సాయి ఎవరు? ఆయన దేవుడా! గురువా! ముస్లిం మతస్తులు భావించే ఒక పీరా!
అసలు వారెవరో, వారు అందరిలాగా పుట్టి పెరిగారా! అనే విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి జీవిత చరిత్రలు మనం చదువుతాము. సాయి విషయంలో మాత్రం పుట్టు పూర్వోత్తరాలు ఉండవు. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో భావనలు మనం చూస్తాము. ఒక్కొక మతం వారి వారి ఆలోచన పరిధిలో భగవంతుడు ఇలా ఉంటాడు, మనం ఇలా ఆరాధిస్తే ఆ భగవంతుడిని చేరుకుంటాము అనే విషయాలను చెప్పారు. ఏ మతం సరిఅయినది? ఏ దారి మనలను భగవంతుడి దగ్గరకు తీసుకుపోతుంది? అనే ప్రశ్నలు మనలను వేధిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గురువు ఒక్కో మార్గం చెప్పారు. అప్పడు మనం ఏమి చేయాలి? ఏ మార్గం ఎంచుకోవాలి? ఆ మార్గం ఎదో మనకు ఎలా తెలుస్తుంది?
భగవంతుడు మాత్రం ఒక మార్గానికె పరిమితం కాదు, అన్ని దారులు మనలను భగవంతుడివైపే నడిపిస్తాయి అన్న సత్యాన్ని, అన్ని మతాల సారం ఒక్కటే అన్న నిజాన్ని జీవితంలో ఆచరించి చూపించారు బాబా. మనం ఆ భగవత్ తత్వానికి ఎలా దగ్గర అవుతాము? అది ఎలా ఒక లీలా మాత్రంగా జరుగుతుంది అనే సంఘటనలను శ్రీ సాయి సత్చరితలో చూపించారు బాబా. ఒక్కొక్క భక్తుడు బాబాకు ఎలా దగ్గర అవ్వటం జరుగుతుందో ఊహించుకుంటేనే పరవశం కలుగుతుంది.
శ్రీ సాయి గురువరేణ్యులను పరబ్రహ్మగా, సర్వ దేవతా స్వరూపంగా ప్రణామాలు చేయుచు వారి చూపించిన మార్గంలో నడిచే శక్తిని మనందరికి ప్రసాదించమని వేడుకుందాము. వారు చూపించిన మార్గంలో నడవాలి అంటే మొట్ట మొదట వారు చూపించిన దారి ఏమిటి అనే విషయం అర్ధం చేసుకోవాలి. వారినుంచి మనం పొందవలిసిన అసలైన, శాశ్వతమైన సత్యం ఏమిటో తెలుసుకోవాలి. సాయి చరితకు సత్చరిత అనే పేరే ఎందుకు? వేరే పేరు పెట్టి ఉండచ్చు కదా. పేరులోనే ఈ సత్యం ఉంది. సాయి ఈ గ్రంధం ద్వారా సత్యాన్ని మాత్రమే బోధించారు. సత్యాన్ని చెప్పే గ్రంధం కాబట్టి ఇది శ్రీ సాయి సత్చరితగా బాబా మనకు ఇచ్చారు. మనం మన కోరికల కోసం పారాయణ చేసినా చివరికి సత్యాన్ని బోధించే గ్రంధం ఈ గ్రంధరాజం. బాబా అప్పట్లో గురు చరిత్ర చదవమని కొంతమందిని ప్రోత్సహించేవారు. ఎందుకంటే పరమగురువుల గురించి తెలుసుకుంటే మనకు సత్యం ఏమిటో బోధపడుతుంది.
శ్రీ సాయి సత్చరితను మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని, బాబా చూపించిన దారిలో నడుద్దాము. ప్రతి ఒక్కరి జీవితంలో గురువుయొక్క ఆగమనం విశేషంగా ఉంటుంది. అది ఎలా జరుగుతుందో ఊహించుకుంటేనే సంభ్రమ ఆశ్యర్యాలు కలుగుతాయి. అందుకే సాయి భక్తులారా అంతఃకరణాన్ని సాయికి సమర్పించండి, శ్రద్ద సభూరి అనే మంత్రాలను నిత్యం జపం చేయండి. అప్పుడు మనలోనే ఉన్న సత్యం సత్చరిత రూపంలో వ్యక్తం అవుతుంది. ఇదే సాయి మన నుంచి కోరుకునే నిజమైన సమర్పణ. బాబా నా వారే, నా కోసమే బాబా ఇవన్నీ చేస్తారు అన్న నమ్మకం సాయి భక్తులను ముందుకు నడిపిస్తుంది.
ఓం శ్రీ సాయిరాం !
No comments:
Post a Comment