In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Thursday, December 24, 2020

భగవద్గీత 5. 3 - కర్మ సన్యాస యోగము - నిత్య సన్యాసి




భగవానుడు కర్మ యోగము కర్మ సన్యాస యోగాలను విశ్లేషిస్తూ కర్మ యోగి ఎలా ముక్తుడు అవుతాడు అన్న విషయం ఇలా చెప్పారు.

జ్ఞేయ: స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి  న కాంక్షతి !
నిర్ద్వంద్వ: హి మహాబాహో  సుఖం బంధాత్ ప్రముచ్యతే !!


మహాబాహో! ఎవ్వరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మ యోగిని నిత్య సన్యాసిగా ఎఱుంగవలయును. ఏలనన రాగ ద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధాలనుండి ముక్తుడగును.

ఇక్కడ కర్మ యోగిని నిత్యసన్యాసిగా చెప్పారు. ఈ సన్యాసి ఎవ్వరినీ ద్వేషింపడు, ఏది కోరుకోడు. రాగద్వేషాలకు అతీతుడు. ఈ స్వభావంతో ఉన్న వారికి సన్యాసాశ్రముతో గాని కర్మ సన్యాసంతో గాని అవసరం ఉన్నట్లు కనిపించదు. మనందరికీ శ్రేయో మార్గ సాధనలో ఇబ్బంది కలిగించే విషయాలు రాగ ద్వేషాలే. వీటివల్లే అనేక సమస్యల్లో చిక్కుకొని సంసార బంధంలో చిక్కుకొని బాధపడతాము. కర్మ యోగి నిష్కామంగా భగవదర్పితంగా తన కర్మలను ఆచరిస్తాడు. అందువల్ల అతడు అనాయాసంగా కర్మబంధములనుండి విముక్తుడవుతాడు. ఇదే భగవత్కృప అని మనం చెప్పుకోవచ్చు. ఇలా కర్మ యోగ అనుసరించక పొతే ఇహపర సుఖాల కోసం తపిస్తూ జననమరణ చక్రంలో నిరంతరం తిరుగుతూ అజ్ఞానంలో ఉంటారు.

సాంఖ్యము, కర్మ యోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని చెప్పుట సరి అయినది కాదని భగవానుడు చెప్పారు. మనం మన స్వభావం బట్టి ఏ దారి ఎంచుకున్నా చివరకు పరమాత్మవైపే తీసుకుపోతుంది. ఒక దారే గొప్ప అనేవారు ఎక్కడకు వెళ్ళరు. వాదవివాదాలు మనిషిని అధోపాతాళానికి తొక్కేస్తాయి.

కర్మ యోగము చక్కగా ఆచరిస్తే అంతః కరణ సుద్ధి కలిగి తత్వజ్ఞానం తనంతట తానే ప్రాప్తించును. ఇక్కడ మనం సాంఖ్యము స్వయానా పరమాత్మ తత్వమే కదా అని అనుకోవచ్చు కాని ఇది మార్గ సాధన మాత్రమే. అందుకే పరమాత్మ ఏ ఒక్క దారి సరిగ్గా ఆచరించినా ఫలితం దక్కుతుంది అని గట్టిగా చెప్పారు. ఇందులో సందేహమే లేదు. కర్మ సన్యాసమనగా కర్మలను చెయ్యకుండా వదిలివేయడం కాదు. అలానే కర్మ యోగమనగా ఏదోవిధంగా కర్మలు చేయడం కాదు.

కర్మ సన్యాసం అంటే సాంఖ్య యోగం, అంటే జ్ఞాన మార్గం.

కర్మ యోగం అంటే ఫలితంపై దృష్టి లేకుండా శాస్త్రవిహిత కర్మలను ఆచరిస్తూ కర్తృత్వం లేకుండా ఉండడం.

ఇలా ఆచరించే వారే నిత్య సన్యాసి. మనకు ఇది సాధ్యమేనా! ఎవరిని ద్వేషించకుండా, ఏది కాంక్షించకుండా ఉండగలమా! ఇలా ఉండడటం కష్టమే అవ్వచ్చు. కాని ధర్మమేమిటో తెలుసుకొని సంఘంలో మనవంతు కర్తవ్యం మనం తప్పకుండా పాటించవచ్చు. మొట్ట మొదట ఎవరిని అనవసరంగా ద్వేషించడం మానేయాలి. మనకు అవసరానికి మించిన వాటిని కోరుకోవడం ఆపేయాలి. ఇలా చేస్తూ ఉంటె ఒక రోజున మనం కూడా నిత్య సన్యాసి స్థితికి చేరవచ్చు. అలాచేరితే పరమపదం అతిచేరువలో ఉంటుంది. 






ఓం శ్రీ పరమాత్మనే నమః!