In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, January 11, 2017

భగవద్గీత 1 - ప్రేమ - అనుబంధం - మోహం

  


భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాదయోగంగా చెప్పారు. ఈ విషాదం ఎక్కడనుంచి వస్తుంది. మనము రోజు చేసే పనులు చాలావరకు వాటంతట అవే జరిగిపోతూవుంటాయి. క్షణాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. కాని అన్ని రోజులు మనవి కావు, ఎక్కడో మనకు ప్రతికూలంగా ఉండేవి జరుగుతాయి. అక్కడే మనకు బాధ, దుఃఖం కలుగుతాయి. ఒక్కోసారి మనవారు అనుకొనే వాళ్ళతోనే సమస్యలు వస్తాయి. ఇవి నిజంగా సమస్యలేనా? లేక ప్రతికూల పరిస్థితులా!

మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటో ఇప్పడు చూద్దాము. 

జీవన సమరంలో ప్రేమ, అనుబంధం, మోహం అనే వాటికి అర్ధం తెలుసుకొని, అవి మనలను ఎలా భ్రమలో పడేస్తున్నాయో తెలుసుకోవాలి. 

ఈ అనుబంధం మోహము అవ్వడానికి కారణాలు ఏమిటి ?

ఈ అనుబంధము, మోహము ఎందుకు మనలను భయానికి, కోపానికి, మరియు దుఃఖానికి గురి చేస్తాయి?

మనం సమస్యల్లో ఉన్నప్పుడు, డీలా పడకుండా వాటిని సమయస్ఫూర్తితో ఎలా ఎదుర్కోవాలి?

ప్రేమ: ఇది స్వచ్ఛమైనది. దీనితో ఏ బాధ, దుఃఖం ఉండవు. ఎందుకంటే దీనిలో స్వార్ధం లేదు. ఎవరినుంచి ఏమి ఆశించదు. ఇది పంచేదే కాని, తీసుకొనేది కాదు. ప్రేమను ఇంకొకరినుంచి పొందవచ్చు కాని అది తరువాత ఉండదేమో అనే ఆలోచన ఉంటుంది. 

అనుబంధం: ఇది శరీర పరంగా కాని, మానసికంగా కాని ఏర్పడుతుంది. బిడ్డకు తల్లిగర్భంలో ఉండగానే అనుబంధం, తరువాత ఈ శరీరానికి సంబందించిన వారందరితో అనుబంధం. భార్య బిడ్డలతో అనుబంధం. మనకు ఇష్టమైన వాళ్ళతో అనుబంధం. ఇక్కడ కూడా చాలావరకు సమస్య ఉండదు. మన బాధ్యతలను ఎంత వరుకు నిర్వర్తించాలో అర్ధం చేసుకొంటే దుఃఖం అనేది మన జోలికి రాదు. వీటన్నిటిని మించి మనం మన శరీరంతో అనుబంధం ఏర్పరుచుకొంటాము. నేను అనే భావనను అన్ని అనుబంధాలకన్నా అతీతంగా ఉంచుతాము. నాకు కష్టం కలగనంతవరుకు ఎన్ని సమస్యలకైనా సమాధానం చెప్పగలము. నా వరకు వస్తే అప్పడు మొదలవుతుంది జీవన సమరం. 

మోహం: ఈ జీవన సమరంలో "నేను- నాది" అనే వాటి ఉనికికి ఎప్పుడైతే అడ్డు తగులుతుందో అప్పుడు నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. దీనిలోనుంచే కంగారు, కోపం, భయం, బాధ, ద్వేషం, పగ, నిస్సహాయత, న్యూనత ఇలా ఎన్నో భావాలు వ్యక్తం అవుతాయి. ఇవి ఏర్పడినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అన్నదాని మీద  మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే ఈ భావాలే వాసనలై మనలను జన్మ జన్మలకు వేధిస్తాయి. అందుకే అర్జునుడు భగవద్గీత అంతా చెప్పిన తర్వాత "నాకు మోహం తొలిగింది కృష్ణా, ఇక యుద్ధం చేస్తాను" అని చెప్పాడు. 


భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఇలా ఉంటుంది. 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువః !
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ !!

ఇక్కడ ధృతరాష్ట్రుడు మామకాః అనే పదాన్ని వాడాడు. అంటే నా వాళ్ళు, నా కుమారుడి తరుపున యుద్ధం చేసే వాళ్లు. పాండవులు కూడా తన వాళ్ళే కాని వారు తన తమ్ముడు కొడుకులు. శరీర పరంగా అందరితో అనుబంధం ఉంది కాని తన కొడుకుల పట్ల మోహం. ఆయనకు ధర్మం ఏమిటో తెలుసు కాని పుత్ర ప్రేమ అనే మోహం అడ్డుపడింది. యుద్ధంలో తన వారందరూ చనిపోయిన తరువాత తన శరీరంపై తనకు మోహం. అందుకే రాజ్య భోగాలను ఒక పట్టాన వదలివెళ్లలేక పోయాడు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది కేవలం నా వారి మీద ప్రేమ కాదు మనలను మోహంలో పడేసేది, నేను - నాది అన్న భావనే మనలను దుఃఖసాగరంలో ముంచేది. 

అర్జునుడు కూడా చాలామందిని ఇదివరకు సంహరించాడు కాని తనవాళ్లను చంపాల్సివచ్చేటప్పడికి, తనకు దుఃఖం కలిగింది. శ్రీకృష్ణులవారు కూడా యుద్ధం చేయడం నీ ధర్మం అని చెప్పి అర్జునినికి నచ్చచెప్పివుండచ్చు. కాని అది మాత్రమే చెపితే అతని మోహం తొలగదు. ఈ మోహానికి మూలమైన శరీర-చిత్త భ్రమ ఏదైతే ఉందొ దాన్ని తొలిగించాలి. అందుకే భగవద్గీత అంతా చెప్పాల్సి వచ్చింది. 

మన సమస్యలకు పరిష్కారం కావాలి అంటే మనమే మారాలి. మన చుట్టూ వుండే ప్రపంచం మారదు. మనం జీవితాన్ని సరైన కోణంలో చూడాలి. పరిస్థితులకు అనుగుణంగా మనమే మారాలి. సత్యంనుంచి దూరంగా వెళ్ళకూడదు. మనకంటే ముందు ఎంతో మంది పుట్టారు కాలంలో కలిసిపోయారు. మనం లేక పోయినా ఈ ప్రపంచం ఆగదు. 

 మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి?

జీవితంలో వచ్చే సమస్యలలో మన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని, ధర్మానుసారంగా మన పని మనం చేయడమే. ఎక్కడ నేను - నాది అన్న మోహం మనలను సందిగ్ధంలో ఎలా పడవేస్తుందో అర్ధం చేసుకోవాలి. అప్పుడే మనకు శాశ్వత సుఖం ప్రాప్తిస్తుంది. 




శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై !








  

No comments:

Post a Comment