మన జీవితంలో ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. అలాగే అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన జీవితాన్ని ఐనా సరిగ్గా అనుభవించము. బాల్యం అంతా క్రీడలతో సరిపోతుంది. యుక్త వయసులో విషయ వాసనలు అలరింపచేస్తాయి. వృద్ధాభ్యంలో జరాగ్రస్తులు అయి ఎప్పుడూ వ్యాధులతో పీడింపబడుతూ ఉంటాము.
పుట్టడం, బాగా పుష్టిగా పెరగటం, గాలిని పీలుస్తూ వదులుతూ చాలా కాలం బ్రతకటం, వీనితో జన్మ సార్ధకం ఐనట్లా? మానవ జన్మ కర్తవ్యం పరమార్ధ ప్రాప్తి. ఇదే సత్యం.
పంచభూతాత్మకము అయిన ఈ నశ్వర శరీరం ద్వారా మాత్రమే మనము ఆ భగవంతుడిని తెలుసుకొగలము. జననమరణాలు ఎప్పుడూ వెంటే ఉంటాయి. వీటినితలుచుకుంటేనే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్లిపోతుంది. పగలురాత్రులు ఎంతమంది వస్తున్నారో మరిఎంతమంది వెళ్ళిపోతున్నారో ఎవరు గమనిస్తున్నారు?
క్షణభంగురం అయిన ఈ శరీరంలో, పుణ్యం సంపాదించి పెట్టే భగవంతుని గూర్చి తెలుసుకొనే సమయమే సార్ధకం అవుతుంది. మిగతాకాలం అంతా వ్యర్ధం. దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవటమే ఈ జన్మకు సార్ధకం. కాని ఎవరికైన అనుభవం లేకుండా విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడే శాశ్వతం అయిన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు.
కలియుగంలో నామస్మరణే మనలను పరమార్దానికి దగ్గర చేస్తుందని మన శాస్త్రాలు చెప్తాయి. అలానే సాయి నామము మనలను ఆ లక్ష్యానికి చేరువ చేస్తుంది. అందుకే హేమాద్పంత్ శ్రీ సాయిసత్చరితలో ఈ విధంగా తెలపడం జరిగింది.
సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకుపోకుండా, పెద్ద రాతి బండలు కొట్టుకోకుండా, నిరాటంకంగా సాగిపోవడానికి, అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను (లైట్ హౌసెస్) నిర్మిస్తారు. ఈ దీపపు స్తంభాలు ఆ నావలు ఓడ్డుకు చేరటానికి ఉపయోగపడ్తాయి. చీకటిలో వాటికి దారి చూపిస్తాయి.
సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా, దుస్తరం అయిన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి.
సాయి కథలు ధన్యం.
వారి కథలు శ్రవణం ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటకు నేట్టివేస్తాయి.
సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు.
సాయి కథలను హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలు దిక్కులా పారిపోతాయి.
బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకు పోతాయి.
సాయి చరిత్ర మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, అహంభావాన్ని నశించేటట్లు చేస్తుంది. అహం నశిస్తే ఆత్మసాక్షాత్కారం కల్గుతుంది
సాయి బంధువులారా!
మనం జీవనమనే సముద్రంలో సుడిగుండాలలో పడకుండా ఉండాలంటే సాయి మంత్రం అనే నావ కావాలి.
మనము సాయి అనే దీపస్తంభాన్ని ఆధారంగా చేసుకొని, పూర్తి శ్రద్ధా సబూరిలతో తీరాన్ని చేరుకుందాము.
సాయినాధులు చూపించిన గురు మార్గాన్నే ఎంచుకుందాము.
మరే దిక్కుకు వెళ్ళే ఆలోచనకూడా చేయద్దు.
ఆయనే మనలను రక్షిస్తూ గమ్యానికి చేరుస్తారు.
సాయిఫై పూర్తి నమ్మకం ఉంచుదాము.
ఓం శ్రీ సాయిరాం!
No comments:
Post a Comment