In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, September 14, 2016

మంత్రమూలం గురోర్వాక్యం- గురు గీత



మన సనాతన సంప్రదాయంలో గురూపదేశంకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువులు వారి శిష్యులకు ఒక మంత్రాన్ని ఉపదేశించి వారిని ఉద్దరించిడం జరిగింది. అయితే ఈ మంత్ర జపమే మనలను మోక్షానికి అనగా ఆత్మసాక్షార దిశగా తీసుకువెళ్తుందా ?

అలా అయితే ఎంతోమంది ఈ మార్గంలో మోక్షాన్ని పొంది ఉండవలసి ఉంది. కానీ అలా జరగడం లేదు.

ఎందుకు అంటే!
మన మనసు అంతర్ముఖం కానిదే, మనలో మార్పు రానిదే, మనం కామ క్రోధాలను వదలకుండా ఎన్ని రోజులు మంత్ర జపం చేసినా, మనలో జ్ఞాన పుష్పము విచ్చుకోకుండా మనం ఈ మోక్షం అనే గమ్యాన్ని చేరుకోలేము.

మరి అయితే మంత్ర జపం మనకు ఎలా ఉపయోగపడుతుంది. మన మనస్సు శుద్ధి పడడానికి సహకరిస్తుంది. అలా శుద్ధి పడిన మనస్సులో గురువు అనుగ్రహం ద్వారా లభించే జ్ఞానం వికసిస్తుంది. అప్పడుమాత్రమే ఒక సాధకుడు ఆత్మసాక్షార దిశగా ప్రయాణించ గలుగుతాడు.

ఈ విషయమే గురు గీతలో పరమాత్మ మనకు బోధించడం జరిగింది.

ధ్యానమూలం గురోర్మూర్తి: పూజా మూలం గురో: పదం !
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో: కృపా !!

సర్వ దేవతలు గురువులోనే ఉంటే మన ధ్యానానికి గురు రూపం సరిపోదా!

మన పూజకు గురు పాదం కన్నా పూజ్యమైనది లేదు.

ఒక్క సారి మనకు గురువు సాకార రూపంలో దర్శనం ఇచ్చిన తర్వాత మనకు మంత్రాలతో పని లేదు. గురువు బోధలే మంత్రాలు కావాలి. గురు వాక్యమే మంత్రమని పరమశివుడు మనకు తెలియచేస్తున్నారు. గురు నామమే మంత్రం కావాలి.

కేవలం గురు కృపద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది అని గురు గీత గట్టిగా చెపుతుంది.

 చాలామంది సాయి భక్తులు ఈ విషయాన్ని నమ్ముతారు. గురువు యొక్క ప్రాధాన్యతను సాయి చాలా చక్కగా వివరిస్తారు. గురువుని మించిన సాధన ఇంకోటి లేదు అని బాబా ఎప్పుడు చెపుతారు. ఇదే విషయాన్ని బాబా మనకు రాధాబాయి దేశముఖ్ ద్వారా చెప్పారు. సాయి అనుగ్రహ మాలికలో మనం ఈ విధంగా చెప్పుకున్నాము. 

రాధా భాయి ఉపవాసం ! కావాలన్నది ఒక మంత్రం !
 బాబా చూపెను గురు మార్గం ! ఆమెకు కల్గెను మరిజ్ఞానం !!

ఈ సంఘటన గురించి మనం అందరం శ్రీ సాయి సత్చరితలో చదువుకున్నాము. 

సాఠే అనే ఒక పెద్దమనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు. మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఎవరో షిరిడికి వెళ్ళమని చెపితే వచ్చి బాబాను దర్శించాడు. గురు చరిత్ర పారాయణం చేశాడు. ఆ ఏడవ రోజు స్వప్నంలో బాబా గురుచరిత్రను వివరిస్తునట్లుగా చూశాడు. ఈ విషయం దీక్షిత్‌కు చెప్పగా అక్కడే ఉన్న హేమద్ మనసులో కలవరం మొదలయింది. ఈ సాఠే ఒక్కసారి పారాయణం చెయ్యగానే బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. కాని నేను 40 ఏళ్ళుగా చేస్తున్నా నాకు ఎన్నడు ఇటువంటి అదృష్టము కలగలేదు అని అనుకున్నాడు. ఇది పసిగట్టిన బాబా హేమద్‌ను 15 రూపాయల దక్షిణ తెమ్మని శ్యామా ఇంటికి పంపించారు. ఆ తరువాత శ్యామా చెప్పే మాటలను జాగ్రత్తగా వినమన్నారు. ఆ తరువాత కథ మనము చదివిందే. శ్యామా 15 నమస్కారాలు దక్షిణగా ఇచ్చి రాధాభాయి దేశ్‌ముఖ్ కథ చెప్పారు. ఈ సంఘటన ద్వారా బాబా హేమద్‌కి చాలా విషయాలు నేర్పించారు. అవి ఏమిటో మనము ఇప్పుడు పరిశీలిద్దాము.

                మొట్టమొదటగా హేమద్‌కు ఆ రోజు ఒక నియమ భంగం కలిగింది. ఆయన రోజు భాగవతం పారాయణం చేస్తారు. కాని ఆ రోజు బాబా గోష్టిలో పాల్గొనాలి అని పారాయణం చేయకుండా మశీదుకు వెళ్తారు. శ్యామా ఇంటిలో ఉన్న భాగవత పుస్తకంలో సరిగ్గా అదే పుటను చూపించి తను ఎక్కడైతే పారాయణం ఆపాడో అక్కడే మరల చదివిస్తారు. ఇదే బాబా మనకు బోదిస్తున్న విషయం. మనము చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. మన ఆలోచనలు మనల్ని బానిసలుగా మార్చుకోకూడదు. తరువాత రాధాభాయి కథను మసీదులో బాబాకు హేమద్ వినిపిస్తాడు. అప్పుడు సాయి హేమద్‌కు ఈ విధంగా బోధచేస్తారు.

                ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఈ సమ్యక్ విజ్ఞానం ధ్యానం ద్వారానే సంభవం. ధ్యానమే ఆత్మానుష్టానం. దీని ద్వారా మనలోని చిత్తవృత్తులు అన్ని సమాధాన పడ్తాయి.ముందుగా నువ్వు ఈ సర్వ ఈషణలు  నుండి ముక్తుడవు అవ్వాలి. (ఇక్కడ ఈషణలు అంటే మనకు జీవితంలో కలిగే కోరికలు, తపనలు, ప్రేమానురాగాలు). తర్వాత సర్వ భూతస్థ ఆత్మను ధ్యానించాలి. (అంటే నిరాకార ధ్యానం) అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇది కనక కష్టమైతే నా ఈ సగుణ రూపాన్ని ధ్యానించు. ఇలాచేస్తే నీ మనసు ఏకాగ్రమవుతుంది. నువ్వు బ్రహ్మంతో ఏకమవుతావు అని చక్కని బోధను బాబా హేమద్‌కు చేయడం జరిగింది. ఆ తరువాత బాబా వీటన్నింటిని చక్కగా శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా మహదానందాన్ని పొందవచ్చు అని చెప్పారు.

                సద్గురువులు మనకు ఎన్నోవిషయాలు చెప్పవచ్చు కాని అవి మన నిజజీవితంలోకి అన్వయించుకుంటేనే అవి మనకు ఉపయోగపడ్తాయి. ఇక్కడ రాధాభాయి కథ ద్వారా శ్రద్ధ, సబూరి అనే గొప్ప మంత్రాల్ని బాబా మనకు ఇచ్చారు. మనకు శాస్త్రాలు, ఉపనిషత్తులు బాగా తెలియవచ్చు. కాని నిజజీవితంలో మార్పులు రాకపోతే ఆ జ్ఞానం మనల్ని ముందుకు తీసుకువెళ్ళదు. ఇక్కడ హేమద్‌పంత్ యొక్క అంతర్ శత్రువులను బాబా వెలికి తీసుకువచ్చి ఒక్కొక్కటిగా పారద్రోలి, తను ముందు ముందు చేయించబోయే సత్కర్మలకు సిద్ధం చేసారు. అలానే బాబా మనలను కూడా ఈ దారిలో నడిపిస్తారు. 

సాయి బంధువులారా!
ధ్యానమూలం సాయి మూర్తి: పూజా మూలం సాయి పదం !
మంత్రమూలం సాయి వాక్యం  మోక్షమూలం సాయి కృపా !!

సాయి రూపాన్నే ధ్యానిద్దాము 
సాయి పాదాలనే పూజిద్దాము 
సాయి మాటలే మన మంత్రాలు
సాయి కృపే మనకు మోక్షము 

ఈ శ్లోకాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుందాము. 





శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కు జై !

No comments:

Post a Comment