In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, October 26, 2016

శివాయ గురవే నమః - గురు గీత




గురు పాదములే మన పూజకు తగిన ఆరాధ్య వస్తువుగా వివరించిన పరమశివుడు ఇంకా ఇలా చెపుతున్నారు. 

సంసారమనే రోగాన్ని పోగొట్టేది, దుఃఖ సముద్రాలను దాటించేది, సర్వ లోకాలను భరించేది అయిన గురు పాదమే నాకు శరణం అని చెపుతున్నారు. సాయి నిరాకార ధ్యానాన్ని చేయమని, ఇది కనుక కుదరక పొతే తన సాకార రూపాన్ని ధ్యానించమని చెప్పారు. గురు గీతలో గురువుని గూర్చి పరమశివుడు పార్వతి ఇలా అంటున్నారు. 

అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విభుజశ్చాపరో హరి:!
యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురుః కథితః ప్రియే !!

పార్వతి! గురువు అంటే 
మూడు కళ్లు లేని శివుడు, నాలుగు చేతులు లేని విష్ణువు, నాలుగు ముఖాలు లేని బహ్మ 
అని శాస్త్రాలు కీర్తిస్తున్నాయి. 

నిత్యాయ నిర్వికారాయ నిరవద్యాయ యోగినే !
నిష్కలాయ నిరీహాయ శివాయ గురవే నమః !!

గురువు నిత్యుడు, వికార రహితుడు, దోష రహితుడు, యోగి, నిష్కలుడు, ఆశలు లేని వాడు, మరియు మంగళప్రదుడు. అలాంటి శ్రీ గురువుకి నమస్కారము.

ఇక్కడ శివాయ గురవే నమః అని వాడడం జరిగింది. ఇక్కడ శివుడు అంటే మంగళ స్వరూపుడు. అంతే కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉన్న శంకరుడి గురించి కాదు. ఇది పరమాత్మ స్వరూపంగా తెలుసుకోవాలి. ఈ తత్వము త్రిమూర్తులకు అతీతమైనది. 


శిష్య హృత్పద్మ సూర్యాయ సత్యాయ జ్ఞానరూపిణే !
వేదాంతవాక్య వేద్యాయ శివాయ గురవే నమః !!

మన అందరికి ఆధ్యాత్మిక హృదయం కుడి వైపున ఉంటుంది. మనకు తెలిసిన గుండె ఎడం వైపున ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక హృదయాన్ని పద్మంతో  పోల్చి చెప్పారు చెప్పారు. వీటిని వికసింప చేసే సూర్యుడే గురువు. జ్ఞానమే ఆయనకున్న వెలుగు. సూర్యుడు పగలు మాత్రమే ఈ పద్మాలను వికసింప చేయగలడు కానీ గురువు యొక్క వెలుగు శాశ్వతమైనది. దీనికి పగలు రాత్రితో సంబంధం లేదు. ఇలా గురు కృపతో విచ్చుకున్నహృదయ పద్మం మళ్ళా ముడుచుకోవడమనేదే ఉండదు. 

మనం ఒక పని చేస్తే దానికి ఒక కారణం వేరుగా ఉంటుంది. అలానే ఒక వస్తువు తయారు అయింది అంటే, ఈ వస్తువుకి కావాల్సిన ముడి సరకు అవసరం ఏంటో ఉంటుంది. కానీ ఈ సృష్టి ఏ వస్తువునుంచి భగవంతుడు తయారు చేసాడు. ఆ వస్తువు భగవంతుడు కన్నా వేరుగా ఉందని చెప్పలేము. మరి ఈ ప్రపంచాన్ని తయారుచేయవలిసిన ముడి సరకు ఎక్కడనుంచి వచ్చింది. దీనికే మన శాస్త్రాలు సాలి పురుగుని ఉదాహరణగా తీసుకున్నాయి. సాలిపురుగు తన గూడు కట్టడానికి తనలోని పదార్ధాన్నే వాడుకుంటుంది. ఎక్కడో బయటినుంచి ఆ దారం రాదు. 

అందుకే గురు గీత ఇలా చెపుతుంది. 

కార్య కారణ రూపాయ రూపారూపాయ తే సదా !
అప్రమేయ స్వరూపాయ శివాయ గురవే నమః !!

దృగ్దృశ్య ధ్రష్ట్రు రూపాయ నిష్పన్న నిజ రూపిణే !
ఆపారాయా అద్వితీయాయ శివాయ గురవే నమః !!

గుణాధారాయ గుణినే గుణవర్జిత రూపిణే !
జన్మినే జన్మ హీనాయా శివాయ గురవే నమః !!


కార్య కారణాలు రెండూ గురువుయొక్క రూపాలే. సాకారుడు నిరాకారుడు కూడా తానే. ఇలా మన ఊహకు అందని స్వరూపముకలవాడే గురువు. 

చూడబడేది, చూచేది మరియు చూపు కూడా గురువే. ఇలా తన స్వస్వరూపంలో నిలిచి ఉండే వాడే గురువు. అపారమైన వాడు అద్వితీయుడు అయిన గురువుకి మనం నమస్కరిస్తున్నాము. 

మనము సాయి హారతిలో ఇలా గానం చేస్తాము. 

సదా స్వస్వరూపం చిదానంద కందం 
జగత్సంభవ స్థాన సంహార హేతుం! 
స్వభక్తేచ్చయా మానుషం దర్శయన్తం 
నమామి ఈశ్వరం సద్గురుమ్ సాయినాథం !!

ఈ శ్లోకంలో పైన చెప్పిన పరమాత్మ తత్వమే ఉంది. 

గురువుకి మొదలు లేదు. అంతం లేదు. అలానే ఆత్మకు మొదలు అంతం లేవు. ఆత్మే గురువు. మనలో ఉన్న ఈ ఆత్మే మన స్వస్వరూపము. ఈ రూపం గురించి తెలుసుకొనే జ్ఞానమే ఆత్మ జ్ఞానము. మాయ అనే తెర ఈ ఆత్మను కప్పి ఉంటుంది. ఈ మాయ గురువు అధీనంలో ఉంటుంది. కానీ జీవులందరూ మాయ అధీనంలో ఉంటారు. 

గురువుకి మాయ లేదు. గురువుకి రూపం లేదు. ఎప్పుడు స్వస్వరూపంలోనే ఉంటారు. అట్టి స్వస్వరూపమైన శివునికి నమస్కారమని గురు గీత గానం చేస్తుంది. 

సాయి మనలోని మాయను తొలగించడానికి ఆయన మరింత మాయను ధరించినట్లు కనిపిస్తారు. మనం ఓర్పుతో సాయి నేర్పిన సత్యాలను అర్ధం చేసుకొని వాటిని అనుసరించాలి. అప్పుడే ఈ మాయను దాటి మనం స్వస్వరూపంలో ఉండగలుగుతాము. ఇదే ఆత్మసాక్షాత్కారమని మన శాస్త్రాలు చెపుతాయి. ఈ బ్రహ్మానుభూతి మనకు కలగాలి అంటే మనకు గురు కృప కలగాలి. గురు కృప కలగాలి అంటే మన చిత్తం శుద్ధి పడాలి. చిత్త శుద్ధి లేని శివ పూజ వ్యర్ధమే. శ్రద్ధ సభూరి లేని సాయి పూజ కూడా మనలను గమ్యానికి తీసుకు వెళ్ళదు. 

కావున సాయి భక్తులారా!

సాయిని భక్తితో గురువుగా పూజిద్దాము. 
సాయి నుంచి ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే కోరుకుందాము. 
సాయి కృపకు పాత్రులమవుదాము. 


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 




Wednesday, October 19, 2016

గురు రక్ష - గురు గీత


 
సాయి రక్ష

మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు జీవితంలో చేస్తూ ఉంటాము. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ఒక్కోసారి ఈ కర్మ ఫలితం ఒక జన్మలోగాని కొన్ని జన్మలలో కానీ అనుభవించాల్సి ఉంటుంది. మనం మంచి మార్గంలో నడిస్తే చాలా వరకు తెలిసి చేసే తప్పులు తగ్గి పోతాయి. కానీ మనకు ధర్మం ఏమిటో తెలియక అంటే రూల్స్ తెలియక చేసే తప్పులు చాలా ఉంటాయి. మరి వీటినుంచి మనలను ఎవరు రక్షిస్తారు. మనకు మంచిది అనిపించింది మనం చేస్తూ ఉంటాము. ఇది కాలానుగుణం మారుతుంది అని పెద్దలు చెప్తారు. మనం మంచిది అనుకున్నది చేసినా కానీ మనకు దుఃఖం తప్పటలేదు. ఒక బిడ్డను చిన్నప్పుడు తల్లితండ్రులు రక్షిస్తూ ఉంటారు.  ఆ బిడ్డకు ఈ దారి మంచిది కాదు అని పెద్దలు చెప్తారు. కానీ ఈ పిల్లలు వారి వాతావరణాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు. ఎందు కంటే వాళ్లకు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. పెద్దలకు తెలుసు అది మంచి మార్గం కాదు అని. కానీ నిస్సహాయ పరిస్థితి. ఈ పిల్లలకు పూర్తిగా అర్ధం కాదు కానీ వాళ్లకు తెలిసినంతలో ఆది కరెక్ట్. అలానే మనం అందరం కూడా ఇదే తప్పు చేస్తాము. మన గురువులు, శాస్త్రాలు చెప్పినవి మనం పట్టించుకోము. అందరు చేసేదే మనం చేస్తాము. 

కానీ మన దురదృష్టం ఏమిటి అంటే? పైన చేప్పిన పిల్లలకు మాదిరిగా మనకు కూడా మంచి చెడులు తెలియవు. అందుకే జీవితంలో ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటాము. వీటి నుంచి చాలాతేలికగా బయట పడేసే శక్తి కేవలం గురువుకి మాత్రమే ఉంటుంది. అందుకే మనం గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మన జీవితంలో గురువు ప్రవేశించే అర్హతను సంపాయించాలి. సాయి భక్తులుగా మనం ఎంతో పుణ్యాత్ములము. ఆయనే మనకు గురువు దేవుడు కూడా. 


గురు గీతలో గురు రక్ష గురించి పరమశివుడు పార్వతి మాతతో ఇలా చెప్పారు. 

మునిభ్య: పన్నగేభ్య శ్చ సురేభ్యచ శాపతోపి వా !
కాలమృత్యు భయా ద్వాపి గురూ రక్షతి పార్వతి !!

పార్వతి! పాములు మొదలైన విషజంతువుల నుంచి, మునులు దేవతులు మొదలైనవారి శాపాలనుంచి, కాలమృత్యు భయం నుంచి కూడా గురువు శిష్యులను రక్షిస్తాడు. 

శ్రీ సాయి సత్చరితలో మనం ఎన్నో ఘట్టాలను చూసాము. సాయి తన భక్తులను ఎలా రక్షించారో, వారిని రకరకాల జీవిత సమస్యలనుంచి ఎలా బయటపడేశారో మనం చదువుకున్నాము. నన్ను తలిస్తే చాలు నేను మిమ్మలను రక్షిస్తాను అని సాయి భరోసా ఇచ్చారు. 

మనలను ఈ శరీర పరమైన భాదలనుంచి కాపాడడమే కాకుండా, మనలను సన్మార్గంలో నడిపించి మనకు తెలియని తప్పులనుంచి కూడా మనలను రక్షిస్తారు. మనం చేయాల్సిందల్లా సాయి చెప్పిన దారిలో నడవటమే. 


శ్యామాను పాము విషంనుంచి రక్షించినా, బాలాసాహెబ్ మిరీకర్ను పాము గురుంచి హెచ్చరించి రక్షించినా, బూటీ మహల్సాపతిలను విషసర్పాల గురించి హెచ్చరించినా, మరి ఎలా తన భక్తులను రక్షించినా ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించినవే. కాని గురువు తపన కొన్ని జన్మలలో మనలను రక్షించాలి అని, ఈ జన్మలే లేకుండా చేయాలి అని గురువు మనకు అనుగ్రహాన్ని ప్రసాదించటానికి రెడీగా ఉంటారు. 

ఒక మనిషిని ఒక విష జంతువు కరిస్తే ఒక్క సారి మాత్రమే చనిపోవచ్చు. కానీ కామ క్రోధాలనే పాములు మనలను కరిస్తే కొన్ని జన్మలెత్తి చనిపోవాలి. అందుకే గురువు మనలను ఈ చెడు అలవాట్లనుంచి రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాని మనము ఈ విషయాలను అర్ధం చేసుకోము. మనకు జరిగేవి అన్ని మనం చేసుకున్న కర్మమూలంగానే అనే సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. కాని ఇవన్నీ తెలుసుకోకుండా కోరి కష్టాలను తెచ్చుకొంటాము. ఆ కష్టాలు వచ్చిన తరువాత నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి అని బాధ పడతాము. 


పరమ శివుడు మునులనుంచి దేవతలనుంచి కూడా గురువు రక్షిస్తారు అని చెప్పారు. మరి ఈ కాలంలో మనం మునులను దేవతలను చూడం కదా అని మనము అనవచ్చు. మనం మహానుభావులను గుర్తించలేము అలానే దేవతలను దర్శించలేము. అలా అని వాళ్ళు లేరు అని తీర్మానించగలమా! మన శరీరంలో ఒక వైరస్, బాక్టీరియా ఇలా మనం చూడలేని ప్రాణులన్నీ మనకు హాని చేస్తూ ఉంటాయి. అలానే మనం ఈ ప్రకృతిని నియంత్రిచే శక్తులను గౌరవించము. ఈ శక్తులను మనం అష్ట దిక్పాలకులు, దేవేంద్రుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పిలుచుకోవచ్చు. లేదా ఈ శక్తిని అమ్మవారు అని అనుకోవచ్చు. మన కోరికలను తీర్చుకోవడానికి మనం వ్రతాలు పూజలతో దేవతలను పూజిస్తాము. ఒక పురోహితుడిని పిలిచి వారి చేత పూజ చేపిస్తాము కాని మనలో ఆ నమ్మకం ఉండదు. మనం మన ఇష్టమొచ్చిన పనులు చేస్తూ, ఆ దేవతకు గౌరవం ఇవ్వకుండా మన పూజా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. దీనివల్ల మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు. మనం మాత్రం పూజ చేసాము అని అనుకొంటాము. అప్పటికి ఈ దేవతలు మనలను క్షమిస్తారు. కాని కొన్ని సార్లు మనం క్షమించలేని తప్పులు చేయవచ్చు. అప్పుడు మనలను ఎవరు రక్షిస్తారు. కేవలం గురువు మాత్రమే మనలను అన్ని పరిస్థుతలనుంచి రక్షించగలుగుతారు. 

అందుకే గురు గీతలో పరమ శివుడు ఇలా చెప్తారు. 

శివే రుష్టే గురు స్త్రాతా గురౌ రుష్టే న కశ్చన !
తస్మాత్ పర గురుం లభ్ద్వా తమేవ శరణం వ్రజేత్ !!

పరమ శివుడే కోపగిస్తే గురువు రక్షిస్తారు. మరి గురువే కోపగిస్తే ఇక రక్షించే వాడే లేడు. కనుక గురువుని ఆశ్రయించి, ఆయననే శరణు పొందాలి. 

ఇక్కడ గురువు కోపగించుకోవడం అంటే గురువు నిజంగా కోపం తెచ్చుకోవడం కాదు. ఆయన మన జీవితంలో లేక పోవడం. గురువు లేని జీవితం తెగిపోయిన గాలి పటం లాంటిది. ఎటు గాలి వీస్తే ఆటే వెళ్తుంది. ఒక దిశ, అర్ధం లేని జీవితం. సాయి అందుకే ఇలా చెప్తారు. "నా దగ్గర జ్ఞానం కుప్పలు కుప్పలుగా ఉంది కాని ఎవరూ అది అడగరు".  

సాయి భక్తులారా,
మన జీవిత పరమైన కోరికలతో మాత్రమే సాయిని పూజించడం కాకుండా, ఆయనను గురువుగా మన జీవితంలోకి ఆహ్వానిద్దాము. సాయి మనలను జన్మజన్మలకు రక్షిస్తారు. 

"గురు" అంటే అర్ధం గురు గీత ఇలా చెపుతుంది. 
"గు" అంటే అంధకారము 
"రు" అంటే వెలుతురు. 

చీకటి అనే అజ్ఞానాన్ని పారద్రోలి వెలుతురుగా మిగిల్చే పరబ్రహ్మమే గురువు.  

వెలుతురు ఉన్న చోట చీకటి అనేదే ఉండదు. సూర్యుడికి పగలు చీకట్లు అనేవే ఉండవు. ఉన్నదంతా స్వయంప్రకాశమైన వెలుతురు మాత్రమే. అలానే గురువు మన జీవితంలో వెలుగు నింపుతారు. ఈ వెలుగుకి చీకటి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు కష్ట సుఖాలనే ద్వంద్వాలు ఉండవు. మనము మన స్వస్వరూపంలో ఉంటాము. ఇదే నిజమైన గురు రక్ష. 
  

 శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 





Wednesday, October 12, 2016

గురు ధ్యానం - గురు గీత




గురు ధ్యానం గురించి గురు గీతలో ఇలా చెప్పబడింది. 

ధ్యానం అనేది త్రికరణ శుద్ధిగా చేయాలి. ఈ ధ్యానం మనో వాక్కాయ కర్మలన్నింటిలో జరగాలి. 

శ్రీమత్పరబ్రహ్మ గురుం స్మరామి 
శ్రీమత్పరబ్రహ్మ గురుం భజామి !
శ్రీమత్పరబ్రహ్మ గురుం వదామి 
శ్రీమత్పరబ్రహ్మ గురుం నమామి !!

మనము ధ్యానించే వస్తువుకన్నా గొప్పది మరొకటి ఉండకూడదు. లేకపోతె మనసులో సందేహాలు మొదలౌతాయి. సర్వవ్యాపకము, సర్వానికి ఆధారము, ఏకము, అద్వితీయము అయిన పరమాత్మే గురువు. అటువంటి గురువె మన ధ్యేయము కావాలి. అప్పుడు మన మనస్సులో అనుమానాలు తలెత్తవు. 

అటువంటి గురువుని స్మరిద్దాము. 
అటువంటి గురువుని భజిద్దాము, 
అటువంటి గురువుని కీర్తించుదాము. 
అటువంటి గురువుకి నమస్కరించుదాము. 

గురువే పరమాత్మ. గురువే మన ఆత్మగా మనలో కొలువై ఉన్నారు. ఇటువంటి గురువు యొక్క గుణాలు లక్షణాలు ఈ విధంగా గురు గీతలో చెప్పారు. 

బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం 
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం !
ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షి భూతం 
భావాతీతం త్రిగుణ రహితం సద్గురుమ్ తమ్ నమామి!! 


పరమాత్మ నిర్గుణము, నిరాకారము మరియు గుణాలన్నిటికి అతీతమైనదిగా చెప్పుకుంటాము. కానీ మనం మాట్లాడుకోవడానికి ఈ విధంగా చెప్పుకోక తప్పదు. 

బ్రహ్మానంద స్వరూపుడు, సుఖప్రదుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు, ద్వంద్వాలకు అతీతుడు, ఆకాశంలాగా నిర్మలుడు, తత్వమసి అనే వేద వాక్యముల అర్ధముగా భాసించేవాడు, ఏకం (రెండు అనేది లేని వాడు), నిత్యుడు, నిశ్చలుడు, మనో బుద్దులకు అందని వాడు, త్రిగుణ రహితుడు అయిన శ్రీ గురువుకి నమస్కరిస్తున్నాను. 

మనము ధ్యానించే తత్వము పైన చెప్పిన విధంగా ఉండాలి. ఇవన్నీ పరమ గురువుల్లో ఉంటాయి. షిర్డీ సాయి అందుకే కుదిరితే నిరాకార ధ్యానం మంచిది లేక పొతే నన్ను సాకార రూపంలో ధ్యానం చేయండి అని చెప్పారు. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మ దర్శనము. 

అందుకే గురువుని ప్రశాంత స్వరూపుడిగా చెప్తారు. గురువు జ్ఞాన స్వరూపుడు. గురువు ఆత్మ జ్ఞాని, యోగి శ్రేష్ఠుడు, సంసారమనే రోగానికి వైద్యుడు. అందుకే గురువుని కేవలం ఆత్మ స్వరూపుడిగా ధ్యానం చేయాలి. ఇదే విషయాలను పరమ శివుడు గురు గీతలో పార్వతి మాతకు చెప్పారు. 

కానీ నిరాకార ధ్యానం అందరికి సాధ్యపడదు. అందుకే గురు గీత కూడా సాకార ధ్యానం గురుంచి కూడా చెపుతుంది. 

హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే 
సింహాసనే సంస్థిత దివ్యమూర్తిమ్ !
ధ్యాయేత్ గురుం చంద్రకళా ప్రకాశం 
సత్చిత్సుఖాభీష్ట వరం దదానం !!

 హృదయ పద్మం మధ్యలో, కర్ణిక మీద ఉన్న సింహాసనంలో కూర్చుని, దివ్యమైన రూపంతో చంద్రుని వలె ప్రకాశిస్తు, సచ్చిదానందమనే వరాన్ని ఇచ్చేవాడైన సద్గురువుని ధ్యానించాలి. 

మనము గురువుకి చాలారకాలైన అలంకారాలతో పూజలు చేస్తాము. కానీ వాటివెనక ఉన్న అర్ధాన్ని తెలుసుకోవాలి. లేక పొతే బయట ఉన్న రూపంలోనే ఉండి పోతాము. 

కాషాయము త్యాగానికి ధర్మానికి ప్రతీక. 
తెలుపు జ్ఞానానికి సూచన. 
నీలి రంగు సర్వ వ్యాపకత్వానికి గుర్తు. 

ఇలా ఈ అలంకారాల వెనక ఉన్న తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. అలా కాకుండా ఆర్భాటాలకు పొతే మనము మన లక్ష్యానికి దూరం అవుతాము. అలా అని మన గురువుకి అలంకరణ చేయకూడదు అని కాదు. గురువుకి ఏ సేవ అయినా చేయవచ్చు. కానీ అది మనసా వాచా శుద్ధమైనదిగా ఉండాలి. మనం గురువుని పూజించేటప్పుడు అష్టావధానాలూ చేయకూడదు. నోటితో గురువు నామాన్ని చెపుతూ, మనసుని ఎక్కడో వదిలేస్తే ఎలా!

న గురో రధికం  న గురో రధికం 
న గురో రధికం  న గురో రధికం !
శివ శాసనత శివ శాసనత
శివ శాసనత శివ శాసనత:!!

గురువుకన్నా అధికమైనది ఏది లేదు. ఇది శివ శాసనం అని పరమ శివుడు చెపుతున్నారు. 

ఇదే మార్గాన్ని బాబా మనకు చూపించారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం. సాయి చెప్పిన బాటలో నడుద్దాము. సాయిని గురువుగా మన జీవితంలోకి ఆహ్వానిద్దాము. 


శ్రీమత్పరబ్రహ్మ సాయిం స్మరామి 
శ్రీమత్పరబ్రహ్మ సాయిం భజామి !
శ్రీమత్పరబ్రహ్మ సాయిం వదామి 
శ్రీమత్పరబ్రహ్మ సాయిం నమామి !!


సాయినే స్మరిద్దాము 
సాయినే భజించుదాము !
సాయినే కీర్తించుదాము 
సాయికె నమస్కరించుదాము !!
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !