సత్పురుషుల చరిత్రలు మనలను సన్మార్గంలో ఉంచుతాయి. మన గురువైన శ్రీ సాయినాథుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, నిధి ధ్యాసనం చేస్తే మనలో పవిత్రత పెరుగుతుంది.
సాయిని శరణు వేడితే, ఆ సాయి మన మీద అనుగ్రహ వర్షం కురిపించినప్పుడు మనలో ఈ శ్రవణ లాలస పెరుగుతుంది. గురు కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మనం ఈ ప్రాపంచిక బాధలనుంచి దూరం కావచ్చు. ఇదే మన జీవితానికి సార్ధకతను చేకూర్చే సాధనం.
మనస్సులో ఏ సందేహాలను ఉంచుకోకుండా సాయిని ప్రేమించాలి. మన మనస్సే సాయి నిలయం అయిపోవాలి.
మన మనస్సు సాయి ప్రేమతో నిండాలి అంటే!
ఎల్లప్పుడూ సాయి స్మరణ చేస్తూ ఉండాలి.
సాయి తత్వాన్ని అర్ధం చేసుకోవాలి.
సాయి చెప్పిన బోధలను మననం చేసుకుంటూ, వాటిని ఆచరిస్తూ మన జీవితంలో వెలుగును నింపుకోవాలి.
ఆ సాయి అనే వెలుగు మనకు దారి చూపిస్తూ మనలో ప్రేమను నింపుతుంది.
ఈ ప్రేమే మనకు బాబా చెప్పిన తత్వాన్ని మరింత బోధపడేట్లు చేస్తుంది.
ఈ స్థితి ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనకు సత్సంగం చాలా అవసరం.
చెడు సావాసం అంత మంచిది కాదు. ఇక్కడ చేడుసావాసం అంటే చెడ్డ వాళ్ళతో తిరగడం అనే అర్ధం మాత్రమె కాదు. మన లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళతో, అలానే బాబా కోసం పరితపించే వాళ్ళతో మెలగడం అలవాటు చేసుకోవాలి. అప్పడు మనలో మానసిక పరివర్తన వస్తుంది.
సృష్టిలోని రూపాలు కళ్ళలో నిండినప్పుడు బాహ్య సౌందర్యాన్ని ఆపేక్షించే మనస్సు దానితో రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖం అయితే అది సత్సంగంలో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. అది శారిరాభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది. అందువల్ల సత్సంగం కంటే మరో సాధన లేదు. అందుకే బాబా నిత్యం సత్సంగం చేయండి అనే చెప్పేవారు. మంచి వారితో ఉండండి అనే వారు. ఇతర సాంగత్యాలు దోషపూరితం అయినవి. శరీరం అంతటినీ నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే.
సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్క సారి దాని పట్ల శ్రద్ద కలిగితే, దాని బలవత్తర శక్తి వల్ల
తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది.
బాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు వాసనలన్నీ పోయి మనసు నిర్మలమైన స్థితిలో రమిస్తుంది.
పరమార్ధంలో ప్రవేశించడానికి విషయసుఖాల యందు విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేము.
సుఖాల వెంట దుఖాలు, దుఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ దుఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖ దుఖాలనే ఈ రెండు అనుభవాలనుంచి విముక్తిని కలిగించేది, సత్పురుషుల సాంగత్యం ఒక్కటే.
సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. అప్పుడే మనం ఆ పరమాత్మను అనుభవ పూర్వకంగా తెలుసుకోగల్గుతాము.
మనం అందరం సాయిని ఆ సత్సంగ భాగ్యం కలిగించమని వేడుకుందాము. ఆ సత్సంగం లభించిన తరువాత దాన్ని వదులుకోకుండా ఉండే శక్తి మనకిమ్మని ఆ సాయిని మనసా వాచా కర్మణా ప్రార్దించుదాము.
ఓం శ్రీ సాయి రాం!
No comments:
Post a Comment