In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, August 31, 2016

తస్మై శ్రీ గురవే నమః - గురు గీత


  


గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః !
గురు రేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః !!

మనం చిన్నప్పటినుంచి చదువుకున్న, మరియు అందరికి బాగా తెలిసిన శ్లోకం ఇది. ఈ శ్లోకం గురు గీతలోనిది. గురువే బ్రహ్మ, విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మము. అలాంటి శ్రీ గురువుకి నమస్కారము అని ఈ శ్లోకం చెపుతుంది. 

గురు గీత తస్మై శ్రీ గురవే నమః అని కొన్ని శ్లోకాలతో  గురువుకి మనం ఎందుకు నమస్కరించాలో చెప్పడం జరిగింది. 

సంసార వృక్షం ఎక్కి నరకమనే సముద్రంలో పడుతున్న లోకాలన్నిటినీ ఉద్ధరించే శ్రీ గురువుకి నమస్కారము. 

ఇక్కడ సంసారం అంటే ఏమిటి?
మనకు సంసారం అంటే ఈ శరీరమే. మనం చేసే పనులన్నీ ఈ శరీర భావనతోనే జరిగిపోతూ ఉంటాయి. అసలు సంసారం అంటే, మనం పుట్టడం, చనిపోవడం మరల పుట్టడం. ఇలా జన్మజన్మలలో ఈ సుఖ దుఃఖాలను అనుభవించడం. ఇలా అనుభవించడమే స్వర్గ నరకాలు. దీన్ని చెట్టుతో ఎందుకు పోల్చారు అంటే, దానికున్న కొమ్మలు, ఆకులు లాగా మన జీవితాలుకూడా అంతులేకుండ సాగి పోతూ ఉంటాయి. ఎన్ని ఆలోచనలు, ఎన్ని బంధాలు, ఎన్ని ఆశలు, ఎన్ని సుఖాలు మరియు ఎన్ని దుఃఖాలు. ఇలా అంతులేని సముద్రంలాగా లోతులో కూరుకుపోయి ఉంటాము. దీన్నుంచి మనలను రక్షించేది శ్రీ గురువు ఒక్కరే. అందుకే శ్రీ గురువుకి నమస్కారము అని గురు గీత బోధిస్తుంది. 

అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం !
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః !!

ఈ శ్లోకం కూడా గురుగీత లోనిదే. ఇక్కడ పరమశివుడు అతి ఉన్నతమైన జ్ఞానాన్ని బోధించారు. 
తత్వమసి అనే మహావాక్యంలో ఉన్న ఈ "తత్" అనే పరమాత్మ తత్వాన్ని చెపుతూ, అఖండమై, బ్రహ్మాండ మండలాకారమై సమస్త జీవులలోను వ్యాపించి ఉన్న పరబ్రహ్మను నాకు దర్శింప చేసిన శ్రీ గురువుకి నమస్కారము. 

షిర్డీ సాయి సర్వ జీవులలో ఉన్న ఈ పరమాత్మ తత్త్వం మనకు అనుభవంలోకి రావాలి అని, అయన అన్ని జీవుల రూపంలో ఉన్న తనను చూడమని చెప్పారు. అలాగే సాయి ఏ దేవత రూపంలో దర్శనమిచ్చినా ఈ భావాన్ని మనకు అర్ధం అయ్యేలాగా చెయ్యడానికే అని మనం తెలుసుకోవాలి. 

ఇంకా గురు గీత ఇలా చెపుతుంది. 

చైతన్యం శాశ్వతం శాంతం మాయాతీతం నిరంజనం !
నాదబిందు కలాతీతం తస్మై శ్రీ గురవే నమః !!

చైతన్యం అంటే పరమాత్మ. ఇది మొదలు చివరలు లేనిది. శాంతమైనది. మాయకు అతీతమైనది. అది నిరంజనము. నాద బిందు కళలకు అతీతమైనది. అట్టి చైతన్య స్వరూపుడు అయిన శ్రీ గురువుకి నమస్కారము. 

వేదములు ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాయి. వేదములను శ్రుతులు అని కూడా అంటారు. ఈ శృతి రత్నాల కాంతులు ఈ శ్రీ గురువు పాదాలపై పడి నీరాజనం ఇస్తూ ఉంటాయి అని గురు గీత చెపుతుంది. అంటే ఈ వేదాలు చెప్పే జ్ఞాన సిద్ధికి గురు శరణాగతి, మరియు గురువు అనుగ్రహం కన్నా మరో మార్గం లేదు. 

గురువు గారిలో ఉన్న పరమ ఆనందమే ఈ లోకంలోని కదిలే వస్తువులలో, కదలని వస్తువులలో ఉన్న చైతన్యంగా కన్పిస్తుంది. ఈ ఆనందాన్ని మన అనుభవంలోకి తెప్పించగల శ్రీ గురువుకి నమస్కారము. 

అందుకే సాయి గురు మార్గమే సరి అయిన దారిగా చెప్పారు. మనం ఎంత పూజలు చేసినా అవి అన్ని మన మనస్సు శుద్ధి పడడానికే. ఇవి మనకు ఈ ఆత్మసాక్షార అనుభవాన్ని ఇవ్వవు అని మన వేదాలు చెపుతున్నాయి. మనలను మనం తెలుసుకుని, మనమే ఈ చైతన్యమని అనుభవపూర్వకంగా గ్రహించినప్పుడు ఈ సత్యం మనకు బోధపడుతుంది. ఇందుకు గురు కృప ఏంతో అవసరం. వేరే ఎన్ని మార్గాలు ఉన్నా సాయి ఈ మార్గమే సులభమని చెప్పారు. 

జ్ఞాన శక్తి స్వరూపాయ కామితార్ద ప్రదాయినే !
భుక్తి ముక్తి  ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః !!

జ్ఞాన స్వరూపుడు, శక్తి స్వరూపుడు అయి కోరిన కోరికలన్నీ తీర్చే వాడు, భుక్తి ముక్తి దాత అయిన శ్రీ గురువుకి నమస్కారము. 

ఇక్కడ శ్రీ గురువు అంటే కేవలము మోక్షాన్ని ఇచ్చే వాడే కాదు, మన ఈ ధర్మ కర్మ మార్గంలో నడవడానికి అవసరం అయిన వాటిని మనకు ఇచ్చే వాడు అని. అందుకే బాబా మన సంసార పరమైన కోర్కెలు తీర్చి, వాటిలోని నిస్సారత్వాన్ని తెలియ చెప్పి మనలను ఈ ముక్తి మార్గంలో తీసుకువెళ్తారు. 

జ్ఞానమనే అగ్నిచే కోట్లాది జన్మలనుంచి వచ్చిన కర్మలను కాల్చివేసే శ్రీ గురువుకి నమస్కారము.  ఒక్క సారి గురువు మన జీవితంలో ప్రవేశిస్తే, ఇక మనకు కావాల్సిందల్లా ఆ గురువు పట్ల శ్రద్ధ. 

న గురో రధికం తత్త్వం న గురో రధికం తపః !
న గురో రధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః !!

గురువుని మించిన తత్త్వం లేదు. గురువుని మించిన తపస్సు లేదు. 
గురువుని మించిన జ్ఞానం లేదు. అట్టి శ్రీ గురువుకి నమస్కారము. 

గురువే అన్నిటికి ఆది. ఆయనే అనాది.
గురువే పరదేవత. అటువంటి సాటిలేని గురువుకి నమస్కారము. 

మనకు కష్టాలు వచ్చినప్పుడు నిజమైన బంధువు గురువు ఒక్కరే. ఆయన కరుణా సముద్రుడు. ఆయనకు ఇవ్వడమే కానీ ఆయన కోరికలకు అతీతుడు. 

మనము సాయిని గురువుగా ఆరాధించాలి. అప్పడు ఆయన మనలను ప్రతి జన్మలోను రక్షిస్తారు. మనం చిన్న చిన్న కోరికలకు లొంగి పోగూడదు. ఆయనతో శాశ్వత సంబంధాన్ని కోరుకోవాలి. 

గురు మధ్యే స్థితం విశ్వం  విశ్వమధ్యే స్థితో గురుః !
విశ్వరూపో విరూపోసౌ తస్మై శ్రీ గురవే నమః !!

ఈ ప్రపంచమంతా గురువులో ఉంది. విశ్వమంతటిలోను గురువు ఉన్నారు. ఆయన విశ్వరూపుడు. ఆయన రూపరహితుడు. అట్టి శ్రీ గురువుకి నమస్కారము. 

  
అందరిలో సాయిని చూద్దాము. 

అన్ని జీవులకు ప్రేమను పంచుదాం. 

సాయిఫై నమ్మకాన్ని పెంచుకుందాము. 

సహనం అనే రుద్రాక్షను ఎప్పుడు మెడలోనే ఉంచుకుందాము. 


అంతా (పరమ గురువైన) సాయి మయం.


  














No comments:

Post a Comment