భగవంతుని పట్ల ప్రేమనే భక్తి అంటారు.
ఈ భక్తి ఎప్పుడైతే ఏమి ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు.
మనము ఎవరినైన ప్రేమించాలి అంటే వాళ్ళ గురించి మనకు తెలియాలి. వాళ్ళ మీద ఇష్టం ఏర్పడాలి.
అట్లానే మనకు దేవుడి మీద ప్రేమ ఏర్పడాలి అంటే దేవుని గురుంచి మనం తెలుసుకోవాలి.
మనకి భక్తి ఉన్నదా లేదా అని ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. ఉంటే మన భక్తి కేవలం భగవంతుని కోర్కెలు కోరడానికి మాత్రమేనా లేక శణాగతి చేసే అవగాహన ఉందా?
బాబా ఎప్పుడూ శ్రద్ద అనే విషయాన్ని ముఖ్యమైనదిగా చెప్పడం జరిగింది. ఈ శ్రద్ద అంటే ఏంటి? శ్రద్ద అంటే తిరుగులేని నమ్మకము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు నమ్మిన గురువుల మీద కాని లేదా దేవుడి మీద కాని చెరగని నమ్మకము ఉండాలి. ఇది లేని రోజున మనము కేవలము సామాన్య భక్తుల్లా మాత్రమే మిగిలిపోతాము.
విషయవాంచలకు సంబంధించిన కోర్కెలను కోరుతూ భగవంతుడితో వ్యాపారం చేస్తాము. ఎంతో కృపామయుడు కాబట్టి మనం అడిగిన కోర్కెలను తీరుస్తాడు. అట్లానే బాబా తన దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళ కోర్కెలన్నింటిని తీరుస్తాడు. అందుకే బాబా ఇలా అనేవారు, "నా దగ్గరకు వారు మొదట్లో కోర్కెల కోసం వచ్చిన, ఆ తరువాత వారిని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడం జరుగుతుంది. కాని అది వాళ్ళ ప్రారబ్ధం బట్టి ఉంటుంది. వారికి విషయవాసనలు మీద మనస్సు ఉంటే, వాళ్ళు మామిడిపూతలాగా రాలిపోతారు. కొందరు పిందెలులాగా రాలిపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే మామిడి పండ్లు అవ్వగలుగుతారు" అని దాము అన్నాకు ఒకసారి బాబా చెప్పడం జరిగింది.
బాబా మనకు శ్రద్దని నేర్పించాలి అని ఎంతో తపన పడ్తుంటే మనము పట్టించుకోము. జీవితంలో అనవసరమైన వాటి వెంట పరుగులు తీస్తాము. ఈ శ్రద్ద మనకు కాకపోతే ఇంకెవరికి.
ఒకసారి మహాభారత యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు కృష్ణపరమాత్ముడి నివాసానికి వచ్చి ఆయన సహాయం అర్ధిస్తారు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడ్ని కాకుండా ఆయన సైన్యాన్ని కోరుకోవడం జరుగుతుంది. కాని అర్జునుడు మాత్రం పరమాత్మనే కోరుకుంటాడు. ధుర్యోధనుడు తన వాళ్ళా దగ్గరికి వెళ్ళి పిచ్చి అర్జునుడు యుద్ధం చేయంటువంటి కృష్ణుడ్ని కోరుకున్నాడు. మనకి విజయము తధ్యము. మనవైపే ఎక్కువ సైన్యం ఉంది అని మురిసిపోయాడు. చివరికి జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు అన్న విషయం మనకు తెల్సినదే.
అట్లానే మనము ఎప్పుడూ ఆ సర్వేశ్వరుడు సృష్టించిన వస్తువులను మాత్రమే కోరుకుంటున్నాము. ఆయన్ని మాత్రం కోరుకోము. ఆయనను ఒక కోర్కెలు తీర్చే యంత్రంలా చూస్తాము. మనకి అవగాహన కలిగిన రోజున, కొంచెము జ్ఞానముతో కూడుకున్న భక్తి మనకి అలవాటు అయినప్పుడు, మనము నిజంగా దేవుడ్ని ప్రేమించడం మొదలుపెడ్తాము.
సరే ఈ భగవంతుడు ఎవరు అంటే మనం మన పిల్లలుగా చెప్పగలమా అంతటి అవగాహన కోసం మనము ప్రయత్నిస్తున్నామా అని ఆలోచించాలి.
సబూరి ఎప్పుడు నేర్చుకోవాలి. మనకు నమ్మకమే ధృడంగా లేకపోతే ఇంక ఓర్పు ఎక్కడ నుంచి వస్తుంది.