In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, April 29, 2015

భక్తి ఆవశ్యకత


          
ఒకసారి వ్యాసుడు చాలా దిగాలుగా ఏదో తెలియని స్పూర్తితో ఉండగా, అటుగా నారదమహర్షి వచ్చి ఆయనను పరామర్శించడం జరిగింది. అప్పుడు వ్యాసుడు "నారద మహర్షి నేనెందుకు ఇలా ఉంటున్నానో నాకర్ధం కావటం లేదు మీరైనా చెప్పండి" అని అడిగాడు.

         అప్పుడు నారద మహర్షి "ఓ పరాత్పర పుత్రా! వేదాలను విభజించావు బ్రహ్మసూత్రాలు వ్రాశావు, పంచమ వేదమైన భగవద్గీత (భారతం) అందించావు, ఇదంతా చేసిన నీవు ఆ ఈశ్వరుని యొక్క సుగుణాలను వర్ణించలేదు.

         ఆధ్యాత్మిక మార్గంలో మనుష్యులకు భక్తి లేకుండా వాళ్ళ అహంకారం తొలగదు. ఆ భగవంతుడైన సర్వేశ్వరుని అవతారములను అందరికి అందించితే అప్పుడు నీకు పరమశాంతి కలుగుతుంది." అని చెప్పడం జరిగింది. అప్పుడు భాగవతం ఆవిర్భవించింది. ఈ భాగవతమే భక్తికి అసలైన మార్గము. అందుకే బాబా కొంతమందికి భాగవతము చదవమని చెప్పడం జరిగింది.

          భాగవతము అంటే భగవంతుని గూర్చి తెలుసుకొని, భక్తిని అలవరచుకుని, మానవుడు తనను తాను ఎప్పుడైతే మర్చిపోతాడో అప్పుడే ఆ ముక్తిలో చరమాంఖానికి చేరుకోగల్గుతాడు. మనకి మన ఇష్టదైవం మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. కాని మనము ఆ దేవుడి గురించి పూర్తిగా తెలుసుకొనే ప్రయత్నం చేయము. ఇక్కడే మనము మాయలో పడ్తాము. మనల్ని ఈ ప్రపంచంలో వస్తువులు లాగుతూ ఉంటాయి. వాటి పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అవి లేకపోతే బతకలేము అని గట్టి నమ్మకం మనకు ఉంటుంది. ఇదే మన పతనానికి నాంది అవుతుంది.

         మహల్సాపతి ఎన్నికష్టాలు ఎదురైన, తన మనస్సును దారి తప్పకుండా అధీనంలో ఉంచుకున్నారు. ఆయనకి తింటానికితిండి కూడా ఉండేది కాదు. చాలా రోజులు పస్తులు ఉండేవాడు. బాబా ఏదైనా ఇచ్చినా తీసుకునే వాడు కాదు. ఆయనకు ఉన్న కొంచెము పొలం పంటకు పనికి రాదు. ఆయన వృత్తి ఆభరణాలు చేయడం. ఆ నిరుపేద గ్రామంలో నగలు చేయించుకునే వారే తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తొణకలేదు. బాబా పట్ల అనన్య భక్తిని మాత్రమే కోరుకున్నాడు. అందుకే ఆయనకు బాబాతో సదా నిదురించే అవకాశం దొరికింది. బాబా చేస్తున్న లోక కళ్యాణంలో ఒక భాగంగా భక్త మహల్సాపతి చిరస్థాయిగా నిల్చిపోయాడు.




|| ఓం సాయిరాం ||

Wednesday, April 15, 2015

భక్తి






భక్తి అంటే ఏమిటి?
భగవంతుని పట్ల ప్రేమనే భక్తి అంటారు.
ఈ భక్తి ఎప్పుడైతే ఏమి ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు. 

మనము ఎవరినైన ప్రేమించాలి అంటే వాళ్ళ గురించి మనకు తెలియాలి. వాళ్ళ మీద ఇష్టం ఏర్పడాలి.
అట్లానే మనకు దేవుడి మీద ప్రేమ ఏర్పడాలి అంటే దేవుని గురుంచి మనం తెలుసుకోవాలి.
           
మనకి భక్తి ఉన్నదా లేదా అని ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. ఉంటే మన భక్తి కేవలం భగవంతుని కోర్కెలు కోరడానికి మాత్రమేనా లేక శణాగతి చేసే అవగాహన ఉందా?
            
బాబా ఎప్పుడూ శ్రద్ద అనే విషయాన్ని ముఖ్యమైనదిగా చెప్పడం జరిగింది. ఈ శ్రద్ద అంటే ఏంటి? శ్రద్ద అంటే తిరుగులేని నమ్మకము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు నమ్మిన గురువుల మీద కాని లేదా దేవుడి మీద కాని చెరగని నమ్మకము ఉండాలి. ఇది లేని రోజున మనము కేవలము సామాన్య భక్తుల్లా మాత్రమే మిగిలిపోతాము.
            
విషయవాంచలకు సంబంధించిన కోర్కెలను కోరుతూ భగవంతుడితో వ్యాపారం చేస్తాము. ఎంతో కృపామయుడు కాబట్టి మనం అడిగిన కోర్కెలను తీరుస్తాడు. అట్లానే బాబా తన దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళ కోర్కెలన్నింటిని తీరుస్తాడు. అందుకే బాబా ఇలా అనేవారు, "నా దగ్గరకు వారు మొదట్లో కోర్కెల కోసం వచ్చిన, ఆ తరువాత వారిని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడం జరుగుతుంది. కాని అది వాళ్ళ ప్రారబ్ధం బట్టి ఉంటుంది. వారికి విషయవాసనలు మీద మనస్సు ఉంటే, వాళ్ళు మామిడిపూతలాగా రాలిపోతారు. కొందరు పిందెలులాగా రాలిపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే మామిడి పండ్లు అవ్వగలుగుతారు" అని దాము అన్నాకు ఒకసారి బాబా చెప్పడం జరిగింది.
           
బాబా మనకు శ్రద్దని నేర్పించాలి అని ఎంతో తపన పడ్తుంటే మనము పట్టించుకోము. జీవితంలో అనవసరమైన వాటి వెంట పరుగులు తీస్తాము. ఈ శ్రద్ద మనకు కాకపోతే ఇంకెవరికి.
            
ఒకసారి మహాభారత యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు కృష్ణపరమాత్ముడి నివాసానికి వచ్చి ఆయన సహాయం అర్ధిస్తారు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడ్ని కాకుండా ఆయన సైన్యాన్ని కోరుకోవడం జరుగుతుంది. కాని అర్జునుడు మాత్రం పరమాత్మనే కోరుకుంటాడు. ధుర్యోధనుడు తన వాళ్ళా దగ్గరికి వెళ్ళి పిచ్చి అర్జునుడు యుద్ధం చేయంటువంటి కృష్ణుడ్ని కోరుకున్నాడు. మనకి విజయము తధ్యము. మనవైపే ఎక్కువ సైన్యం ఉంది అని మురిసిపోయాడు. చివరికి జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు అన్న విషయం మనకు తెల్సినదే.
           
అట్లానే మనము ఎప్పుడూ ఆ సర్వేశ్వరుడు సృష్టించిన వస్తువులను మాత్రమే కోరుకుంటున్నాము. ఆయన్ని మాత్రం కోరుకోము. ఆయనను ఒక కోర్కెలు తీర్చే యంత్రంలా చూస్తాము. మనకి అవగాహన కలిగిన రోజున, కొంచెము జ్ఞానముతో కూడుకున్న భక్తి మనకి అలవాటు అయినప్పుడు, మనము నిజంగా దేవుడ్ని ప్రేమించడం మొదలుపెడ్తాము.
          
సరే  ఈ భగవంతుడు ఎవరు అంటే మనం మన పిల్లలుగా చెప్పగలమా అంతటి అవగాహన కోసం మనము ప్రయత్నిస్తున్నామా అని ఆలోచించాలి.
       
సబూరి ఎప్పుడు నేర్చుకోవాలి. మనకు నమ్మకమే ధృడంగా లేకపోతే ఇంక ఓర్పు ఎక్కడ నుంచి వస్తుంది.
  
ఇదంతా ఎందుకు జరుగుతుంది. మనుష్యులు ఇలా దేవుడి పట్ల శ్రద్ధలేకుండా ఎందుకు తయారు అవుతున్నారు అని ఆలోచిస్తే సమాధానం మనకు దొరుకుతుందా!


సాయి చెప్పిన శ్రద్ధ - సభూరి అనే మంత్రమే మన జీవితం కావాలి.  
సాయి మాటలే మనకు మంత్రం కావాలి . 
సాయి పరమాత్మే మన లక్ష్యం అవ్వాలి. 
ఇదే మనకు ముక్తి. 


ఓం శ్రీ సాయి రాం !

Wednesday, April 1, 2015

జీవన విధానం



నానా! ఈ సంసారంలో ఎలా  వ్యవహరించాలో విపులంగా చెప్తాను జాగ్రత్తగా వినమని బాబా ఈ క్రింది విధముగా కొనసాగించడం జరిగింది.

దేహ ప్రారబ్ధం వలన ఏ స్థితి లభించిందో దాన్ని ఆనందంగా అనుభవించాలి. ప్రారబ్ధ వశంగా ఇతరులకు కల్గిన స్థితిగతుల కోసం ప్రాకులాడకూడదు. 

భార్యపుత్రులు, పుత్రికలు దాసదాసీజనులు మొదలైన వారందరు దేహప్రారబ్ధం వల్లనే ప్రాప్తించారు. వారితో  ప్రీతితో మెలగాలి. వీళ్ళందరు నా వాళ్ళు అన్న అభిమానం ఉండరాదు. అది జనన మరణాలకు కారణభూతమౌతుంది. ఎందుకంటే దేహ ప్రారబ్ధమంతా ఇక్కడే పూర్తి కావాలి. ఆ కీర్తి అంతా కేవలము ఆ జన్మ ప్రారబ్ధానిదే.

బందుమిత్రులు, బార్యాపుత్రులు  ఈ జన్మకు చెందినవారే, వారు ఏ జన్మలో వస్తే ఆ జన్మలోనే పోతారు. ముందు జన్మకు సంబంధించిన వారెవరు? ఎక్కడ? అంటే తెలియదు. కాని వాసన బలం మాత్రము మనలను విడవక బద్ధులను చేస్తుంది.  విషయ వాసనలే తర్వాత జన్మకు కారణం అందువల్లనే మనం కర్మలు యందు మోహాన్ని పెంచుకొనకుంటే తర్వాత అక్షయ సుభలాభాలు  చేకూరుతాయి.
ఎలగైతే ధర్మసత్రంలో బసచేసి, అవసరం తీరిన తరువాత దాని మీద ఏ విధమైన వ్యామోహము పెంచుకొనకుండా విడిచిపోతామో, అదే  విధముగా ఈప్రపంచం కూడా ధర్మసత్రం లాంటిది. తదనుగుణంగా మన కర్తవ్యమును నిర్వర్తించాలి. ఈ కర్తవ్యమును నిర్వర్తిస్తూ సచ్చిదానందుడైన ఈశ్వరుని గుర్తించాలి.

తన స్వంత పుత్రుడిని మరొకరి పుత్రుడిని సృస్టించేది ఒక్కడే. మనము మన పిల్లల భారాన్ని మోసినా కాని, నేనే వారి పాలన, పోషణ చూస్తున్నాను. నేను చదువు చెప్పిస్తున్నాను అనే అహంభావనను వదలాలి. మనం పనులను చేస్తూ ఈశ్వరునికి సమర్పించి నిర్లిప్తంగా వుండగలగాలి.  

పురుషార్ధం : మనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతివిషయం యొక్క మంచి చెడులను గురించి పూర్తిగాతెలుకోవాలి.
మంచి వాటిని గ్రహించి చెడువాటిని వదిలివేయాలి. సత్కార్యాలు చేపట్టి వాటిని ప్రయత్నంతో పూర్తి చేయాలి.
మరణించిన తరువాత కీర్తి రూపంలో ఈ ప్రపంచంలో ఉండాలి. కర్తృత్వము భావన లేకుండా కర్మ చేయగలగాలి. దీనినే పురుషార్ధం అంటారు.

కర్తృత్వము వలన కలిగిన అభిమానమును భగవంతునికి అర్పణా చేయాలి.
కర్తృత్వమునకు తగ్గ ఫలము లభించినపుడు అభిమానంతో వినమ్రతతో ఉండాలి.

అస్తిత్వము వున్నంత వరకు దేహాన్ని రక్షిస్తూ ఉండాలి. కాని మరణం గూర్చి వ్యధ చెందడం వృధా. పంచభూతముల నుండి అరువు తెచ్చుకొని ఈ దేహం ఏర్పడుతుంది. ప్రాణం పోగానే వాటిలో అవి కలిసిపోతాయి. వాయువు వాయువులో కలిసిపోతుంది. శరీరం పృద్థ్వి యొక్క భాగము. దాన్ని గురించి శోకించుట వ్యర్ధము. అలాగే జన్మించినప్పుడు కూడ హర్షమునొందరాదు. అది సృష్టి వ్యవహారము అని తెలిసికుని స్వస్థులై ఉండాలి.

భూమిలో బీజము ఉంది. మేఘము వర్షాన్నిస్తుంది. సూర్యుని వలన మొక్కలు మొలకెత్తుతాయి. అది చూచి భూమి, మేఘము, సూర్యుడు ఆనందంతో నాట్యం చేయవు కదా! చిన్న మొక్క పెద్ద మానుగా మారిన లేదా  కాలిపోయినా పంచభూతములు సంతోషంగాని దుఃఖం గాని వ్యక్తము చేయవు. సుజ్ఞానులు వీటికి అతీతంగా ఉంటారు. మనం కూడా అలాగే ఉండాలి. అప్పుడిక సుఖదుఃఖాలు ఎలా కలుగుతాయి. సుఖదుఃఖాల పట్ల ఆభావం ఏర్పడటమే ముక్తి స్థితి.

అన్నదానం మూడు రకాలు (విశేష, నిత్య మరియు కార్య కారణాలు)
1) విశేష కారణం :  కాలం అనుకూలించి ధనం బాగా సంప్రాప్తించినపుడు వేయిమందికైన అన్నదానం చేయాలి.
అన్నదానం చేసేటప్పుడు ఉచ్చనీచాలు, మంచిచెడులు చూడకూడదు. అన్నదానానికి అందరూ యోగ్యులే.
సత్రాలలో కూడా అలాగే యధాశక్తి అన్నధానం చేయాలి. అప్పుచేసి మాత్రం అన్నదానం చేయకూడదు.
2) నిత్యాన్నదానం  :  స్వీకరించుటకు యోగ్యులు ఎవరు అనేది కూడా నీకు చెప్తాను. బాటసారి, తాపసి, సన్యాసి, ఆకలిగొన్నవాడు. వీరందరూ నిత్యాన్నదానానికి యోగ్యులు.
3) కార్య కారణం : పెండ్లి, ఉపనయనము, ఆప్తులు, సఖులు, సగోత్రులు మొదలైన వారిని పిలిచి బహు ఆదరణంగా బోజనం పెట్టాలి.
వస్త్ర దానానికి కూడా ఇవే నియమాలు.

వీటిని కల్పాంతములో కూడ మరువవద్దు. శక్తి కొలది ఇతరుల బాధలను నివారించడంలో సాయిపడాలి.
సత్తా ఉన్నదని దాన్ని దుర్వినియోగించరాదు.
న్యాయస్థానంలో ఉన్నప్పుడు భ్రష్ఠాచారము చేయకూడదు.
అప్పచెప్పినటువంటి కార్యాన్ని ఉత్తమ రీతిలో పూర్తి చేయాలి.
ఎంత అవసరమో అంతవరకే దుస్తులు ధరించాలి. లోకులు చూస్తున్నారని అతి అలంకరణలకు పోరాదు.
దుష్టులను మనసు నుండే గుర్తించాలి.
               
కామాన్ని అదుపులో ఉంచాలి. దాని ప్రభావానికి లోనుకాకూడదు. ఇలా నడచినవాడు బుద్ధిమంతుడు. దేహప్రారబ్దాన్ని అనుభవించేటప్పుడు ఈ అరిషడ్వర్గాలు ఎంత మోతాదులో అవసరమో అంత వరకే ఉపయోగించాలి. ఎల్లప్పుడు హరినామాన్ని జపిస్తూ అవినీతి పైకి మనస్సును పోనీయక, అంతరంగాన మోక్షాసక్తి కలిగి, మనస్సును పరమార్ధము వైపు మళ్ళించాలి. దుష్ర్కత్యాల యందు విరక్తి కలిగి భక్తి భావముతో,  ఈశ్వరుని నీవాడిగా చేసుకోవాలి. మదానికి తానీయకూడదు. సత్పురుషుల కధాశ్రవణము, శుద్ధమైన మనస్సుతో జ్ఞానులను ఆదరించడం, తల్లిదండ్రుల యెడల గౌరవ భావం కలిగి ఉండటం అవసరం.

కొన్ని రోజుల తరువాత నానా మరల షిర్డి వచ్చి బాబాను దర్శించి, బాబా నాకు నీవు ఇంతకు ముందు ఏ బోధ చెయ్యదలచుకున్నావో దాన్ని ఇప్పుడు ఉపదేశించవలసినది అని ప్రార్ధించాడు.
 అప్పుడు బాబా  ఇలా  చెప్పారు : 
నేను చెప్పేదాని మీద లక్ష్యం ఉంచి విను. సుఖదుఃఖ రూపమైన సంసార బంధనాశనమే ముక్తి స్థితి. ఆ స్థితి కలిగేందుకు నేను చెప్పిన ప్రకారము నడుచుకో! దేహప్రారబ్ధము సంభవించినపుడు సద్విచారముతో సదా జాగృతిలో ఉండవలెను. దానిని ఎంత మాత్రము వదిలిపెట్టకూడదు. సహజస్థితిలో ఏమేమి జరుగుతాయో అవన్నీ అక్షరాల దేహప్రారబ్ధం కానేరదు. ఉదాహరణకు కొందరు దొంగతనము చేస్తారు. ఆ చేసిన పనికి శిక్షను అనుభవిస్తారు. ఆ అనుభవము దేహప్రారబ్ధము కాదు.

విషము పుచ్చుకుంటే మరణం సంభవిస్తుంది. ఇది చేసుకొన్న దాని ఫలితం. యజమానిని మోసగించి ఆ డబ్బుతో సేవకుడు తాను యజమాని కావచ్చు. ఇవి దేహ ప్రారబ్దానికి సంభందించినవి కావు. జీతగాడు ధనికుడైన తర్వాత వాడు ఆనందంతో బండ్లు కొనుక్కొని సుఖంగా ఉన్నాననుకుంటాడు. కానీ యజమానిని మోసగించిన కర్మ ఫలితం అతనిని వెంటాడుతుంది. ఆ సంచితాన్ని అతను వచ్చే జన్మలో అనుభవించక తప్పదు. సంచితము క్రియా రూపంలో ఉన్నప్పుడు జన్మనెత్తవలెను. బుద్దిమంతులైన వారు ఇది తెలుసుకుంటారు. మూర్ఖులు పట్టించుకోరు.

దేహప్రారబ్దము వలన అతనికి జీతగాడి వృత్తి లభించింది. అది మరో జన్మకు కారణ భూతమైనది. ఈ జన్మలో ఏం చేశాడయ్యా అంటే రాబోయే జన్మకు పీఠం వేశాడు. ఈ జనన మరణ యాత్ర ఎట్లా తప్పించుకుంటాము. కొందరు ఉన్నత పదవులలో ఉంటూ అదికారం చెలాయిస్తారు, కొందరు ప్రపంచమంతా తిరుగుతూ ప్రవచనాలు చేస్తుంటారు, కొందరు యోగులవుతారు, కొందరు దుకాణాలు పెడ్తారు, కొందరు ఉపాధ్యాయులై పాఠశాలలో పిల్లలను చదివిస్తారు.

ఉపాధ్యాయుడు, దుకాణము, యోగి, వ్యాఖ్యాత, అధికారి నిజానికి వీళ్ళంతా పదవీదారులే. అయినా, ఈ వేర్వేరు ఉద్యోగాలు ఎందుకు కలిగాయో చెప్పగలవా? 
ఇవన్నీ కూడా దేహ ప్రారబ్ధ్యోగమే. కర్మఫలం వలన లభించేవి కావు. 

అప్పుడు నానా ఇట్లడిగాడు.
దొంగతనం చేసి దొంగవుతాడు. అక్కడ మాత్రం కర్మఫలం అంటున్నారు. ఇక్కడ దేహ ప్రారబ్ధమంటున్నారు. దీన్ని కొంచెం విడమరచి చెప్పండి.
బాబా : నారాయణా! పిచ్చి కల్పనలు మాని ప్రశ్నించు.
కొందరు దొంగతనం చేసి, తెలివిగా ఆ నేరాన్నుండి బయటపడ్తారు. కొందరు కటకటాల్లోకి వెళ్తారు. మరికొందరు తప్పించుకుని పెద్దమనుషుల్లా తిరుగుతుంటారు. దీంట్లో కర్మఫలమంటే దొంగతనమే. ఒకడు బయట పడతాడు. ఒకడు శిక్షను అనుభవిస్తాడూ. దేహప్రారబ్ధము కర్మఫలానికి అతీతము. బయటపడ్డ దొంగను కర్మఫలం విడువదు. అది తరువాత జన్మకు కారణభూతమవుతుంది. అందువల్ల నీకు చెప్పేది ఏమంటే దేహప్రారబ్ధము అనుభవించేటప్పుడు జాగరూకుడై నీతిని పాటించాలి. అంటే ఏం చేయాలి? సజ్జనుల సాంగత్యము చెయ్యాలి. సంతుల సముఖంలో కూర్చోవాలి. దుష్టులు, దుర్జనులు, భక్తిలేని వాళ్ళ చాయకు కూడా పోగూడదు. అభక్ష్యములను భక్షించకూడదు. వాదాలకు, వంతులకు పోవద్దు. సత్యాన్ని అంటిపెట్టుకో దైవం సంప్రీతుడౌతాడు.
ఒక్కసారి ఎవరికైనా మాటిస్తే దానిని తప్పక నెరవేర్చు. మాట తప్పిన వారికి దైవం దూరం అయిపోతాడు.

ఈశావాశ్యోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడుతుంది. 
మనము కర్మలు చేస్తూనే వందేళ్ళు బ్రతకాలి. వేరేదారే లేదు. ఈ శరీరం ఉన్నంత వరకు కర్మలు జరుగుతూనే ఉండాలి.

అయితే ఏ కర్మలు ఆచరించవచ్చు, ఎట్లా చేయవచ్చు.
మనము ఆగామి కర్మలు ఆచరించేటప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చే కర్మలు మనము చేయవచ్చు. తర్వాతి కాలంలో ఫలితాన్ని ఇచ్చే కర్మలపట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఆగామి కర్మలను కర్మయోగం ద్వారా నిర్వర్తించాలి.

ప్రారబ్ధకర్మలను భక్తియోగం ద్వారా అనుభవించడం, సహించడం నేర్చుకోవాలి.

సంచిత కర్మలను మనము ఏమి చేయలేము. కాని గురుకృప ద్వారా జ్ఞానము ద్వారా వాటిని దూరం చేయవచ్చు.

మనం కర్మలాచరించినప్పుడు వాటిపై ఎటువంటి మోహం లేకుండా వాటిని పరమేశ్వరునికి సమర్పించి నిర్వర్తించినచో మనం వాటి నుంచి బయటపడవచ్చు.