Play Audio |
బాబా రక్షణ కవచం
1. బాబా పది రూపాయల
రూపంలో అనుగ్రహం
మహల్సాపతి, అతని
కుటుంబం చాలాసార్లు ఆహారం లేక పస్తులు ఉండవలసి వచ్చేది. అట్లా ఒకసారి వారి కుటుంబం
చాలా రోజులు ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే బాబా మహల్సాపతి భార్యకు నేనే మీ ఇంటికి
వస్తున్నాను కాదనకండి అని చెప్పారు. అదే సమయంలో దీక్షిత్ గారు 10 రూపాయలు మహల్సాపతి
గారికి ఇవ్వ నిశ్చయించి బాబా దగ్గరకు వచ్చి బాబా దాన్ని పంపించమంటారా అని అడగ్గా,
బాబా పంపించు అన్నారు. ఆయన ఎవరికి, ఏమిటి అని కూడా చెప్పలేదు బాబాకి సర్వము
తెలుసు. అప్పుడు మహల్సా కుటుంబం దాన్ని స్వీకరించడం జరిగింది. బాబాయే ఆ రూపంలో
వచ్చారని వారు భావించి, దానిని తీసుకోవడం జరిగింది.
2. రెండు పాముల
గురించి హెచ్చరిక
అప్పట్లో షిర్డి
గ్రామంలో చాలా పాములు ఉండేవి. ఒకసారి సాయంత్రం సమయంలో మహల్సాపతి ద్వారకామాయి నుండి
ఇంటికి వెళ్ళబోతున్నాడు, అప్పుడు బాబా "మహల్సా నీకు ఇద్దరు దొంగలు
ఎదురవుతారు" అని చెప్పారు. అట్లానే మహల్సాపతికి
రెండు పాములు కనిపించాయి. ఒకటి ద్వారకామాయికి దగ్గరలో, ఇంకొకటి ప్రక్కనున్న ఇంటి
దగ్గర కనిపించాయి.
మరొకసారి బాబా మహల్సాపతితో
ఇట్లా చెప్పారు. "నీవు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు దీపంతో రా! నీవు ఒక దొంగను
చూస్తావు." అట్లానే మహల్సాపతి దీపం తీసుకుని బయలుదేరాడు. అతని ఇంటి బయట ఒక
పాము కనిపించింది. ఇలా బాబా మహల్సాను హెచ్చరించడం జరిగింది.
3. మహల్సాపతిని
నడుము వాల్చవద్దని హెచ్చరిక
ఒకసారి బాబా
మహల్సాపతిని ఈ విధంగా హెచ్చరించారు. "నీ వీపుని నేలకు మాత్రము
ఆనించవద్దు." ఈ హెచ్చరికను మరిచి మహల్సాపతి, చక్కగా బర్ఫీని తిని, మత్తు
వచ్చి నడుము వాలుస్తాడు. అంతలో స్పృహ కోల్పోతాడు. నిద్రలో మాట్లాడుతు కాళ్ళు అలాగే
చాపుకొని పడుకుంటాడు. అతనికి మళ్ళా స్పృహ వచ్చిన తరువాత అతని కాళ్ళని మడవలేకపోతే,
అతని కూతుళ్ళు మర్ధన చేస్తారు. అప్పుడు నడవగలిగి బాబాదగ్గరకు వచ్చినప్పుడు బాబా
"అరే నీకు పడుకోవద్దని చెప్పాను కదా!" అని అన్నారు.
4. మహల్సా కుటుంబ
రక్షణ
ఒకసారి బాబా ఈ
విధంగా హెచ్చరించడం జరిగింది. ఖండోబా దగ్గర అనర్ధం జరగబోతుంది. కాని నేను ఉన్నాను
బయపడాల్సిన పనిలేదు. అప్పుడు మహల్సాపతి భార్య, పిల్లలు అందరూ ఒకసారే జబ్బున
పడతారు. అది సుమారు 1908 వ సంవత్సరం అప్పటికే చాలా మంది యాత్రికులు షిర్డి రావడం
ప్రారంభించారు. అట్లానే చాలా మంది వైద్యులు కూడా రావడం జరిగింది. వారు ఆ జబ్బులకు
వైద్యం చేస్తానన్నారు, కాని బాబా నేను చూచుకుంటాను అని ధైర్యం చెప్పారు. అట్లానే ఆ
వ్యాధులను నయంచేసారు.
ఒకసారి మహల్సాపతి భార్య
తన పుట్టింటికి వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడ ఉన్నప్పుడు, ఆమె గొంతులో గడ్డతో బాధపడింది.
ఆ విషయం భర్తతో చెప్పడానికి వీలు పడలేదు. కాని బాబా మహల్సాతో ఇట్లా చెప్పారు.
"నీ భార్యకు గొంతులో గడ్డ వచ్చింది. దాన్ని నేనుతప్ప ఎవరు తీసివేయలేరు, నేను
దాన్ని తీసివేస్తాను". ఇవన్ని మహల్సాకు తెలియక సరే బాబా అని
ధైర్యంగా ఉన్నాడు. తరువాత ఆయనకు ఉత్తరం ద్వారా ఈ విషయం తెలిసింది. అది తగ్గిపోయిన
విషయం కూడా అందులో ఉంది.
మహల్సాపతి - వియ్యంకుల దగ్గర అవమానం
ఒకసారి మహల్సాపతి
వియ్యంకుల దగ్గర నుంచి వారి ఊరికి రమ్మని కబురు వచ్చింది. అప్పుడు బాబా దగ్గరకు
వచ్చిన మహల్సాపతిని బాబా హెచ్చరించారు. వారు నిన్ను అవమానించటానికే
పిలుస్తున్నారు. మహల్సా బీదతనాన్ని వారు చులకనగా తీసుకుని ఎన్నోపరాభవాలకు
గురిచేశారు. అట్లానే బాబా హెచ్చరించినా మహల్సాపతి అతని స్నేహితుడితో కలిసి వెళ్ళడం
జరుగుతుంది. ఆయన వెళ్ళే సమయానికి వారందరూ బోజనం చేసి మహల్సాపతిని అవమానిస్తారు. తరువాత మహల్సాపతి
బాబా దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్తారు.
అస్తినా గ్రామంలో
గొడవ
ఒకసారి రామ్‌భావ్
హర్డె అనే సాయి భక్తుడు, మహల్సాపతిని వారి గ్రామమైన అస్తినా గ్రామానికి మహల్సాపతి
పురాణము చదివేందుకు ఆహ్వానించారు. బాబా దగ్గర సెలవ తీసుకునేందుకు వస్తే, బాబా
అక్కడకు వెళ్ళొద్దని, అక్కడ గొడవ, కొట్లాట జరుగుతుంది అని చెప్పారు. కాని పిలిచిన
తరువాత వెళ్ళకుండా ఉంటే మంచిది కాదని మహల్సాపతి వెళ్తాడు. అక్కడ కొంతమంది ఆకతాయి
కుర్రాళ్ళు మాట మాట మీరి, కొట్లాటకు దిగుతారు. కర్రలతో కొట్టుకుంటారు. పురాణము
చదవటానికి వచ్చినవారంతా పలాయనం చిత్తగిస్తారు. మహల్సాపతి కూడా చేసేదేం లేక
తిరిగివస్తాడు.
పండరిపురంలో విఠ్ఠల దర్శనం
ఒకసారి
మహల్సాపతికి స్వప్నంలో ఖండోబా కనిపించి పండరిపురం వెళ్ళమని చెప్పటం జరిగింది. కాని
ఆయన బీదతనం వల్ల ఆ ప్రయాణం కష్టమనిపించింది. ఎట్లాగో ఒక సంపన్నుల కుటుంబం ద్వారా ఆయన పండరిపురం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పూజారులకు
డబ్బులు ఇస్తేకాని ప్రవేశం దొరికేటట్లుగా లేదు. మహల్సాపతి దగ్గర డబ్బులేదు. ఆ జనంతో
అట్లానే నడుస్తూ ఉన్నాడు. ఇంతలో అందరికి మహల్సాపతి ముఖము ఖండోబా లాగా కనిపించి, వారందరు
ప్రక్కకు తొలగి మహల్సాపతిని లోపలకు పంపడం జరిగింది. అట్లా అతనికి విఠ్ఠల దర్శనం అయింది.
ఓం శ్రీ సాయి రామ్!