ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాయి మన జీవితంలో ప్రవేశించారు. సాయి తన భక్తులను జాగ్రత్తగా కాపాడుతు ఆధ్యాత్మిక పధంలో నడిపిస్తారు. సాయి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటే చాలు మనం ఈ భవసాగరాన్ని దాటవచ్చు. సాయి భక్తులు ఎన్నడు నిరాశకు లోనవ్వరు. వారి జీవితంలో సుఖశాంతులికి కొదవ ఉండదు. సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పారు. ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతాము.
సాయి సమర్ధుని కృపతో దాసగణు మహారాజ్ సత్పురుషుల కథలను రచించి, ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందారు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేసారు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించారు. దాసగణు షిర్డీకి రావడానికి కారణం నానాచందోర్కర్. నానా వల్ల సాయి భక్తి నలుదిశలా వ్యాపించింది. ఒక సారి దాసగణు మహారాజ్ షిర్డీ గ్రామంలో హరికథా కీర్తన కోసమని శరీరంపై కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరారు. బాబా ఆశీర్వాదం కోసమని వస్తే బాబా ఇలా అంటారు. "వాహ్వా పెళ్ళికొడుకు లాగా అలంకరించుకుని, ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు. కీర్తన చెప్పడానికి ఇవన్నీ అవసరమా! వీనిని నా ఎదుట తీసివేయి అని చెప్తారు. అప్పటినుంచి దాసగణు మహారాజ్ ఒక్క పంచ కట్టుకొని చొక్కా లేకుండా, చేతిలో చిడతలు మరియు మేడలో మాల వేసుకొని హరికథ చెప్పేవారు. ఇదే ప్రసిద్ధమైన నారదీయ పద్దతి. బాబా ఈ నిరాడంబరతనే కోరుకునే వారు. ఇక్కడ మన ధ్యేయం అంతరంగ పరిశుద్ధత.
మీరెవరైనా ఎక్కడున్నా భక్తితో నా వైపు మళ్లితే ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవరాసులలో నేనే ఉన్నాను నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు.
దేవుడికి ఎంత చేసినా తక్కువే, కాని బాబా ఎందుకు నిరాడంబరతకు ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఆధ్యాత్మిక సాధనలో నిరాడంబరత అవసరం ఎంతో ఉంటుంది. లేక పొతే ఈ ఆడంబర పూజలే వాసనలై చివరికి మనలను వేధిస్తాయి. ఆత్మ సాక్షాత్కారానికి నేను, నాది అనే అహంకారమే అడ్డుగా నిలుస్తుంది.
ఓం శ్రీ సాయిరాం!