గృహస్థులుగా ఉన్నవారు అన్నం వండుకొని మొట్టమొదటగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అప్పుడు మాత్రమే వారు స్వీకరించాలి. బాబా గృహస్థులు కారు. వారు ఒక ఫకీరులా జీవనం సాగించారు. ఈషణ త్రయాలు లేనివారు భిక్షకు అర్హులు. ఈషణ త్రయం అంటే సంతానం పైన, ధనం పైన మరియు లోకంపైనా ఉన్న మోహాలు. ఈ మోహాలే మనలను బాధలకు గురిచేస్తాయి. మనం ఆహరం తయారు చేసేటప్పుడు చాలా ప్రాణులు చనిపోతాయి. చాలామంది కష్టపడితే కాని ఈ ఆహారం మన దాకా రాలేదు. ఈ రకంగా వచ్చే పాపాలను పంచ సూనాలు అంటారు. వీటినుంచి తప్పించుకోవాలి అంటే మనం పంచ మహా యజ్ఞాలు అనేవి చేయాలి. ఈ పంచమహాయజ్ఞాలలో ఒకటి అయిన అతిధి యజ్ఞం భిక్ష ద్వారా బాబా చేయించారు. బాబా ఐదు ఇళ్లలో రోజు భిక్ష తీసుకొనే వారు. అలానే దక్షిణ రూపంలో అందరి దగ్గరినుంచి పాపాలను పోగెట్టే వారు. ఇలా ఇంటి దగ్గరే ఉండి బాబాకు భిక్ష ఇచ్చినవారు ఎంతో పుణ్యాత్ములు. ఈ ఆహరం మనం స్వీకరించే ముందు భగవంతునికి సమర్పించడం కూడా అందుకే. అలా సమ్పర్పిస్తే దాని ద్వారా వచ్చే పంచ సూనాల నుంచి మనం విముక్తి పొందుతాము అని బాబా మనకు నేర్పిస్తున్నారు.
పంచమహా యజ్ఞాలు ఏమిటో చూద్దాము.
బ్రహ్మ యజ్ఞము - వేదాలను, మన శాస్త్రాలను పారాయణ చేయడమే బ్రహ్మ యజ్ఞము.
పితృ యజ్ఞము - పితృ దేవతలకు ఇచ్చే ప్రసాదం.
దేవ యజ్ఞము - దేవతలకు నైవేద్యం ఇవ్వడం.
భూత యజ్ఞము - సర్వ జీవులకు ఆహరం సమర్పించడం.
అతిధి యజ్ఞము - మనం ఆహ్వానించని అతిధులకు ఆహరం పెట్టడం.
మనం దేవుడికి సమర్పించేవి నిజంగా దేవుడు తీసుకుంటాడా అని కొంతమందికి సందేహం ఉండచ్చు. బాబా ఎన్నోసార్లు తనకు సమర్పించినవి స్వీకరించినట్లు చూపించడం జరిగింది. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే, తెచ్చినవారు మర్చిపోయినా బాబా అడగడం మర్చిపోయేవారు కారు. రొట్టె, కూర, పాలకోవా కాని దృఢమైన భక్తితో ఇవ్వాలి. అలాంటి భక్తులు తటస్థ పడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది.
ఎవరిమనసులో ఏ భావం ఉంటె దానికి అనుగుణంగా అనుభవాలు కలుగచేసి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు సాయి. సర్వ జీవులలోను భగవంతుడిని చూడాలి అని బాబా మనకు నేర్పిస్తున్నారు. ఇదే సర్వమతాలు బోధించే సత్యం. మనం సమర్పించే నైవేద్యం తప్పకుండా బాబా స్వీకరిస్తారు అని గ్రహించాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే; బాబా సర్వాంతర్యామి. ఎలాగైతే ఒక జీవి స్వీకరిస్తే తాను తీసుకున్నట్లు బాబా చెప్తారో, అలానే బాబాకి నైవేద్యం ఇస్తే సర్వ జీవులకు అన్నం పెట్టినట్లే అని మనం తెలుసుకోవాలి. కేవలం మన కోరికల కోసమే నైవేద్యం పెట్టడం కాకుండా అన్ని జీవులకు ఆహరం బాబా ఇవ్వాలి అని మనం కోరుకోవాలి.
ఓం శ్రీ సాయి రాం !