మానవుడు జీవితంలో కష్టాలు, సుఖాలు అనుభవిస్తాడు.
మనము సుఖాలు కావాలి అని అనుకోవడం సహజం. మనకు సుఖాలను కోరుకునే అవకాశం, అర్హత ఉండవచ్చు.
కాని వాటిని సహించగల శక్తిని మాత్రము మనము సంపాదించవచ్చు. ఈ శక్తి బాబా చెప్పిన సబూరి
అనే సద్గుణంలో ఒక అంశం. గురువు అనుగ్రహం కలిగినప్పుడు ఈ పూర్వకర్మల తీవ్రత తగ్గుతుంది.
మనము వాటిని అనుభవించదగ్గ శక్తిని కూడా ప్రసాధిస్తారు. కాని బాబా ఇంకొక మెట్టు పైకి
వెళ్ళి ఈ కర్మ బంధం నుంచి విముక్తి పొందె సులభమైన మార్గాన్ని చూపించారు.
మనము విషయభోగాలకు బాగా అలవాటుపడిపోయాము.
విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్దాన్ని సాధించలేడు. విషయాలను తన ఆధీనంలో ఉంచుకునే వారికి
పరమార్ధం దాసోహం అంటుంది. యదాపంచావ తిష్ఠంతు అని మన శాస్రం చెప్తుంది. శబ్ద, స్పర్శ,
రూప గంధాదులకు సంబందించిన విషయాలు ఎప్పుడు ఆధీనంలోకి వస్తాయో అప్పుడే యోగంలోని చరమ అంకమైన
మరియు అంతర్ముఖమైన సమాధిస్థితి ప్రాప్తిస్తుంది. ఈ విషయాన్నే బాబా ఒక చిన్న హాస్య ఘటన
ద్వారా హేమద్‌పంత్‌కి చూపించారు. ఇది మనందరి జీవితాలను మార్చగలిగిన సన్నివేశం.
ఒకసారి హేమద్‌పంత్ బాబాకి పాదసేవచేస్తూ ఉంటాడు.
ఇంతలో శ్యామా హేమద్‌పంత్ కోటు మడతలో శనగగింజలు చూసి నవ్వడం ప్రారంభించెను. హేమద్‌పంత్‌కి
ఆశ్చర్యం కలిగెను. ఆయన సంతకు వెళ్ళలేదు, మరి అవి ఏట్లా వచ్చెను అని ఆలోచనలో పడెను.
అప్పుడు బాబా వీనికి ఒక్కడే తినే దుర్గుణం కలదు. ఈ నాడు సంతరోజు, శనగలు తింటూ ఇక్కడకు
వచ్చాడు. వాని గురించి నాకు తెలియును. ఈ విషయంలో ఆశ్చర్యం ఏమి ఉన్నది అని బాబా పల్కెను.
అప్పుడు హేమద్‌పంత్, బాబా నేనెప్పుడు ఒంటరిగా
తింటిని అయితే ఈ దుర్గుణం నాపై ఏల మోపెదవు. నేను ఈనాటి వరకు షిర్డిలోని సంతను చూడను
కూడా లేదు. మరి శనగ పప్పు తిన్నది ఎప్పుడు? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడు
తినలేదు. అప్పుడు బాబా, దగ్గరుంటే వారికి ఇస్తావు, ఎవరూ లేకపోతే నువ్వైనా ఏమిచేస్తావు?
నేను మాత్రం ఏం చేయగలను? నేనుగుర్తున్నానా? నేను నీవద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా?
అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా భోదించారు.
ఈ కథలో ఉన్న నిజమైన అర్ధం గ్రహిస్తే మన జన్మ
ధన్యమవుతుంది. మనము ఏ వస్తువునైన అనుభవించటానికి ముందు,
తనని స్మరించమని బాబా చెప్తున్నారు. చాలా మందికి తినే ముందు దేవునికి అర్పించి తినే
అలవాటు ఉండచ్చు. కాని మనము ఏ వస్తువైనా అనిభవించే ముందు దేవుని స్మరించుట అన్నది చాలా
గొప్ప సాధన. అప్పుడు మనము అనుభవించాల్సిన వస్తువు మనము పొందవచ్చా లేదా అన్న సద్విచారము
కలుగుతుంది.
అప్పుడు మన బుద్దిని వాడుకుంటాము. మనస్సుని
ఇష్టము వచ్చిన రీతిలో కదలనివ్వము. ఇలా కామ, క్రోధ, లోభా మోహాలను భగవంతునికి అర్పించే అభ్యాసం
మొదలు పెడితే మన దుర్గుణాలన్ని నశిస్తాయి. మన వ్యక్తిత్వం పరిశుద్ధం అవుతుంది. సద్గురువులపై
శ్రద్ధ పెరుగుతుంది. వారిపై ప్రేమ భావం ప్రత్యేక స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు గురువు
యొక్క కృప కల్గి దేహబుద్ది నశించి, చైతన్యమే మనము అని తెలుసుకుంటాము. గురువునకు, దేవునకు
భేధం ఎవరు చూపెదరో వారు దైవము నెచ్చటా చూడలేరు. కాబట్టి గురువే దైవముగా మనము భావించాలి.
ఈ విషయాలను బాబా మాటల్లో విందాము.
బుద్ది మొదలగు ఇంద్రియాలు విషయాలను
సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి.
ఇంద్రియ విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతంలో
కూడా సంభవం కాదు.
ఈ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి
సహజంగా తొలగిపోతుంది.
దేనినైనా కోరాలని అనిపిస్తే నా విషయాలనే
కోరుకోండి. కోపము వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, ధురభిమానాన్ని నాకు
సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి.
కామం, క్రోధం అభిమానం అనే ఈ మనో వృత్తులు ఉదృతంగా లేచినప్పుడు
వానిని నా వైపుకు మళ్ళించండి.
ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి
తొలగిస్తాడు. ఈ కామక్రోధ అభిమానాలనే విషతరంగాలను గోవిందుడు నశింపచేస్తాడు.
నిజానికి ఈ మనోవికారాలు కూడా నా స్వరూపంలోనే
లయం అవుతాయి. లేదా నా రూపాన్నే పొందుతాయి. నా పాదాలయందే విశ్రమిస్తాయి. ఇలా అభ్యాసం
చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మూలనమై మనో వృత్తి శూన్యమవుతుంది.
గురువు ఎల్లప్పుడూ మన దగ్గరలోనే ఉన్నారన్న
దృఢమైన బుద్ది ఉన్న వారిని విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు ఇక
భవ బంధం విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటమవుతారు. విషయాలను ఏ మాత్రం అనుభవించటానికి
ఏమాత్రం కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, అది మనకు తగినదా లేదా అని ఆలోచిస్తాము.
ఇలా ఈ కోరిక, ఆ కోరికల నుంచి కలిగే ఫలితం రెండూ వాటి ఉనికిని కోల్పోతాయి. ఈ నియమాలన్ని
వేదాలలో ఉన్నాయని చెప్తారు. ఇలా ఆలోచించే వారు విచ్చలవిడిగా ప్రవర్తించరు. మనసుకు అలవాటు
చేయగా చేయగా విషయ సుఖాల ఆలోచనలు తగ్గిపోతాయి. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది.
శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహ బుద్ది అనే బంధనం విడిపోతుంది. ఈ శరీరం క్షణభంగురమైనా
పరమపురుషార్ధాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని
ప్రసాధించేది ఈ శరీరమే. ధర్మార్ధ, కామ, మోక్షాలనే పురుషార్ధాల పైన పంచమ పురుషార్ధం
భక్తియోగం. గురుసేవలో కృతార్ధులైనవారికి ఈ మర్మాలు యధార్ధంగా అర్ధం అవుతాయి. వారికే
భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, మరియు పరమార్ధం ప్రాప్తిస్తాయి.
పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయవాసనలు నశిస్తాయి.
పంచవిషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా
సేవించరాదు.
వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షించుతూ ఉంటే ప్రపంచ సుఖాలు ఆకలిదప్పులు హరించుకునిపోతాయి. ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి
కలుగుతుంది.
ఇలా ఈ శనగల కథ మనజీవితాలను మార్చగల గొప్ప
సాధనం. ఇందులోని విషయాలు మనము అర్ధంచెసుకొని వాటిని మన నిజజీవితానికి అన్వయిస్తే మన
జన్మ ధన్యమవుతుంది. ఇలా జరగాలని మనము మన సద్గురువైన శ్రీసాయిని ప్రార్ధించుదాము. ఆయన
కృప మనవైపు ఎప్పుడూ ఉండాలని (మాత్రమే) కోరుకుందాము.
ఓం శ్రీ సాయిరాం!
No comments:
Post a Comment