భగవానుడు 4వ అధ్యాయం ముగిస్తూ అర్జునిని తన హృదయమునందు ఉన్న అజ్ఞానాన్ని వివేక జ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి కర్మ యోగమునందు స్థితుడవు కమ్ము అని చెప్పి ముగించారు. ఇప్పుడు 5వ అధ్యాయంలో కర్మయోగము మరియు కర్మ సన్యాస యోగముల గురించి చెపుతూ అర్జునినికి కర్మయోగమే శ్రేయస్కరము అని బోధించారు. ఇక్కడ కర్మసన్యాస యోగము అంటే కర్మను త్యచించడం కాదు. కర్మసన్యాస యోగి అంటే సాంఖ్య యోగి అని అర్ధం. సాంఖ్యం అంటే ఇక్కడ అర్ధం జ్ఞాన మార్గము.
ఈ అధ్యాయంలో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి. భగవానుడు ఏ మార్గం ఎవరికి అనువుగా ఉంటుంది, మనకి కర్మ యోగము మంచిదా లేక కర్మ సన్యాస యోగానికి మనకు అర్హత ఉందా అనే విషయాలను చక్కగా ఉదహరించి మరీ చెప్పారు. మన మనో స్థితిని బట్టి మనం ఏక్కడ ఉన్నాము అనే విషయం అర్ధం చేసుకుని మన మార్గాన్ని తెలుసుకోవచ్చు. మనకు ముందుగా ఈ మార్గాలు ఎందుకు అనుసరించాలి అనే విషయం అర్ధం కావాలి.
చివరగా ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాము.
మనకు కర్మ యోగము మంచిదా లేక కర్మ సన్యాసం మంచిదా అన్న విషయం అర్ధం చేసుకోవాలి. మనందరం ఈ ప్రాపంచిక విషయాలలో సతమవుతూ ఉంటాము అందుకే కర్మ యోగమే అర్జునిని లాగా మనకు కూడా శ్రేయస్కరము.
ఇక్కడ కర్మ యోగము ద్వారా మనస్సు శుద్ధి పడితే అప్పుడు మనకు కర్మ సన్యాస యోగము చేసే అర్హత వస్తుంది అని అర్ధం చేసుకోవాలి. అందుకే భగవానుడు ఆ యోగి యొక్క లక్షణాలు మనకు చెప్పారు.
మనకు విషయభోగాలు ఎలా అడ్డుగా ఉంటాయో తెలుసుకోవాలి.
మనలో ఉన్న కామక్రోధాల వేగాన్ని ఎలా తట్టుకోవాలో అనే విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు.
కర్మ యోగము ద్వారా మన మనోస్థితిని ఉన్నతంగా తీర్చిదిద్దుకుని, భగవంతుడు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అర్హత ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది ఈ అధ్యాయం.