In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, July 27, 2016

త్యజించి (సమర్పించి) అనుభవించు



మానవుడు జీవితంలో కష్టాలు, సుఖాలు అనుభవిస్తాడు. మనము సుఖాలు కావాలి అని అనుకోవడం సహజం. మనకు సుఖాలను కోరుకునే అవకాశం, అర్హత ఉండవచ్చు. కాని వాటిని సహించగల శక్తిని మాత్రము మనము సంపాదించవచ్చు. ఈ శక్తి బాబా చెప్పిన సబూరి అనే సద్గుణంలో ఒక అంశం. గురువు అనుగ్రహం కలిగినప్పుడు ఈ పూర్వకర్మల తీవ్రత తగ్గుతుంది. మనము వాటిని అనుభవించదగ్గ శక్తిని కూడా ప్రసాధిస్తారు. కాని బాబా ఇంకొక మెట్టు పైకి వెళ్ళి ఈ కర్మ బంధం నుంచి విముక్తి పొందె సులభమైన మార్గాన్ని చూపించారు. 

మనము విషయభోగాలకు బాగా అలవాటుపడిపోయాము. విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్దాన్ని సాధించలేడు. విషయాలను తన ఆధీనంలో ఉంచుకునే వారికి పరమార్ధం దాసోహం అంటుంది. యదాపంచావ తిష్ఠంతు అని మన శాస్రం చెప్తుంది. శబ్ద, స్పర్శ, రూప గంధాదులకు సంబందించిన విషయాలు ఎప్పుడు ఆధీనంలోకి వస్తాయో అప్పుడే యోగంలోని చరమ అంకమైన మరియు అంతర్ముఖమైన సమాధిస్థితి ప్రాప్తిస్తుంది. ఈ విషయాన్నే బాబా ఒక చిన్న హాస్య ఘటన ద్వారా హేమద్‌పంత్‌కి చూపించారు. ఇది మనందరి జీవితాలను మార్చగలిగిన సన్నివేశం.

ఒకసారి హేమద్‌పంత్ బాబాకి పాదసేవచేస్తూ ఉంటాడు. ఇంతలో శ్యామా హేమద్‌పంత్ కోటు మడతలో శనగగింజలు చూసి నవ్వడం ప్రారంభించెను. హేమద్‌పంత్‌కి ఆశ్చర్యం కలిగెను. ఆయన సంతకు వెళ్ళలేదు, మరి అవి ఏట్లా వచ్చెను అని ఆలోచనలో పడెను. అప్పుడు బాబా వీనికి ఒక్కడే తినే దుర్గుణం కలదు. ఈ నాడు సంతరోజు, శనగలు తింటూ ఇక్కడకు వచ్చాడు. వాని గురించి నాకు తెలియును. ఈ విషయంలో ఆశ్చర్యం ఏమి ఉన్నది అని బాబా పల్కెను.

అప్పుడు హేమద్‌పంత్, బాబా నేనెప్పుడు ఒంటరిగా తింటిని అయితే ఈ దుర్గుణం నాపై ఏల మోపెదవు.  నేను ఈనాటి వరకు షిర్డిలోని సంతను చూడను కూడా లేదు. మరి శనగ పప్పు తిన్నది ఎప్పుడు? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడు తినలేదు. అప్పుడు బాబా, దగ్గరుంటే వారికి ఇస్తావు, ఎవరూ లేకపోతే నువ్వైనా ఏమిచేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేనుగుర్తున్నానా? నేను నీవద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా? అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా భోదించారు.

ఈ కథలో ఉన్న నిజమైన అర్ధం గ్రహిస్తే మన జన్మ ధన్యమవుతుంది. మనము ఏ వస్తువునైన అనుభవించటానికి ముందు, తనని స్మరించమని బాబా చెప్తున్నారు. చాలా మందికి తినే ముందు దేవునికి అర్పించి తినే అలవాటు ఉండచ్చు. కాని మనము ఏ వస్తువైనా అనిభవించే ముందు దేవుని స్మరించుట అన్నది చాలా గొప్ప సాధన. అప్పుడు మనము అనుభవించాల్సిన వస్తువు మనము పొందవచ్చా లేదా అన్న సద్విచారము కలుగుతుంది.

అప్పుడు మన బుద్దిని వాడుకుంటాము. మనస్సుని ఇష్టము వచ్చిన రీతిలో కదలనివ్వము. ఇలా కామ, క్రోధ, లోభా మోహాలను భగవంతునికి అర్పించే అభ్యాసం మొదలు పెడితే మన దుర్గుణాలన్ని నశిస్తాయి. మన వ్యక్తిత్వం పరిశుద్ధం అవుతుంది. సద్గురువులపై శ్రద్ధ పెరుగుతుంది. వారిపై ప్రేమ భావం ప్రత్యేక స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు గురువు యొక్క కృప కల్గి దేహబుద్ది నశించి, చైతన్యమే మనము అని తెలుసుకుంటాము. గురువునకు, దేవునకు భేధం ఎవరు చూపెదరో వారు దైవము నెచ్చటా  చూడలేరు. కాబట్టి గురువే దైవముగా మనము భావించాలి.

ఈ విషయాలను బాబా మాటల్లో విందాము.

బుద్ది మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి.

ఇంద్రియ విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతంలో కూడా సంభవం కాదు.

ఈ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది.

దేనినైనా కోరాలని అనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపము వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, ధురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి.

కామం,  క్రోధం అభిమానం అనే ఈ మనో వృత్తులు  ఉదృతంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్ళించండి.

ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు. ఈ కామక్రోధ అభిమానాలనే విషతరంగాలను గోవిందుడు నశింపచేస్తాడు.

నిజానికి ఈ మనోవికారాలు కూడా నా స్వరూపంలోనే లయం అవుతాయి. లేదా నా రూపాన్నే పొందుతాయి. నా పాదాలయందే విశ్రమిస్తాయి. ఇలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మూలనమై మనో  వృత్తి శూన్యమవుతుంది.

గురువు ఎల్లప్పుడూ మన దగ్గరలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ది ఉన్న వారిని విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు ఇక భవ బంధం విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటమవుతారు. విషయాలను ఏ మాత్రం అనుభవించటానికి ఏమాత్రం కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, అది మనకు తగినదా లేదా అని ఆలోచిస్తాము. ఇలా ఈ కోరిక, ఆ కోరికల నుంచి కలిగే ఫలితం రెండూ వాటి ఉనికిని కోల్పోతాయి. ఈ నియమాలన్ని వేదాలలో ఉన్నాయని చెప్తారు. ఇలా ఆలోచించే వారు విచ్చలవిడిగా ప్రవర్తించరు. మనసుకు అలవాటు చేయగా చేయగా విషయ సుఖాల ఆలోచనలు తగ్గిపోతాయి. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది. శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహ బుద్ది అనే బంధనం విడిపోతుంది. ఈ శరీరం క్షణభంగురమైనా పరమపురుషార్ధాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాధించేది ఈ శరీరమే. ధర్మార్ధ, కామ, మోక్షాలనే పురుషార్ధాల పైన పంచమ పురుషార్ధం భక్తియోగం. గురుసేవలో కృతార్ధులైనవారికి ఈ మర్మాలు యధార్ధంగా అర్ధం అవుతాయి. వారికే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, మరియు పరమార్ధం ప్రాప్తిస్తాయి.

పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయవాసనలు నశిస్తాయి.

పంచవిషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు.

వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షించుతూ ఉంటే ప్రపంచ సుఖాలు ఆకలిదప్పులు హరించుకునిపోతాయి. ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది.

ఇలా ఈ శనగల కథ మనజీవితాలను మార్చగల గొప్ప సాధనం. ఇందులోని విషయాలు మనము అర్ధంచెసుకొని వాటిని మన నిజజీవితానికి అన్వయిస్తే మన జన్మ ధన్యమవుతుంది. ఇలా జరగాలని మనము మన సద్గురువైన శ్రీసాయిని ప్రార్ధించుదాము. ఆయన కృప మనవైపు  ఎప్పుడూ ఉండాలని (మాత్రమే) కోరుకుందాము.



ఓం శ్రీ సాయిరాం!

Wednesday, July 20, 2016

సాయి మానస పూజ




ఆత్మ స్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలలతో బహుచక్కగా కనిపిస్తుంది. అద్దంలో కనిపించేవన్ని వాస్తవానికి అద్దంలో ఉండవు. నిద్రలో కనిపించినవి మెలుకువ రాగానే నశించిపోతాయి. జాగ్రదావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. విశ్వం యొక్క స్పురణ, సత్తా మరియు ఆధిష్టానమైన, గుర్వాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ స్వరూపము సత్య స్వరూపము మరియు స్వప్రకాశకమైనది. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయమైన ఈ దృశ్యజగత్తు తత్వ జ్ఞానంతో  లయమై పోతుంది.

అందుకే మనము బాబాను ఇలా ప్రార్ధించాలి. 

బాబా నా బుద్ది ఆత్మ పరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయుము తండ్రి.

నేను అవివేకిని మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ దారి తప్పుతుంది. నాకు నీయందు దృడ విశ్వాసం ఉండేలా దీవించు.

నా అంతఃకరణం అద్దంలా  నిర్మలమై, అందు ఆత్మ జ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి.

సద్గురుసాయీ! శరీరమే, నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాల యందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి.

మా శరీర అభిమానాన్ని తీసుకోండి. మాకు సుఖ-దుఃఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇష్ఠానుసారం  మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖ-దుఃఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు దాని చింత వద్దు.

జయజయపూర్ణకామా! మాకు మీయందు ప్రేమ స్థిరపడుగాక, మంగళదామా! ఈ చంచలమైన మనస్సు మీపాదాలయందు విశ్రాంతిని తీసుకొనుగాక.

శంకరాచార్యులవారు శివ మానసపుజా స్తోత్రం ఈ జగతికి ప్రసాదంగా ఇచ్చారు. ఆయన ఈ మానసపూజను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. ఆయన ఆ స్తోత్రంలో ఇలా చెప్తారు.

ఆత్మత్వం గీరిజామతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

నా ఆత్మవు నీవే, పార్వతియే శక్తి. నా పంచప్రాణాలు నీ ఆధీనాలు, ఈ శరీరమే నీకు గృహం. నా ఇంద్రియ సుఖాలే నీ పూజలో ఉపయోగించే సాధనాలు. నా నిద్రే నా సమాధి స్థితి. నేను ఎక్కడ నడచిన చుట్టు నీవే ఉంటావు. నా వాక్కు ఉన్నది నిన్ను స్తుతించదానికే, నేనేమి చేసినా అది నీ పట్ల భక్తిని వ్యక్తపరచాలి దేవా! అని చక్కగా వర్ణిస్తారు. 

ఇలానే హేమద్‌పంత్ సాయి సచ్చరితలో సాయిమానసపూజను చక్కగా వ్యక్తపరిచారు.

సాయిదేవా! మాకు ప్రేరణ కలిగించేది మీరే. మావాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో సత్య సమాగం మాకు ఆగమనిగమాలు.

నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామవర్తనే మాకు కథా కీర్తన. అదే మా నిత్యానుష్టానం, అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాల మాకు వద్దు. పరమార్ధంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి?

ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను.
నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పుస్తాను.
మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను.

బాహ్యోపచారపూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంతుష్టుణ్ణి అవుతాను.
సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను.

శ్రద్ధ, భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసమనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి, మీ పాదాంగుష్టాల  యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను.

ప్రేమరత్నాలతో మిమ్ములను అలకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదిడుపు దిష్టి తీస్తాను.

నా పంచప్రాణాలను వింజూమరలుగా వీస్తాను.

మీ తాపనివారణ కొరకు తన్మయత్వమనే గొడుగు పట్టుతాను.

ఈ విధంగా గంధం, అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా! మా మంచికోసం మీకు స్వానందపూజ చేస్తాను.


నా మనోభీష్టాలు తీరడానికి ఎల్లప్పుడూ సాయి సమర్ధ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్ధం సాధిస్తాను.

నిష్ఠతో కృతార్థుడను అవుతాను. 


ఓం శ్రీ సాయి రామ్ !

Wednesday, July 13, 2016

గురువు పూర్ణము - గురు పూర్ణిమ



సత్ చిత్ ఆనందం అనే మూడు మిళితం అయి ఉన్న తత్వమే పరతత్వం. సద్వస్తువు ఉన్న చోట జ్ఞానానందాలు తప్పక ఉంటాయి. 

ధర్మ సంస్థాపనకొరకు , మరియు తాపత్రాయాలతో తపించి పోతున్న ఈ లోకాన్ని ఉద్దరించటానికి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మానవ రూపంలో గురువుగా అవతరిస్తారు. అటువంటి నిరాకార పరబ్రహ్మమే, శ్రీ సాయినాథుని రూపంలో సాకార పరబ్రహ్మగా అవతారం దాల్చింది.


ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో మోక్షానికి మూలం అయినది ధర్మము. ధర్మం ఆచరింప బడితే మోక్షం దానంతట అదే వస్తుంది. అందుకే ఏ మతమైన, 
 ఏ శాస్త్రమైన ఈ ధర్మాన్నే బోధించటం జరిగింది. కాని మానవులుగా దాన్ని మనం అర్ధం చేసుకునే విధంగా అర్ధం చేసుకుంటున్నామా, లేక మనకి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నామా! ఇలా ధర్మానికి పెడర్ధాలు తీస్తే, మనం మోక్షానికి దూరం అవుతాము. 

పరమగురువులు మనకు ఈ ధర్మాన్ని వారి వాక్కుల ద్వారా మనకు అందిస్తారు. వారి వాక్కులే మనకు మార్గనిర్దేశంగా నిలుస్తాయి. అలా సాయి నాధుని కృపతో వెలువడిన అధ్భుత జ్ఞాన ప్రవాహమే శ్రీ సాయి సచ్చరిత. ఈ జ్ఞాన వాణి మన జీవితాల్లో ఒక కొత్త వెలుగుని నింపుతుంది.
 ఇక ముందు కూడా ఇది వెలుగుని నింపుతూనే ఉంటుంది. 

శ్రీ సాయి సచ్చరిత ఎంతోమందిని ఎన్నో విధాలుగా కాపాడింది. వారిని సాయి భక్తులుగా మార్చింది. శ్రీ సాయి దివ్య చరితమనే అమృతాన్ని ఎన్నో లక్షలమంది ఆస్వాదిస్తున్నారు. వారి జీవితాలలో మార్పులను వారే స్వయంగా గమనిస్తున్నారు. మనిషి జీవితంలో మార్పు తీసుకురాలేని ఏ
 బోధకాని, ఏ శాస్త్రం గాని, ఏ ప్రవచనం గాని  సంపూర్ణం అవ్వదు. ఇది సంపూర్ణం అవ్వాలి అంటే దాని మీద నమ్మకం ఉండాలి. అలా నమ్మిన దాన్ని సభూరితో అనుసరించాలి. అప్పుడే దానికి సార్ధకత. అందుకే శ్రీ సాయి సచ్చరిత నమ్మకమనే పునాదితో మొదలపెట్టి మెల్లగా మన కర్మలకనుగుణంగా మనకు సభూరి నేర్పించి మనందరిని ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది.  

మన బాబా చేతల గురువు. అయన ఏది బోధించాలన్నా అనుభవ పూర్వకంగానే నేర్పిస్తారు. ఆయనను గట్టిగా పట్టుకుంటే మనకింక వేరే దారులు అవసరం లేదు.
 

సచ్చిదానంద పరబ్రహ్మ శ్రీ సాయి రూపంలో అవతరిస్తే,

శ్రీ సాయిపరమాత్మ తత్త్వం శ్రీ సాయి సచ్చరిత రూపంలో వెలిసింది.
 

సద్గురువులు తమ సమాధి అనంతరం కూడా తమ దివ్య వాణి రూపంలో అమరులు అయి ఉంటారు. అందుకే బాబా ఏకాదశ సూత్రాలలో ఇలా చెప్పారు.
 
ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
జీవన్ముక్తులు శరీరాన్ని వదిలితే వారికి విదేహ ముక్తి కలిగింది అని మన శాస్త్రాలు చెపుతాయి. ఆ పరబ్రహ్మమే సర్వము.   
నా సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.
బాబా సమాధి నుండియే సర్వకార్యములను చేసెదను అనటంలో అర్ధం ఏమిటి?
దేనికయితే మొదలు అంతం లేదో అదే పరమాత్మ. ఆ పరమాత్మగా ఉండటమే సమాధి. ఆ పరమాత్మే మనలను నడిపిస్తుంది.  
నా యందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
పరమాత్మ గురించి చింతన లేక పోతే, విషయాల్లో చిక్కుకు పోతాము. అందుకే బాబా ఇలా చెప్పారు.   

ఇంత ఖచ్చితంగా భరోసా ఇచ్చి, మనలను కాపాడగల్గిన పరమ గురువు మన సాయి. అందుకే అయన మనకు ప్రసాదించిన శ్రీ సాయి సచ్చరిత అనే గ్రంధరాజాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి.
 

ఇదే మన ధర్మం కావాలి.
 

ఈ ధర్మమే మన జీవితం కావాలి.
 

ఈ జీవితమే సాయి నాధునికి అంకింతం చెయ్యాలి.
 

ఈ అంకిత భావంలోనుంచి అపరంపారమైన భక్తి జనించాలి.
 

ఈ భక్తి అనే అమృతంతో సాయికి పూజ అభిషేకాలు జరగాలి.
 

అప్పుడు ప్రసాదంగా కేవలం సాయి కృపని మాత్రమే కోరుకోవాలి.
 

కేవలం గురు కృప మాత్రమే మానవునిలో ఉన్న మూడు ఆవరణలలో చివరిది అయిన అజ్ఞానమనే ఆవరణను తొలిగిస్తుంది. ఈ అజ్ఞానం వీడితే సాయిపరబ్రహ్మ స్వస్వరూపంగా వ్యక్తమవుతారు.
 

సదా స్వస్వరూపం  చిదానంద కందం 
జగత్సంభవ స్థాన సంహార హేతుం ! 
స్వభక్తెచ్చయా  మానుషం దర్శయన్తమ్ 

నమామి ఈశ్వరం  సద్గురుం సాయి నాధమ్  !!


 ఓం శ్రీ సాయి రామ్ !