మనము
ఎన్నో పుస్తకాలను చదువుతాము. పాటలను వింటాము. ఇట్లా మనసుకు ఆనందమైనటువంటివి మనము అనుభవిస్తాము.
కాని వీటిల్లో కొన్ని మాత్రమే మన హృదయానికి హత్తుకుని పోతాయి. కాని భక్తిలో కలిగేటువంటి
పారవశ్యం అసాధారణమైనది. ఆ పారవశ్యంలో మునిగితే కాని దాని ఆనందము తెలియదు. ఇది నోటితో చెప్పేది కాదు. మనందరికి భక్తి ఉండవచ్చు కాని మనము ఆ పారవశ్యాన్ని పూర్తిగా అనుభవిస్తున్నామా
లేదా?
అటువంటి
స్థితికి చేరాలంటే ఏం చేయాలి? ఏది దారి? బాబా మనకు ఒక చక్కటి మార్గం చూపించారు. అదే
నవవిధ భక్తి మార్గము. అనంతరావు పాటంకర్ ద్వారా మనకి ఈ నవవిధ భక్తి మార్గాన్ని బోధించి
బాబా మనకు చాలా ఉపకారం చేసారు. ఇది ఏ సందర్భంలో చెప్పారు అని మనం పరిశీలించి చూస్తే
ఈ మార్గం ఎంత గొప్పదో మనకు అవగతం అవుతుంది.
ఒకసారి
అనంతరావు పాటంకర్, సాయి దర్శనానికై వచ్చి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. బాబా నేను చాలా
పుస్తకాలు చదివాను, విన్నాను. ఉపనిషత్తులు వాటి బాష్యాలు, మన పవిత్రగ్రంధాలు ఇలా చాలా
పఠించడం జరిగింది. కాని మనస్సులో ఏదో వ్యాకులత. నేను చదివినదంతా వృధా అనిపిస్తుంది.
నేర్చుకున్న దానికి అర్ధం లేకుండా పోయింది. ఈ జపతపాదులు ఎందుకు? ఇవి మనశ్శాంతిని ఇవ్వలేదు.
ఈ పరమాత్మ అనుభూతి పొందని ఈ సాధనలన్నీ వ్యర్ధమేనా? నీ పాద పద్మాలే నాకు గతి, నన్ను
ఉద్ధరించు మహారాజా అని దీనంగా అడగడం జరిగింది.
అప్పుడు
బాబా ఒక కధ చెప్పడం జరిగింది. ఒక వర్తకుడు తొమ్మిది లద్దెలను తన పంచె కొంగులో సేకరించెను.
ఇట్లు అతడు తన మనస్సును కేంద్రీకరించ కల్గెను అని చెప్పారు. దాని
యొక్క అర్ధం తెలియక పాటంకరు, దాదా కేల్కురుని అడగటం జరిగింది. వీరిని అడ్డం పెట్టుకుని
బాబా మనకు నవవిధభక్తిని ఇవ్వడం జరిగింది.
అవి:
1)
శ్రవణం
2)
కీర్తనం
3)
స్మరణం
4)
పాదసేవనం
5) అర్చనము
6)
నమస్కారము
7)
దాస్యము
8)
సఖ్యము
9)
ఆత్మ నివేదనము
వాటిని
మూడు భాగాలుగా విభజిస్తే :
మొదటి
మూడు శ్రవణం, కీర్తనం, స్మరణం - ఇవి మన మనస్సును శుద్ది చేస్తాయి. అప్పుడు భక్తి బీజం
మొలకెత్తటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ తరువాత పాదసేవ, అర్చనము మరియు నమస్కారము
అనే మూడింటి ద్వారా ఈ బీజం పెరుగుతుంది. మనకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు
దాన్ని దాస్యము, అంటే సేవ ద్వారా, ఆ గురువుకి భక్తి భావనతో గూడిన సఖ్యముతో ఆత్మనివేదన
గావించటమే మన లక్ష్యము.
సరే
ఈ నవవిధ భక్తికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది. సఛ్ఛరితలో గుర్రము గురించి చెప్పినపుడు
ఆడ గుర్రము గురించి చెప్పడము జరిగింది. అలా ఎందుకు? ఇక్కడ ఆడగుర్రమునగా భగవంతుని అనుగ్రహము
అని చెప్పటం జరిగింది.
మనకి
సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మనువును, శతరూపును స్త్రీ పురుషులుగా సృష్టించడం జరిగింది.
వీరి కుమార్తె అయిన దేవహుతిని కర్ధమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. కర్ధమ
ప్రజాపతి చాలా గొప్ప తపఃసంపన్నుడు. ఆయన జితేంద్రియుడు మరియు దివ్యాత్ముడు. కర్ధముడనగా
ఇంద్రియములను నిగ్రహించిన వాడని అర్ధము. దేవహుతి అనగా దేవుని ఆహ్వానించునది అని భావము.
దేవహుతి భర్తను భగవంతునిగా ఆరాధించి సేవచేస్తూ ఉండేది. కఠోరసాధనలతో, నిష్టలతో ఆమె శరీరం
చిక్కి శల్యమైనా కూడా లెక్కచేయక భర్తకు సేవ చేసేది. ఆమె భక్తికి మెచ్చి భర్తయైన కర్ధముడు
మరల ఆమెకు యవ్వనం ప్రసాదించి, ఆమె కోర్కె మీద సంతానం ప్రసాదించెను. వారికి తొమ్మిది
మంది కుమార్తెలు పుట్టారు. నవవిధ భక్తి రూపాలుగా కుమార్తెలు పుట్టడం జరిగింది. ఆ కన్యలు
తరువాత మహర్హులని వివాహం చేసుకోవడం జరిగింది.
కళ-మరీచిని,
అనసూయ-అత్రిమహర్షిని, శ్రద్ధ అనే కన్యను అంగీరసునకు, హవిర్భువును పులస్త్యునకు, గతిని
పులహమహర్షికి, క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అరుంధతిని వశిస్ఠునకు ఇవ్వడం
జరిగింది. ఈ కన్యలే నవవిధ భక్తి స్వరూపాలు.
ఆ
తరువాత దేవహుతికి స్వయానా భగవంతుడే కపిలదేవుడిగా జన్మించి ఆమెకు మోక్షం ప్రసాదించడం
జరుగుతుంది.
ఈ
మహర్షులందరు పరమాత్మ స్వరూపులు. ఈ కన్యలందరు భక్తి స్వరూపాలు. ఎప్పుడైతే భక్తితో భగవంతుని
సేవిస్తామో అప్పుడే ఆ భగవంతునిలో మనం కల్సిపోతాము. అప్పుడు భక్తికి భగవంతునికి తేడా
ఉండదు. ఇదే శక్తి చైతన్య స్వరూపము.
నవవిధ
భక్తి విధానాన్ని మనకి అనుభవ పూర్వకంగా అందించే పరమగురువే సాయి. బాబా ఈ నవవిధ భక్తుల
విధానాన్ని చాలా చోట్ల నేర్పించడం జరిగింది. కాని మనకు బాగా తెలిసిన సందర్బాలు రెండు.
ఒకటి అనంతరావు పాటంకర్ మరియు లక్ష్మీబాయి. బాబా తన మహా సమాధి ముందు, లక్ష్మీబాయికి
తొమ్మిది నాణెములు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా గురువులు వీటి గురించి బోధిస్తారు కాని
బాబా విధానము బోధంచడమే కాదు, మనకు అనుభూతి కల్పించి, ఆ స్థితిలోకి మనల్ని తీసుకువెళ్తారు.
ఇప్పుడు
ఆ నవవిధ భక్తులను గురించి విడివిడిగా పరిశీలిద్దాము.
1)
శ్రవణము: గురువు (దేవుడు) గురించి వినడం, తెలుసుకోవటం, ఆయన గుణగణాలని, ఆయన లీలలను ఎల్లపుడూ
వింటూ ఉండటం, భక్తుడి యొక్క మనస్సు ఈ శ్రవణము ద్వారా తన్మయత్వం చెందుతుంది. ఒక స్థితిలో
ఈ భక్తుడు తన కలల్లో కూడా దేవుడ్నే గుర్తు చేసుకుంటాడు. కాని ఈ శ్రవణము మనకి (మన మనస్సుకి)
వంట బట్టాలి అంటే సత్సంగము కావాలి. మనకి గురువుల సాంగత్యము కావాలి. పాజిటివ్ ఎనర్జీ
ఉన్నచోట, బాబా సచ్చరితతో, హారతులతో ముక్తిని పొందవచ్చు.
2)కీర్తనము:
ఇక్కడ భక్తుడు భగవంతుని గుణగణాలను, లీలలను పాటల రూపంలోనూ, మరియు వేరే విధములుగా కీర్తిస్తుంటారు.
దీనిలో వారికి ఒకరకమైన భావోద్రేకము వస్తుంది. గొంతుక పూడిపోతుంది. కంటి వెంట నీరుకారుతుంది.
ఆ భక్తి సాగరంలో తేలియాడుతుంటారు. దాసగణు బాబా గురించి ఎప్పుడూ కీర్తిస్తుంటారు. మనకి
తెలియని ఎందరో మహానుభావులు కీర్తనము ద్వారా ముక్తి పధంలో నడిచారు.
3)
స్మరణము : అంటే ఎల్లప్పూడు భగవంతుని గూర్చి ఆలోచించడమే. మనము ఏ పని చేస్తున్నా మనసెప్పుడు
ఆ గురువు మీద ఉంటంది. ఇంకా వేరే వస్తువులు ఆలోచనలోకి రావు. వాళ్ళు ఆ భగవంతుని గూర్చిన
కథలో ఆయన నామాలను, ఆయన లీలలను ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. జపము చేయడము, ధ్యానము చేయడము,
సత్సంగము చేయడం ఇట్లా ఏది చేసినా భగవంతుని స్మరణ అవుతుంది. బాబా ఎప్పుడూ అల్లామాలిక్
అనే స్మరణ చేస్తూ మనల్ని కూడా ఆ భగవంతుని గూర్చిన స్మరణ చేయమని చెప్పడం జరిగింది.
4)
పాదసేవ : భగవంతుని పాదాలకు సేవ చేయడం, లక్ష్మీపార్వతులు ఎప్పుడూ ఈ సేవ చేస్తూ ఉంటారు.
ఇక్కడ లక్ష్మీ అంటే ఏమిటి? ఆ చైతన్య స్వరూపుడైన భగవంతుని యొక్క మాయారూపమే. ఈ మాయ వల్ల బంధం ఏర్పడుతుంది. ఈ మాయ మనల్ని భ్రమింపజేస్తుంది.
ఆ భగవంతుడు ఈ చర్మచక్షువులకి దర్శనం ఇవ్వడం లేదు. మనము డైరెక్టుగా భగవంతుని సేవ చెయ్యలేక
పోతున్నాము అన్న బాధ ఉండవచ్చు. అందుకే ఈ దేవాలయాలు, పూజామందిరాలు, విగ్రహాలు, వీటి ద్వారా మనము ఈ సేవను చేస్తాము.
పాదసేవా లేక పదసేవా!
భగవంతుడు నేను అంతటా ఉన్నాను
అంటే దాని అర్ధం, మనము ఎవరికి సేవ చేసినా అది పాదసేవే అవుతుంది. కాని మనకు ఆ భావన ఉండాలి.
భగవంతుడి విశ్వరూపమే ఈ జగత్తు. మానవ సేవయే మాధవ సేవ. దీన్నే మనం ఇట్లా చెప్పుకోవచ్చు.
ఇది పదసేవ! భగవంతుని పాదములవైపు నడిచే మార్గం ఏదైన సరే అది పాద సేవ అవుతుంది. ఆయన చూపించిన
మార్గంలో నడవడం మన కర్తవ్యము.
5)
అర్చన: అర్చన నవవిధ భక్తులలో చాలా ప్రధానమైనది. మనము ఒక విగ్రహానికి లేదా ఒక పటమునకు
పూజా రూపంలో ఈ అర్చనను చేస్తాము. భగవంతుని పూజించటమే అర్చన. అర్చన
యొక్క ముఖ్య ఉద్ధేశ్యము. భగవంతుడిని ప్రసన్నుడను చేసుకోవడమే. అర్చన వలన మన మనస్సు శుద్ధి
పడుతుంది. మన అహంకారం నశించి మనలో ప్రేమభావన నిండుతుంది.
మానవ
సేవ మాధవసేవగా చెప్పబడింది. ఆ భగవంతుడు విరాట్ స్వరూపుడు. అందుకే గురుసేవ, మానవ సేవ
కూడ అర్చనలో భాగమే. అర్చన చేసేటప్పుడు భక్తుని యొక్క మనస్సు ఆ భగవంతుని రూపమును గుణగణాలను
మరియు ఆ శక్తి యొక్క అనంతతత్వాన్ని గుర్తు చేసుకోవాలి.
6)
వందనము: మన శరీర ఉనికిని మార్చి పూర్తిగా భగవంతుని ముందు మోకరిల్లటమే వందనము. సాష్టాంగ నమస్కారం చేయడం వందనమే. భగవంతునికి మిక్కిలి శ్రద్ధతో, ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఆ దేవుడ్ని
అన్నింటిలో చూస్తూ, భక్తి భావనతో అన్ని శరీర అంగములను అర్పించి నమస్కరించటమే వందనము.
7)
దాస్యము : దాస్య భక్తి అంటే, భగవంతుని పూర్తి సేవక భావనతో ప్రేమించటమే. ఆయన యొక్క భావనలను
(అంటే మన శాస్త్రాలను) గౌరవించి, ఆ వేద వాక్కులను
తప్పకుండా సేవా భావముతో పాటించడం చాలా ముఖ్యము. ఒక యజమాని గురించి నిజమైన సేవకుడు ఎట్లా
ఆలోచిస్తాడు, ఆ యజమానికి సేవకుడు కావల్సినవన్ని చేయడం మనం చూస్తాము. మనము పల్లకి సేవ
చేయడం, మన దేవాలయములు, పూజా మందిరములను శుభ్రం చేయడం, ఇట్లా ఏ రకమైన సేవ చేసినా ఈ దాస్యభక్తి
కిందకు వస్తుంది.
8)
సఖ్య భక్తి: భగవంతుని పట్ల సఖ్యభావనతో ఉండటమే సఖ్యభక్తి. మనకు బాగా ఇష్టమైన స్నేహితులకు
మనము ఏమైన చేస్తాము. మనము మన పనులన్నీ ప్రక్కన పెట్టి మన పాత స్నేహితులకు ప్రాముఖ్యత
ఇస్తాము. ఇదే భావన కనుక మనము భగవంతుని పట్ల పెంపొందించుకోగల్గితే మన జన్మ సార్ధకం అవుతుంది.
9)
ఆత్మ నివేదన : తనువును, మనస్సును, ఆత్మను పూర్తిగా సమర్పించటమే ఆత్మనివేదన. ఇంక మనదంటూ ఏమీ ఉండదు. అంతా భగవంతునిదే. ఆయన దయ, కృప మరియు కరుణయే సర్వస్వము. మనము భగవంతునిలో
భాగమైపోతాము. ఆ భగవంతుని లీలే ఈ ప్రపంచము. ఇక ఈ ప్రపంచములో శత్రువులే లేరు. కష్టమేలేదు.
భక్తుడే భక్తియై పోతాడు. అతని కర్మలన్నీ నశిస్తాయి. ప్రపంచ భావన నశించి పరమాత్మ భావన
మాత్రమే మిగిలిపోతుంది. మనిషి మహాత్ముడౌతాడు. ఇది మనకి కష్టం అనుకోవచ్చు. కాని ఒక ఉదాహరణ
మనము ఇక్కడ చెప్పుకుందాము. ఈ భావన ప్రతి మనిషికి సర్వసిద్దముగా ఉంటుంది. కాని మనము
ఆచరించము. ఒక వ్యక్తి పట్టుదలతో ఒక వ్యాపారం చేస్తాడు. దాన్ని రాత్రింపగళ్ళు తన మనసులో
నింపుకుంటాడు. చివరికి అదే తన గుర్తింపు, స్వభావము అవుతుంది. తన పేరే ఆ బిజినెస్‌గా
గుర్తించబడుతుంది. అట్లానే మనకు శ్రద్ధ ఉండి, సబూరితో అంటే ఓర్పుతో వ్యవహరిస్తే ఈ నవవిధ
భక్తుల ద్వారా భగవంతుడ్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. మనసాయి మనలందరిని ఈ బాటలో
నడిపించాలని కోరుకుందాము.
|| ఓం సాయిరాం ||
No comments:
Post a Comment