భగవద్గీత రెండవ అధ్యాయములో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి. ఈ
అధ్యాయాన్ని సాంఖ్య యోగము అని కూడా అంటారు. ఇది మొత్తం భగవద్గీత యొక్క సారాంశంగా
పరిగణించ బడుతుంది.
ఈ అధ్యాయములో నేర్చుకోవాల్సిన అంశాలు.
ఆత్మ తత్త్వం అంటే ఏమిటి ?
ఆత్మ లక్షణాలు ఏమిటి?
స్వధర్మము అంటే ఏమిటి? ఈ ధర్మము ఆచరించక పొతే కలిగే నష్టాలు ఏమిటి?
సకామ, నిష్కామ కర్మలు అంటే ఏమిటి?
సమత్వ బుద్ధి అంటే ఏమిటి?
స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు?
ఇంద్రియాలను ఎలా నియత్రించుకోవాలి?
పరమశాంతి ఎలా లభిస్తుంది?
ఇలా చాలా వరకు ఈ అధ్యాయములోనే భగవానుడు భగవద్గీతలో చెప్పాల్సినవన్నీ
టూకీగా చెప్పడం జరిగింది.
రెండవ అధ్యాయములో 11వ శ్లోకంనుంచి నిజమైన బోధ మొదలవుతుంది. మనమందరము
ఒక్కోసారి జీవితంలో చాలా నిస్సహాయతతో ఉంటాము. జీవితం చాలా కష్టం అనిపిస్తుంది.
చాలా క్లిష్టమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటాము. ఇలాంటి సమయంలో మనకు ఒక మార్గదర్శి
కావాల్సి ఉంటుంది. వీరిద్వారా మాత్రమే మనము ఒక పరిష్కారాన్ని కనుగొనగలుగుతాము.
అలానే అర్జునుడు ఇక్కడ యుద్ధం చేయను అంటున్నాడు. మనం దీన్ని మనకు తగినట్లుగా
అన్వయించుకోవాలి. మనది జీవన సమరం. రోజు ప్రొద్దున లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకొనే
దాకా ఎన్నో సమస్యలు. వీటిల్లో మునిగిపోయి అలసిపోతాము. మన పెద్దలో, మన మంచి కోరే
వారో మనకు సహాయం చేస్తూనేవుంటారు. కానీ సమస్యలు రావడం ఆగదు. అందుకే వీటికి శాశ్వత
పరిష్కారం తెలుసుకోవాలి.
మనం సమస్యలు లేకుండా ఉండాలి అని కోరుకోకూడదు. ఎందుకు అంటే ఇది
ఎప్పటికి సాధ్యం కాదు. కాని ఈ సమస్యలు ఎక్కడనుంచి వస్తున్నాయో అర్ధం చేసుకోవాలి.
మనలను మనం అర్ధం చేసుకోవాలి. సమస్యలు వేరు వేరుగా ఉండచ్చు, కాని మన ప్రతిస్పందన
మాత్రం ఒకే లాగా ఉంటుంది. సమస్యనుంచి పారిపోవడం తేలికే, కాని అది తాత్కాలికమే. ఇలా
చేయడంవల్ల మన మానసిక స్థితి ఇంకా దెబ్బ తింటుంది.
మనుషులకు ఉండే అతి పెద్ద సమస్య
ఏమిటి? నేను, నాది అనే భావానికి ఎప్పడు దెబ్బ తగలకూడదు. నా శరీరానికి, నా వారికి
ఎటువంటి కష్టం కలుగకూడదు. కాని ఇది సాధ్యమేనా! శరీరమంటూ ఉంటే జబ్బులు రాకుండా
ఉండవు. పుట్టిన వారు ఈ శరీరాన్ని ఒక రోజు వదలక తప్పదు. మనసంటూ ఉంటే ఆలోచనలు
తప్పవు. అందుకే భగవానుడు భీష్ముని వయస్సు అప్పటికే 400 సంవత్సరాలు అని గుర్తు
చేస్తూ, అర్జునినికి సత్యాన్ని బోధించారు. సమస్యలు లేకుండా జీవితం లేదు. ఈ సమస్యలకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవడం ఎలానో ఈ అధ్యాయం
నేర్పిస్తుంది.
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై !