In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, February 18, 2015

సంసారం


              సాయినాధుడు మానవ జీవితం గూర్చి మరియు దాని ముఖ్య ఉద్దేశ్యము గురించి చాలా సార్లు చెప్ఫారు. మానవ రూపం ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకు లభించినదని శాస్త్రాలు చెప్పాయి. మనము దానిని వృధా చేసుకొనకుండా సద్వినియోగం చేసుకోవాలి.
              మానవ జీవిత లక్ష్యం ముక్తి. ఈ సంసార బంధాలనే సంకెళ్ళను తెంచుకొని ఆ పరమాత్ముడే మనము అని తెలుసుకోవడమే ముఖ్య లక్ష్యము. నానా చందోర్కరుకు సాయి ఇటువంటి బోధచేయడం జరిగింది. దానిని దాసగణు మహారాజు ఒక చోట కూర్చడం జరిగింది. ఆ తరువాత చాలామంది వాటిని మనకి అందించారు.
             ఒక రోజు మహా పుణ్య సంపన్నుడైన నానాసాహెబ్ చదోర్కరు మరియు నానా సాహెబ్ నిమోన్కరులు బాబా ధర్శనార్ధమై షిర్డి గ్రామానికి వచ్చారు. నానా చందోర్కరు బాబా పాదాలపై పడి ఈ విధముగా ప్రార్ధించారు.

నానా : ఓ సాయి మహారాజా! సమర్దా! ఈ సంసారమిక చాలు, శాస్త్రాలన్నీ సంసారం నిస్సారమని వక్కాణిస్తున్నాయి. ఓ ధీనబందు! ఈ ప్రాపంచిక సంబంధాలనే సంకెళ్ళను తెంపివేయి. ఏ సుఖాలకైతే మేము పరిగెడుతున్నమో, అవే చివరకు దు:ఖాలై మమ్మల్ని ఆడిస్తాయి. ఎంత చూసినా ఈ సంసారంలో సుఖమనేది లేదు. ఇక నాకు విసుగెత్తిపోయింది. ఈ సంసార బంధాలిక నాకు అక్కరలేదు.

చందోర్కరు మాటలు విన్న బాబా ఈ విధంగా చెప్పారు.
బాబా: నానా ఈ పిచ్చి ఆలోచనలు నీకెక్కడి నుంచి వస్తున్నాయి. నీవు చెప్పింది కొంత వరకు నిజమే కాని మొత్తం మీద నీవు కొంచెం దారి తప్పావు. ఈ సంసారం నుండి నీవు తప్పించుకోవాలనుకున్నా అది వదలక నీ వెన్నంటే ఉంటుంది. అది ఎవరికీ తప్పదు. ఈ దేహాలలో తగులు కోవడం నాకే తప్పలేదు. ఇక నీవెలా తప్పించుకోగలవు. ఈ సంసారంలో ఎన్నో రూపాలున్నాయి అని అవి నీకు చెప్తాను విను.

సంసారం :
1) కామక్రోధ మదమాత్సర్యలోభ మోహములన్నీ ఒక దానితో ఒకటి కలిసి మోహమవుతుంది.
2) ఈ అరిషడ్ వర్గములు అహంకారంతో కలిసినప్పుడు సంసారబంధం ఏర్పడుతుంది. అదే సంసారమంటే.
3) కళ్ళు వస్తువులను చూస్తాయి. చెవులు ధ్వనిని వింటాయి. జిహ్వ రసాస్వాధన చేస్తుంది. ఇవి కూడా సంసారమే. అది శరీర ధర్మము.
4) ఈ సంసారం సుఖ దు:ఖాలనే రెండు వస్తువుల కలయిక. ఇవి ఎవ్వరిని వదిలి పెట్టవు.
5) ధనము, బార్యాపుత్రులు, వీనినే సంసారమని నీవు అనుకుంటున్నావు. అదే ఇప్పుడు నీకు వెగటు అయింది. భార్య, పుత్రులు, పుత్రికలు, అన్నలు, తమ్ముళ్ళు, బంధుమిత్రాది బంధాలతో నీవెంత విసిగిపోయినా అవి నిన్ను వదలవు. దానికి కారణము దేహప్రారబ్ధమని తెలుసుకో, దాన్ని అనుభవించక మూడు కాలాల్లో ఎవరు తప్పించుకోలేరు.
            ఇక్కడ బాబా దేహ ప్రారబ్దం గురించి చెప్పడం జరిగింది. సంసారమంటే కేవలము భార్యపుత్రులు మాత్రమే కాదు. మనలో ఉన్న వాసనలు, కోరికలు, బంధాలు, మనము చేసే ప్రతీ పని దీనిలో భాగమవుతుంది. ఒక దేశము కాని, సంస్థ కాని, ఏదైనా ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే దానికి ఒక శాసనము కావాలి. ఆ శాసనమే మనకు ఇవ్వబడిన శాస్త్రాలు. కర్మ సిద్దాంతమును మనము అర్ధం చేసుకోకుండా ఈ జీవన సమరం సాగించడం చాలా కష్టము.
                                                                                                                           
                        
|| ఓం సాయిరాం ||



Wednesday, February 4, 2015

సత్యం - జ్ఞానం - అనంతం -బ్రహ్మ





ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో భాగంగా మనం కూడా మార్పు చెందుతూ ఉంటాము. రోజూ ప్రొద్దున లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే దాక మనం ఎన్నో కర్మలు ఆచరిస్తాము. ఈ కర్మలన్నిటి నుండి మనం ఏమి ఆశిస్తున్నాము. 

- ఇష్ట ప్రాప్తి 

- అనిష్ట నివారణం 

మనకు ప్రియమైనది ప్రాప్తించాలి, లేదా మనకు ఇష్టం లేనిది జరగకూడదు. ఈ ఆలోచన వినటానికి చాలా బాగుంటుంది. కాని ఎప్పుడూ అలా జరగడం లేదు. మనకు దుఃఖం కలుగుతూనే ఉంది. 


ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారు ఈ రెండింటిని సమానంగా స్వీకరించేన్దుకు సాధన చేస్తూ ఉంటారు. వీరికి కొంతలో కొంత ఊరట లభిస్తుంది. వారు ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండగల్గుతారు.  వారు ఈ తేడాలకు గల కారణాన్ని వెతుకుతారు. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవాలి అని అనుకొంటారు. ఈ వెదికే ప్రక్రియలోనే మామూలు మనుషులుగా మనం తప్పుదోవ పట్టేది. ఈ కారణాన్ని బయట వెదకటానికి ప్రయత్నిస్తాము. బయట ఉండే పరిస్థుతులు, మనుషులే దీనికి కారణంగా భావించడం జరుగుతుంది. కాని ఆధ్యాత్మక మార్గంలో పయనించాలి అనుకొనేవాళ్ళు, ఈ కారణం కోసం తమలో తాము వెతుక్కొవాలి. మన మనస్సు లోతుల్లో ఉన్న ఈ వాసనలను అర్ధం చేసుకొని, అవి ఏ విధంగా మనకు దుఃఖాన్ని కలుగ చేస్తున్నాయో తెలుసుకోవాలి. 


మనం ప్రవచనాలు విన్నప్పుడు, శాస్త్రాలు చదివినప్పుడు అందరూ చెప్పేది ఏమిటి అంటే, నిన్ను నీవు తెలుసుకొ. నువ్వు ఈ శరీరం కాదు, ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు బుద్ధి నువ్వు కాదు అని చెప్తారు. ఇది వినటానికి బాగానే ఉంటుంది. కాని ఈ సత్యాన్ని అర్ధం చేసుకునే జ్ఞానం మన దగ్గర లేదు. 


ఎలాగో ఈ నిజాన్ని మనసులోకి ఎక్కించుకొని, నేను ఈ శరీరం కాదు అని మొదలుపెడితే, మొదట్లోనే కష్టం ఎదురు అవుతుంది. జబ్బు చేసి మన శరీరంలో బాధ మొదలైనప్పుడు నేను ఈ సరిరం కాదు అనుకొంటే సరిపోతుందా! మనకు నొప్పి లేకుండా పోతుందా. కొంచెం నొప్పి ఎక్కువ కాగానే ఈ సిద్ధాంతం మనకు కాదు అని వదిలేస్తామా !

లేదు, ఇంకా లోతుగా వెళ్లి విశ్లేషణ చేసుకోవాలి. వీటిని అర్ధం చేసుకోవాలి అంటే మనలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. 

మనలో మూడు శరీరాలు ఉన్నాయి అని మన శాస్త్రాలు చెపుతున్నాయి. 

1) స్థూల శరీరం
2) సూక్ష్మ శరీరం 
3) కారణ శరీరం 

స్థూల శరీరం: రక్తము, రకరకాల రసాలు, మాంసము, మేద, ఎముక, మజ్జ మరియు శుక్లము అనే సప్త దాతువులతో కలిపి స్థూల శరీరం అవుతుంది. 


సూక్ష్మ శరీరం: 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారము అనే 19 తత్వాలతో కలిసి సూక్ష్మ శరీరం అవుతుంది.


కారణ శరీరం: అనాదిగా ఉన్న అజ్ఞానం ఏది అయితో ఉందొ అదే కారణ శరీరం.

ఈ అజ్ఞానమే ఈ మూడు శరీరాలకు కారణం అవుతుంది. ఈ కారణ శరీరాన్నే ఆనందమయ కోశం అంటారు. ఇది కూడా తెచ్చిపెట్టుకున్న స్థితే. దీన్ని కూడా దాటితే కాని సచ్చిదానంద స్థితి అవగతం కాదు. 


ఈ మూడు శరీరాలు పంచాకోశాలతో అన్వయించి చూస్తే ఇలా చెప్ప వచ్చు. 


స్థూల శరీరం - అన్నమయ కోశం 

సూక్ష్మ శరీరం - ప్రాణమయ, మనోమయ మరియు విజ్ఞానమయ కోశాలు. 
కారణ శరీరం - ఆనందమయ కోశం. 

శ్రీ సాయి సత్చరితలొ బ్రహ్మ జ్ఞానం కథలో బాబా అడిగిన ఐదు మరేమిటో కాదు. ఇవే బాబా అడిగినవి. మన ఉపనిషత్తులు చెప్పిన సత్యం కూడా ఇదే. బాబా ఒక చిన్న సన్నివేశం ద్వారా మనకు తెలియ చెప్పేందుకు ప్రయత్నించారు. మనం ఆ కథలో ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ పంచాకోశాలను దాటి పరమానంద స్థితికి చేరాలి. ఆ సత్ చిదానందమే మన నిజమైన స్థితి అనే జ్ఞానాన్ని పొందాలి. 


జ్ఞాన ప్రదాయకమైన ఈ అనంత పరబ్రహ్మమే మన నిజ స్వరూపమనే సత్యాన్ని ఎరుక పొందటమే మానవ జీవిత లక్ష్యం. 




 ఓం శ్రీ సాయి రామ్ !