In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, June 24, 2015

పరిప్రశ్న-జ్ఞానం




బాబా చాలా చోట్ల కర్మల గురించి, భక్తి గురించి చెప్పడం జరిగింది. నానా సాహెబ్ చందోర్కరు ద్వారా, బాబా మనకు చాలా విషయాలు నేర్పడం జరిగింది. మానవులకు సుఖదుఃఖాలు మరియు ఇతర కష్టాలు ఈ జీవితంలో అనుభవించక తప్పదు. కాని బాబా చూపించిన దారిలో మనము పయనిస్తే మనము ఆ ముక్తి మార్గాన్ని చేరుకోగలము.

ఒకసారి నానా చందోర్కరు మసీదులో కూర్చొని, బాబా పాదములను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు. ఆయన భగవద్గీతలోని 4వ అధ్యాయంలో శ్లోకాలను మనసులోనే అనుకుంటున్నాడు. బాబాకి నానా మీద దయకలిగి, 34వ శ్లోకం వద్ద ఆయన పఠనం ఆపాడు. నానాని ఏమిటి నానా నీలోనే గొణుక్కుంటున్నావు, అని అడిగాడు.

నానా వినమ్రతతో ఆ శ్లోకం వినిపించాడు .  ఇక్కడ నానాకి చాలా అనుమానాలు కలిగియుండవచ్చు. బాబాకి సంస్కృతం తెలుసా? నానాకి గీత గురించి బాగా తెలుసు. చాలా అధ్యయనం చేశాడు. ఆ శ్లోకం ఈ విధంగా ఉంటుంది.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః||

దీనికి చాలా మంది భాష్యకారులు భాష్యం ఇవ్వటం జరిగింది. వారందరిది ఒక్కటే అభిప్రాయం. బాబా నానాని అర్ధం చెప్పమని అడిగాడు. అప్పుడు నానా ఇలా చెప్పారు.

గురుచరణాలకు సాష్టాంగ ప్రణామము చేసి, గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్ధాన్ని ఉపదేశిస్తారు.

సాయి మొదటి సగం శ్లోకానికి ఉన్న అర్ధాన్ని అంగీకరించారు. కాని మిగతా సగం శ్లోకానికి సరైన అర్ధం చెప్పమని నానాని అడగడం జరిగింది. జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానమనే శబ్ధానికి నీవు చెప్పిన అర్ధం విన్నాను, కాని దానికి జ్ఞానమని కాకుండా అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది. అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం.

గర్భానికి చుట్టుకున్న మానివలె, అద్దం మీది ధూళివలే, అగ్నికి కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం  కప్పివేస్తుంది. అజ్ఞానంతో  జ్ఞానం కప్పబడి ఉంది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువలన అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావసుద్దంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్దమైన నీరువలె జ్ఞానం స్వతఃసిద్దంగా ఉంటుంది. నాచును తొలగించిన బుద్ధిమంతునికి శుభ్రమైన నీరు లభిస్తుంది. వస్తువులను కళ్ళతో చూచి తెలుసుకునే శక్తి జ్ఞానం. కాని కళ్ళకు పొరలువస్తే అది అజ్ఞానం. దానిని తొలగించటం అవసరం. ఒక్క గురుకృప ద్వారా మాత్రమే ఈ అజ్ఞానం నశించి జ్ఞానం వెలుగులోకి వస్తుంది.

మనము ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు, ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ అనే అంశాలు చాలా అవసరం. వాటిలో గురువు పట్ల పూర్తి శ్రద్ధ, శరణాగతి, ఓర్పు ఉండాలి. ఇవి లేనినాడు, నీవు ఆయన కాళ్ళు వత్తినా, మనస్సులో భావం లేకపోతే లేదా గురువు మీద పూర్తి నమ్మకం లేకపోతే, ఆ గురుకృప మనకు ఎట్లా లభిస్తుంది. ఇక్కడ నానా పరిస్థితి కూడా అదే. నానాకి బాబా మీద నమ్మకం ఉంది. కాని ఎక్కడో మూలలో దాగిఉన్న అజ్ఞానపు పొరలను పరమ గురువైన బాబా పసికట్టారు. వాటిని తొలగించే ప్రయత్నమే ఈ భగవద్గీత పారాయణ లీల.

అసలు జ్ఞానం అంటే ఏమిటి? 
కనిపించే దృశ్య ప్రపంచం అంతా నిజం కాదు లేదా మిధ్యా అని తెలుసుకొని, బ్రహ్మము ఒక్కటె సత్యం అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జ్ఞానము.

అసలు ఇలాంటి అనుభవం ఒకటి ఉంటుంది అని శ్రవణం ద్వారా తెలుసుకొని, మన జీవితాలు మార్చుకొనే ప్రయత్నం చేస్తేనే మనకి దాంట్లో ఉన్న ఆనందం అర్ధం అవుతుంది. ఇంక దాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటే వచ్చేది నిశ్చలానందము. ఉన్న వస్తువులు, కనిపించే వస్తువులు నిజం కాదు. మిథ్య అంటే ఎట్లా? మనకు ఈ ప్రపంచం కనిపిస్తుంది. మిథ్య అంటే ఇప్పుడు లేదు అని కాదు. ఒక కాలంలో ఉన్నా మరియొక కాలంలో నశిస్తుంది. మనము ఒక్కసారి ఈ విశ్వాన్ని పరిశీలిస్తే, చాలా గోళాలు వాటి మధ్య ఖాళీస్థలం. ఒక గోళం ఈ శూన్యంలో కలిసిపోవచ్చు. చివరకు ఏమీ మిగలదు. అట్లానే మన యొక్క శరీరం ఒక కణం నుంచి వచ్చి పెద్ద శరీరం అవుతుంది. చనిపోయిన తర్వాత అంటే ఈ చైతన్యం వీడితే, శరీరం కుప్ప కూలుతుంది. అది తగలపెడ్తే బూడిదే మిగులుతుంది.

సరే ఈ జ్ఞానం అనేది ఎందుకు తెలుసుకోవాలి? మనం రోజూచేసే పనుల్లో ఈ జ్ఞాన దృష్థిని మనము అన్వయించుకోవచ్చు. మనము విశాలదృక్పధంతో ఆలోచించకపోతే మనసుకు కష్టం కలుగుతుంది. దుఃఖం కలుగుతుంది. ఒక వస్తువుని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం మూలాన, అది భిన్నంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని మనము సరిగ్గా అర్ధం చేసుకుంటే మనము వాళ్ళతో ఉండగల్గుతాము. ప్రతి విషయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మన అహంకారాన్ని ప్రక్కకు పెట్టడం నేర్చుకోవాలి. అందుకే బాబా జ్ఞానంతో పాటు భక్తిని నేర్పించడం జరిగింది. అప్పుడు ఈ మాయ అనే అజ్ఞానం మనల్ని వెంటాడదు. జ్ఞానులకు, వారు జ్ఞానులమన్న భావన ఉండొచ్చు. కాని జ్ఞానంతో కూడుకున్న భక్తితో మనం మన కర్మలను ఆచరించినప్పుడు మనకు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది.

అందుకే ఈ భగవద్గీత శ్లోకం అంత ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. బాబా మనకు బోధించిన వాటిలో, అందులో ప్రత్యేకంగా భగవద్గీతలో నుంచి ఈ శ్లోకాన్ని బాబా ఎందుకు ఎంచుకున్నారో మనం అర్ధం చేసుకోవాలి. జ్ఞానానికి కావల్సిన అర్హతలను బాబా ఇక్కడ  బోధించడం జరిగింది.

ఇదంతా విన్న నానా ఇంకా వినమ్రుడై  బాబా పాదాలకు సాష్థాంగ ప్రణామం చేసి రెండు చేతులతో వందనం చేశాడు. తరువాత భక్తి శ్రద్దలతో  "బాబా నాకు చక్కగా శిక్షణ నిచ్చి నా అజ్ఞానాన్ని పారద్రోలండి. నా దురభిప్రాయాన్ని శిక్షించండి అని ప్రార్ధించాడు".

సాత్విక గుణాలు పైపైకి కనిపిస్తున్నా మనసులో అనేక వికల్ఫాలుండి ఒక క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానం అంటే వేరే ఏమీ లేదు. మనసులో కీర్తి ప్రతిష్ఠలయందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకము, కామాక్రోధాలు లోపల రగులుతుంటే ఇక  ఇంతకన్నాఅజ్ఞానం వేరే ఏముంటుంది.

మనసులో చెడు భావాలు ఉండి పైకి మహాభక్తునిగా జ్ఞానిగా ఉండటం ఎంత దుర్భరము. ఈ భావాలు ఒక్కోసారి బయటికి తెలియవచ్చు లేదా కొన్నిసార్లు వీటిని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మానవుడు ఆచారవ్యవహారాల పేరు మీద ఒక్కొసారి తన ఉనికిని మర్చిపోతాడు. తను చేసే ప్రతిపని తనకు న్యాయమనిపిస్తుంది. అహంకారం ఆలోచనాశక్తిని హరింపచేస్తుంది. బయటకు నిష్ఠా గరిష్ఠులు కాని అహంకారం వాళ్ళకి తెలియకుండా మిగేస్తుంది.

సాయి కొన్ని వ్యవహారములను ఎవరికి తెలియకుండా చేస్తారు. చిన్న పనైన పెద్ద పనైన కారణం ఎప్పుడూ తెలిసేది కాదు. కాని చెప్పకుండానే ఎప్పుడూ ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులు సహజంగా ఉపక్రమింపబడేవి. కాని వానికి మూలకారణం, పేరు, నిర్దేశింపబడేవి కావు. పైగా ఇవన్నీ బాబా లీలలుగా కనిపించేవి. ఇటువంటి పరమగురువులు పరోపకారం కోసమే జగత్తులో అవతరిస్తారు. సంకల్పించిన కార్యం పూర్తి కాగానే చివరకు అవ్యక్తంలో కలిసిపోతారు.

మనం ఎక్కడ నుంచి వచ్చాం? ఎక్కడికి వెళతాం? ఎందుకొరకు పుట్టాము. ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నలకు మూలకారణాలు మనకు తెలియవు. ఇష్టమొచ్చిన రీతిలో జీవితాన్ని గడిపేస్తున్నాము. తరువాత మరణ కాలం సమీపిస్తుంది. మన ఎదురుగా మన బంధువులంతా చనిపోవడం చూస్తున్నాము. అయినా మన మనసులో ఇట్లాంటి ఆలోచనలు రావు. నాకు ఈ రోజు ఏం జరుగదు అన్న ధీమా. అందుకే మన గురువులు చెప్తారు. నలుగురితో నారాయణ అనుకోవడం కాదు. నారాయణుడవు నీవే అని తెలుసుకో. మనము ఈ సత్యాలను గురించి తెలుసుకోవడమే జ్ఞానమార్గం. ఇవి ఎప్పుడో ముసలితనం వచ్చిన తరువాత నేర్చుకొనేవి కాదు. అప్పుడు దాని ఉపయోగం ఎంత? మన శరీరం కదల్లేనప్పుడు ఇది తెలిసి ఏమిటి ప్రయోజనం.

మనకు జ్ఞానం అనేది ఎప్పుడూ కావాలి. జీవితం పట్ల అవగాహన రావాలి. కష్ట సుఖాలలో ఈ జీవన సమరం సాగించడమా లేక నిజాన్ని అర్ధం చేసుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమా? మనము ఎప్పుడూ సుఖాన్నే కోరుకుంటున్నామని అనుకొంటాము.  కాని నిజానికి అది సుఖము కాదు. రోజు మనం నిర్వర్తించే కార్యక్రమాలలో సత్యాసత్యాలను అర్ధం చేసుకోవాలి. ఏవి ముందు ఏవి వెనుక, దేనికి మనము ప్రాముఖ్యత నివ్వాలి. ఏది మనకు శ్రేయమైనది. మనకున్నఈ అహంకారాన్ని ప్రక్కకు పెడ్తే, మనము ఎంత సుఖపడ్తామో మనకు అర్ధం కాదు. ఎప్పుడు నేను చెప్పే మాటే నెగ్గాలనే మన ప్రయత్నానికి గండి కొట్టితే, ఈ సంకెళ్ళలో నుంచి బయటపడ్తాము. స్వార్ధము మనలను అధోగతిపాలు చేస్తుంది. బాబా సర్వమానవాళిలో, సర్వప్రాణులలో, కదిలే వాటిలో కదలని వాటిలో తననే చూడమని చెప్పడానికి కారణం ఇదే. మనలో ఈ సద్గుణాలను ఏర్పరిచి చెడు గుణాలను అంతమొందించడానికే అని మనం అర్ధం చేసుకొని బాబా బోధించిన జ్ఞాన మార్గం తెలుసుకోవాలి.



|| ఓం సాయిరాం ||

Wednesday, June 10, 2015

నవవిధ భక్తి



మనము ఎన్నో పుస్తకాలను చదువుతాము. పాటలను వింటాము. ఇట్లా మనసుకు ఆనందమైనటువంటివి మనము అనుభవిస్తాము. కాని వీటిల్లో కొన్ని మాత్రమే మన హృదయానికి హత్తుకుని పోతాయి. కాని భక్తిలో కలిగేటువంటి పారవశ్యం అసాధారణమైనది. ఆ పారవశ్యంలో మునిగితే కాని దాని ఆనందము తెలియదు. ఇది నోటితో  చెప్పేది కాదు. మనందరికి భక్తి ఉండవచ్చు కాని మనము ఆ పారవశ్యాన్ని పూర్తిగా అనుభవిస్తున్నామా లేదా?

అటువంటి స్థితికి చేరాలంటే ఏం చేయాలి? ఏది దారి? బాబా మనకు ఒక చక్కటి మార్గం చూపించారు. అదే నవవిధ భక్తి మార్గము. అనంతరావు పాటంకర్ ద్వారా మనకి ఈ నవవిధ భక్తి మార్గాన్ని బోధించి బాబా మనకు చాలా ఉపకారం చేసారు. ఇది ఏ సందర్భంలో చెప్పారు అని మనం పరిశీలించి చూస్తే ఈ మార్గం ఎంత గొప్పదో మనకు అవగతం అవుతుంది.

ఒకసారి అనంతరావు పాటంకర్, సాయి దర్శనానికై వచ్చి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. బాబా నేను చాలా పుస్తకాలు చదివాను, విన్నాను. ఉపనిషత్తులు వాటి బాష్యాలు, మన పవిత్రగ్రంధాలు ఇలా చాలా పఠించడం జరిగింది. కాని మనస్సులో ఏదో వ్యాకులత. నేను చదివినదంతా వృధా అనిపిస్తుంది. నేర్చుకున్న దానికి అర్ధం లేకుండా పోయింది. ఈ జపతపాదులు ఎందుకు? ఇవి మనశ్శాంతిని ఇవ్వలేదు. ఈ పరమాత్మ అనుభూతి పొందని ఈ సాధనలన్నీ వ్యర్ధమేనా? నీ పాద పద్మాలే నాకు గతి, నన్ను ఉద్ధరించు మహారాజా అని దీనంగా అడగడం జరిగింది.

అప్పుడు బాబా ఒక కధ చెప్పడం జరిగింది. ఒక వర్తకుడు తొమ్మిది లద్దెలను తన పంచె కొంగులో సేకరించెను. ఇట్లు అతడు తన మనస్సును కేంద్రీకరించ కల్గెను అని చెప్పారు. దాని యొక్క అర్ధం తెలియక పాటంకరు, దాదా కేల్కురుని అడగటం జరిగింది. వీరిని అడ్డం పెట్టుకుని బాబా మనకు నవవిధభక్తిని ఇవ్వడం జరిగింది.

అవి:
1) శ్రవణం
2) కీర్తనం
3) స్మరణం
4) పాదసేవనం
5) అర్చనము
6) నమస్కారము
7) దాస్యము
8) సఖ్యము
9) ఆత్మ నివేదనము

వాటిని మూడు భాగాలుగా విభజిస్తే :
మొదటి మూడు శ్రవణం, కీర్తనం, స్మరణం - ఇవి మన మనస్సును శుద్ది చేస్తాయి. అప్పుడు భక్తి బీజం మొలకెత్తటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ తరువాత పాదసేవ, అర్చనము మరియు నమస్కారము అనే మూడింటి ద్వారా ఈ బీజం పెరుగుతుంది. మనకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు దాన్ని దాస్యము, అంటే సేవ ద్వారా, ఆ గురువుకి భక్తి భావనతో గూడిన సఖ్యముతో ఆత్మనివేదన గావించటమే మన లక్ష్యము.

సరే ఈ నవవిధ భక్తికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది. సఛ్ఛరితలో గుర్రము గురించి చెప్పినపుడు ఆడ గుర్రము గురించి చెప్పడము జరిగింది. అలా ఎందుకు? ఇక్కడ ఆడగుర్రమునగా భగవంతుని అనుగ్రహము అని చెప్పటం జరిగింది.
మనకి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మనువును, శతరూపును స్త్రీ పురుషులుగా సృష్టించడం జరిగింది. వీరి కుమార్తె అయిన దేవహుతిని కర్ధమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. కర్ధమ ప్రజాపతి చాలా గొప్ప తపఃసంపన్నుడు. ఆయన జితేంద్రియుడు మరియు దివ్యాత్ముడు. కర్ధముడనగా ఇంద్రియములను నిగ్రహించిన వాడని అర్ధము. దేవహుతి అనగా దేవుని ఆహ్వానించునది అని భావము. దేవహుతి భర్తను భగవంతునిగా ఆరాధించి సేవచేస్తూ ఉండేది. కఠోరసాధనలతో, నిష్టలతో ఆమె శరీరం చిక్కి శల్యమైనా కూడా లెక్కచేయక భర్తకు సేవ చేసేది. ఆమె భక్తికి మెచ్చి భర్తయైన కర్ధముడు మరల ఆమెకు యవ్వనం ప్రసాదించి, ఆమె కోర్కె మీద సంతానం ప్రసాదించెను. వారికి తొమ్మిది మంది కుమార్తెలు పుట్టారు. నవవిధ భక్తి రూపాలుగా కుమార్తెలు పుట్టడం జరిగింది. ఆ కన్యలు తరువాత మహర్హులని వివాహం చేసుకోవడం జరిగింది.

కళ-మరీచిని, అనసూయ-అత్రిమహర్షిని, శ్రద్ధ అనే కన్యను అంగీరసునకు, హవిర్భువును పులస్త్యునకు, గతిని పులహమహర్షికి, క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అరుంధతిని వశిస్ఠునకు ఇవ్వడం జరిగింది. ఈ కన్యలే నవవిధ భక్తి స్వరూపాలు.

ఆ తరువాత దేవహుతికి స్వయానా భగవంతుడే కపిలదేవుడిగా జన్మించి ఆమెకు మోక్షం ప్రసాదించడం జరుగుతుంది.
ఈ మహర్షులందరు పరమాత్మ స్వరూపులు. ఈ కన్యలందరు భక్తి స్వరూపాలు. ఎప్పుడైతే భక్తితో భగవంతుని సేవిస్తామో అప్పుడే ఆ భగవంతునిలో మనం కల్సిపోతాము. అప్పుడు భక్తికి భగవంతునికి తేడా ఉండదు. ఇదే శక్తి చైతన్య స్వరూపము.

నవవిధ భక్తి విధానాన్ని మనకి అనుభవ పూర్వకంగా అందించే పరమగురువే సాయి. బాబా ఈ నవవిధ భక్తుల విధానాన్ని చాలా చోట్ల నేర్పించడం జరిగింది. కాని మనకు బాగా తెలిసిన సందర్బాలు రెండు. ఒకటి అనంతరావు పాటంకర్ మరియు లక్ష్మీబాయి. బాబా తన మహా సమాధి ముందు, లక్ష్మీబాయికి తొమ్మిది నాణెములు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా గురువులు వీటి గురించి బోధిస్తారు కాని బాబా విధానము బోధంచడమే కాదు, మనకు అనుభూతి కల్పించి, ఆ స్థితిలోకి మనల్ని తీసుకువెళ్తారు.

ఇప్పుడు ఆ నవవిధ భక్తులను గురించి విడివిడిగా పరిశీలిద్దాము.
1) శ్రవణము: గురువు (దేవుడు) గురించి వినడం, తెలుసుకోవటం, ఆయన గుణగణాలని, ఆయన లీలలను ఎల్లపుడూ వింటూ ఉండటం, భక్తుడి యొక్క మనస్సు ఈ శ్రవణము ద్వారా తన్మయత్వం చెందుతుంది. ఒక స్థితిలో ఈ భక్తుడు తన కలల్లో కూడా దేవుడ్నే గుర్తు చేసుకుంటాడు. కాని ఈ శ్రవణము మనకి (మన మనస్సుకి) వంట బట్టాలి అంటే సత్సంగము కావాలి. మనకి గురువుల సాంగత్యము కావాలి. పాజిటివ్ ఎనర్జీ ఉన్నచోట, బాబా సచ్చరితతో, హారతులతో ముక్తిని పొందవచ్చు.

2)కీర్తనము: ఇక్కడ భక్తుడు భగవంతుని గుణగణాలను, లీలలను పాటల రూపంలోనూ, మరియు వేరే విధములుగా కీర్తిస్తుంటారు. దీనిలో వారికి ఒకరకమైన భావోద్రేకము వస్తుంది. గొంతుక పూడిపోతుంది. కంటి వెంట నీరుకారుతుంది. ఆ భక్తి సాగరంలో తేలియాడుతుంటారు. దాసగణు బాబా గురించి ఎప్పుడూ కీర్తిస్తుంటారు. మనకి తెలియని ఎందరో మహానుభావులు కీర్తనము ద్వారా ముక్తి పధంలో నడిచారు.

3) స్మరణము : అంటే ఎల్లప్పూడు భగవంతుని గూర్చి ఆలోచించడమే. మనము ఏ పని చేస్తున్నా మనసెప్పుడు ఆ గురువు మీద ఉంటంది. ఇంకా వేరే వస్తువులు ఆలోచనలోకి రావు. వాళ్ళు ఆ భగవంతుని గూర్చిన కథలో ఆయన నామాలను, ఆయన లీలలను ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. జపము చేయడము, ధ్యానము చేయడము, సత్సంగము చేయడం ఇట్లా ఏది చేసినా భగవంతుని స్మరణ అవుతుంది. బాబా ఎప్పుడూ అల్లామాలిక్ అనే స్మరణ చేస్తూ మనల్ని కూడా ఆ భగవంతుని గూర్చిన స్మరణ చేయమని చెప్పడం జరిగింది.

4) పాదసేవ : భగవంతుని పాదాలకు సేవ చేయడం, లక్ష్మీపార్వతులు ఎప్పుడూ ఈ సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ లక్ష్మీ అంటే ఏమిటి? ఆ చైతన్య స్వరూపుడైన భగవంతుని యొక్క మాయారూపమే. ఈ మాయ వల్ల బంధం ఏర్పడుతుంది. ఈ మాయ మనల్ని భ్రమింపజేస్తుంది. ఆ భగవంతుడు ఈ చర్మచక్షువులకి దర్శనం ఇవ్వడం లేదు. మనము డైరెక్టుగా భగవంతుని సేవ చెయ్యలేక పోతున్నాము అన్న బాధ ఉండవచ్చు. అందుకే ఈ దేవాలయాలు, పూజామందిరాలు, విగ్రహాలు, వీటి ద్వారా మనము ఈ సేవను చేస్తాము. 

పాదసేవా లేక పదసేవా! 

భగవంతుడు నేను అంతటా ఉన్నాను అంటే దాని అర్ధం, మనము ఎవరికి సేవ చేసినా అది పాదసేవే అవుతుంది. కాని మనకు ఆ భావన ఉండాలి. భగవంతుడి విశ్వరూపమే ఈ జగత్తు. మానవ సేవయే మాధవ సేవ. దీన్నే మనం ఇట్లా చెప్పుకోవచ్చు. ఇది పదసేవ! భగవంతుని పాదములవైపు నడిచే మార్గం ఏదైన సరే అది పాద సేవ అవుతుంది. ఆయన చూపించిన మార్గంలో నడవడం మన కర్తవ్యము.

5) అర్చన: అర్చన నవవిధ భక్తులలో చాలా ప్రధానమైనది. మనము ఒక విగ్రహానికి లేదా ఒక పటమునకు పూజా రూపంలో ఈ అర్చనను చేస్తాము. భగవంతుని పూజించటమే అర్చన. అర్చన యొక్క ముఖ్య ఉద్ధేశ్యము. భగవంతుడిని ప్రసన్నుడను చేసుకోవడమే. అర్చన వలన మన మనస్సు శుద్ధి పడుతుంది. మన అహంకారం నశించి మనలో ప్రేమభావన నిండుతుంది.

మానవ సేవ మాధవసేవగా చెప్పబడింది. ఆ భగవంతుడు విరాట్ స్వరూపుడు. అందుకే గురుసేవ, మానవ సేవ కూడ అర్చనలో భాగమే. అర్చన చేసేటప్పుడు భక్తుని యొక్క మనస్సు ఆ భగవంతుని రూపమును గుణగణాలను మరియు ఆ శక్తి యొక్క అనంతతత్వాన్ని గుర్తు చేసుకోవాలి.

6) వందనము: మన శరీర ఉనికిని మార్చి పూర్తిగా భగవంతుని ముందు మోకరిల్లటమే వందనము. సాష్టాంగ నమస్కారం చేయడం వందనమే. భగవంతునికి మిక్కిలి శ్రద్ధతో, ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఆ దేవుడ్ని అన్నింటిలో చూస్తూ, భక్తి భావనతో అన్ని శరీర అంగములను అర్పించి నమస్కరించటమే వందనము.

7) దాస్యము : దాస్య భక్తి అంటే, భగవంతుని పూర్తి సేవక భావనతో ప్రేమించటమే. ఆయన యొక్క భావనలను (అంటే మన  శాస్త్రాలను) గౌరవించి, ఆ వేద వాక్కులను తప్పకుండా సేవా భావముతో పాటించడం చాలా ముఖ్యము. ఒక యజమాని గురించి నిజమైన సేవకుడు ఎట్లా ఆలోచిస్తాడు, ఆ యజమానికి  సేవకుడు కావల్సినవన్ని చేయడం మనం చూస్తాము. మనము పల్లకి సేవ చేయడం, మన దేవాలయములు, పూజా మందిరములను శుభ్రం చేయడం, ఇట్లా ఏ రకమైన సేవ చేసినా  ఈ దాస్యభక్తి కిందకు వస్తుంది.

8) సఖ్య భక్తి: భగవంతుని పట్ల సఖ్యభావనతో ఉండటమే సఖ్యభక్తి. మనకు బాగా ఇష్టమైన స్నేహితులకు మనము ఏమైన చేస్తాము. మనము మన పనులన్నీ ప్రక్కన పెట్టి మన పాత స్నేహితులకు ప్రాముఖ్యత ఇస్తాము. ఇదే భావన కనుక మనము భగవంతుని పట్ల పెంపొందించుకోగల్గితే మన జన్మ సార్ధకం అవుతుంది.

9) ఆత్మ నివేదన : తనువును, మనస్సును, ఆత్మను పూర్తిగా సమర్పించటమే ఆత్మనివేదన. ఇంక మనదంటూ ఏమీ ఉండదు. అంతా భగవంతునిదే. ఆయన దయ, కృప మరియు కరుణయే సర్వస్వము. మనము భగవంతునిలో భాగమైపోతాము. ఆ భగవంతుని లీలే ఈ ప్రపంచము. ఇక ఈ ప్రపంచములో శత్రువులే లేరు. కష్టమేలేదు. భక్తుడే భక్తియై పోతాడు. అతని కర్మలన్నీ నశిస్తాయి. ప్రపంచ భావన నశించి పరమాత్మ భావన మాత్రమే మిగిలిపోతుంది. మనిషి మహాత్ముడౌతాడు. ఇది మనకి  కష్టం అనుకోవచ్చు. కాని ఒక ఉదాహరణ మనము ఇక్కడ చెప్పుకుందాము. ఈ భావన ప్రతి మనిషికి సర్వసిద్దముగా ఉంటుంది. కాని మనము ఆచరించము. ఒక వ్యక్తి పట్టుదలతో ఒక వ్యాపారం చేస్తాడు. దాన్ని రాత్రింపగళ్ళు తన మనసులో నింపుకుంటాడు. చివరికి అదే తన గుర్తింపు, స్వభావము అవుతుంది. తన పేరే ఆ బిజినెస్‌గా గుర్తించబడుతుంది. అట్లానే మనకు శ్రద్ధ ఉండి, సబూరితో అంటే ఓర్పుతో వ్యవహరిస్తే ఈ నవవిధ భక్తుల ద్వారా భగవంతుడ్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. మనసాయి మనలందరిని ఈ బాటలో నడిపించాలని కోరుకుందాము.



|| ఓం సాయిరాం ||