బాబా దక్షిణగా తీసుకున్న దానిని ఎక్కువగా అందరికి పంచేవారు. కొంత పైకాన్ని ధునిలోకి కావాల్సిన కట్టెలను కొనేవారు. అందులోనుంచి వచ్చే బూడిదే ఆయన అనుగ్రహంతో అందరికి ఊదిగా పంచేవారు. మనకు ఊది గురించిన లీలలు తెలుసు. బాబా ఎందుకు ఊది ఇచ్చారు. ఈ విభూతి ప్రకృతి యొక్క నశ్వరతత్వాన్ని బోధిస్తుంది. ఈ సకల విశ్వం దానిలోని వస్తువులు బూడిదవంటి వని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. శరీరంలో నుంచి జీవుడు వెళ్ళగానే కుప్పకూలుతుంది. ఇది బూడిద అని నిరూపిస్తుంది. మీది, నాది కూడా ఇదే పరిస్థితి. ఇది మీరెప్పుడూ తెలుసుకోవాలని ఊది ఇస్తాను అని బాబా చెప్తారు. ఇక్కడ విభూది యొక్క తత్వార్ధం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. బాబా దక్షిణ తీసుకోవడానికి కూడా కారణం ఈ వైరాగ్యాన్ని మనకు నేర్పించేందుకే.
బాబా చాలా ఉల్లాసంగా ఒక పాట పాడేవారు. "రమతే రామ ఆయోజి, ఆయోజి ఉదియాంకి గోనియా లాయోజి!" రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు, ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. బాబాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం అయ్యుండాలి లేకపోతే అంత ఉల్లాసంగా ఎందుకు పాడేవారు. ఆ రామనామం ఇచ్చేటువంటి పరమానందం కంటే మోక్షం ఇంకెక్కడ దొరుకుతుంది. దక్షిణ ఇచ్చి ఊది తీసుకుంటే గాని అది అర్ధం కాదు.
ఒక సారి నారాయణ మోతిరాం జాని అనే బాబా భక్తుడు తన స్నేహితుడికి తేలు కుడితే బాబా ఊదికోసం చూస్తాడు. కాని ఊది దొరకక అక్కడ బాబా పటం దగ్గర ఉన్న అగరువత్తుల బూడిద తీసుకొని బాబాను స్మరించుకొని ఆ ఊదీని తేలు కుట్టిన ప్రదేశంలో రాస్తాడు. అతనికి నెప్పితగ్గి ఉపశమనం కలుగుతుంది. అలానే ఇంకొక బాబా భక్తుడు తన కుమార్తె ప్లేగు వ్యాధిసోకి బాధపడుతూ ఉంటె నానా చాందోర్కర్ గారిని ఊది పంపమని కోరతాడు, కాని నానా ఆ సమయంలో ప్రయాణంలో ఉంటాడు. తన దగ్గర ఊదిలేక రోడ్డు మీద కొంచెం మట్టి చేతిలోకి తీసుకొని సాయి నామ జపం చేసి తన భార్య నుదిటిపై రాస్తాడు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూసేను. అతడు ఇంటికి పోవుసరికి ఆతండ్రి తన కుమార్తెకు జబ్బు తగ్గేనని చెప్పెను.
బాబా ఈ ఊది ద్వారానే నానాచందోర్కర్ కుమార్తె మైనతాయికి సుఖ ప్రసవం జరిగే లాగా చేసి తన, తన బిడ్డ ప్రాణాలను రక్షించారు. బాబా కలరా వ్యాధిని షిరిడీనుంచి దూరంగా తరిమికొట్టారు. ఇలా బాబా తన భక్తులను ఎప్పుడు రక్షిస్తూనే వుంటారు.
సాయి భక్తులారా మనందరం సాయిపై నమ్మకంతో ఎలాంటి ఉపద్రవాలైన ఎదుర్కోవచ్చు.
ఓం శ్రీ సాయిరాం!
No comments:
Post a Comment