భగవంతుడిని సగుణం మరియు నిర్గుణం అనే రెండువిధాలుగా చెప్తారు. సగుణ స్వరూపమునకు ఆకారము ఉంటుంది కాని నిర్గుణము అంటే ఆకారము లేదు. ఇక్కడ ఆకారము ఉండదు అంటే అంతా ఆ పరబ్రహ్మమే అయినప్పుడు, ఇంకా ఆకారంతో పని లేదు. రెండును పరబ్రహ్మ స్వరూపములే.
మొదట్లో సగుణ స్వరూపమే మనకు అనువుగా ఉంటుంది. భక్తి వృద్ధి చెంది, జ్ఞానం కలిగితే అప్పుడు నిర్గుణ ఆరాధన కుదురుతుంది. బాబా అందుకే తనను నిర్గుణంగా ఆరాధించమని చెప్పి అలా కుదరకపోతే అప్పుడు నన్ను సగుణంగా పూజించండి అని చెప్పారు.
భక్తిపై గట్టి నమ్మకం ఉండాలి అని సాయి చెప్పారు. ఆయన రకరకాల దేవతలా రూపంలో దర్శనం ఇచ్చారు. అలానే వేరే గురువుల రూపంలో కూడా దర్శనం ఇచ్చారు. అలాంటి ఒక సన్నివేశమే డాక్టర్ పండిట్ గారి కథ.
ఒక సారి తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పండిట్ అనే ఆయన షిర్డీ వచ్చారు. బాబా అతనిని దాదా భట్ వద్దకు పంపిస్తారు. వారు ఇరువురు బాబా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ డాక్టర్ పండిట్ బాబాకు నుదిటిపై త్రిపుండ్రం పెడతాడు. అందరికి ఆశ్చర్యం ఎందుకంటే బాబా ఎవరిని అలా బొట్టు పెట్టనివ్వరు. దాదా తరువాత ఆలా ఎందుకు చేయనిచ్చారు అని అడిగితె బాబా ఇలా చెప్పారు. ఈ డాక్టర్ నాలో తన గురువైన రఘునాథ్ (కాకా పురానిక్) గారిని చూసుకున్నాడు. అందుకే అతను ఆలా చేయగలిగాడు అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ ఆయన చూపించిన నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసింది అని కూడా బాబా చెప్పారు. దాదా భట్ తరువాత డాక్టర్ పండిట్ ఈ విషయం గురించి అడగగా తన గురువుని బాబాలో చూసినట్లు చెప్తారు. సాయి ఈ విధంగా మన గురువుని మనం ఎలా ఆరాధించాలో నేర్పించారు.
మనం మన గురువుతో మమేకం అవ్వాలి.
ఆయన దారే మన దారి కావాలి.
సాయి ఆరాధన అన్నిదేవతల ఆరాధన కన్నా గొప్పది అని తెలుసుకోవాలి.
ఒక్క సారి మనకు గురువు లభిస్తే ఆ గురువు తప్ప మనకు వేరే ఆరాధనలతో అవసరం ఉండదు. ఎందుకంటే గురువే పరబ్రహ్మము.
ఓం శ్రీ సాయిరాం!