సాయినాధుడు
మానవ జీవితం గూర్చి మరియు దాని ముఖ్య ఉద్దేశ్యము గురించి చాలా సార్లు చెప్ఫారు. మానవ
రూపం ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకు లభించినదని శాస్త్రాలు చెప్పాయి. మనము దానిని వృధా
చేసుకొనకుండా సద్వినియోగం చేసుకోవాలి.
మానవ
జీవిత లక్ష్యం ముక్తి. ఈ సంసార బంధాలనే సంకెళ్ళను తెంచుకొని ఆ పరమాత్ముడే మనము అని తెలుసుకోవడమే
ముఖ్య లక్ష్యము. నానా చందోర్కరుకు సాయి ఇటువంటి బోధచేయడం జరిగింది. దానిని దాసగణు మహారాజు
ఒక చోట కూర్చడం జరిగింది. ఆ తరువాత చాలామంది వాటిని మనకి అందించారు.
ఒక రోజు
మహా పుణ్య సంపన్నుడైన నానాసాహెబ్ చదోర్కరు మరియు నానా సాహెబ్ నిమోన్కరులు బాబా ధర్శనార్ధమై
షిర్డి గ్రామానికి వచ్చారు. నానా చందోర్కరు బాబా పాదాలపై పడి ఈ విధముగా ప్రార్ధించారు.
నానా : ఓ సాయి మహారాజా! సమర్దా! ఈ సంసారమిక చాలు, శాస్త్రాలన్నీ సంసారం నిస్సారమని
వక్కాణిస్తున్నాయి. ఓ ధీనబందు! ఈ ప్రాపంచిక సంబంధాలనే సంకెళ్ళను తెంపివేయి. ఏ సుఖాలకైతే
మేము పరిగెడుతున్నమో, అవే చివరకు దు:ఖాలై మమ్మల్ని ఆడిస్తాయి. ఎంత చూసినా ఈ సంసారంలో
సుఖమనేది లేదు. ఇక నాకు విసుగెత్తిపోయింది. ఈ సంసార బంధాలిక నాకు అక్కరలేదు.
చందోర్కరు మాటలు విన్న బాబా ఈ విధంగా చెప్పారు.
బాబా: నానా ఈ పిచ్చి ఆలోచనలు నీకెక్కడి నుంచి వస్తున్నాయి. నీవు చెప్పింది కొంత
వరకు నిజమే కాని మొత్తం మీద నీవు కొంచెం దారి తప్పావు. ఈ సంసారం నుండి నీవు తప్పించుకోవాలనుకున్నా
అది వదలక నీ వెన్నంటే ఉంటుంది. అది ఎవరికీ తప్పదు. ఈ దేహాలలో తగులు కోవడం నాకే తప్పలేదు.
ఇక నీవెలా తప్పించుకోగలవు. ఈ సంసారంలో ఎన్నో రూపాలున్నాయి అని అవి నీకు చెప్తాను విను.
సంసారం :
1) కామక్రోధ మదమాత్సర్యలోభ మోహములన్నీ ఒక దానితో ఒకటి కలిసి
మోహమవుతుంది.
2) ఈ అరిషడ్ వర్గములు అహంకారంతో కలిసినప్పుడు సంసారబంధం ఏర్పడుతుంది.
అదే సంసారమంటే.
3) కళ్ళు వస్తువులను చూస్తాయి. చెవులు ధ్వనిని వింటాయి. జిహ్వ
రసాస్వాధన చేస్తుంది. ఇవి కూడా సంసారమే. అది శరీర ధర్మము.
4) ఈ సంసారం సుఖ దు:ఖాలనే రెండు వస్తువుల కలయిక. ఇవి ఎవ్వరిని
వదిలి పెట్టవు.
5) ధనము, బార్యాపుత్రులు, వీనినే సంసారమని నీవు అనుకుంటున్నావు.
అదే ఇప్పుడు నీకు వెగటు అయింది. భార్య, పుత్రులు, పుత్రికలు, అన్నలు, తమ్ముళ్ళు, బంధుమిత్రాది
బంధాలతో నీవెంత విసిగిపోయినా అవి నిన్ను వదలవు. దానికి కారణము దేహప్రారబ్ధమని తెలుసుకో,
దాన్ని అనుభవించక మూడు కాలాల్లో ఎవరు తప్పించుకోలేరు.
ఇక్కడ
బాబా దేహ ప్రారబ్దం గురించి చెప్పడం జరిగింది. సంసారమంటే కేవలము భార్యపుత్రులు మాత్రమే
కాదు. మనలో ఉన్న వాసనలు, కోరికలు, బంధాలు, మనము చేసే ప్రతీ పని దీనిలో భాగమవుతుంది.
ఒక దేశము కాని, సంస్థ కాని, ఏదైనా ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే దానికి ఒక శాసనము కావాలి.
ఆ శాసనమే మనకు ఇవ్వబడిన శాస్త్రాలు. కర్మ సిద్దాంతమును మనము అర్ధం చేసుకోకుండా ఈ జీవన
సమరం సాగించడం చాలా కష్టము.
|| ఓం సాయిరాం ||
No comments:
Post a Comment