భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం విషాదంతో ప్రారంభం అవుతుంది. మనం మాములుగా అనుభవించేది విషాదము, కానీ దాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలో తెలియచెప్పటమే ఈ అధ్యాయము యొక్క ముఖ్య ఉద్దేశము. చూడటానికి చాలా మామూలు కథ లాగా ఉంటుంది కానీ, లోతుగా పరిశీలిస్తే దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక తత్త్వం మనకు అర్ధం అవుతుంది. మన జీవితానికి మంచి పునాది వేసి మనలను మంచి బాటలో నడిపించడానికి ఉపయోగపడేట్లు చేసేదే ఈ అధ్యాయం.
ఈ అధ్యాయంలో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషములను గురించి చెప్పమని సంజయుడిని అడగడంతో ప్రారంభం అవుతుంది. తరువాత దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి సేనను గూర్చి మాట్లాడుతూ, యోధుల పేర్లను చెప్పును. అలానే అందరూ వారి వారి శంఖములను పూరించటంతో యుద్ధం ఆరంభము అయినదని గ్రహించిన అర్జునుఁడు తన రధాన్ని ఉభయసేనలమధ్యకు తీసుకు వెళ్ళమని శ్రీకృష్ణుని అర్ధిస్తాడు. అక్కడున్న తన వాళ్ళందరిని చూసి, వీళ్లందరినీ చంపుకొని అనుభవించే ఈ రాజ్యం ఎందుకు ? నన్ను పెంచిన నా పితామహులను, నాకు విద్య నేర్పించిన గురువుని చంపాలా ! అని తన వ్యాకులతను వ్యక్తపరుస్తాడు. యుద్ధం వల్ల జరిగే నష్టాలను చెప్తూ, నేను మరణించవలిసి వచ్చిననూ లేదా త్రిలోకాధిపత్యము వచ్చినను కాని, నేను నా స్వజనాన్ని, ఆచార్యులను చంపుటకు ఒప్పుకోను అని చెప్తాడు. ఇక చివరి శ్లోకాలలో అర్జునుడు ఆయుధాలన్నీ క్రింద పడేసి, రధం వెనుక చతికిలపడిపోయిన విషయం వివరించుచు సంజయుడు అధ్యాయమును ముగించెను.
అర్జునుడు గొప్ప వీరుడు. ఎన్నో యుద్ధాలు జయించి అజేయుడుగా నిలిచాడు. రాజసూయ యాగానికి ముందు రాజ్యాలన్నిటిని జయించి చాలా ధనాన్ని తన రాజ్యానికి చేర్చి ధనుంజయడు అనే నామాన్ని ఆర్జించాడు. దేవతలకు సహాయం అవసరం అయినప్పుడు చాలా మంది రాక్షసులను సంహరించాడు. స్వయానా పరమశివుడుతో తలపడ్డ గొప్ప పరాక్రమవంతుడు. ఇంత ధైర్యసాహసాలు కల అర్జునుడు ఇలా ఎందుకు డీలా పడిపోయాడు? తన వారందరితో యుద్ధం చేయాల్సి వచ్చేటప్పటికి తనలో ఈ వ్యాకులత మొదలయ్యింది. ఏ విషయమైనా మన దాకా వస్తే కానీ దాని యొక్క తీవ్రత మనకు అర్ధం కాదు. ఎవరో ఎక్కడో చనిపోతే, అయ్యో పాపం అని అనుకోని మన పనులలో మనం నిమగ్నమవుతాము. కాని అదే మన జీవితంలో మనమే ఈ అనుభవం ఎదుర్కోవాలి వస్తే తల్లక్రిందులైపోతాము. ఇక్కడ అర్జునిని పరిస్థితి కూడా ఇదే. ఇంతకు ముందు చాలా మందిని అర్జునుడు సంహరించాడు, తన వాళ్ళతో యుద్ధం చేస్తే, తనకు పాపమని, కుల నాశనం జరుగుతుంది అని బాధపడ్డాడు.
అర్జునిని విషాదము యోగం ఎలా అయింది. ఎందుకు అంటే తన బాధను సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుని వద్ద వ్యక్త పరిచాడు. మన బాధను ఒక పరిపూర్ణ జ్ఞానవంతుడైన గురువు దగ్గర చెప్పుకుంటే అదే విషాద యోగం అవుతుంది. శ్రీకృష్ణుని మించిన పరమ గురువు ఎవరు ఉంటారు. అందుకే ఈ విషాదంలోనుంచి ఒక జ్ఞానరాజం వెలువడింది. అలానే వాల్మీకిమహర్షికి కూడా విషాదంలోనుంచి ఒక అద్భుత కావ్యం వచ్చింది. ఒక క్రౌంచ పక్షి బాణం తగిలి తన ఎదురుగా చనిపోయిన తరువాత, దానితో ఉన్న జంట పక్షి కూడా ప్రాణాలు వదిలివేస్తుంది. అప్పుడు అయన నోట్లోనుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడింది.
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు. ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి.
. తన భావనలో వెల్లుబికిన విషాదంలోనుంచి వచ్చిన కావ్యమే శ్రీమద్రామాయణము. ఆ శ్లోకమే మొట్టమొదటి శ్లోకంగా చెప్పబడింది. అందుకే వాల్మీకి ఆదికవి అయ్యారు.
శ్రీ సాయి సత్చరిత కూడా ఒక రకమైన సంఘర్షణతోనే మొదలు పెట్టారు. బాబా కలరా జాడ్యాన్ని తరమడానికి తిరగలిలో గోధుమ పిండిని తీస్తారు. తిరుగలిలో ఉన్న రెండు రాళ్ళే జీవన సమరం. ఈ సమరంలో మనం నలిగిపోతూ ఉంటాము. దీనిలోనుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించము.
ఈ అధ్యాయము నుంచి మనము మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో నేర్చుకోవచ్చు. ఈ శ్లోకాలలో ఉన్న మానసిక సంఘర్షణ ఏమిటో తెలుసుకోవాలి. ఈ సంఘర్షణను ఒక యోగంగా ఎలా మార్చుకోవాలో కూడా నేర్చుకోవచ్చు.
.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment