బాబా
బోధించిన సత్యాలను అర్ధం చేసుకుంటూ నానా చేతులు జోడించి బాబా! శుద్ధచైతన్యము అంటే ఏమిటి?
అది ఎలా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అని అడిగారు.
దానికి
బాబా ఈ విధముగా సమాధానం ఇచ్చారు.
నానా!
ఇది జగత్తుకు ఆధారమైనది, చరాచర సృష్టి అంతా వ్యాపించి ఇంకా ఏదైతే మిగిలి ఉన్నదో, ఎందులో
సర్వం చివరకు లయం అవుతుందో, అన్నింటికి మూలమైనదేదో అదే శుద్ధ చైతన్యము. కంటికి కనబడే
యీ జగత్తు రూపంలో ప్రకాశించేదంతా నారాయణుడే! ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే ఎలాంటి అంతరాయం
లేకుండా అందరిలో ఉన్నాను అనే అనుభవరూపంలో సాక్ష్యం ఇస్తున్నది. ఇది ప్రతిక్షణం అనుభవమవుతూ ఉన్నది.
ఆ చైతన్యం ఎక్కడ ఉంది అని అడిగావు. అది ఎక్కడ లేదో చెప్పు. ఎంత వెదికినా ఆ చైతన్యం లేని చోటే లేదు. కనబడేదంతా చైతన్యమే. అది నామరూప రహితమైనది. గాలి ఎలాగైతే రంగు మొదలైన గుణరూపాలకతీతమో, చైతన్యం కూడా అలాంటిదే. ఇది ఎప్పటికీ మరువవద్దు.
చైతన్యం
అంటే బ్రహ్మవేత్తలు, వృక్షకోటి, జీవకోటి, జంతుకోటి, ఇవన్నీ ఆ చైతన్యం యొక్క రూపాలే.
చూచేవాడు, చూడబడేవి, చూపు కనిపించడం, తెలుసుకోవడం, ప్రకాశించడం, వాటన్నింటికీ మూలకారణము
చైతన్యం.
ఈ
చైతన్యం సర్వవ్యాపి, దుఃఖరహితము, సత్యజ్ఞానానందరూపము. మీరందరూ ఆ చైతన్యానికి భిన్నంగా
లేరు. ఆ చైతన్య స్వరూపమే బ్రహ్మము.
అప్పుడు
నానా చేతులు జోడించి
బాబా! ఓ సద్గురు!
బ్రహ్మము సర్వ వ్యాపకము క్లేశరహితము, ఆనందరూపమని
మీరు చెప్తున్నారు మరి ఒక్కటి అయిన బ్రహ్మము ఇన్ని రూపాలకి ఎట్లా వర్తిస్తుంది. అన్నింట్లో
కూడా ఆనంద స్వరూపమైన ఈ చైతన్యము ఉన్నదన్నారు మరి ఈ జగత్తతంతా ఎందుకు దుఃఖపూరితమై ఉన్నది.
పుట్టుగుడ్డి సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించ గలడు? అలాగే శుద్ధచైతన్యము, మిధ్యయైన ఈ జగత్తులో
ఎలా ఇమిడి ఉండగలదు? ఆత్మచైతన్యం అంటే దాని ఏకత్వానికి నష్టం కలుగుతున్నది. ఎందుకంటే
ఆత్మలు అనేకాలు, కాని భిన్న శరీరాలు ఉన్నాయి కదా. నా ఈ సందేహాన్ని నివృత్తి చెయ్యవలసినది"
అని ప్రార్ధించాడు.
అప్పుడు
సాయినాధుడు 'ఓ నానా! నీవిక్కడే పొరబడుతున్నావు. శాంతచిత్తుడవై సావధానముగా వినుము.
తెలుపు, నలుపు, పసుపు, ఊదా, రాగి, కెంపు, ఆకుపచ్చ, నేరేడు మొదలగు రంగులు నీళ్ళలో వేరువేరుగా
కలిపి వివిధ ప్రాంతాలలో ఉంచితే వేర్వేరు రంగులలో కనబడతాయి. కాని వాటిలో ఉన్న నీరు మాత్రం
ఒక్కటే. రాగి రంగుతో కలిస్తే రాగిగా, పసుపు
రంగులో కలిస్తే పసుపు రంగుగా గోచరిస్తాయి. మిశ్రమ రంగులు కూడ నీళ్ళ నుండి విడగొడితే
అవి విడిపోతాయి గాని నీరు మాత్రము అలాగే ఉంటుంది. అలాగే ఆత్మ కాడా ఒక్కటే. హృదయాలు
అనేకం, హృదయం ఆత్మ కలిసి ఉన్నపుడే సుఖదుఃఖాలు కలుగుతాయి. ఇది తెలుసు కొనుము.
ఆత్మకు
భేదము లేదు. అది అందరకు ఒక్కటే. ఇది సత్యం. సుఖదుఃఖాలు కూడా ఖచ్చితంగా హృదయానికి సంబంధించిన
ధర్మాలు. ఆత్మ కలిస్తేనే హృదయానికి చైతన్యం కల్గుతుంది.
ఈ
చైతన్యం త్రిగుణాత్మకమైనది. ఈ మూడు గుణాలను పారమార్ధిక, వ్యవహారిక మరియు ప్రతిభాసికాలు అని చెప్తారు.
నారాయణా! దేహము ఒక్కటే అయినా, అది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనే మూడు అవస్థలను
ఎలా భరిస్తుందో, ఈ ఆత్మ కూడా అంతే.
పారమార్ధిక
చైతన్యము గల ఆత్మను సాధువులోనే దర్శించవచ్చు.
వ్యవహారికులు
: శాస్త్ర ప్రకారమున ఏది వదిలిపెట్టవచ్చు, ఏది వదలకూడదు అనే విచక్షణతో వ్యవహరించిన
వారు వ్యవహారికులు.
ప్రతిభాసకులు
: ఎవరు అసత్యమును సత్యమనుకుంటారో, ఎవరి బుద్ది అజ్ఞానముతో కప్పబడి ఉంటుందో వారిని ప్రతిభాసకులంటారు.
ప్రతిభాసకులు,
అజ్ఞానులు, వ్యవహారికులు, సజ్జనులు, పారమార్ధికులు, సంతులు అయినా అందరికి ఆధారము ఆత్మయే.
దీనికి ఉదాహరణ బాబా ఈవిధంగా చెప్పారు.
రాజు, అధికారి, రాజమాత. ఈముగ్గురికి ఆధారమైనవి
రాజ్యాంగా శాసనము. అయినా ఈ ముగ్గిరిలో తారతమ్యాలున్నాయి. రాజు
సింహాసనముపై కూర్చుంటాడు. ఏనుగు అంబారీపై విహరిస్తాడు. తన ఇష్టానుసారంగా సంచరిస్తూ
ఉంటాడు. రాజాజ్ఞననుసరించి అధికారులు మెలగుతారు. ఆ
రాజాజ్ఞను పాటించడమే సేవకుల పని? వాళ్ళ ఇష్టాలతో పనిలేదు. రాజ్యాంగ
శాసనపరిధిలోనే ప్రజలందరూ నడుస్తారు. రాజరికం, అధికారయంత్రాంగం, సేవకులు, ప్రజలందరూ
వేరైనప్పటికి అందరిని ఒకే త్రాటిపైన నడిపించేదే రాజ్యాంగ శాసనము. ఒక రాజు మరణించినా
రాజశాసనము చావలేదు. దాని వలననే రాజ్యాదికారము లభిస్తుంది. ఆ రాజశాసనాన్ని విక్రయించలేము.
కాని దాని వలన అన్నీ లభిస్తాయి. ఏ రాజశాసనం వల్ల రాజు గద్దెపై కూర్చుంటాడో దాని వలననే
సేవకులు వింజామరలు వీస్తుంటారు. రాజు ఆ శాసనాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఉంటే ఆ రాజ్యంలోని
అధికారులు కొంత శాసనాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. దాని కంటే తక్కువగా సేవకులు,
అంతకంటే తక్కువగా ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే
ఆత్మ బ్రహ్మములో కలిసి ఏకరూపమైన వారికి బ్రహ్మము పూర్తిగా లభిస్తుంది.
అప్పుడు
నానా ఇలా ప్రశించడం జరిగింది.
బాబా!
రాజశాసనము ఇన్ని భాగాలుగా ఎలా మారుతుంది. అట్లు విభజించడం వలన దాని నిరవయత్వమునకు భంగము
వాటిల్లుతుంది కదా?
అప్పుడు
బాబా,
నానా! రాజశాసనము ఖచ్చితంగా అభేధ్యమైనది.
కాని అది విభజించబడినట్లు కనబడుతూ వుంటుంది. అదే న్యాయము చైతన్యానికి కూడా వర్తిస్తుంది.
దానిని విడగొట్టలేము. కాని దాన్ని గ్రహించేవారు తనకు ఎంతకావాలో అంతే తీసుకుంటారు.
కుండ
చిన్నదైన, పెద్దదైన, అనేక రకములుగా వున్న వాటి నీటిలో ఆకాశము కనబడుతుంది. నదిలోని నీటిలో
కనబడే ఆకాశమే, కుండలోనూ వివిధ పరిమాణాలలో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశము విభజించబడలేదు
కదా. అలాగే ఆత్మ యొక్క స్థితి కూడా.
ఈ జగత్తంతా మాయ. ఈ మాయ మరియు బ్రహ్మము కలసి ఏకమై
ఈ బ్రహ్మండ రచన సాగింది.
|| ఓం శ్రీ సాయిరాం ||
No comments:
Post a Comment