In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, June 19, 2019

శరీరం - అద్దె ఇల్లు



మన జీవితం సగం నిద్రతోనే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. ఆలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. బాల్యంలో క్రీడలు, వయసులో సుఖభోగాలకై పరుగులు మరియు వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తులై పీడింపబడతారు. శరీర పోషణ మరియు మైథునం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే, ఈ జన్మకు పర్యవసానం ఇదే అయితే ఈ నర జన్మ వ్యర్థం అని మన శాస్త్రాలు చెప్తాయి. మనం ఎవరము, ఎక్కడినుండి వచ్చాము ? ఈ మానవ జన్మకు కారణం ఏమిటి ? అన్న రహస్యం అర్ధం చేసుకున్నవారు వివేకవంతులు. బాల్యం, యవ్వనం, వార్ధక్య అవస్థలు జనులందరికి ఉంటాయి.  కాని అవి ఎలా వచ్చి వెళ్ళిపోతాయో ఎవరు తెలుసుకోలేరు. కళ్ళకు కన్పించేది ఏదైనా నశించేదే. ఈ క్షణంలో ఉన్న శరీరం తరువాత ఉండదు. శరీరం మలమూత్రాలు, శ్లేష్మం చీము రక్తాలతో నిండి ఉంటుంది. దీనిని ప్రతీ క్షణం మృత్యువు వెంటాడుతు ఉంటుంది. ఇలాంటి ఈ శరీరమే మనకు పరమేశ్వర ప్రాప్తిని కూడా కలుగచేస్తుంది. క్షణభంగురమైన ఈ శరీరం పుణ్యం సంపాయించే భగవద్ ఆరాధన, శ్లోకాలు, భగవంతుని కథలు వినే సమయమే సార్ధకం అవుతుంది. పరమేశ్వరుని దయతో మనకు కావలసినవన్నీ వచ్చినా ఇంకా మనలో అశాంతే ఉంటుంది. శాశ్వతమైన పరమపదం పొందిన దాకా నిజమైన శాంతి దొరకదు. జీవించడానికి సరిపడా అన్న వస్త్రాలు, తగుమాత్రం ఆలన పాలన చేసి, జనన మరణాలను తప్పించుకోవడమే మానవ కర్తవ్యం. 

బాబా అందుకే ఈ శరీరాన్ని ఒక అద్దె ఇల్లులాగా చూసుకోమని చెప్పారు. ఇక్కడ ఉన్నంత వరకు దీనిని శుభ్రంగా ఉంచుకొని పరమార్ధం చేరుకోవడానికి తగినంతగా వాడుకొవాలి. మనం ఎన్నో జీవరాశులుగా జన్మలు తీసుకొన్న తరువాత కాని మనకు మానవ జన్మ రాలేదు అని శాస్త్రాలు చెప్తాయి. భగవంతుని పొందే అవకాశాన్ని ఈ జన్మలోనే దక్కించుకునే ప్రయత్నం చేయాలి. మరు జన్మకై ఎదురుచూడకూడదు. ఎందుకంటే మళ్ళా మానవ జన్మ ఎప్పుడు వస్తుందో? అందుకే శంకరాచార్యులవారు "జంతూనాం నరజన్మ దుర్లభం" అని చెప్పారు. మన కర్తవ్యం ఏమిటో చక్కగా అర్ధం చేసుకోవాలి. మనం జీవితం అనే అరణ్యంలో ఎంత పరుగులు తీసినా దైవాన్ని మరువకూడదు. పరమార్ధాన్ని బోధించే శాస్త్రాలను పారాయణ చేయాలి. సత్సంగం చేయాలి. గురువులను ఆశ్రయించాలి. శరీరం పట్ల అంతులేని వ్యామోహం వదలాలి. గురువుల పట్ల శ్రద్ధను పెంచుకోవాలి. ఈ జీవితం క్షణభంగురం. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు.  కాలుడు తనపని తాను చేసుకుంటూ పోతాడు. అప్పుడు నాకు ఒక్కరోజు ఎక్కువ ఉంటే బాగుండు అనే బేరసారాలు ఉండవు. ప్రతిక్షణం ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ సాధన జరుగుతూ ఉండాలి.

అబేధ జ్ఞానమే తత్త్వం. ఉపనిషత్తులలో ఉన్న బ్రహ్మజ్ఞానం ఇదే. పరమాత్మ ఉపాసన అన్నా ఇదే. భక్తులు భగవంతుడు అన్నా ఇదే. గురువు బ్రహ్మము వేరు కాదన్న అభేదజ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తితో మాయను దాటటం సులభం. యోగ్యులు శ్రద్ధ కలిగిన వివేకవంతులు జ్ఞాన వైరాగ్యాలను సంపాయించుకుంటారు. ఈ ఆత్మా తత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. సాయి మనకు గురువు. ముల్లుని ముల్లుతోనే తీసివేసినట్లు, అజ్ఞానమనే ముల్లును జ్ఞానమనే ముల్లుతోనే తీయాలి. నేను నాది అనేది పోయినదాకా జ్ఞానజ్యోతి తన ప్రకాశం వ్యక్తం చేయదు. సాయి చూపించిన దారిలో నడిస్తే ఈ జ్యోతి తొందరగా వెలుగుతుంది. 


ఓం శ్రీ సాయి రాం!

No comments:

Post a Comment