సత్ చిత్ ఆనందం అనే మూడు మిళితం అయి ఉన్న తత్వమే పరతత్వం. సద్వస్తువు ఉన్న చోట జ్ఞానానందాలు తప్పక ఉంటాయి.
ధర్మ సంస్థాపనకొరకు , మరియు తాపత్రాయాలతో తపించి పోతున్న ఈ లోకాన్ని ఉద్దరించటానికి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మానవ రూపంలో గురువుగా అవతరిస్తారు. అటువంటి నిరాకార పరబ్రహ్మమే, శ్రీ సాయినాథుని రూపంలో సాకార పరబ్రహ్మగా అవతారం దాల్చింది.
అసలు ధర్మం ఎందుకు స్థాపించాలి?
ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో మోక్షానికి మూలం అయినది ధర్మము. ధర్మం ఆచరింప బడితే మోక్షం దానంతట అదే వస్తుంది. అందుకే ఎ మతమైన, ఎ శాస్త్రమైన ఈ ధర్మాన్నే బోధించటం జరిగింది. కాని మానవులుగా దాన్ని మనం అర్ధం చేసుకునే విధంగా అర్ధం చేసుకుంటున్నామా, లేక మనకి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నామా! ఇలా ధర్మానికి పెడర్ధాలు తీస్తే, మనం మోక్షానికి దూరం అవుతాము.
సరే ఈ ధర్మం మనకు ఎవరు బోధిస్తారు?
పరమగురువులు మనకు ఈ ధర్మాన్ని వారి వాక్కుల ద్వారా మనకు అందిస్తారు. వారి వాక్కులే మనకు మార్గనిర్దేశంగా నిలుస్తాయి. అలా సాయి నాధుని గళంలో నుంచి వెలువడిన అధ్భుత జ్ఞాన ప్రవాహమే శ్రీ సాయి సచ్చరిత. ఈ జ్ఞాన వాణి మన జీవితాల్లో ఒక కొత్త వెలుగుని నింపుతుంది. ఇక ముందు కూడా ఇది వెలుగుని నింపుతూనే ఉంటుంది.
శ్రీ సాయి సచ్చరిత ఎంతోమందిని ఎన్నో విధాలుగా కాపాడింది. వారిని సాయి భక్తులుగా మార్చింది. శ్రీ సాయి దివ్య చరితమనే అమృతాన్ని ఎన్నో లక్షలమంది ఆస్వాదిస్తున్నారు. వారి జీవితాలలో మార్పులను వారే స్వయంగా గమనిస్తున్నారు. మనిషి జీవితంలో మార్పు తీసుకురాలేని ఏ బోధకాని, ఏ శాస్త్రం గాని, ఏ ప్రవచనం గాని సంపూర్ణం అవ్వదు. ఇది సంపూర్ణం అవ్వాలి అంటే దాని మీద నమ్మకం ఉండాలి. అలా నమ్మిన దాన్ని సభూరితో అనుసరించాలి. అప్పుడే దానికి సార్ధకత. అందుకే శ్రీ సాయి సచ్చరిత నమ్మకమనే పునాదితో మొదలపెట్టి మెల్లగా మన కర్మలకనుగుణంగా మనకు సభూరి నేర్పించి మనందరిని ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది.
మన బాబా చేతల గురువు. అయన ఏది బోధించాలన్నా అనుభవ పూర్వకంగానే నేర్పిస్తారు. ఆయనను గట్టిగా పట్టుకుంటే మనకింక వేరే దారులు అవసరం లేదు.
సచ్చిదానంద పరబ్రహ్మ శ్రీ సాయి రూపంలో అవతరిస్తే,
శ్రీ సాయిపరమాత్మ తత్త్వం శ్రీ సాయి సచ్చరిత రూపంలో వెలిసింది.
సద్గురువులు తమ సమాధి అనంతరం కూడా తమ దివ్య వాణి రూపంలో అమరులు అయి ఉంటారు. అందుకే బాబా ఏకాదశ సూత్రాలలో ఇలా చెప్పారు.
ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
నా సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.
నాయన్దెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
ఇంత ఖచ్చితంగా భరోసా ఇచ్చి, మనలను కాపాడగల్గిన పరమ గురువు మన సాయి. అందుకే అయన మనకు ప్రసాదించిన శ్రీ సాయి సచ్చరిత అనే గ్రంధరాజాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి.
ఇదే మన ధర్మం కావాలి.
ఈ ధర్మమే మన జీవితం కావాలి.
ఈ జీవితమే సాయి నాధునికి అంకింతం చెయ్యాలి.
ఈ అంకిత భావంలోనుంచి అపరంపారమైన భక్తి జనించాలి.
ఈ భక్తి అనే అమృతంతో సాయికి పూజ అభిషేకాలు జరగాలి.
అప్పుడు ప్రసాదంగా కేవలం సాయి కృపని మాత్రమే కోరుకోవాలి.
కేవలం గురు కృప మాత్రమే మానవునిలో ఉన్న మూడు ఆవరణలలో చివరిది అయిన అజ్ఞానమనే ఆవరణను తొలిగిస్తుంది. ఈ అజ్ఞానం వీడితే సాయిపరబ్రహ్మ స్వస్వరూపంగా వ్యక్తమవుతారు.
సదా స్వస్వరూపం చిదానంద కందం
జగత్సంభవ స్థాన సంహార హేతుం !
స్వభక్తెచ్చయా మానుషం దర్శయన్తమ్
నమామి ఈశ్వరం సద్గురుం సాయి నాధమ్ !!
ఓం శ్రీ సాయి రామ్ !