In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, January 18, 2017

భగవద్గీత 1 - సంఘర్షణ - మానసిక స్థితి





అర్జునుడు తన వారినందరిని చూసి శ్రీకృష్ణునునితో ఇంకా ఇలా అంటున్నాడు.

ఈ స్వజన సమూహాన్ని చూచి, నా అవయవములన్ని పట్టుతప్పుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి.

గాండీవము చేతినుండి జారి పోవుచున్నది. చర్మముకూడా తపించుచున్నది. మనస్సు భ్రమకు లోనవుతున్నది. నేనింక నిలబడలేక పోవుచున్నాను. అన్ని అపశకునములే కనబడుచున్నవి. ఈ యుద్ధంవల్ల ఏమి శ్రేయస్సు కనబడుటలేదు.

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ !
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా !!

ఓ కృష్ణా! నాకు విజయము కాని, రాజ్యం కాని, సుఖములు కాని అక్కర లేదు. ఈ జీవితం వల్ల కూడా ప్రయోజనం ఏమున్నది?

అర్జునుడుకి తన అన్న తమ్ములకు జరిగిన అన్యాయాలన్ని గుర్తు ఉన్నా, దుర్యోధనునికి రాజ్యం ఇచ్చేస్తే ప్రజలకు జరిగే నష్టాలన్నీ తెలిసి కూడా సంఘర్షణకు లోనయ్యాడు. శాంతి రాయభారాలన్నీ ఫలించనప్పుడు, ఇక యుద్ధం తప్ప వేరే దారి లేదనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను యుద్ధం చేయమని చెప్పాడు. కాని కేవలం మీకు అన్యాయం జరిగిందని యుద్ధం చేయవద్దు. అధర్మాన్ని ఎదిరించడానికి మాత్రమే యుద్ధం చేయండి. ప్రజలందరికి న్యాయం జరగాలి అని యుద్ధం చేయండి అని శ్రీకృష్ణుల వారు సలహా ఇవ్వడం జరిగింది.

మన సమస్యల్లో స్వార్థం ఉంటే సంఘర్షణ తప్పదు. మనం అనుకున్న విధంగా ఏది జరగక పోయినా సంఘర్షణే. సమస్యయొక్క తీవ్రతనిబట్టి మన సంఘర్షణ తీవ్రత కూడా మారుతుంది. మన మానసిక పరిస్థితి బాగా కృంగిపోయి అర్జునిని లాగా ఈ జీవితం వ్యర్థం అని అనిపిస్తుంది. అర్జునుడు తన వారినందరిని చంపి ఆ పాపం అంత నేను మూట కట్టుకోలేను అని అంటాడు. మనకు ఇష్టం లేనప్పుడు, కష్టమైనప్పుడు ఎక్కడ లేని కారణాలు చెపుతాము. ఒక పండితుడు లాగా జరిగే కష్ట నష్టాల గురించి చెప్పగలుగుతాము. 


కార్పణ్య దోషాపహాత స్వభావః పృచ్ఛామి త్వామ్ ధర్మసమ్మూఢచేతాః !
యత్ శ్రేయశ్చ నిశ్చితం బ్రూహి తన్మే శిష్య: అహం శాధి మాం త్వామ్ ప్రపన్నమ్!!

కార్పణ్య దోషమునకు లోనై నాస్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై, ఎటు తేల్చుకోలేక పోతున్నాను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమైనదో తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, నాకు ఉపదేశించుము అని అర్జునుడు శ్రీకృష్ణుని వేడుకున్నాడు. 

అర్జునుడు  ఇంత బాధ వ్యక్తం చేసినా, ఇంత సంఘర్షణ పడినా, చివరికి జీవించడం కూడా అనవసరం అన్నా కాని, శ్రీకృష్ణుల వారు ఏమి మాట్లాడ లేదు. ఇంకా వింటూనే ఉన్నారు. తను జగత్తులకే పరమ గురువు. అయినా ఎటువంటి బోధ చేయలేదు. ఇలా పూర్తి శరణాగతి చేసినదాకా శ్రీకృష్ణుల వారు మాట్లాడలేదు. 

మనం ఎవరు అడగక ముందే సలహాలు ఇస్తాము. మనకు తెలిసింది కొంచమే అయినా అందరితో చెప్పాలి అని ఉబలాట పడతాము. మనం ఎవరితోనైనా మన కష్టం చెప్పుకున్నా, మనం వాళ్ళ సలహా వినే స్థితిలో ఉంటామా! మనకు సరిపోయినట్లుగా చెప్తే కాని మనం వినము. దీనివల్ల ఎవరికి నష్టం! 

సంఘర్షణ అనేది మన జీవితంలో రోజు ఉండేదే. పిల్లలుగా ఉన్నప్పుడు పరీక్షలకు చదువుకోవాలి. కాని టీవీ ప్రోగ్రామ్స్ చూడాలి, కంప్యూటర్ గేమ్స్, ఐ -పాడ్స్, సెల్ ఫోన్స్, ఇలా  చాలా విషయాలు పిల్లలను వారి గమ్యంనుంచి దూరం చేస్తాయి. వారికి బాగా చదువుకోవాలి అని అనిపిస్తుంది కాని నిస్సహాయత. మనకు ఉపయోగపడే పనులు చాలా చేయాలి అని నిర్ణయించుకుంటాము, కాని పక్క దారులు పడతాము. ఒక్కోసారి బద్ధకం ఏర్పడి ఏమీ చేయము. అలానే భగవంతుని వైపు మన దృష్టి ఉంటే బాగుంటుంది అని మనకు తెలుసు. కాని బయటి విషయాలు మన మనస్సుని లాగేస్తాయి. మనకు అవసరం లేని విషయాలలో కలగచేసుకుంటాము. మనం ఏమి చేయాలో మనకు తెలుసు. కాని రోజూ సంఘర్షణే. మన బాధ ఎవరికి చెప్పుకోవాలి? 

 సరి అయిన గురువు దగ్గర, లేదా చెప్పగల అర్హత ఉన్న వారి దగ్గరే చెప్పుకోవాలి. అప్పుడే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మన వారికి కష్టం కలుగుతుంది అంటే, మనకు ఏంతో బాధ.  

మన మానసిక స్థితిని మనం అర్ధం చేసుకోవాలి. ఏ సమస్య అయినా తాత్కాలికమే. మన జీవిత విలువలలోనుంచే మనకు పరిష్కారం దొరుకుతుంది. మనం ఈ విలువలు మర్చిపోయినప్పుడు ఒక గురువు మనకు ఎదో ఒక రూపంలో గుర్తు చేస్తారు. మన చుట్టూ ఉండే ప్రపంచం ఇలా ఉండాలి అని మనం ఊహించుకుంటాము. కాని ప్రపంచం అంటేనే మార్పుతో కూడుకున్నది, ఎప్పడూ మారుతూనే ఉంటుంది. కాని మనం పాటించవలిసిన విలువలు మాత్రము మారవు. అప్పడు సంఘర్షణలో కూడా మన మానసిక స్థితి నిర్మలంగా ఉంటుంది. ఆ విలువలు ఏమిటో, మనము ఏది తెలుసుకుంటే సుఖంగా ఉండగలుగుతామో అదే భగవద్గీత. అదే శ్రీకృష్ణులవారు అర్జునినికి బోధించారు. ఇక నుంచి అదే మనం కూడా నేర్చుకుందాము. 


శ్రీ సాయికృష్ణ గురవే నమః  






No comments:

Post a Comment