బాబా కొంత కాలం షిర్డీలో ఉండి అదృశ్యం అవుతారు. తరువాత కొంతకాలం ఆయన ఎక్కడఉన్నారో ఎవరికీ తెలియదు. ఔరంగాబాదు జిల్లాలోని ధూప్ అనే చిన్న గ్రామంలో చాంద్ పాటిల్ అనే భాగ్యశాలికి మొట్టమొదట కనిపిస్తారు. ఈ పాటిల్ తన గ్రామానికి అధికారి. చాంద్ పాటిల్ రెండునెలలుగా తప్పిపోయిన గుర్రాన్ని వెదుకుతూ ఉంటారు. గుర్రం జీను భుజాన వేసుకొని దిగాలుగా వెనుతిరిగి వెళ్తున్నప్పుడు ఒక మామిడి చెట్టు కింద బాబా కూర్చుని ఉంటారు. పాటిల్కు ఆ గుర్రం జాడ తెలిపి నిప్పు నీరు భూమిలో నుంచి తెప్పించి ఆశ్యర్య పరుస్తారు.
తరువాత బాబాను తన ఇంటికి ఆహ్వానించి తీసుకువెళతారు. ఈ సన్నివేశం గురించి మనం ఎన్నో సార్లు చదువుకున్నాము.
ఇక్కడ గుఱ్ఱం తప్పిపోవడం అంటే మన మనస్సు మన అధీనంలో లేకుండా పోయి మనం పరమాత్మకు దూరం అవడం. గురువు మన జీవితంలో ప్రవేశించితే వారు మనకు సరిఅయిన దారి చూపించితే మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవడం తేలిక అవుతుంది. ఇక్కడ గుడ్డను నీటితో తడపడం అంటే మనలో ఉన్న రజోతమో గుణాలను పోగొట్టడం. అలానే నిప్పుతో పొగాకు వెలిగించటం అంటే మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించడం. ఒక్క సారి ఈ జ్యోతి వెలిగితే ఇంక మనలో మార్పులు వస్తాయి. గురువుని హృదయ మందిరంలో పదిలంగా ప్రతిష్ట చేసుకోవాలి. అంటే మన ఇంటికి ఆహ్వానించాలి.
చాంద్ పాటిల్ భార్య మేనల్లుడి పెళ్లి కోసం బాబా పెళ్లిబృందంతో కలిసి షిర్డీ రెండోసారి వస్తారు. వారు ఖండోబా ఆలయం దగ్గర దిగగానే మహల్సాపతి "రండి సాయి" అని పిలుస్తారు. అప్పటి నుండి అందరు బాబాను సాయి సాయి అని పిలవడం మొదలు పెట్టారు. మహల్సాపతి గారు ఎప్పటినుండో గురువు కోసం తపించిపోతూ ఉంటారు. సాయి రావడంతో అయన జీవితంలోకి గురువు ప్రవేశించారు.
మనం కూడా మన జీవితంలోకి గురువు వచ్చి జ్ఞాన జ్యోతి వెలిగించాలని సదా కోరుకుందాము. బాబాను మన గుండెలో నింపుకొని, ఆయన చూపిన దారిలో నడుద్దాము.
ఓం శ్రీ సాయి గురవే నమః
No comments:
Post a Comment