ఒక సారి ఠాణా జిల్లాలో కౌపీనేశ్వర దేవాలయంలో దాసగణు గారి హరికథా ఏర్పాటు చేశారు. అక్కడకు చోల్కర్ అనే ఒక సామాన్య ఉద్యోగి కూడా వచ్చాడు. ఆయన సాయి మహిమల గురించి విని పరవశం పొందుతారు. అక్కడకు వచ్చిన వారు కొంతమంది దాసగణు గారి కీర్తన విధానం కోసం వస్తే, మరికొంత మంది గానం కోసం లేదా నృత్యం కోసం వస్తారు. కాని చోల్కర్ మాత్రం సాయి లీలామృతంలో మునిగిపోయాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది.
అప్పుడు సాయిని ఈ విధంగా ప్రార్ధిస్తాడు.
"సాయి దయామయా! ఈ దీనుని అనుగ్రహించు, నాది పేద సంసారం. ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలి అంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి. నా జీవితం ఉద్యోగంపైనే ఆధారపడివుంది. మీ కృపతో ఇది నెరవేరితే మీ దర్శనం చేసుకొని మీకు పటిక బెల్లం సమర్పిస్తాను" అని వేడుకుంటాడు. అతని కోరిక నెరవేరి ఉద్యోగం నిలబడుతుంది. షిర్డి వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అందుకని తన ఖర్చులను తగ్గించుకొన్నాడు. ఆఖరికి చెక్కర లేకుండా టీ తాగడం కూడా అలవాటు చేసుకుంటాడు. ఇలా కొంత డబ్బు ఆదా చేసి షిర్డీకి వెళ్తాడు.
బాబాను దర్శించుకొని పటిక బెల్లం మరియు కొబ్బరికాయను సమర్పించి ఈ రోజు నా సకల కోరికలు తీరి నా జీవితం సఫలం అయ్యింది. చోల్కర్ జోగ్ ఇంట్లో అతిధిగా ఉంటారు. చోల్కర్ జోగ్ తో బయల్దెరపోతే బాబా జోగ్ తో ఇలా అంటారు. "ఇతనికి త్రాగటానికి కప్పులో చెక్కెర బాగా ఎక్కువగా వేసి టీ ఇవ్వు". జోగ్ కి వింతగా అనిపిస్తుంది కాని చోల్కర్కి మాత్రం ఆనందాశ్రువులు దొర్లుతుండగా బాబా కాళ్లపై తన శిరసు ఉంచాడు.
అప్పుడు బాబా " చోల్కర్ నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. నీ త్యాగనియమం కూడా పూర్తిఅయింది. మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. మీరెవరైనా ఎక్కడున్నా భక్తితో నా వైపు మళ్లితే ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవరాసులలో నేనే ఉన్నాను నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. ఇలా బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని స్థిరపరిచారు.
ఓం శ్రీ సాయి రామ్!