ప్రతిఒక్క భక్తుని హృదయం షిర్డి అని మనం చెప్పుకోవచ్చు. గురువు మన హృదయమనే షిర్డీలో ఉంటేనే ఆ షిర్డీకి ప్రాముఖ్యత. ఆయనను మన హృదయపీఠంలో ప్రతిష్టించుకుంటే మనలో తప్పకుండా మార్పులు వస్తాయి. గురు స్పర్శతో ఆ మార్పులు ఎలా సంభవిస్తాయి, మనం మన జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలో కూడా బాబా చెప్పారు.
బాబాకు మనం రోజు పూజ చేసుకుంటాము. ఆయన భక్తిలో చాలామంది పరవశం పొందుతారు. అలాంటి పరవశమే ఇప్పుడు మన అందరమూ పొంద ప్రయత్నిద్దాము. బాబా ఆరతి అయిన తరువాత ద్వారకామాయి అరుగు మీద కూర్చొని ఒక్కొక్కరికి నుదిటిన ఊది పెట్టి ఆశీర్వదించి పంపుతారు. ఒక్కసారి మనం కూడా ఆ అనుభూతిని పొందుదాము. ఇప్పుడే ఆరతి అయిపొయింది. మనమందరము ఒక వరుసలో బాబా ఆశీర్వదంకోసం తపిస్తూ ముందుకు నడుస్తున్నాము. బాబా దివ్యమంగళ రూపం మనకు కనిపిస్తుంది. ఆయన పొడవాటి తెల్లని కఫ్ని ధరించి ఉన్నారు. తలపై ఒక తెల్లటి గుడ్డను చుట్టి దాని అంచులు జడవలె మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవుమీదగా వెనుకకు వేలాడుతూ ఉంది. బాబా వెనక ద్వారకామాయిలో ఉన్న ధుని మంట కనపడుతుంది. ఆ ధుని వెలుతురు బాబా తల వెనక ఒక కాంతిపుంజంలాగా కనపడుతూ ఉంది. వెనుక గోడ దగ్గర ఉన్న గూడు, పూల మాలలతో ఉన్న నింబారు బాబా యొక్క నిర్గుణ స్వరూపాన్ని గుర్తుచేస్తుంది. ఇంతలోనే బాబా ఎదురుగా చేరుకున్నాము. ఆయన దగ్గరకు వెళ్ళగానే ఎదో తెలియని అనుభూతి. అలానే మనసులో నా తండ్రిని చూస్తున్నాను, ఆయన ఆశీర్వాదాన్ని పొందబోతున్నాను అనే ఉత్కంఠ. అంతలో బాబా కుడిచెయ్యి పైకి లేచింది. నా కళ్ళు మూతలు పడ్డాయి. ఊది నుదిటిపై పెట్టి బాబా తన చేతిని నా తలపై ఉంచారు. నా మనస్సు సంతోషంతో నిండిపోయి, కండ్లనిండా ప్రేమ పొంగిపోయింది. ఈ ఆనందానికి అవధులు లేవు. నా గురువు నా హృదయంలోనే ఉన్నారు అన్న భావన అధికం అయింది. నేను నీవు అన్న భావన ఈ స్పర్శతో నశించింది. సాయియే సర్వం అనిపించింది. అంతా సాయి మయం, ఎదో ఎప్పుడు లేని అనుభూతి.
సాయే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమ శివుడు. సాయే సర్వదేవతా స్వరూపము. సాయే నిర్గుణము. ఈ అనుభూతి ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అని మనసులో ఆరాటం. హేమద్పంత్ గారు గురు కర స్పర్శ ప్రభావం గురించి మనకు కళ్ళకు కట్టినట్లు చూపించి అందులో ఉన్న పరమార్ధాన్ని తెలిపారు. ఈ అనుభవం బ్రహ్మైక్య భావనతో సమానమైనదిగా చెప్పారు.
శ్రీ సాయి పరబ్రహ్మణే నమః !
No comments:
Post a Comment