మానవుడు పుట్టిన దగ్గరనుంచి చనిపోయేదాకా కోరికల వలయంలో పడి సతమవుతూ ఉంటాడు. ఈ కోరికల్లో మనకు సుఖం లభిస్తూ ఉంటే, మరి మనకు దుఃఖం ఎందుకు కలుగుతోంది?
కోరికలు ఉండటం తప్పా!
కోరికలు తీర్చుకోవడం మంచిదా ! కాదా !
అలానే కోర్కెలు అణుచుకోవడం సరియైనదేనా !
అసలు వీటిగురించి ఎందుకు ఆలోచించాలి? అందరిలాగా జీవితం ఎందుకు గడపగూడదు ?
ఇక్కడ సమస్య ఏమిటి అంటే, కోరికలు కావాలి కానీ, వాటివల్ల మనకు దుఃఖం కలుగకూడదు.
ఒక వస్తువుని మనం పొందాలి అంటే, అందుకు మనకు అర్హత కావాలి. ఈ అర్హత అనేది మనకు లేనప్పుడు, మరియు మనము సరియైన ప్రయత్నం చేయనప్పుడు, మనకు ఆ వస్తువు దక్కదు. మనం అనుకున్నది జరుగనప్పుడు మన మనసుకి కష్టం కలుగుతుంది.
మన శాస్త్రాలన్నీ, కోరికలను నియంత్రించమని, వాటిని అదుపులో ఉంచమని చెప్తాయి. కానీ సామాన్యమానవులకు ఇది చాలా కష్టతరం అయినది.
అందుకే బాబా ఇలా అనేవారు.
"నా భక్తులు రకరకాల కోరికలతో నా దగ్గరకు వస్తారు. మొట్టమొదట వారి కోరికలు తీర్చుతూ వారిని సక్రమమార్గములో నడిపిస్తాను. వారికి విషయవాసనలమీదే మనస్సు ఉంటే, వాళ్ళు మామిడి పూతలాగా రాలిపొతారు".
మనము ఈ కోరికల వలయము నుండి బయట పడాలి. బాబా మనకు ఇవ్వాలి అనుకున్నఖజానాని మనం పొందాలి. భగవంతుని పట్ల శ్రద్ధతో ఉండి, బాబా చూపిన మార్గములో నడిస్తే మనకు ఈ కొరికలవల్ల కలిగే దుఃఖమునుండి విముక్తి కలుగుతుంది.
కోరికలను నియంత్రించే మార్గము - అర్థం చేసుకోవాల్సిన విషయాలు:
విషయములందు ఆసక్తి :
మనం వస్తువుల గురించి ఆలోచిన్చేకొలది, వాటిమీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తివలన ఆ విషయములను పొందాలని అనిపిస్తుంది. ఈ విషయాన్నే భగవద్గీత సాంఖ్య యోగంలో భగవానుడు మనకు చెప్పడం జరిగింది.
కోరిక కర్మకు దారి తీస్తుంది:
మనము ఒక వస్తువు గురించి ఆలోచించగా, ఆలోచించగా, దాని మీద ఆసక్తి కలిగితే, మనస్సులో నానా విధములు అయిన సుఖాల ప్రాప్తి కొరకు ఇచ్ఛలు ప్రబలమగును. ఈ కోరిక తీరడానికి మనము ఏది అయిన చేయడానికి సిద్ధపడతాము.
కోరికలోనుంచే కోపం పుడ్తుంది:
మన కోరిక ప్రబలం అయినప్పుడు, ఆ కోరిక తీరనప్పుడు, మనము కారణాలకోసం వెదుకుతాము. ఈ కారణము ఒక పరిస్థితి వల్ల కాని, లేదా ఒక వ్యక్తి ద్వారా కాని సంభవిస్తే, మనకు చాలా క్రోధము కల్గుతుంది.
కోపము వలన మనలో వివేక శక్తి నశిస్తుంది. అప్పుడు మంచి చెడ్డల గురుంచి ఆలొచించము. ఇటువంటి పరిస్తితుల్లో మనల్ని మనము నియత్రించుకోలేము. దీనివల్ల కష్టాలను కొనితెచ్చుకుంటాము. ఈ జన్మలో అనుభవించేదే కాకుండా, వచ్చే జన్మలో కూడా దీని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఆ తరువాత అయ్యో నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని బాధ పడతాము.
కోరికలను హృదయముతో అర్థం చేసుకోవాలి:
కోరికలు కలగడం సహజం. బాబా వాటిని అడగద్దు అని చెప్పలెదు. కానీ వాటిని తీర్చుకొనే ముందు, వాటిని నాకు సమర్పించు, అప్పుడు ఆ కోరిక నువ్వు తీర్చుకోవచ్చా లేదా అన్న విచక్షణ నీలో కల్గుతుంది అని చెప్పారు.
మనము ఒక కోరిక గురుంచి ఆలోచించినప్పుడు, లేదా దాన్ని అనుభవించినప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటీ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
మనము విషయసుఖాలను ఇంద్రియాలద్వారా అనుభవించడానికి అలవాటుపడ్డాము. కాని ఇక్కడ ఒక మెట్టు ఫైకి ఎక్కి, వాటిని హృదయంతో ఆస్వాదించటం నేర్చుకోవాలి.
మామూలుగా మనము ఈ సుఖాల తరంగాలను వస్తువుల వైపు పోనిస్తాము. దానివల్ల పూర్తి ఆనందాన్ని అనుభవించలేము. ఇలా మనము సుఖాల వైపు పరుగులు తీస్తూనే ఉంటాము. ఒక కోరిక చాలా కోరికలకు మూల కారణం అవుతుంది. కోరిక ఎప్పటికీ తీరదు. అందుకే, ఈ తరంగాలను హృదయం వైపు త్రిప్పాలి. వాటిని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు వాటి మీద వ్యామోహం తగ్గుతుంది.
బాబా చెప్పిన సులభమైన మార్గం ఏమిటి?
"విషయ సుఖాలను నాకు అర్పించి అనుభవించు" అని చెప్పారు.
మనము సాయిని స్మరించకుండా యే వస్తువును పంచ ఇంద్రియములతో అనుభవించరాదు.
ఇలా చేయడం వల్ల మనకు విచక్షణా శక్తి వస్తుంది.
ఆ కోరికవల్ల ప్రాప్తించిన సుఖంయొక్క విలువ తెలుస్తుంది.
ఆ విలువను మనం అర్థం చేసుకున్నప్పుడు, దానిపట్ల ఆసక్తి తగ్గుతుంది.
అప్పుడు అరిషడ్వర్గాలు అదుపులో ఉంటాయి. మనస్సుకు శాంతి లభిస్తుంది.
శాంతి కలిగితే, మనకు గురువు పట్ల శ్రద్ధ కుదురుతుంది.
దీనివల్ల మనము బాబాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము. మనకు బాబా ద్యానము ఎన్నో రెట్లు వృద్దిపొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షము మన వశమవును.
సాయి బంధువులారా!
కోరికలను అర్థం చేసుకుందాము.
వాటి అవసరం మనకు ఎంతవరకు ఉందో తెలుసుకుందాము.
మనకు అక్కరలేని వాటికోసం పరుగులు ఆపేద్దాం.
మన దృష్టిని సాయి వైపు మరల్చుదాము.
సాయి అనుగ్రహాన్ని పొంది, మామిడి పూతలాగ రాలిపోకుండా ఆయన బాటలో నడుద్దాం.
ఓం సాయి రాం !
No comments:
Post a Comment