Play Audio |
బాబా మూడురోజుల సమాధి
సాయిబాబా
శరీరాన్ని వదలడానికి ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది.
కాని మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. మార్గశిర శుద్ధ
పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. శరీరధర్మాన్ని సహించటానికి ప్రాణాలను బ్రహ్మాండంలో
చేర్చారు. మసీదులోని సభా మండపంలో ఒక మూలన ఉన్న స్థలాన్ని వ్రేలితో చూపించి అక్కడ నా
సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి. మహల్సాపతితో మూడురోజుల వరకూ నన్ను వదలకుండా
జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు.
"నా సమాధి పై రెండు జండాలు ఉంచండి"
అని చెప్పుతూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. ఆకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి
తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఆ విధంగా జరిగితే, అందరికి నోట
మాట రాలేదు. బాబా యొక్క శ్వాసకాని, నాడికాని ఆడటంలేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే
అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కాని సాయి మాత్రం సుఖంగా ఉన్నారు.
మహల్సాపతి అతిజాగరుతతో అహర్నిశలూ సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు.
సమాధిని త్రవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా
అలా చేయటానికి ఎవరికి ధ్యైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి, గ్రామ ప్రజలందరూ
అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు.
మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుంచి
క్రిందకు దించలేదు. ప్రాణాలు పోయాయని తెలుసు కాని, ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని
"మూడు రోజులు ఉంచండి" అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు.
బాబా శ్వాస ఉచ్వాసలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్ని చలన రహితమయ్యాయి. ఏదీ కదిలే సూచన
లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలులేదు. వాక్కు ధృడ
మౌనం వహించినట్లుంది. మరల ఎలా స్పృహకు వస్తారు అని అందరికి చింత పట్టుకుంది. రెండు రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహరాలేదు,
మౌల్విముల్లా ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పాకులకర్ణి, కాశీరాం
వచ్చి బాగా ఆలోచించి, బాబా తన ధామానికి చేరుకున్నారు. కనుక వారి శరీరానికి విశ్రాంతి
ఇవ్వాలి అని నిశ్చయించారు.
అయితే ఇంత తొందర పనికిరాదు. కొంతసేపు
ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు. వారిమాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే
మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది? అంతా ఎంత తెలివిలేనివారు
అని అన్నారు. వారిని సరియైన వేళలో సమాధి చేయడానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి.
భక్తులందరిని పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించు కుంటూనే మూడు రోజులు గడిచిపోయాయి.
తరువాత మూడు గంటల ప్రాంతంలో బాబాలో చైతన్యం
కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాస ఉచ్వాసలు మొదలయ్యాయి.
పొట్టకూడా కదల సాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి.
మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూచాడు. సాయిబాబా కూడా తలను ఆడించారు. మౌల్వీలు ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన
సంఘటన తొలగిపోయింది. మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా, తన
నిర్ణయాన్ని ఏ కాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది.
మహల్సాపతి ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా,
గురువాక్య పరిపాలన చేసి తన నమ్మకాన్ని ఏమాత్రము సడలనివ్వకుండా మనందరికి గొప్ప ఉపకారం
చేశారు. ఈ సేవ కేవలం మహల్సాపతి గారు మాత్రమే చేయగలరు. దీనివలన బాబా యొక్క బోధలు, లీలలు
మనందరికి లభ్యం అయ్యాయి. 1886 నుంచి 1918 వరకు బాబా నిరవధికంగా ఎంతో మంది భక్తులను
సంరక్షించడం జరిగింది. మహల్సా గనక ఈ ప్రయత్నంలో విఫలం అయితే అన్న ఆలోచన కూడా మనము జీర్ణించుకోలేము.
ఇటువంటి బాధ్యతనే ఇంకోసారి బాబా మహల్సాపతికి అప్పచెప్పడం జరిగింది.
నిగోజ్‌పాటిల్ భార్యను రక్షించే ప్రయత్నం
ఒకసారి
మహల్సాపతి రోజూ మాదిరిగా, తన ప్రక్కను పరచి పడుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు బాబా
మహల్సాపతితో ఇలా అన్నారు. " రా! ఈ రోజు మనము ఒకరిని రక్షించాలి. ఒక భయంకరమైన రోహిల్లా(ప్లేగువ్యాధి)
నిగోజ్‌పాటిల్ భార్యను తీసుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అల్లా నామస్మరణలో
ఉంటాను. నన్ను ఎవరు ఇబ్బంది పరచకుండా చూసే బాధ్యత నీది" అని చెప్పారు.
అప్పుడు మహల్సా మేలుకొని జాగ్రత్తగా ఎవరు
అటువైపు రాకుండా చూస్తున్నారు. ఇంతలో అక్కడి మామల్తాదారు అతని మనుషులతో రావడం జరిగింది.
వారు బాబా దర్శనం కోసం వచ్చారు. కాస్తంత ఊదీ తీసుకుని వెళ్ళాలని వారి అభీష్టం. మహల్సా
ఎంత నివారించిన వారు అతని మాట లెక్కచేయలేదు. కాని వాళ్ళు ఊదీ అయినా తీసుకువెళ్తాము
అని ద్వారకామాయిలో ప్రవేశించడం జరిగింది. అప్పుడు బాబా సమాధికి భంగం వాటిల్లింది. బాబాకు
బాగా కోపం వచ్చింది.
"అరే భగత్ నీకు భార్య పిల్లలు ఉన్నారు,
ఎందుకు అర్ధం చేసుకోలేదు, నీకు నిగోజ్‌పాటిల్ పరిస్థితి తెలుసు ఇప్పుడు నేను చేసే పనిలో
భంగం వాటిల్లింది. పాటిల్ భార్య చనిపోయింది. సరే ఏం జరిగిందో అదీ మన మంచికే, కాని ఇంక
ఎప్పడూ ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకో" అని హెచ్చరించడం జరిగింది.
ఆ తరువాత మహల్సా దాదాపు నలబైఏళ్ళు బాబా
జరిపిన లోక కళ్యాణంలో భాగంగా నిలిచారు. ప్రతిరోజు వారు నిద్రించకుండా బాబా గుండెలపై
చేయి ఉంచి భక్తులను సంరక్షించడం జరిగింది. అటువంటి మహానుభావుడైన మహల్సాపతి గురించి
విన్నా చదివినా, అది మన పూర్వజన్మ పుణ్యం.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment