పరమ గురువులు మనకు అనుభూతుల రూపంగా బోధలు చేస్తారు. వారు మనకు వాటి గురించి డైరెక్ట్‌గా నోటితో చెప్పకపోవచ్చు. కాని మన జీవితంలో మాత్రం జ్ఞానమనే వెలుగు వెలుగుతుంది. మనకు కావల్సినదల్లా ఆ గురువు పట్ల భక్తి శ్రద్ధలు. బాబా, భగవంతుడు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న విషయాలను అనుభవపూర్వకంగా మనకి నేర్పిస్తారు.
భగవంతుడు అంతటా, అన్ని చోట్లా ఉన్నాడన్న సత్యాన్ని మనకి నేర్పించేందుకే ఆయన వివిధ రూపాలలో దర్శనం ఇచ్చారు. అట్లానే జంతువుల్లో కూడా నేనున్నాను అని చాలా సార్లు చూపించడం జరిగింది. సరే గురువులు బోధించే ఈ అనుభవాన్ని మనము ఎట్లా పొందాలి, ఏం చెయ్యాలి?
మనము భగవంతుడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే దానికి కొంచెం కృషి చెయ్యాలి. దానికి భక్తి కావాలి. మనం కోరుకునేది అత్యంత శాశ్వతమైనది. కాని మన కోర్కెలు కారణంగా దేవుడ్ని కూడా పరిమితం చేస్తాము. మన జీవితంలో ఎంత భాగం దేవుని సేవకు కేటాయిస్తాము . సరే మనము భక్తులము మనకి ఆ భగవంతుని మీద శ్రద్ధ ఉండవచ్చు.
భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది మన శాస్త్రాలు ఇలా చెప్పాయి.
1) భక్తునకు దేవుడి మీద బాగా నమ్మకం ఉంటుంది.
వీరు చాలా భక్తితో దేవుడ్ని సేవిస్తారు. వాళ్ళు ఒక ఇష్ట దేవతను బాగా కొలుస్తారు. వాళ్ళకి వాళ్ళ ఇష్ట దేవత తప్ప మిగతా సంప్రదాయాల్ని ఇష్టపడరు. ఒక్కోసారి వాటిని విమర్శిస్తారు కూడా. భగవంతుడి యొక్క శక్తులను పొగుడ్తారు. వీరు మొదటి తరగతి.
2) భగవంతుడు ఒక్కడే అని నమ్మే భక్తులు :
భక్తునకు కొద్దిగ జ్ఞానం కలిగితే గురుకృపతో ఒక్కడే భగవంతుడు, ఆయనకు రూపము, పేరు లేదని తెలుసుకుంటాడు. భగవంతుడు వేరు వేరు రూపాల్లో ఉన్నా, ఒక్కడే అన్నింటిలో కనిపిస్తాడు అని అనుకుంటారు. మొదటి వాళ్ళతో చూస్తే, వీళ్ళు వేరు సంప్రదాయాల్లో ఉన్నవారు తప్పుదారిలో లేరు అని అర్ధం చెసుకుంటారు. వీరు భగవంతుడే సృష్టికి మార్గం చూపిస్తాడు అంటారు.
3) వీళ్ళకి భక్తి ఉందని చెప్పడం కాదు వాళ్ళే భక్తి అవుతారు :
ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రపంచం కనిపించదు. వాళ్ళకి దైవస్వరూపం ఒక్కటే కనిపిస్తుంది. వాళ్ళు ఏ కర్మను ఆచరించినా అది భగవదర్పితమే.
ఈ మూడు తరగతులు కూడా గొప్పవే. కాని మన గమ్యం ఎటు అనేది వేరే చెప్పనవసరంలేదు. కాని మన మనస్సు మన మీద చాలా ట్రిక్స్ చేస్తుంది. వాటికి ఒక్కోసారి మనం బానిసలమవుతాము. దాన్ని గుర్తించలేము. మనము ఈ చివరి స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. మన వంతు కృషి మనము చెయ్యాలి.
అందుకే మనకు బాబా నవవిధభక్తి మార్గాన్ని కూడా బోదించడం జరిగింది. ఇదే ప్రహ్లదుడు మనకి చేసి చూపించాడు. బాగవతంలో ప్రహ్లదుడు ద్వారా ఈ నవవిధభక్తిని మనకి ఇవ్వడం జరిగింది. ఆయన చిట్టచివరి స్థాయిలో ఉండి, బాధల్ని కూడా విష్ణు స్వరూపంగా చూసిన మహాభక్తుడు. అందుకే హిరణ్యకశ్యపుడు ఎన్ని బాధలు పెట్టినా ప్రహ్లదుడ్ని ఏమీ చెయ్యలేకపోయాడు. ఇక్కడ ప్రహ్లదుడు అంతా విష్ణువు తప్ప ఇంకేమి లేదన్న భావాతీత స్థితికి ప్రతీక. అదే బాబా మనకి నేర్పాలని చూస్తారు. అందుకే ఆయన చెప్పేవారు. ఆయన లాంటి శిష్యుడి కోసం చూస్తున్నానని ఆయన తన గురువుతో ఎలా ఉన్నారో అన్నది ఈ భక్తికి ప్రతీక కూడా.
ఒకసారి ఒక భక్తుడు ప్రయాణం చేస్తూ ఒక లోయలో కాలు జారి పడ్డాడు. భగవంతుడిని ప్రార్ధిస్తూ, ఒక కొమ్మ దొరికితే పట్టుకుంటాడు. భగవంతుడ్ని రక్షించమని ప్రార్ధిస్తాడు. అప్పుడు భగవంతుడు కనిపించి, ఆ కొమ్మను వదిలేయి నేను రక్షిస్తాను అంటారు. కాని భక్తుడికి దైర్యం చాలలేదు. పూర్తి శ్రద్ధ లేదు, నమ్మకం లేదు, మనము ఆ పరిస్థితిలో ఉంటే ఏమి చేస్తాము?
మనము మాయ అనే లోయలో పడి సంసారం అనే కొమ్మను పట్టుకోని వేలాడుతూ ఉండక, బాబా నేర్పిన శ్రద్ధ, సబూరి మార్గంలో పయనిద్దాం.
ఓం శ్రీ సాయిరామ్!