మానవులలో ఉండే చెడ్డ గుణం లోభం. మనవి అనుకున్నవి వదలటం అస్సలు ఇష్టం ఉండదు. బాబా తన భక్తులను ఈ లోభమనే ఊబినుండి బయటకు లాగడానికే దక్షిణను అలవాటు చేస్తారు. తైత్తరీయ ఉపనిషత్ దానం గురించి ఇలా చెప్తుంది. దానం ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. ఏదైనా సరే అణుకువతో ఇవ్వాలి. అందుకే బాబా దయ కలిగి ఉండండి, సంయమనంతో ఉంటె అత్యంత సుఖం పొందుతారు అని చెప్పారు. పరమ దయాళువు అయిన సాయి భక్తులకు త్యాగం అలవాటు చేయడానికే ఈ దక్షిణను స్వీకరించేవారు. ఆయన ఫకీరు, భిక్షతో జీవనం సాగించారు. ఆయనకు డబ్బుతో పని లేదు. ఆయన ఆశ్రమాలను స్థాపించాలని కాని, ఆస్తులను కూడపెట్టాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా కొత్తవి ఏమైనా కట్టేటప్పుడు ఆయన వాటిని ప్రోత్సహించేవారు కారు. మొట్టమొదటి రోజుల్లో బాబా అసలు ఏమి తీసుకొనే వారు కాదు. ఎవరైనా ఒక పైసా ఇస్తే తీసుకునే వారు. రెండు పైసలు ఇస్తే వద్దు అనే వారు. తరువాత కాలంలో భక్తుల సంఖ్య పెరిగి, వారి కర్మల అనుగుణంగా వారు ఇవ్వాలి అనుకున్న దక్షిణ మాత్రం తీసుకునే వారు. వారు దక్షిణ అడిగారు అంటే దాని వెనక ఏదో పరమార్ధం ఉంటుంది. అలా అని అందరి దగ్గర దక్షిణ తీసుకొనే వారు కాదు. ధనవంతులను కూడా పంపించి వేరే వారి దగ్గర నుంచి దక్షిణ అడిగి తెమ్మని కోరే వారు. వారికి పేద ధనవంతుల మధ్య తేడా లేదు. ఎవరి జీవితంలో ఏది అవసరమో అది మాత్రమే చేసే వారు.
దక్షిణ అనేది ఒక్కో సారి డబ్బు రూపంలోనే కాకుండా వేరే రూపాలలో కూడా అడిగే వారు. ఒక సారి జి. జి నార్కే గారిని 15 రూపాయల దక్షిణ అడిగారు. ఆయన దగ్గర పైసా కూడా లేదు అయిన దక్షిణ అడుగుతారు. ఆయన చదివే యోగ వాసిష్టంలో చదివిన వాటిని అనుసరించి వాటినే దక్షిణగా ఇమ్మన్నారు. అలానే తర్ఖడ్ భార్యను కామ క్రోధాలనే అరిషడ్ వర్గాలను 6 రూపాయలగా ఇమ్మని అడుగుతారు. ఇలా ఎవరికి ఏది ఉపయోగపడుతుందో అది మాత్రమే కోరే వారు.
బాబాకు ఒక్కో రోజు దక్షిణగా చాలా ధనం వచ్చేది కాని సాయంత్రము అయ్యే సమయానికి బాబా అందరికి పంచేసే వారు. మరల తరువాత రోజు మామూలే. ఇలా బాబా మహాసమాధి నాటికి బాబా దగ్గర ఏమి మిగల లేదు. బాబా ఒక సారి నానా చాందోర్కర్తో ఇలా చెప్పారు. ఆయన దగ్గర ఉన్న ప్రాపంచికమైన ఆస్థి ఏమిటి అంటే, ఒక చిలుం, ఒక డబ్బా, జోలి, కఫ్నీ మరియు గోచి అని చెప్పేవారు. కాని మహానుభావుల నిజమైన ఆస్తి అందరిపట్ల, అన్ని జీవుల పట్ల సమ భావన, కరుణ, దయ, మరియు ఆత్మ స్థితి. ఇదే మనం నిజంగా నేర్చుకోవాల్సిన, అనుసరించాల్సిన మార్గం. ఈ మార్గమే షిర్డి మార్గం అంటే సాయి మార్గం.
ఓం శ్రీ సాయిరాం!
No comments:
Post a Comment