Play Audio |
సాయినాధుడు ఆర్త రక్షణుడై సదా తన
భక్తులను రక్షిస్తూ ఉంటాడు. కాని ఆయన సాకారుడై షిర్డిలో పాంచ భౌతిక శరీరంతో తన రక్షణ
బాధ్యతను నిర్వర్తించడం జరిగింది. అందరు నిద్రించే సమయంలో మరియు ఇతర సమయాల్లో తనను
నమ్మినవారిని కంటికి రెప్పలా కాపాడుకునే పరమ దైవం సాయి. ఇలా సాయి నిర్వర్తించిన స్థితికారత్వ
బాధ్యతలలో పాలుపంచుకుని కొన్ని సంవత్సరాల పాటు ఆయనతో కలిసి జీవించిన మహానుభావులలో మొట్టమొదటి
వారు మహల్సాపతి.
ధర్మార్ధ కామమోక్ష మార్గంలో ఎప్పుడూ దారి
తప్పకుండా, సాయి చూపిన శ్రద్ధ, సబూరి దారిలో నడుస్తూ సాయిని తప్ప ఏమి కోరుకోకుండా మనందరికి
మార్గదర్శిగా నిల్చిన పరమ భక్తుడు, భక్త మహల్సాపతి. అటువంటి భక్తుడి గురించి విన్నా,
చదివినా మన జన్మ ధన్యమైపోతుంది. ఈ మహానుభావుడు ఎన్ని కష్టాలు ఎదురైన ధర్మాన్ని తప్పకుండా,
ఎంత అవసరమైనా అర్ధానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, కోరికలను నియంత్రించుకొని, సాయి తప్ప
(అంటే మోక్ష మార్గంతప్ప) మరేమి ఈ జీవితంలో అవసరంలేదు అని నిరూపించిన భక్తమహల్సాపతి
ఎంతటి ఆదర్శమూర్తియో! మహల్సా అంటే అమ్మ పార్వతి, మహల్సాపతి అంటే పరమశివుడు. అందుకే
ఆయన ఖండోబా దేవుని తన జీవితం అంతా పూజించడం జరిగింది. ఆయన సాయిని గురువుగా నమ్మి ఆయనే
తన ఖండోబా అని తలచి నిత్యపూజలు నిర్వర్తించిన గొప్పమహానుభావుడు.
మహల్సాపతి కోపర్‌గాం తాలూకా లోని షిర్డి
గ్రామానికి చెందిన సదాచార సంపన్నుడు. ఆయన ఆ గ్రామంలోని చిన్న వీధి బడిలో ప్రాధమిక
విద్యను మాత్రమే అభ్యసించిన వ్యక్తి. ఆయనకు కంసాలి వృత్తి వంశపరంగా ప్రాప్తించింది.
ఆయన వంశం ఆనాటి బ్రాహ్మణులకు ఏ మాత్రం తగ్గకుండా ఆచారవ్యవహారములను ఆచరించే కుటుంబం.
ఆయనకు 7 1/2 ఎకరాల భూమి, ఒక మట్టి గోడల ఇల్లు ఉండేవి. ఆ భూమికి నీరులేక పంటలు కూడా పండేవి
కావు. వారు ఖండోబాగా కొలువై వున్నా పరమ శివుని ఆలయాన్ని చూసుకుంటూ జీవనం సాగించేవారు.
ఆయనకు ఎటువంటి ఆదాయం ఉండేది కాదు. షిర్డి గ్రామంలో ఆయన వృత్తికి తగ్గట్లు ఆభరణాలు చేయించుకునేవారు
చాలా తక్కువ. ఖండోబా ఆలయం కూడా మట్టిగోడలతో ఒకమాదిరిగా శిధిలావస్థలో ఉండేది. ఆయన ఖండోబాను
పూర్తిగా నమ్మి, ఒక గురువు కోసం ఎదురు చూస్తూ జీవిత లక్ష్యం అయిన మోక్షం కోసం పరితపిస్తూ
ఉండేవారు. ఆయన షిర్డి గ్రామానికి ఎటువంటి సాధుపుంగవులు, ఫకీరులు వచ్చిన వారిని ఆదరించి
వారికి సేవ చేసేవారు. కాశీరాం షిండే మరియు అప్పాబిల్ ఆ సాధు సంతులకు అవసరం అయిన ధన,
వస్తు సాయం చేసేవారు. ఈ రకంగా వారు ముగ్గురు షిర్డి గ్రామంలో తమ ధర్మాచరణను కొనసాగించేవారు.
సాయి పదహారేళ్ళ వయసులో వచ్చినప్పుడు కూడా,
మహల్సాపతి ఆ బాలుడు దివ్య సంపన్నుడు అని గ్రహించి సేవించినాడు. మరల సాయి చాంద్ పాటితో
పెళ్ళి బృందముతో వచ్చినపుడు ఆయనను "రా సాయి" అని పిలిచి మనందరికి సాయి అనే
దివ్య నామాన్ని ప్రసాదించటం జరిగింది. అది సుమారు 1872 వ సంవత్సరంలో జరిగి ఉండవచ్చునని
మనకి చరిత్ర చెబుతుంది. సాయి ఖండోబా ఆలయాన్ని చూసి ఆహా ఈ ఆలయం నాలాంటి ఫకీరుకు అనువైన
స్థలం కదా అన్నప్పుడు మహల్సాపతి ముస్లిం ఫకీరునకు అది సరియైన స్థలం కాదని సాయితో చెప్పడం
జరిగింది. అప్పుడు వద్దన్నా మహల్సాపతి తరువాత సాయితో కలసి మసీదులో ఎన్నో ఏళ్ళు నిద్రించడం
జరిగింది. ఆయన ముస్లింలు ఖండోబా విగ్రహాలు పగలకొట్టెదరని బయపడ్డాడు.
అప్పుడు ముస్లింలకు, హిందువులకు భగవంతుడొక్కడే, కాని నువ్వు అభ్యంతరం తెలుపుతున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను" అని సాయి వెళ్ళడం
జరిగింది. మొదట్లో అందరు సాయిని ఒక పిచ్చి ఫకీరుగా చూడడం జరిగింది. కాని మహల్సాపతి
సాయిలో ఉన్న గొప్పతనం గుర్తించడం జరిగింది. బాబా ఎప్పుడూ పరమ వైరాగ్యంతో ఉండేవారు.
ఆయన త్రిగుణాతీతుడై కాంతాకనకాలకు అతీతంగా బ్రహ్మస్థితిలో ఉండేవారు. మహల్సాపతి కూడా
చాలా వైరాగ్యంతో బాబాని గురువుగా భావించి శ్రద్దా భక్తులతో పూజించేవాడు. బాబాను పూజించినవారిలో మహల్సాపతి మొట్టమొదటి వాడు. ఆయన ప్రతిరోజు ద్వారకామాయికి వెళ్ళి బాబాని పూలతో పూజించి
బాబా కాళ్ళకి, మెడకు గంధం రాసి, పాలను సమర్పించేవారు.
అప్పట్లో నానాసాహెబ్ డెంగ్లే కూడా ఈ ప్రయత్నం చేస్తే బాబా, నానాను అక్కడవున్న స్తంబానికి పూజచేయమని
చెప్పడం జరిగింది. ఆ తరువాత కొన్ని రోజులకు దగ్గుభాయి సహాయంతో ఆయన కూడా బాబాకు సేవచేయడం
జరిగింది.
మహల్సాపతి సాయితో ఎంతో సన్నిహితంగా ఉండడం
జరిగింది. ఆయనకు ఎటువంటి సంపాధన లేక, తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో, విసుగు చెంది
వున్నప్పుడు, ఖండోబా ఆయనకు రెండు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖండోబా ఉత్సవ విగ్రహాలను
తన ఇంటికి తీసుకువెళ్ళి పూజలు జరిపించడం మరియు ఆయన కంసాలి వృత్తిని వదలమని చెప్పడం.
ఇలా పూర్తివైరాగ్యంతో, బాబాతో ఒక రోజు చావడిలో మరొక రోజు ద్వారకామాయిలో నిద్రించడం
జరిగింది. అది 1896వ సంవత్సరం, బాబా ఒక రోజు మహల్సాపతికి ఇట్లాచెప్పడం జరిగింది.
"అరె భగత్: ఈ ఫకీరు మాట కొంచం విను, నా మాటలు సత్యం, నువ్వు ఎప్పుడూ ఇక్కడే నిద్రపోతావు
ఇక నుంచి ఇంటి దగ్గర నిద్రపో. నీకు ఒక కొడుకు పుడతాడు" అయినా మహల్సాపతి బాబాను
వదలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. తరువాత అతని స్నేహితుడు అయిన కాశిరాం ఒత్తిడితో ఇంటి
దగ్గర నిద్రపోవడానికి ఇష్టపడతాడు. 1896 జన్మాష్టమికి ఆయన ఇంటిదగ్గర నిద్రపోవడం మొదలుపెట్టాడు,
సరిగ్గా ఒక సంవత్సరంలో చక్కటి కొడుకు పుట్టడం జరిగింది. ఆయనకు కొడుకు పుట్టిన తరువాత
మరల బాబాతో నిద్రించడం జరిగింది.
మహల్సాపతి తన దగ్గర ఉన్న ఒక దుప్పటిని
పరిచేవాడు. బాబా చెక్కపై పడుకోకుండా ఉన్న రోజు, ఈ దుప్పటిపై నిద్రించేవారు. ఒక ప్రక్క
మహల్సాపతి ఇంకో పక్క బాబా నిద్రించేవారు. మహల్సాపతికి చాలా కష్టమైన భాద్యత అప్పగించడం
జరిగింది. బాబా భక్తులను రక్షించే ప్రక్రియలో యోగనిద్రలో ఉండేవారు. అప్పుడు మహల్సాపతి
బాబా గుండెలపై చేతిని ఉంచాలి. బాబా ఇట్లా చెప్పారు "నువ్వు కూర్చుని నిద్రపోకుండా,
నా గుండెపై చేతిని ఉంచవలెను, నేను భగవంతుని నామస్మరణలో ఉంటాను, అది నీకు నా గుండె చప్పుడు
ద్వారా తెలుస్తుంది. మామూలు నిద్ర కనుక వస్తే, నన్ను లేపే బాధ్యత నీది, అప్పుడు నా
గుండె చప్పుడు మారుతుంది. ఈ విధంగా బాబా మరియు మహల్సాపతి ఇద్దరూ నిద్రించేవారు కాదు.
వారు లోక కళ్యాణం కోసం రాత్రంతా భగవధ్యానంలో ఉండటం జరిగేది.
మహల్సా గొప్ప పుణ్యాత్ముడు తన ఇంద్రియాలను
చాలా వరకు తన ఆధీనంలో ఉంచుకున్న దివ్యాత్ముడు. ఆకలిని కూడా జయించిన జితేంద్రియుడు.
ఎవ్వరి దగ్గరి నుంచి ఏమి ఆశించేవాడు కాదు. బాబా ఇస్తానన్నా, తీసుకునేవాడు కాదు. బాబా
ఇలా అనేవారు అరె భగత్! ఈ మూడు రూపాయలు తీసుకో కొద్ది రోజుల్లో నీవే ఇంకొకరికి సహాయపడే
స్థితి కలిగి ఉంటావు. నీ జీవితము సుఖప్రదం అవుతుంది." అప్పుడు మహల్సాపతి,
"బాబా ఇవన్ని నాకు వద్దు నీ పాదాలను పూజించడం తప్ప నాకింకేమి అక్కరలేదు" అని అనేవాడు. మహల్సా అప్పటికే జ్ఞానవంతుడు.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment