Play Audio |
సచ్చరితకు శ్రీకారం
సాయి తొలిదర్శనం తరువాత
హేమద్‌పంత్ అత్యంత ఆనందాన్ని పొంది ఎనలేని మనశ్శాంతిని పొందాడు. బాబాకు ఎవరిచేత ఏ
సేవ చేయించుకోవాలో బాగా తెలుసు. 1911 డిసెంబర్ నెలలో హేమద్‌పంత్‌కి ప్రేరణ కలిగి
మరల షిరిడికి రావడం జరిగింది. ఈ సారి ప్రయాణంలో ఉన్న ప్రత్యేకత హేమద్‌పంత్‌కి తెలియదు.
కాని బాబా సర్వజ్ఞుడు. సర్వ మానవాళిని ఉద్ధరించే సమయం ఆసన్నమైనది. షిరిడి ప్రజలు
కలరా వ్యాధితో భయాంధోళనకు గురి అవుతున్న సమయం. అప్పుడే హేమద్‌పంత్ షిరిడికి రావడం
జరిగింది. వెంటనే బాబా దర్శనం కోసం మశీదుకు వెళ్ళాడు హేమద్‌పంత్. అదే సమయంలో బాబా
గోధుమలు విసిరేందుకు కూర్చుని ఉన్నారు. ఆయన గోదుమలు విసురుతూ ఉంటే హేమద్‌పంత్‌లో
ఏదో తెలియని అనుభూతి. ఉత్తమమైన కీర్తి గలవారి గుణాలను వర్ణించడం మరియు
ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి
వికాసవంతమవుతుంది. వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే
భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. ఆది భౌతిక,
ఆధ్యాత్మిక, ఆది దైవిక మను త్రితాపాలతో బాధపడేవారు, తమ ఆత్మహితాన్ని ఆత్మానందాన్ని
కోరుకునేవారు, సాయిచరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మసాక్షాత్కారానుభూతి పొందగలరు.
ఇలా మనసులో కలిగిన
ప్రేరణలతో సాయి మహారాజ్ యొక్క గాధను రచించాలి అని భావించాడు. ఈ సత్సంకల్పమే భక్తుల
పాలిట వరమైంది. బాబా హేమద్‌లో ఈ ప్రేరణ కలిగించి లోకానికి మహోపకారం చేశారు. ఈ
అమరమైన, అద్భుతమైన ఆలోచనా తరంగాల్లో నుంచి శ్రీ సాయి సచ్చరిత అనే అమృతం
ఉద్భవించింది.
సాయిలీలలు రాయాలన్న కోరికను హేమద్ ఎవరికి చెప్పలేదు. 5 సంవత్సరముల
తరువాత 1916లో మరల సాయి చరిత్ర రాయాలనే ఆలోచన తీవ్రమైంది. తరువాత శ్యామా ద్వారా
బాబా దగ్గర నుండి అనుమతి పొంది 1917 లో గ్రంధ రచన ప్రారంభిస్తారు. సాయి మహాసమాధి
నాటికి అంటే 1918 విజయదశమికి కేవలం 2 అధ్యాయాలు మాత్రమే రచించారు. 1929 వ సంవత్సరం
వరకు 52 అధ్యాయాలు రాయడం జరిగింది.
హేమద్‌పంత్ ఈ గ్రంథరచన
చేస్తూ సాయియే దీని రచయిత అని చక్కటి భావాలను వ్యక్తం చేస్తారు.
శ్రీ సాయితో నా సహవాసం
అంత ఎక్కువేమి కాదు. అతని నిజతత్వం నేనసలు ఎరుగను. నిజానికి నా మనసులో అవిశ్వాసమే
ఉంది. నిర్భయంగా పరిశోధనాత్మకంగా పరిశీలించే దృష్టి నాకు లేదు. నేను అనన్య భావనతో
ఉపాసన చేయలేదు. క్షణం మాత్రం నేను సాయి భజన చేసింది
లేదు. అయినా ఈ నా చేతులతో తన చరిత్రను సాయి తనే రాయించుకున్నారు. ఇదంతా సాయికి
నాపై ఉన్న అవ్యాజ్యమైన కరుణయే సుమా! సాయినాధుడు తన కార్యాన్ని ఫలవంతం
చేసుకోవటానికి నన్ను వాడుకున్నారు. నన్ను ధన్యుడుని చేశారు. అని ఎంతో చక్కగా
రాశారు.
బాబా మహాసమాధి తరువాత
హేమద్ జీవితం
హేమద్ 1916లో తను స్వయాన
కట్టించుకున్న ఇంటిలో నుంచే సచ్చరిత రాయడం జరిగింది. ప్రతిరోజు ఆయన కార్యక్రమం
నియమబద్ధంగా ఉండేది. ఉదయం స్నాన సంధ్యలు పూర్తిచేసుకుని గురుచరిత్రను, శ్రీ
విష్ణుసహస్ర నామం పఠించే వారు. ఆయనకు ఏకనాథ భాగవతంలోని శ్రీకృష్ణ నిధానమనే
అధ్యాయాన్ని చాలా ప్రేమతో చదివేవారు. ఈ నియమాలన్ని పాటిస్తూ షిరిడి సంస్థానం
శ్రీసాయిలీలా మాస పత్రికకు సంబంధించిన పనులన్ని చేస్తూ తన కార్యక్రమాలన్ని ఒక
డైరీలో రాసి ఉంచేవారు.
ఎవరైన పేదవాడు లేదా శ్రీమంతులు తనను కలుసుకోవడానికి వస్తే తమ
సమయాన్ని వెచ్చించి చాలా ప్రేమతో మాట్లాడేవారు. వారు ఎల్లప్పుడు ఉల్లాసంగా
ఉండేవారు. పేద విద్యార్ధుల చదువు కోసం వారు చాలా సహాయం చేసేవారు. ఎవరైన ఏదైనా
అడిగితే వారు ఎప్పుడు లేదనే వారు కాదు. వారు పేదరికం నుండి పైకి రావడం వలన పేదల
కష్టాలను తెలుసుకొని మరీ సహాయం చేసేవారు. ఎవరైన వస్తే వారిని భోజనం చేయకుండా
వెళ్ళనిచ్చేవారు కాదు. ఈ విధంగా హేమద్‌పంత్ ప్రాపంచికంగా ఉంటూనే పరమార్ధాన్ని కూడా
చక్కగా సాధించారు. వారు 1929 జూలై 15వ తారీఖున మధ్యాహ్నం తమ స్వంత ఇంటిలో
శరీరాన్ని వదిలివేశారు. వారి మరణం ఏ యోగులకో సంభవించే మరణంలాగా సంభవించిందని
చెప్పబడింది.
హేమద్‌పంత్ లాంటి
మహానుభావుల గురించి శ్రవణం చేసే అదృష్టం మనకు కలిగినందుకు మనము కూడా పుణ్యాత్ములమే
ఆ సాయి కృప మనపై ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశిస్తూ ఈ సత్సంగాన్ని సంపన్నము చేద్దాము.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment