భక్తులు ఒక సారి ద్వారకామాయికి మరమ్మత్తులు చేయాలి అని పనులు మొదలుపెడతారు. అప్పుడు బాబా తాత్యా తలపాగాను మంటలో వేసి ఆయన గొంతుని పట్టుకుంటారు. తరువాత ఆయనే ఒక నగిషీ చెక్కిన తలపాగాను తెప్పించి తాత్యా తలకు చుడతారు. మన అందరకు మంచి పనులు చేయాలని, దైవ కార్యాలలో పాల్గోవాలని మంచి సంకల్పం ఉంటుంది. కాని మనలోని పూర్వ వాసనలు అహంకారమై మన తలలోనే ఉంటాయి. ఇదే మనం చుట్టుకొనే తలపాగా. ఈ అహంకారమనే తలపాగా బాబా తీసి జ్ఞానమనే ధునిలో వేస్తె కాని మనలో ఉన్న అహంకారం పోదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే తాత్యా ప్రేమించినట్లు బాబాను ప్రేమించాలి, బాబాకు దగ్గర అవ్వాలి. ఆయన చెప్పిన మార్గంలో నడవాలి. అప్పుడే ఆయన మన తలపాగాను కూడా తీసి వేస్తారు.
మనలో ఉన్న ఈ అహంకారం పోగొట్టుకోవాలి అంటే మనం ఏమి చేయాలి? మనం బాబాకు ఎలా దగ్గర అవ్వాలో అన్న విషయాలు బాబా స్వయంగా చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. వాటిని మన జీవితంలో భాగంగా చేసుకుందాము. ఇవి అనుసరించడం కష్టం అని మనం అనుకోవచ్చు. ఒక లక్ష్యం పొందాలి అంటే సాధన కావాలి, వైరాగ్యం ఉండాలి.
నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందె భక్తిశ్రద్ధలతో మనస్సు నిలిపిన వారి యోగక్షేమములు నేను చూచెదను. కావున వీటికొరకు ప్రయాస పడవద్దు.
ప్రపంచములో కీర్తిప్రతిష్టలకోసం ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను బ్రమను వీడుము.
లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్య మూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి.
సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియవికారాలు భక్తివైపు మొగ్గాలి. ఇతర విషయాలపై ప్రీతిలేకుండా ఎల్లప్పుడూ మనసులో భజన జరగాలి.
మనస్సు నందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను భగవంతుని ఆరాధనకు నియమించుము. ఇతర విషయములపైకి మనసుని పోనివ్వకము.
మనసు అన్నిటిని మర్చిపోయేలా నామస్మరణ యందు లగ్నం చెయ్యాలి. అప్పుడు శరీరం, గృహం, ధనం అవేవి గుర్తు ఉండవు. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. చిత్తం పరమానందంతో ప్రశాంతతను పొందుతుంది.
ఇలా బాబా మనకు సాధనలో ఉపయోగపడే చాలా విషయాలు చెప్పారు. మనం ఆధ్యాత్మిక పధంలో ఎదగాలి అంటే ఇవి పాటించక తప్పదు. బాబా పై నాకు భక్తి ఉంది అంటే సరిపోదు. ఆయన చెప్పిన సూచనలను తప్పకుండా పాటించాలి. అప్పుడే మనము నిజమైన సాయి భక్తులుగా ఎదగగలుగుతాము. సాయికి నిజంగా దగ్గర అవ్వగలుగుతాము.
ఓం శ్రీ సాయిరాం!
No comments:
Post a Comment