In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Sunday, January 6, 2019

దైవం మానుష రూపేణ


గురువే పరమేశ్వరుడు అని, ఆయనే పరమాత్మ అని, సకల చరాచరాలలో ఉన్న చైతన్యం గురువే అని మన శాస్త్రాలు చెపుతున్నాయి. మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలి అంటే ఈ పంచకోశాలతో ఉన్న ఉపాధిని తొలిగిస్తే కానీ అది సాధ్య పడదు. ఈ శరీరం త్రిగుణాలను కలుపుకొని, పంచ భూతాలు, పంచకోశాలనే ఒరలతో నిర్మితమై ఉంటుంది. పంచకోశాలు అంటే - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ కోశాలు. కానీ ఈ శరీరానికి ఆత్మ అనే చైతన్యం ఆధారం. కరెంటు అనే విద్యుత్ శక్తి లేక పొతే బల్బ్ వెలగదు. ఈ చైతన్యం లేక పొతే శరీరం వ్యక్తం అవ్వదు.  

చైతన్యం ఉంటె అది శివమ్ అవుతుంది లేకపోతె అది శవం అవుతుంది. అలాంటి చైతన్యం గురించి తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. అప్పుడే మనం శివమ్ అవుతాము. లేకపోతె ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటాము. ఇలా ఈ చక్రంలో నుంచి మనలను రక్షించడానికి గురువు అవతరిస్తారు. ఈ విషయం గురు గీతలో ఇలా చెప్పారు. 

మనుష్య చర్మణా బద్ధ: సాక్షాత్పర శివస్స్వయమ్ !
గురురిత్యభిధామ్ గృహ్ణన్ గూఢ: పర్యటితి క్షితౌ !!

ఆ పరమేశ్వరుడే, ఆ పరమాత్మే స్వయంగా మనుష్య దేహంలోకి వచ్చి గురువునే నామరూపాలను స్వీకరించి, రహస్యంగా ఈ భూమి మీద తిరుగుతున్నారు అని గురు గీత చెపుతుంది. 


గురువు మన స్థాయిలోకి వచ్చి మనకు అర్ధం అయ్యే భాషలో మాట్లాడితే కానీ మనకు ఈ మార్గం బోధ పడదు. మనం ఒక ఆకారాన్ని మాత్రమే అర్ధం చేసుకోగలము. మనకు ప్రతిదీ పంచభూతాత్మకంగా ఉండాలి. కళ్ళతో చూస్తే కానీ నమ్మము. మనం విద్యుత్ ను చూడలేము కానీ మన బుద్దితో తెలుసుకుంటాము. అలానే పరమాత్మను జ్ఞానంతో తెలుసుకోవాలి. కేవలం తెలుసుకుంటేనే సరిపోదు, అనుభూతితో ఆ పరమాత్మే మనము అని తెలుసుకోవాలి. 

ఈ దారిలో చాలా పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే ఇది శాశ్వత ఆనందము. దీన్ని పొందాలి అంటే మనం మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడే ఈ ఆత్మ వ్యక్తం అవుతుంది. సరళ భాషలో చెప్పుకోవాలి అంటే, మనలో ఉన్న కామ క్రోధ మద మాత్స్యార్యాలనే శత్రువులను సంహరించాలి. సర్వము ఆ పరమాత్మే అనే భావం స్థిర పడాలి. అన్ని జీవులను, అందరిని ప్రేమ భావంతో చూడాలి. బాబా చెప్పిన సర్వ వ్యాపకత్వం ఇదే. 


శివ వదృశ్యతే  సాక్షాత్ శ్రీగురుః పుణ్య కర్మణామ్ !
నర వదృశ్యతే సైవ శ్రీగురుః పాప కర్మణామ్ !!

పుణ్యాత్ములకు శ్రీ గురువు సాక్షాత్తూ శివుడిగానే కనిపిస్తారు. ఆ గురువే పాపాత్ములకు మనిషిగా కనిపిస్తారు. అందుకే మనకు గురువుని గుర్తు పట్టడం చేతగాదు. మన పాపాలు నశించినప్పుడు మనకు అర్హత కలిగినప్పుడు శ్రీ గురువే మన ముందు ప్రత్యక్షం అవుతారు. 

సాయిని (గురువుని) మనిషిగా చూసే వారు పాపాత్ములు.

సాయిని దేవునిగా ఆరాధించే వారు పుణ్యాత్ములు.

సాయిని గురువుగా పొందిన వారు ధన్యాత్ములు. 


సాయి బంధువులారా !

మనం ఎంతో కొంత పుణ్యం చేసుకుంటేనే ఈ మానవ జన్మ వచ్చింది. 

మనం పుణ్యం చేసుకుంటేనే సాయి భక్తులం అయ్యాము. 

సాయి చూపిన దారిలో నడిస్తే మన మనస్సు శుద్ధి పడుతుంది. 

అప్పుడే సాయిలో ఉన్న గురు తత్వాన్ని మనం అర్ధం చేసుకోగలము. 

ఒక్క సారి సాయిని గురువుగా స్వీకరించామా ఇక మోక్షం ఖాయం. 


No comments:

Post a Comment