In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Monday, October 15, 2018

సాయి మహాసమాధి - సూచన

 


గురు కృపా యోగం కలిగితే భవభయ దుఃఖాలు తొలిగిపోతాయి. ముక్తి మార్గ ద్వారాలు తెరుచుకొని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నిత్యం సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలను కలిగించే విఘ్నం తొలిగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మరిచిపోగలరు. అందరు తమ శ్రేయస్సు కొరకు సాయి సమర్ధుని చరిత్రను శ్రవణం చేస్తే శీఘ్రముగా అత్యంత పావనులవుతారు. ఈ అధ్యాయంలో హేమద్పంత్ గారు బాబా మహాసమాధి గురించి ప్రస్తావిస్తూ, రెండు సంవత్సరాల ముందు బాబా దీనికి సంబంధించిన ఆధారం ఎలా చెప్పారో అన్న విషయం చెప్పడం జరిగింది. అలానే లక్ష్మి బాయి గురించి చెప్పారు. 

బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్థ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిర్డీ ప్రజలు ధన్యులు. 1918 అక్టోబర్ 15, దక్షిణాయన ప్రధమ మాసంలో శుక్ల పక్షంలోని విజయదశమి రోజున బాబా శరీరాన్ని వదిలారు. ముసల్మానుల మొహరం నెలలోని తొమ్మిదవ తారీఖున కత్తల్ రాత్రి రోజున సుమారు మధ్యాన్నం రెండు గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్య తిథి. పన్నెండున్నర గంటలు గడిచి, దశమి కాలం పూర్తిగా దాటిపోయి ఏకాదశి వచ్చింది. కనుక సాయి యొక్క నిర్వాణ కాలం ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే, ఆ రోజు తిధి దశమి. అందువల్ల సాయి నిర్వాణం విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేశారు. ఇదే విషయం గురించి బాబా 1916 విజయదశమి రోజున సూచించారు. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటం చేశారు. ఉన్నట్లుండి తల రుమాలును, కఫినీని లంగోటిని కూడా విప్పేసి ధునిలో వేశారు. అసలే ధునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. తోడుగా అందులో ఆహుతిని వేసేసరికి, జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను భక్తులను కలవర పెట్టాయి. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఏం అర్ధ కాలేదు. సీమోల్లంఘన సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉన్నది. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజోవంతంగా కనిపించారు. భక్తులు కళ్ళు మూసుకొని పోగా ముఖాలను తిప్పేసుకున్నారు. దిగంబరులైన బాబా పరుశురాముని వలె ఉగ్రంగా అయ్యారు. బాబా కళ్ళు కోపంతో ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. "నేను హిందువునా ముస్లింనా ఇప్పుడు నిర్ణయించుకోండిరా. ఇది బాగా నిర్థారించుకోండి. మీ సందేహాలను తొలిగించుకోండి" అని గట్టిగా కేకలు వేశారు. ఈ దృశ్యాన్ని చూసి అందరు వణికి పోయారు. అప్పుడు భాగోజి షిండే ధైర్యాన్ని పుంజుకొని బాబా సమీపానికి వెళ్లి వారికి లంగోటిని చుట్టాడు. బాబా ఇవాళ దసరా పండుగ, సీమోల్లంఘన రోజున ఇదంతా ఏమిటి? అంటాడు. అప్పుడు బాబా "ఇదే నా సీమోల్లంఘన" అని చెప్పి సట్కాతో టపా టపా మని కొట్టారు. ఆ రోజున చావడి ఉత్సవం ఎలా జరుగుతుందా అని అందరికి చింత. ఊరేగింపు తొమ్మిది గంటలకు జరగాలి పది అయినా బాబా శాంతించలేదు. 11 గంటలకు బాబా శాంతించి కొత్త లంగోటిని మరియు కఫినీని ధరించారు. అప్పుడు చావడి ఉత్సవం మొదలయ్యింది. ఆ విధంగా బాబా సీమోల్లంఘన మిషతో భవసాగర సీమోల్లంఘనానికి దసరాయె మంచి ముహూర్తమని అందరికి సూచించారు. తమ శరీరమనే సుద్ధవస్త్రాన్ని ఇదే దసరా రోజున యోగాగ్నికి సమర్పించారు.
  

బాబా రామచంద్ర పాటిల్ ద్వారా ఇంకొక సూచన కూడా ఇచ్చారు. పాటిల్ ఒక సారి బాగా జబ్బు పడి రకరకాల చికిత్సలు చేయించినా జబ్బు తగ్గదు. తాను మృత్యువాత పడక తప్పదు అనుకున్న పరిస్థితిలో ఒక అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటం అయ్యారు. అప్పుడు పాటిల్ బాబా పాదాలు పట్టుకొని నిరాశతో "నాకు మరణం ఎప్పుడు వస్తుంది? నాకు నిశ్చయంగా చెప్పండి. నాకు జీవితం మీద అసహ్యం కలిగింది. మృత్యువు కష్టం అని అనిపించడం లేదు. చావు నన్ను ఎప్పుడు కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను". అని అన్నాడు. బాబా అప్పుడు నీకు మరణగండం లేదు కాని రామచంద్ర తాత్యా గురించే నా ఆలోచన. తాత్యా రాబోయే విజయదశమి రోజున ముక్తిని 

పొందుతాడు. ఈ విషయం అతనితో చెప్పవద్దు. ఇదే మనసులో పెట్టుకుంటాడు. చింతలో క్షీణించి పోతాడు. కేవలం రెండు సంవత్సరాలే మిగిలాయి, తాత్యాకు సమయం సమీపించింది. తట్టుకోలేక బాలా షింఫేకు ఈ విషయం చెప్పాడు. ఇద్దరు తాత్యా గురించి బాధపడసాగారు. ఈ లోపల అతని జబ్బు తగ్గి రోజులు గడిచి వారు అనుకున్న సమయం వచ్చేసింది. తాత్యాకు జబ్బు చేసింది. అక్కడ తాత్యా జ్వరంతో మంచం పడితే ఇక్కడ బాబా చలితో వణికి పోయారు. తాత్యాకు బాబాపై నమ్మకం. బాబా దర్శనానికి వెళ్లే ఓపికకూడా లేక మంచంమీదనే ఉండిపోయాడు. ఇక్కడ బాబా జబ్బు కూడా ఎక్కువ అవుతూఉంది. బాబా సూచించిన రోజు వచ్చింది. రామచంద్రకు బాలాకు భయం పట్టుకుంది. తాత్యా నాడి మెల్లగా తగ్గసాగింది. ఇక అందరు ఆశలు వదులుకున్నారు. కాని తాత్యాకు గండం తప్పింది. అదే విజయదశమి రోజు బాబా తన శరీరాన్ని వదిలివేశారు. తాత్యాకు ప్రాణదానం చేసి బాబా వెళ్లిపోయారు అని అందరు అనుకున్నారు. 

బాబా శరీరాన్ని వదిలిన తరువాత దాసగణుకు స్వప్నంలో కనిపించి ఇలా చెప్పారు " మసీదు కూలిపోయింది. షిర్డీలోని నూనె వ్యాపారులు నన్ను బాగా కష్టపెట్టారు. నేను ఇప్పుడు అక్కడినుండి వెళ్ళిపోతున్నాను. వెంటనే షిర్డీ వచ్చి నన్ను పూలతో కప్పు అని చెప్పారు. ఇంతలో షిరిడీనుంచి కూడా బాబా సమాధి చెందినట్లు వార్త వచ్చింది. ఆయన తన భక్త బృందంతో వచ్చి బాబాకు పూలు సమర్పించి, అఖండ నామఘోష చేశారు. తరువాత అన్న సంతర్పణ కూడా చేశారు. ధర్మాధర్మ బంధనాలు లేనివారికి, సకల బంధనాలు విడిపోయిన వారికి ప్రాణం పోవడం అనేది లేనివారికి నిర్యాణమెక్కడిది. బ్రహ్మైవ సన్ బ్రహ్మప్యేతి అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావటం పోవటం లేని సాయి మహారాజుకు మరణమెలా సంభవం?
 

బాబా శరీరం వదిలిన రోజు ఉదయం తొమ్మిది పది గంటల ప్రాంతంలో తమంతట తామే లేచి నిశ్చలంగా కూర్చున్నారు. ఇది చూసి అందరిలో ఆశ కలిగింది. బాబా అప్పుడు తన కఫినీ జేబులోనుంచి లక్ష్మి బాయికి తొమ్మిది రూపాయలు ఇచ్చారు. లక్ష్మి బాయి చాలా సుగుణవంతురాలు. బాబా ఎవరిని రాత్రివేళల ద్వారకామాయిలోకి రానిచ్చేవారు కాదు. భక్త మహల్సాపతి, దాదా కేల్కర్, తాత్యాలతో పాటుగా లక్ష్మి బాయి ఒక్క దానికి మాత్రమే ప్రవేశం ఉండేది. ఒక సారి బాబా ఆకలిగా ఉన్నదని ఆహరం తెమ్మని అడుగుతారు. ఆమె మిక్కిలి సంతోషంతో రొట్టెలు తెచ్చి బాబాకు సమర్పిస్తే, ఆ ఆహరం అక్కడ ఉన్న కుక్కకు పెడతారు. అది చూసి లక్ష్మి బాయి నొచ్చుకుంటే,
బాబా ఇలా చెప్తారు. ఎందుకు వృధాగా బాధపడతావు. కుక్క కడుపు నిండితే నా పొట్ట నిండినట్లే. ప్రాణులన్నింటి ఆకలి ఒక్కటే. ఈ కుక్క అడగలేదు అందుకే దానికోసం నేను అడిగాను. ఆకలితో ప్రాణం విలవిల లాడేవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే. అప్పటినుంచి లక్ష్మి ఈ సత్యాన్ని గ్రహించి వ్యవహరించేది. ప్రతిరోజూ బాబాకు రొట్టె ముక్కలు పాలలో వేసి తెచ్చేది. బాబా ఇది గ్రహించి మెలంగిలిన శేషం రాధాకృష్ణమాయికి పంపించేవారు. ఇలా ఆమె బాబాకు ఎన్నో సంవత్సరాలు సేవ చేసింది. బాబా ఆమెకు మొట్టమొదట 5 రూపాయలు తరువాత నాలుగు రూపాయలు ఇచ్చారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధ భక్తికి గుర్తుగానా? లేక దుర్గానవరాత్రి అయిన తరువాత సీమోల్లంఘన రోజున ఇచ్చే దక్షిణా? లేక శ్రీమద్భాగవతంలో శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవ లక్షణాలా? ఇలా బాబా ఇచ్చిన దక్షిణ గురించి ఎన్ని రకాలుగానైనా చెప్పుకోవచ్చు. శిష్యుడు గౌరవమర్యాదలను ఆశించనివాడు, ఏ మమకారము లేని గురుసేవాపరుడు, నిశ్చలమైన మనసు కలవాడు, పరమార్ధ జిజ్ఞాస పరుడుగా ఉండాలి. ఇదే సాయినాథుని ఉద్దేశ్యం. 

బాబా చివరి సమయంలో కాకాసాహెబు దీక్షిత్ను మరియు బూటీని వాడాకు భోజనం చేసిరమ్మని పంపించారు. వారికి ఇష్టం లేక పోయినా వాడాకు వెళ్లిన తరువాత వారికి బాబా శరీరం వదిలివేసిన కబురు చేరింది. ఆయుర్దాయ తైలం ముగిసిపోగానే ప్రాణ జ్యోతి మందగించి, బాబా శరీరం భయ్యాజీ అప్ప కోతే ఒడిలోకి ఒరిగింది. సాయి సమర్ధుని మనోగతం ఎవరికీ తెలియదు. 

మాయా శరీరం ధరించి సత్పురుషులు సృష్టిలోకి వస్తారు. వారి కార్యం పూర్తి కాగానే శరీరం విడిచి అవ్యక్తంలో కలిసిపోతారు. వారు తమ ఇచ్ఛానుసారం ఒక రూపం ధరించిన వారు జనన మరణాలకు అతీతంగా ఉంటారు. పరబ్రహ్మ వైభవం ఉన్నవారికి మరణమెలా సంభవం? సాయి పనులలో నిమగ్నం అయినట్లు కనిపించినా వారు ఎప్పుడు ఏ కర్మకు కర్త కాదు. 
  


ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!

No comments:

Post a Comment