Play Audio |
మానవుడు తరించడానికి ఎన్నో మార్గాలు ఉండవచ్చు. ఈ మానవ జీవితం ఎన్నో లక్షల
జన్మల తరువాత మనకు సంప్రాప్తించ వచ్చని మన శాస్త్రాలు చెప్తాయి. ఈ వచ్చిన జీవితాన్ని
సార్ధకం చేసుకోమని ఎందరో మహానుభావులు బోధించారు. పరమాత్మే గురువుగా వచ్చిన సందర్భాలు
ఎన్నో ఉన్నాయి. అటువంటి మహానుభావుల చరిత్రలు చదవడం అనేది ఒక తేలికైన మార్గం. వీరి గురించి
తెలుసుకుని ఆ గ్రంథాలు పారాయణం చేయడం ముక్తికి సోపానం. సాయి పరమాత్ముని చరిత్ర ఎందరి
జీవితాలలోనో మార్పులు తీసుకువచ్చి వారిని ముక్తి మార్గంలో నడిపించడం జరిగింది. అటువంటి
చరిత్రను రాయడానికి సాయినాధుడు స్వయంగా హేమడ్‌పంత్‌ని ఎన్నుకోవడం అనేది ఆయన పూర్వ జన్మల
పుణ్యఫలం. మనకు ఒకసారి పారాయణం చేస్తేనే ఫలితం వ్యక్తమవుతుంటే, హేమద్‌పంత్ గారు సాయి
సచ్చరితను అందరికి అందించడం వలన ఆయనకు తప్పక బాబా సద్గతిని ప్రసాధించి ఉంటారు.
సచ్చరితలాంటి ఉత్తమ గ్రంథాలను పారాయణం చేయడమే కాకుండా దాన్ని ఇతరులకు సాయి ప్రసాదంగా పంచగలిగితే
ఎంత అదృష్టమో మనం వేరే చెప్పనక్కరలేదు. మనం ఎంతో ధనాన్ని మన కోసం, మన కుటుంబం కోసం
ఖర్చు పెట్టుకుంటాము. కాని ఇటువంటి మంచిపనులకు మన ధనాన్ని ఉపయోగించగలగడం కూడా అదృష్టమే.
మనం కావ్యాలు, గ్రంథాలు రాయలేకపోవచ్చు, కాని వాటిని మనం పారాయణం చేయవచ్చు. అలాగే వాటిని
వేరే ఎవరికైనా బహుకరించవచ్చు. ఇటువంటి కోవకే చెందిన ఈ సాయి సచ్చరితను మనకిచ్చిన ఆ మహానుభావుని
గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
జననం, కుటుంబ వివరాలు,
ఉధ్యోగ వివరాలు
హేమద్‌పంత్ గారి అసలు పేరు అన్నాసాహేబ్ దాబోల్కర్. ఆయన 1859 లో పేద ఆర్యగౌడ
కుటుంబంలో జన్మించారు. ఆయన ధానా జిల్లాలో ఒక గ్రామంలో జన్మించారు. ఆయన తాత, తండ్రి ఇంకా
ఇతర తరాలవారు ఆచార సంపన్నులు. మిక్కిలి దైవభక్తి గల కుటుంబం. ఆయన ప్రాథమిక విద్య వారి
గ్రామంలోనే అయ్యింది. తరువాత పూనాలో 5వ తరగతి వరకు చదివి ఇంగ్లీషు (ఆంగ్ల భాష) నేర్చుకున్నారు.
ఆయన ఆర్ధిక పరిస్థితి సరిగా లేక ఇక ఆ పైన చదువు చడవడం కష్టం అయింది. తరువాత బడిపంతులుగా
వాళ్ళ ఊరిలోనే ఉధ్యోగంలో చేరతారు. కాని ఆయనలో కష్టపడే మనస్థత్వం, పట్టుదల ఉండదంతో ఆయన
స్వంతంగా మరాఠి భాషలో, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాధించారు. ఆయన తెలివితేటలు చూసి ఆయనకు
గ్రామాధికారి ఉద్యోగం ఇస్తారు. తరువాత ఒక గుమస్తాగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి ఒక
మెజిట్రేట్‌గా రిటైర్ అవుతారు. ఇలా ఎంత మందికి సాధ్యపడుతుంది. ఉన్నత విద్య లేకుండా
ఉన్నత అధికారిగా ఎదగడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆయనకు ఒక కుమారుడు, 5 గురు కూతుళ్ళు
ఉన్నారు. అందరికి చక్కగా పెళ్ళిళ్ళు అయి సాయికృపతో సుఖ సంతోషాలతో ఉన్నట్టు చెప్తారు.
తొలిదర్శనానికి
అడ్డంకులు
మనలో కొంతమందికి రజో గుణము ఎక్కువ పాళ్ళలో ఉంటుంది. మనకి జీవితంలో పైకి
ఎదగాలి అనే పట్టుదల ఉంటుంది. అలానే మనము చేసే పనులలో కూడా, మన అహంకారము బయటపడుతూ ఉంటుంది.
నేను దీన్ని కష్టపడి చేసాను. నా చేతుల మీదగానే ఇది జరగాలి అన్న భావనలు స్పష్టంగా వ్యక్తమవుతాయి.
హేమద్‌పంత్ జీవితాన్ని చూస్తే ఆయన కేవలం 5వ తరగతి వరకు చదివినా కష్టపడి ఉన్నత అధికారి
పదవికి ఎదిగాడు. తనలో పాతుకు పోయిన ఆలోచనలే బాబా తొలి దర్శనానికి అడ్డుగా నిలిచాయి.
ఆయన పూర్వజన్మ పుణ్యం వల్ల నానా చందోర్కర్ మరియు ధీక్షిత్ ఆయనకు స్నేహితులు అయ్యారు.
నానా బాబా గురించి ఎన్నోసార్లు హేమద్‌పంత్‌కు చెప్పారు. ధీక్షిత్ కూడా బాబా యొక్క గొప్పతనాన్ని
చెప్పడం జరిగింది. కాని హేమద్‌పంత్‌లో ఏమి చలనం లేదు. బాబా పట్ల నమ్మకం రాలేదు. కాని
వాళ్ళు చెప్పడంతో షిర్డి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. అంతలో ఒక స్నేహితుడి కుమారుడు
జబ్బునపడ్డాడు. ఎంత వైద్యం చేయించినా ప్రయోజనం లేక చివరకు ఆ స్నేహితుడు తన గురువు
దగ్గరకు వెళ్తాడు. ఆ గురువు సమక్షంలో ఆయన కుమారుడు ప్రాణాలు వదులుతాడు. ఇదంతా చూసి
హేమద్‌పంత్ షిర్డి ప్రయాణాన్ని నిలిపివేస్తాడు. కొన్ని రోజుల తరువాత మరల వెళ్దామని
అనుకుంటే దీక్షిత్ కుమార్తె చనిపోతుంది. ఇది చూసి బాబా తన స్నేహితుడి కుమార్తెను రక్షించలేదని
గురువుల వల్ల ఏమి ఉపయోగం అని నిరుత్సాహ పడతాడు. ఈ విధంగా రెండోసారి కూడా షిర్డి వెళ్ళలేక
పోతాడు.
మనలో ఉన్న వాసనలు ఒక జన్మలోనివి కావు. ఎన్నోజన్మల నుండి మనల్ని వెంటాడి
వేదిస్తాయి. వాటికి మనం బానిసలు అవుతాము. మనము జీవితంలో ఖచ్చితంగా ఉన్నామని భావిస్తాము.
కాని ఈ భావాల వెనుక అహంకారం ఉంటుంది. ఇవి మనల్ని మోసంచేస్తాయి. మనం ఆదర్శంగా, ధర్మంగా
ఉన్నామని భావిస్తాము. కాని దీనిలో రజో గుణం మెండుగా ఉంటుంది. ఈ రజో గుణమే మన ప్రగతికి
అడ్డుపడుతుంది. గురుకృపకు దూరం చేస్తుంది. మనము సత్వ గుణంతో మసలుకొని గురువులకు శరణాగతి
చెయ్యనిదే వారి అనుగ్రహం మనకు లభించదు. ఒకవేళ వారు మనల్ని కరుణించినా మనము తప్పులు
చేస్తూనే ఉంటాము. కాని గురువు మాత్రము ఓపికగా మన వెంట ఉండి మనల్ని రక్షిస్తారు. కాని
మన మూర్ఖత్వంతో మన పయనానికి మనమే అడ్డుగా నిలబడతాం. హేమద్‌పంత్ సదాచార సంపన్నుడు. నిత్యము
భక్తితో దైవాన్ని పూజిస్తారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణం చేసారు. గురు చరిత్రను
కూడా చాలాసార్లు చదవారు కాని గురువుల పట్ల అవగాహన ఏర్పడలేదు.
ఇక మూడోసారి నానాచందోర్కర్ స్వయంగా హేమద్‌పంత్‌కు హిత బోధ చేసారు. ఒకసారి
నానా బొంబాయి వెళ్ళి కొంచెం సమయం ఉండడంతో హేమద్‌పంత్‌ని కలిసారు. ఆయన షిర్డి వెళ్ళడానికి
ఎందుకు సంశయిస్తున్నాడో తెలపమని ఒత్తిడి చేస్తాడు. అప్పుడు హేమద్, గురువు పట్ల తన ఆలోచనలు
వ్యక్తం చేస్తాడు. అప్పుడు నానా ఈ విధంగా చెప్తారు. నేను నీ లాగే దేన్ని గుడ్డిగా నమ్మేవాడిని
కాదు. కాని సాయి అందరిలాంటి వాడు కాదు. సాయి చేసిన లీలలు, మహిమలు నన్ను పూర్తిగా మార్చాయి.
ఆయన సమక్షంలో అమితమైన ఆనందం కలుగుతుంది. మన కర్మలు అడ్డుపడితే మనము మహాత్ముల దర్శనం
చేసుకోలేము. కాని నీవు తప్పకుండా బాబాని కలవాలి అని ప్రేరేపించారు. ఇది కూడా బాబా లీలే.
నానా ద్వారా హేమద్‌పంత్‌లో మార్పు తీసుకువచ్చారు.
తొలిదర్శనం
సత్సంగము కలగడం కూడా అదృష్టమే. దీనికి పూర్వజన్మ పుణ్యం కావాలి. హేమద్‌పంత్‌కి
నానా, ధీక్షిత్‌లతో పరిచయం కూడా అట్లాంటిదే. నానా చందోర్కర్ మాటలు హేమద్‌కి ఎంతో నచ్చాయి.
ఇక షిర్డి ప్రయాణము తప్పలేదు. బాబా పిలుపు వచ్చింది. బాబా పిలవకుండా మనము షిర్డికి
వెళ్ళలేము. బాబా తొలిదర్శనము చాలా విచిత్రంగా జరుగుతుంది. హేమద్‌పంత్ బొంబాయి నుండి
దాదర్‌కి వెళ్ళి అక్కడ నుండి మన్మాడ్ మెయిల్ ఎక్కవచ్చని బావించి దాదర్కు టిక్కెట్ తీసుకొనెను.
కాని దాదర్‌లో మన్మాడ్ మెయిల్ ఆగదని హేంద్‌పంత్‌కి తెలియదు. అప్పుడు ఒక ఫకీర్ వచ్చి ప్రయాణం
ఎక్కడకు అని ఆడిగి, నీవు దాదర్‌లో దిగకుండా బోరిబందరు వెళ్లమని అతడు సలహా ఇచ్చాడు.
ఈ సలహా పాటించడం వలన షిర్డికి వెళ్ళే అదృష్టం కలిగింది. ఇదే హేమద్‌కి తొలిదర్శనం. కాని
గురువు వేరువేరు రూపాలలో వచ్చినప్పుడు మనం కనుగొనలేము. మనలో గురువు సర్వవ్యాపి అన్న
భావన దృడంగా లేకపోతే ఇది సాధ్యపడదు.
హేమద్ తరువాత రోజు ఉదయం 9-10 గంటల మధ్య షిర్డి చేరతారు. అక్కడ బాపుసాహేబ్‌ధీక్షిత్
హేమద్ కోసం ఎదురు చూస్తున్నారు. అది 1910వ సంవత్సరం, అప్పుడు యాత్రికులు బస చేయడానికి సాథే వాడ మాత్రమే ఉన్నది. టాంగా దిగగానే బాబాను చూడవలెనన్న ఆరాటం పెరిగింది. ఇంతలో తాత్యాసాహేబ్
నూల్కర్ మసీదు నుండి వచ్చి బాబా వాడా చివర ఉన్నారు. త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి
అని చెప్పారు. వెంటనే హేమద్ పరుగున వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసారు.
ఈ దర్శనాన్ని గురించి హేంద్‌పంత్ ఈ విధంగా చెప్పారు.
నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. ప్రత్యక్షంగా సాయిబాబాను చూసి వారి దర్శనంతో నేను దన్యుణ్ణి అయ్యాను, నా నయనాలు సజలమయ్యాయి.
ఎన్నడూ కనీవినీ ఎరుగనట్టి మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పికలు హరించిపోయాయి.
ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణ స్పర్శ వారితో సంభాషణ ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. ఈ అనుభూతి నానా సాహేబ్ చెప్పిన దాని కంటె అధికంగా ఉంది , మాటల్లో వ్యక్త పరచలేనిది. ఇది అపరోక్షానుభూతి.
అప్పటి నుండి ఈ నూతన జీవితం, ఇటువంటి సత్సంగప్రాప్తి, అంగ ప్రత్యంగ
సుఖానుభూతి ఎవరి కారణంగా లభించాయో వారి ఉపకారానికి నేను నిరంతరం ఋణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్ధం
లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు మరియు బంధువులు. వారికంటే దగ్గరి బందువులు లేరని మనసులో
అనుకున్నాను. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువల్ల కేవలం చేతులు
జోడించి వారి పాదాలపైన నా శిరసును ఉంచుతున్నాను. సాయి దర్శన లాభంతో నా మనో సంశయం తొలగిపోయింది.
అంతేకాదు సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది. సాయి యొక్క ధర్శనంతో చిత్తవృత్తి
మారిపోయింది. అంతే కాదు పూర్వకర్మలు కూడా నశించబడతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది.
ఇది వారి దర్శనంలోని విశిష్టత. వారి కృపావలోకనంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది.
వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా
కాకి వంటి నేను సాయి చరణ స్పర్శ వల్ల మానస సరోవరంలో హంసనై పోయాను. సాయి మహాత్ములు సాధువులలో
శ్రేష్ఠులు, పరమ యోగి, పరమ హంస. పాపతాపాలను నశింపచేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు
వారి సమాగమంతో నేను అత్యంత పునీతుణ్ణి అయ్యాను. నా అనేక పూర్వజన్మల పుణ్యం వల్ల
ఈ సాయి మహరాజ్ కలిశారు. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకలసృష్టి సాయి మయమనిపిస్తుంది.
అని చాలా చక్కగా వర్ణించారు.
ఈ తొలిదర్శన అనుభూతిని ఎంతో చక్కగా హేమద్‌పంత్ మనకు అందించారు. ఇది కేవలం
సాయికృప ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మనలో కూడా ఇటువంటి అనుభూతి కలగాలి. ఈ అనుభూతి
బాబా తప్పకుండా ప్రసాదిస్తారు . కాని దానికి తగిన అర్హత మనము సంపాదించాలి.
ఆయన
మనలను అడిగిన ఈ అర్హత ఏమిటి?
శ్రద్ధ, సబూరి అనే రెండు విషయాలను అర్ధం చేసుకోవాలి. వాటిని మన జీవితంలోకి
ఆహ్వానించాలి. అవే మన జీవితం కావాలి. మనము బాబా మీద అమితమైన శ్రద్ధతో ఉండగలిగితే ఇటువంటి అనుభూతిని సాయి తప్పక ప్రసాదిస్తారు.
ఓం శ్రీ సాయి రాం !
No comments:
Post a Comment