తెలిపే జ్ఞానమే గీతా జ్ఞానము. మనందరిని ఒక గీతలో నడిపించేదే ఈ సుగీత. 



                                                         శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 








Wednesday, December 21, 2016

ఓం శ్రీ మనోవాగతీతాయా నమః





మన జీవితంలో జరిగే కొన్ని అనుభవాలు మనం మాటలతో వర్ణించలేము. మనం ఎంత చెప్పినా కానీ అవి మన అనుభవానికి సరిపోదు. మనం ఒక తీపి పదార్ధం తిని,  అది ఎలా ఉంది అని ఎవరైనా అడిగితె తియ్యగా ఉంది అని చెపుతాము. కానీ తియ్యగా అంటే ఏమిటి అని అడిగితే; నువ్వు తిని చూడు, అప్పుడే నీకు తెలుస్తుంది అని చెప్పాలి. తల్లి ప్రేమ ఎలావుంటుంది అంటే ఎవరు చెప్పగలరు? ఎందుకంటే అది మాటలతో చెప్తే తెలిసేది కాదు. నీకు నువ్వు అనుభవించాలి. అలానే   భగవంతుని భక్తిలో ఉన్న పారవశ్యం చెప్తే అర్ధం అయ్యేది కాదు. దాని గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అందుకే బాబా మాటల గురువుగా కాక చేతల గురువుగా అన్ని నేర్పిస్తారు. అంటే మనం కోరుకునే దాన్ని అనుభవ పూర్వకంగా ఇస్తారు. 

మనము చూసేవి కూడా శాశ్వతం కావు. ఒక కాలంలో ఉండి మరో కాలంలో నశించేవే. మనం మనస్సుతో గ్రహించి చెప్పేది కూడా అనుభవానికి సరిపోదు. మనం ఎలా అయితే పాలల్లో నుంచి వెన్న తీస్తామో, అలానే ఆత్మ విశ్లేషణ చేసి ఈ అనుభవాన్ని పొందాలి. దీనికి గురు కృప కావాలి. గురు కృప ఎలా ఉపయోగ పడుతుంది అంటే, మన అజ్ఞానాన్ని తొలిగించడానికి మాత్రమే. ఎందుకంటే అనుభవమనేది నీలోనే ఉంది. అది ఒకరు ఇచ్చేది కాదు. అందుకే అది మనస్సుకి మాటలకు అందనిది అని చెప్తారు. 

ఒక సారి నానా చందోర్కర్ శుద్ధచైతన్యము అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అని  బాబాను అడిగారు.

దానికి బాబా ఈ విధముగా సమాధానం ఇచ్చారు.
నానా! ఇది జగత్తుకు ఆధారమైనది, చరాచర సృష్టి అంతా వ్యాపించి ఇంకా ఏదైతే మిగిలి ఉన్నదో, ఎందులో సర్వం చివరకు లయం అవుతుందో, అన్నింటికి మూలమైనదేదో అదే శుద్ధ చైతన్యము. కంటికి కనబడే యీ జగత్తు రూపంలో ప్రకాశించేదంతా నారాయణుడే! ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే ఎలాంటి అంతరాయం లేకుండా అందరిలో ఉన్నాను అనే అనుభవరూపంలో సాక్ష్యం  ఇస్తున్నది. ఇది ప్రతిక్షణం అనుభవమవుతూ ఉన్నది.

ఆ చైతన్యం ఎక్కడ ఉంది అని అడిగావు. అది ఎక్కడ లేదో చెప్పు. ఎంత వెదికినా ఆ చైతన్యం లేని చోటే లేదు. కనబడేదంతా చైతన్యమే. అది నామరూప రహితమైనది. గాలి ఎలాగైతే రంగు మొదలైన గుణరూపాలకతీతమో, చైతన్యం కూడా అలాంటిదే. ఇది ఎప్పటికీ మరువవద్దు.

చైతన్యం అంటే బ్రహ్మవేత్తలు, వృక్షకోటి, జీవకోటి, జంతుకోటి, ఇవన్నీ ఆ చైతన్యం యొక్క రూపాలే. చూచేవాడు, చూడబడేవి, చూపు, కనిపించడం, తెలుసుకోవడం, ప్రకాశించడం, వాటన్నింటికీ మూలకారణము చైతన్యం.

ఈ చైతన్యం సర్వవ్యాపి, దుఃఖరహితము, సత్యజ్ఞానానందరూపము. మీరందరూ ఆ చైతన్యానికి భిన్నంగా లేరు. ఆ చైతన్య స్వరూపమే బ్రహ్మము అని బాబా చెప్పారు. 

ఈ ఆత్మ చైతన్యం మనస్సుకి వాక్కుకి అతీతమైనది. అంటే ఈ అనుభవం మాటలతో చెప్పలేనిది. మన మనస్సుకి అందనిది. అందుకే మనం పరమాత్మను స్తుతించినప్పుడు మనోవాగతీతాయా నమః అనే మంత్రాన్ని జపిస్తాము. ఈ అనుభవం ఇంద్రియాలతో పోల్చుకోలేనిది. చర్మ చక్షువులతో చూసేది కాదు. కానీ మన ఋషులు, మహాత్ములు మనకు కొంచెమైనా అర్ధం కావాలి అని, ఈ చైతన్య అనుభవం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. 

మనం బాబా హారతిలో ఇలా పాడుకుంటాము. 

భవాద్వాoత  విధ్వంస మార్తాoడ మీడ్యo 
మనోవాగతీతం మునీర్ధ్యాన గమ్యం !
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం 
నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం!!

భవ సాగరమనే ఈ సంసార అజ్ఞాన అంధకారాన్ని నశింపచేసే సూర్యుడవు నీవు.  మనో వాక్కులకు అతీతుడవు. మునుల యొక్క ధ్యాన గమ్యం నీవే. జగత్ వ్యాపకుడవు, నిర్మలము నిర్గుణత్వము గల ఈశ్వరస్వరూపుడైన సద్గురు సాయినాథునకు నమస్కరించుచున్నాను. 

ఈ శ్లోకం శ్రీ సాయినాథుని మహిమా స్తోత్రంలో ఉంది. దీన్ని మనం మధ్యాన్న హారతిలో మరియు సాయం హారతిలో పాడుకుంటాము. ఇక్కడ కూడా పరమాత్ముని మనోవాక్కులకు అతీతుడుగా చెప్పారు. బాబా మన ప్రాపంచక కోరికలు తీర్చడమే కాకుండా మనకు ఈ పరమాత్మ తత్వ అనుభవం కోసం కృషి చేయమని బోధించారు. 

ఈ మానవ జన్మ మాటి మాటికీ వచ్చేది కాదు. అందుకే మనం అందరమూ శాశ్వతమైన, మరియు మాటలకు అందని ఈ ఆత్మ సాక్షత్కారమనే అనుభవం కోసం ప్రయత్నించాలి. అప్పుడే మన జన్మ సార్ధకం అవుతుంది. 


ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః - ఓం శ్రీ మనోవాగతీతాయా నమః 















  






Wednesday, December 14, 2016

ఓం శ్రీ సర్వాంతర్యామినే నమః




మనము సాయి అష్టోత్తరములో ఓం సర్వాంతర్యామినే  నమః అని చదువుతాము. భగవంతుడిని అర్ధం చేసుకోవాలి అంటే ఈ మంత్రాన్ని బాగా తెలుసుకోవాలి. 

ఒక సారి బాబా ఇలా చెప్పారు. 
బంధాలతో విషయ వాంచలతో ఉన్నవారు మంచి చెడుల గురించి తెల్సుకోలేరు అట్లానే భగవంతుడ్ని అర్ధం చేసుకోలేరు. వాళ్ళకు మానవత్వం బహు తక్కువగా ఉంటుంది. ధర్మమార్గం తెలియదు. ఎప్పుడూ ఈ ప్రపంచం అనే సాగరంలో మునిగి శాస్త్రాలపట్ల, సంతుల పట్ల శ్రద్ద లేక బతుకుతూ ఉంటారు. వారు భగవంతుని కాక నరకానికి చేరుకొంటారు.

ముముక్షువులు బంధాలతో విసిగి, వివేక విచారములతో, సదా భగవంతుడినే కోరుకుంటారు. వాళ్ళు తప్పకుండా ధర్మమార్గంలో నడుస్తారు. వీళ్ళే సాధకులై, జాగరూకులై, భగవంతుని స్మరిస్తూ తపోధ్యానాదులతో జీవనాన్ని సాగిస్తారు. భగవంతుడి నుంచి ముక్తి తప్ప వేరేమి కోరుకోరు. వారికి నేను గురువు రూపంలో ఉండి ఈ శరీరం వాళ్ళది కాదు అని, వారిలోనే పరమాత్ముడు ఉన్నాడని అనుభవపూర్వకంగా తెలియచేస్తాను. అప్పుడు వారికి భగవంతుడు సర్వవ్యాపి అని, అన్ని రూపాలలో తనే ఉన్నాడన్న అనుభవం కల్గుతుంది. కదిలేవి, కదలనివి అంతా దేవుడే అని వారికి అనుభూతి అవుతుంది. దేవుడు లేని స్థలము లేదని అర్ధం అవుతుంది. కాని మాయ అనే తెర వలన ఇది చాలా కష్టం అనిపిస్తుంది. ఆ మాయను కేవలం గురుకృప ద్వారా మాత్రమే దాటగల్గుతాము. గురువు పట్ల శ్రద్ద, ఆ తరువాత ఈ కర్మలను నశింప చేసుకొనే దాకా ఓర్పు కలిగి యుండాలని బాబా చెప్పడం జరిగింది.

భగవంతుడు సర్వవ్యాపి అని, అందరిలో భగవంతుడిని చూడమని మనము యుగయుగాలుగా వింటూనే ఉన్నాము. కాని ఈ సత్యం మన మనస్సులోతుల్లోకి ప్రవేశించలేకపోతుంది. భగవద్గీతలో పరమాత్ముడు ఈ విధంగా చెప్పారు. 

సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః !
సర్వథా  వర్తమానోపి  స యోగీ  మయి వర్తతే !!

భగవంతునియందు ఏకీ భావ స్థితుడైన పురుషుడు సర్వభూతములయందును  ఆత్మ రూపమున సచ్చిదానందుడై ఉన్న నన్ను  భజించును. అట్లాంటి యోగి సర్వధా సర్వ కార్యములయందు వ్యవహరించుచున్నను  నా యందే ప్రవర్తించుచుండును. 

ఇక్కడ భగవంతుడిని సర్వ భూత స్థితుడుగా భజించాలి అని చెప్పడం జరిగింది. ఎలాగైతే నీటి బిందువులలో, ఆవిరిలో, పొగమంచులో మరియు మంచులో అంతా నీరే ఉందో, అలానే భగవంతుడు పరిపూర్ణుడై చరాచర విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. 

ఈ అనుభూతిని మన నిజ జీవితంలో పొందలేకపోతున్నాము. మరి ఎట్లా? ఏ మార్గంలో వెళ్ళాలి!

అందుకే బాబా మనకి సులభమైన మార్గం చెప్పటం జరిగింది. ఆయన ఎల్లప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ, భగవంతుడే మనకు దారి అనే తత్వాన్ని బోధించారు. కేవలము శ్రద్ధ, సబూరితో మాత్రమే మనము ఈ గమ్యాన్ని చేరుకోగల్గుతాము.

ఉదాహరణకి మనం చిన్నప్పుడు కొన్ని మాటలు తప్పు వ్రాసినప్పుడు మన టీచర్స్ మన చేత కాంపోజీషన్ వ్రాయించేవారు. దాని మూలాన మనకు ఆ తప్పుని దిద్దుకొనే అవకాశం కల్గింది. అట్లానే కేవలము భగవంతుని యొక్క స్మరణతో ఈ కలియుగంలో ముక్తిపథం వైపు నడవచ్చు. 

ఏదైనా సాధన ద్వారా మాత్రమే సాద్యపడుతుంది. ఈ సాధనలో మనకు మార్గదర్శి కావాలని బాబా చెప్పడం జరిగింది. లేకపోతే ఈ అరణ్యంలో మనము దారి తప్పుతాము. ఈ మాయ మనల్ని మింగేస్తుంది. 


ఈ సర్వవ్యాపకత్వం మనకు అలవాటు చెయ్యడానికి బాబా వివిధ రూపాలలో దర్శనం ఇచ్చి, వారికి వారి కర్మలు, వాసనలకనుగుణంగా వారిని నడిపించి మార్గదర్శకత్వం చేయడం జరిగింది. కేవలము పరమ గురువులు మాత్రమే ఈ విధంగా మనలను ఉద్దరించ గల్గుతారు. ఏ విధంగా భగవంతుడు (కృష్ణుడు) అన్నింటా ఉన్నాడని విభూధి యోగంలో కృష్ణపరమాత్మ చెప్పడం జరిగిందో అదే బాబా చేసి చూపించారు. ఆయన జంతువుగా వచ్చిన, మనిషిగావచ్చిన, గురువులుగా కనిపించినా, మన ఇష్ట దైవంలా కనిపించినా, ఇలా ఏ రూపముగా వచ్చినా, ఇదంతా మనకు ఈ భావనను అనుభవ పూర్వకంగా చూపించగల పరమదయాళువు మన సాయి పరమాత్మ.
  


ఓం శ్రీ సాయి రామ్ !

Wednesday, December 7, 2016

నవవిధ భక్తి





మనము ఎన్నో పుస్తకాలను చదువుతాము. పాటలను వింటాము. ఇట్లా మనసుకు ఆనందమైనటువంటివి మనము అనుభవిస్తాము. కాని వీటిల్లో కొన్ని మాత్రమే మన హృదయానికి హత్తుకుని పోతాయి. కాని భక్తిలో కలిగేటువంటి పారవశ్యం అసాధారణమైనది. ఆ పారవశ్యంలో మునిగితే కాని దాని ఆనందము తెలియదు. ఇది నోటితో  చెప్పేది కాదు. మనందరికి భక్తి ఉండవచ్చు కాని మనము ఆ పారవశ్యాన్ని పూర్తిగా అనుభవిస్తున్నామా లేదా?

అటువంటి స్థితికి చేరాలంటే ఏం చేయాలి? ఏది దారి? బాబా మనకు ఒక చక్కటి మార్గం చూపించారు. అదే నవవిధ భక్తి మార్గము. అనంతరావు పాటంకర్ ద్వారా మనకి ఈ నవవిధ భక్తి మార్గాన్ని బోధించి బాబా మనకు చాలా ఉపకారం చేసారు. ఇది ఏ సందర్భంలో చెప్పారు అని మనం పరిశీలించి చూస్తే ఈ మార్గం ఎంత గొప్పదో మనకు అవగతం అవుతుంది. 

ఒకసారి అనంతరావు పాటంకర్, సాయి దర్శనానికై వచ్చి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. బాబా నేను చాలా పుస్తకాలు చదివాను, విన్నాను. ఉపనిషత్తులు వాటి బాష్యాలు, మన పవిత్రగ్రంధాలు ఇలా చాలా పఠించడం జరిగింది. కాని మనస్సులో ఏదో వ్యాకులత. నేను చదివినదంతా వృధా అనిపిస్తుంది. నేర్చుకున్న దానికి అర్ధం లేకుండా పోయింది. ఈ జపతపాదులు ఎందుకు? ఇవి మనశ్శాంతిని ఇవ్వలేదు. ఈ పరమాత్మ అనుభూతి పొందని ఈ సాధనలన్నీ వ్యర్ధమేనా? నీ పాద పద్మాలే నాకు గతి, నన్ను ఉద్ధరించు మహారాజా అని దీనంగా అడగడం జరిగింది.

అప్పుడు బాబా ఒక కధ చెప్పడం జరిగింది. ఒక వర్తకుడు తొమ్మిది లద్దెలను తన పంచె కొంగులో సేకరించెను. ఇట్లు అతడు తన మనస్సును కేంద్రీకరించ కల్గెను అని చెప్పారు. దాని యొక్క అర్ధం తెలియక పాటంకరు, దాదా కేల్కురుని అడగటం జరిగింది. వీరిని అడ్డం పెట్టుకుని బాబా మనకు నవవిధభక్తిని ఇవ్వడం జరిగింది.

అవి:
1) శ్రవణం
2) కీర్తనం
3) స్మరణం
4) పాదసేవనం
5) అర్చనము
6) నమస్కారము
7) దాస్యము
8) సఖ్యము
9) ఆత్మ నివేదనము

వాటిని మూడు భాగాలుగా విభజిస్తే : 
మొదటి మూడు శ్రవణం, కీర్తనం, స్మరణం - ఇవి మన మనస్సును శుద్ది చేస్తాయి. అప్పుడు భక్తి బీజం మొలకెత్తటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ తరువాత పాదసేవ, అర్చనము మరియు నమస్కారము అనే మూడింటి ద్వారా ఈ బీజం పెరుగుతుంది. మనకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు దాన్ని దాస్యము, అంటే సేవ ద్వారా, ఆ గురువుకి భక్తి భావనతో గూడిన సఖ్యముతో ఆత్మనివేదన గావించటమే మన లక్ష్యము.

సరే ఈ నవవిధ భక్తికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది. సఛ్ఛరితలో గుర్రము గురించి చెప్పినపుడు ఆడ గుర్రము గురించి చెప్పడము జరిగింది. అలా ఎందుకు? ఇక్కడ ఆడగుర్రమునగా భగవంతుని అనుగ్రహము అని చెప్పటం జరిగింది.

మనకి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మనువును, శతరూపును స్త్రీ పురుషులుగా సృష్టించడం జరిగింది. వీరి కుమార్తె అయిన దేవహుతిని కర్ధమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. కర్ధమ ప్రజాపతి చాలా గొప్ప తపఃసంపన్నుడు. ఆయన జితేంద్రియుడు మరియు దివ్యాత్ముడు. కర్ధముడనగా ఇంద్రియములను నిగ్రహించిన వాడని అర్ధము. దేవహుతి అనగా దేవుని ఆహ్వానించునది అని భావము. దేవహుతి భర్తను భగవంతునిగా ఆరాధించి సేవచేస్తూ ఉండేది. కఠోరసాధనలతో, నిష్టలతో ఆమె శరీరం చిక్కి శల్యమైనా కూడా లెక్కచేయక భర్తకు సేవ చేసేది. ఆమె భక్తికి మెచ్చి భర్తయైన కర్ధముడు మరల ఆమెకు యవ్వనం ప్రసాదించి, ఆమె కోర్కె మీద సంతానం ప్రసాదించెను. వారికి తొమ్మిది మంది కుమార్తెలు పుట్టారు. నవవిధ భక్తి రూపాలుగా కుమార్తెలు పుట్టడం జరిగింది. ఆ కన్యలు తరువాత మహర్హులని వివాహం చేసుకోవడం జరిగింది.

కళ-మరీచిని, అనసూయ-అత్రిమహర్షిని, శ్రద్ధ అనే కన్యను అంగీరసునకు, హవిర్భువును పులస్త్యునకు, గతిని పులహమహర్షికి, క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అరుంధతిని వశిస్ఠునకు ఇవ్వడం జరిగింది. ఈ కన్యలే నవవిధ భక్తి స్వరూపాలు.

ఆ తరువాత దేవహుతికి స్వయానా భగవంతుడే కపిలదేవుడిగా జన్మించి ఆమెకు మోక్షం ప్రసాదించడం జరుగుతుంది. ఈ మహర్షులందరు పరమాత్మ స్వరూపులు. ఈ కన్యలందరు భక్తి స్వరూపాలు. ఎప్పుడైతే భక్తితో భగవంతుని సేవిస్తామో అప్పుడే ఆ భగవంతునిలో మనం కల్సిపోతాము. అప్పుడు భక్తికి భగవంతునికి తేడా ఉండదు. ఇదే శక్తి చైతన్య స్వరూపము.

నవవిధ భక్తి విధానాన్ని మనకి అనుభవ పూర్వకంగా అందించే పరమగురువే సాయి. బాబా ఈ నవవిధ భక్తుల విధానాన్ని చాలా చోట్ల నేర్పించడం జరిగింది. కాని మనకు బాగా తెలిసిన సందర్బాలు రెండు. ఒకటి అనంతరావు పాటంకర్ మరియు లక్ష్మీబాయి. బాబా తన మహా సమాధి ముందు, లక్ష్మీబాయికి తొమ్మిది నాణెములు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా గురువులు వీటి గురించి బోధిస్తారు కాని బాబా విధానము బోధంచడమే కాదు, మనకు అనుభూతి కల్పించి, ఆ స్థితిలోకి మనల్ని తీసుకువెళ్తారు.

ఇప్పుడు ఆ నవవిధ భక్తులను గురించి విడివిడిగా పరిశీలిద్దాము.
1) శ్రవణము: గురువు (దేవుడు) గురించి వినడం, తెలుసుకోవటం, ఆయన గుణగణాలని, ఆయన లీలలను ఎల్లపుడూ వింటూ ఉండటం, భక్తుడి యొక్క మనస్సు ఈ శ్రవణము ద్వారా తన్మయత్వం చెందుతుంది. ఒక స్థితిలో ఈ భక్తుడు తన కలల్లో కూడా దేవుడ్నే గుర్తు చేసుకుంటాడు. కాని ఈ శ్రవణము మనకి (మన మనస్సుకి) వంట బట్టాలి అంటే సత్సంగము కావాలి. మనకి గురువుల సాంగత్యము కావాలి. పాజిటివ్ ఎనర్జీ ఉన్నచోట, బాబా సచ్చరితతో, హారతులతో ముక్తిని పొందవచ్చు.

2)కీర్తనము: ఇక్కడ భక్తుడు భగవంతుని గుణగణాలను, లీలలను పాటల రూపంలోనూ, మరియు వేరే విధములుగా కీర్తిస్తుంటారు. దీనిలో వారికి ఒకరకమైన భావోద్రేకము వస్తుంది. గొంతుక పూడిపోతుంది. కంటి వెంట నీరుకారుతుంది. ఆ భక్తి సాగరంలో తేలియాడుతుంటారు. దాసగణు బాబా గురించి ఎప్పుడూ కీర్తిస్తుంటారు. మనకి తెలియని ఎందరో మహానుభావులు కీర్తనము ద్వారా ముక్తి పధంలో నడిచారు.

3) స్మరణము : అంటే ఎల్లప్పూడు భగవంతుని గూర్చి ఆలోచించడమే. మనము ఏ పని చేస్తున్నా మనసెప్పుడు ఆ గురువు మీద ఉంటంది. ఇంకా వేరే వస్తువులు ఆలోచనలోకి రావు. వాళ్ళు ఆ భగవంతుని గూర్చిన కథలో ఆయన నామాలను, ఆయన లీలలను ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. జపము చేయడము, ధ్యానము చేయడము, సత్సంగము చేయడం ఇట్లా ఏది చేసినా భగవంతుని స్మరణ అవుతుంది. బాబా ఎప్పుడూ అల్లామాలిక్ అనే స్మరణ చేస్తూ మనల్ని కూడా ఆ భగవంతుని గూర్చిన స్మరణ చేయమని చెప్పడం జరిగింది.

4) పాదసేవ : భగవంతుని పాదాలకు సేవ చేయడం, లక్ష్మీపార్వతులు ఎప్పుడూ ఈ సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ లక్ష్మీ అంటే ఏమిటి? ఆ చైతన్య స్వరూపుడైన భగవంతుని యొక్క మాయారూపమే. ఈ మాయ వల్ల బంధం ఏర్పడుతుంది. ఈ మాయ మనల్ని భ్రమింపజేస్తుంది. ఆ భగవంతుడు ఈ చర్మచక్షువులకి దర్శనం ఇవ్వడం లేదు. మనము డైరెక్టుగా భగవంతుని సేవ చెయ్యలేక పోతున్నాము అన్న బాధ ఉండవచ్చు. అందుకే ఈ దేవాలయాలు, పూజామందిరాలు, విగ్రహాలు, వీటి ద్వారా మనము ఈ సేవను చేస్తాము. 

పాదసేవా లేక పదసేవా! 

భగవంతుడు నేను అంతటా ఉన్నాను అంటే దాని అర్ధం, మనము ఎవరికి సేవ చేసినా అది పాదసేవే అవుతుంది. కాని మనకు ఆ భావన ఉండాలి. భగవంతుడి విశ్వరూపమే ఈ జగత్తు. మానవ సేవయే మాధవ సేవ. దీన్నే మనం ఇట్లా చెప్పుకోవచ్చు. ఇది పదసేవ! భగవంతుని పాదములవైపు నడిచే మార్గం ఏదైన సరే అది పాద సేవ అవుతుంది. ఆయన చూపించిన మార్గంలో నడవడం మన కర్తవ్యము.

5) అర్చన: అర్చన నవవిధ భక్తులలో చాలా ప్రధానమైనది. మనము ఒక విగ్రహానికి లేదా ఒక పటమునకు పూజా రూపంలో ఈ అర్చనను చేస్తాము. భగవంతుని పూజించటమే అర్చన. అర్చన యొక్క ముఖ్య ఉద్ధేశ్యము. భగవంతుడిని ప్రసన్నుడను చేసుకోవడమే. అర్చన వలన మన మనస్సు శుద్ధి పడుతుంది. మన అహంకారం నశించి మనలో ప్రేమభావన నిండుతుంది.

మానవ సేవ మాధవసేవగా చెప్పబడింది. ఆ భగవంతుడు విరాట్ స్వరూపుడు. అందుకే గురుసేవ, మానవ సేవ కూడ అర్చనలో భాగమే. అర్చన చేసేటప్పుడు భక్తుని యొక్క మనస్సు ఆ భగవంతుని రూపమును గుణగణాలను మరియు ఆ శక్తి యొక్క అనంతతత్వాన్ని గుర్తు చేసుకోవాలి. 

6) వందనము: మన శరీర ఉనికిని మార్చి పూర్తిగా భగవంతుని ముందు మోకరిల్లటమే వందనము. సాష్టాంగ నమస్కారం చేయడం వందనమే. భగవంతునికి మిక్కిలి శ్రద్ధతో, ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఆ దేవుడ్ని అన్నింటిలో చూస్తూ, భక్తి భావనతో అన్ని శరీర అంగములను అర్పించి నమస్కరించటమే వందనము.

7) దాస్యము : దాస్య భక్తి అంటే, భగవంతుని పూర్తి సేవక భావనతో ప్రేమించటమే. ఆయన యొక్క భావనలను (అంటే మన  శాస్త్రాలను) గౌరవించి, ఆ వేద వాక్కులను తప్పకుండా సేవా భావముతో పాటించడం చాలా ముఖ్యము. ఒక యజమాని గురించి నిజమైన సేవకుడు ఎట్లా ఆలోచిస్తాడు, ఆ యజమానికి  సేవకుడు కావల్సినవన్ని చేయడం మనం చూస్తాము. మనము పల్లకి సేవ చేయడం, మన దేవాలయములు, పూజా మందిరములను శుభ్రం చేయడం, ఇట్లా ఏ రకమైన సేవ చేసినా  ఈ దాస్యభక్తి కిందకు వస్తుంది.

8) సఖ్య భక్తి: భగవంతుని పట్ల సఖ్యభావనతో ఉండటమే సఖ్యభక్తి. మనకు బాగా ఇష్టమైన స్నేహితులకు మనము ఏమైన చేస్తాము. మనము మన పనులన్నీ ప్రక్కన పెట్టి మన పాత స్నేహితులకు ప్రాముఖ్యత ఇస్తాము. ఇదే భావన కనుక మనము భగవంతుని పట్ల పెంపొందించుకోగల్గితే మన జన్మ సార్ధకం అవుతుంది.

9) ఆత్మ నివేదన : తనువును, మనస్సును, ఆత్మను పూర్తిగా సమర్పించటమే ఆత్మనివేదన. ఇంక మనదంటూ ఏమీ ఉండదు. అంతా భగవంతునిదే. ఆయన దయ, కృప మరియు కరుణయే సర్వస్వము. మనము భగవంతునిలో భాగమైపోతాము. ఆ భగవంతుని లీలే ఈ ప్రపంచము. ఇక ఈ ప్రపంచములో శత్రువులే లేరు. కష్టమేలేదు. భక్తుడే భక్తియై పోతాడు. అతని కర్మలన్నీ నశిస్తాయి. ప్రపంచ భావన నశించి పరమాత్మ భావన మాత్రమే మిగిలిపోతుంది. మనిషి మహాత్ముడౌతాడు. ఇది మనకి  కష్టం అనుకోవచ్చు. కాని ఒక ఉదాహరణ మనము ఇక్కడ చెప్పుకుందాము. ఈ భావన ప్రతి మనిషికి సర్వసిద్దముగా ఉంటుంది. కాని మనము ఆచరించము. ఒక వ్యక్తి పట్టుదలతో ఒక వ్యాపారం చేస్తాడు. దాన్ని రాత్రింపగళ్ళు తన మనసులో నింపుకుంటాడు. చివరికి అదే తన గుర్తింపు, స్వభావము అవుతుంది. తన పేరే ఆ బిజినెస్‌గా గుర్తించబడుతుంది. అట్లానే మనకు శ్రద్ధ ఉండి, సబూరితో అంటే ఓర్పుతో వ్యవహరిస్తే ఈ నవవిధ భక్తుల ద్వారా భగవంతుడ్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. మనసాయి మనలందరిని ఈ బాటలో నడిపించాలని కోరుకుందాము.

|| ఓం సాయిరాం ||