Play Audio |
ఒక గురువుని పూజించగలవారు చాలా మంది ఉండవచ్చు. కాని అదే గురువుని అమితంగా ప్రేమించగలవారు చాలా తక్కువ మంది ఉంటారు. మనకు ఎంతో నిష్ట, శ్రద్ధ ఉంటేకాని ఈ ప్రేమ అనేది పుట్టదు. మనము దేవుడిని ఎన్నో అలంకరణలతో దర్శిస్తాము. మనకు ఇష్టమైన విధంగా ఆ దేవుడికి సేవలు చేస్తాము. కాని ఒక గురువు దగ్గరకు వచ్చేటప్పటికి మనము ఆ బాహ్యశరీరం దాటలేము. దీని వల్ల మనలో చాలా సంఘర్షణలు చెలరేగుతాయి. ఆయన ఇలా ఎందుకు ఉన్నారు. అలా ఎందుకు వేషధారణ ఉంది అనే ఆలోచనలు మనలను కట్టిపడేస్తాయి. ఈ ప్రేమ అనేది వీటన్నింటికి అతీతము. మనము ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే వారియొక్క అంతర్ సౌందర్యం అవగతము అవ్వాలి. బాహ్యతత్వం మీద కలిగే అభిమానం ప్రేమ కాజాలదు. అట్లే మనము బాబాను ప్రేమించాలి అంటే బాబా గురించి తెలుసుకోవాలి. ఆయన్ని నిరంతరం స్మరించాలి. వారిని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు బాబా మీద అమితమైన ప్రేమ కలుగుతుంది.
బాబా భక్తులలో ఈ ప్రేమతత్వాన్ని బహిర్గతం
చేసినవారిలో పురందరే ముఖ్యులు. బాబానే స్వయంగా పురందరే ప్రేమను కొనియాడారు. ఆయన పూర్తి
పేరు రఘువీర్ భాస్కర్ పురందరే. ఈయన ఒక సాదాసీదా వ్యక్తి. కోపంవచ్చినా, ప్రేమ పుట్టినా పురందరే యొక్క అసలు తత్వం బయట పడ్తుంది. ఆయనకు మంచి జ్ఞానులను, సాధువులను కలవాలనే కోరిక
బలంగా ఉండేది. ఆయన ఒక చిన్న గుమస్తాగా జీవితం గడిపేవాడు. ఆయనకు వచ్చే 35 రూపాయల జీతం
అంతంత మాత్రమే. ఈ డబ్బుతోనే 5 గురి పోషణ జరగాల్సి ఉంది.
పురందరే గురించిన విషయాలు ఎక్కువగా
బి.వి. నరసింహ స్వామి గారి ద్వారా మనకు తెలుస్తాయి. ఆయన మే 4వ తేది 1936వ సంవత్సరంలో
పూణాలో బి.వి.నరసింహ స్వామి గారికి ఇంటర్యూ ఇచ్చారు. అప్పుడు ఆయన వయస్సు 60 సంవత్సరాలు.
ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు భాస్కర పురందరే. ఆయన బాంద్రాలో
ఉండేవారు. ఆయన నివాసము పేరు సాయినాధ్ ఆశ్రమం. ఆయన గురించిన మరికొన్ని విషయాలు సాయిలీల
మాసపత్రిక ద్వారా తెలుస్తాయి.
సాయితో మొదటి కలయిక
పురందరేకు
సాధుసత్పురుషులను కలవాలని కోరిక బాగా ఉండేది. 1909వ సంవత్సరములో మొట్టమొదట సాయిబాబా
పేరు వినడం జరిగింది. అందరూ వారు దేహముతో ఉన్న పరమగురువులని చెప్పారు. ఇంక పురందరే
ఆలస్యం చేయడం ఇష్టంలేక వెంటనే షిర్డి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. బాబా కూడా కలలో
కనిపించి షిర్డికి రమ్మని పిలుస్తారు. షిర్డికి
వెళ్ళాలంటే ఈ గుమస్తా దగ్గర అంత ధనములేదు. తను బొంబాయి నుంచి షిర్డి వెళ్ళాలంటే సెలవు
తీసుకోవాలి. వాళ్ళ పాపకు అప్పుడు 6 నెలల వయస్సు. ఆ పిల్ల అనారోగ్యంతో ఉంటుంది. వాళ్ళ
అమ్మ ఆరోగ్యం బాగాలేని పిల్లతో ప్రయాణం వద్దని చెప్తారు. కాని పురందరే పట్టుబట్టి షిర్డికి
ప్రయాణమవుతారు. వెళ్ళిన మూడు రోజులకు పాపకు జబ్బు పూర్తిగా నయం అవుతుంది. ఇలా పాపకు
పూర్తిగా నయమవడంతో పురందరేకు బాబాపై అమితమైన ప్రేమ కలుగుతుంది. బాబాకు తెలుసు ఇది ఒక్క
జన్మ సంబందం కాదని, ఋణానుబంధం ఉన్నదని. బాబా కూడా వారికి ఇంటికి వెళ్ళేందుకు అనుమతిని ఇవ్వలేదు. వారు దాదాపు 13
రోజుల పాటు షిర్డిలో ఉంటారు. పురందరే బాబాను ఒక్క కోరిక కూడా కోరలేదు. బాబా పురందరే
తల్లితో మాట్లాడుతూ మా అనుబంధం ఏడు శతాబ్దాల నాటిది. నేనతడిని మర్చిపోను అతను వేలమైళ్ళ దూరంలో
ఉన్నా, నేనెప్పుడూ గుర్తుంచుకొంటాను. అతను లేకుండా నేనొక ముద్ద అయినా ముట్టను " అని
చెప్తారు. తరువాత బాబా అనుమతితో నాశిక్ మీదుగా దాదర్‌కు వెళ్తారు.
ఇక్కడ బాబా కూడా ఆ ప్రేమతత్వాన్ని వెల్లడించారు.
పురందరే బాబాను కలిసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఆయనకు ఎన్నో సమస్యలు, పాప ఆరోగ్యం
బాగుండలేదు, ఆయనేమో చిన్న గుమస్తా, వాళ్ళ అమ్మ వద్దని వారించింది. ఇన్ని అడ్డంకులు
ఉన్నా బాబాతో ఉన్న ప్రేమానుబంధం ఆయనను షిర్డికి లాక్కుని వెళ్ళింది. సాయి భక్తులమైన
మనము ఈ ప్రేమను అర్ధం చేసుకోవాలి. ఈ అంశం గురించి భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది.
పూర్వాభ్యాసేన
తేనైవ హ్రియతే హ్యవశః ఆపి సః |
జిజ్ఞాసురపి
యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే ||
అర్జునుడు యోగ బ్రష్టుల గురించి అడిగిన
ప్రశ్నకు శ్రీ కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ఎవరైతే పూర్వజన్మలలో ఎంతో సాధన చేసి
చనిపోతారో వారు మరల వచ్చే జన్మలో నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితులవుతారు. జిజ్ఞాసువులై
సకల కర్మలకు అతీతంగా ఉంటారు. ఇక్కడ పురందరే అదే చేశారు. బాబాపై తెలియని ప్రేమ, ఋణానుబంధం,
అలానే ప్రాపంచిక కోరికలను కోరలేదు. తన జీవితము చాలా కష్టతరమైనా కాని బాబాను ఏమీ అర్ధించలేదు.
మొదటి దర్శనంలో బాబాచేసిన బోధ
పురందరే
విష్ణుమూర్తిని ఆరాధించేవాడు. బాబా పురందరేతో మాట్లాడుతూ అదే ఉపాసన కొనసాగించవలసినదిగా
చెప్పాడు. పురందరేను "రామ్ బావ్" అని పిలిచేవారు. బాబా ఆయనను కేవలం రెండు
రూపాయలు మాత్రమే దక్షిణగా అడిగేవారు. ఒకసారి పురందరే బాబాను కేవలం రెండు రూపాయలు మాత్రమే
అడుగుతున్నారు అని వాపోయాడు.
బాబా: "నేను అడిగింది
నువ్వు అనుకుంటున్న రూపాయలు కాదు. ఒకటి నిష్ట (అనన్యమైన నమ్మకము), రెండవది సబూరి (సంతోషంతో
కూడిన ఒరిమి)" అని అన్నారు.
పురందరే
:
"అవి నేనెప్పుడో మీకు సమర్పించాను".
బాబా
:
అలాగే! నీ నిష్ట చెదరకుండా కాపాడుకో, అంతేకాక నీవు చేసిన వాగ్దానాలన్ని నెరవేర్చు.
నీవు ఎప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకో, అప్పుడు నీవు ఎక్కడ ఉన్నా అన్ని సమయాలలో నేను
నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు.
పురందరే
:
"బాబా మీరు చెప్పినట్లే నడుచుకొంటాను. కాని నా మనస్సు నా ఆధీనంలో ఉండేటట్లు మీరు
అనుగ్రహించాలి".
బాబా
:
"అలాగే" అని అభయం ఇచ్చారు.
ఇలా పురందరే మొదటి కలయిక ఎంతో అపురూపంగా
ప్రేమానురాగాల భరితమై, పురందరే యొక్క భావిజీవితానికి పునాది వేసింది.
స్వంతఇల్లు - బాబా ప్రోత్సాహం
బాబా
మామూలుగా వైరాగ్యంతో ఉండమని చెప్తారు. కాని పురందరే విషయంలో బాబా చాలా పట్టుబట్టి మరీ అతనిని ఒక ఇంటి యజమానిగా చేశారు. ఒకసారి పురందరే షిర్డి వచ్చినప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు.
"బావ్ నువ్వు ఒక స్థలం కొని, దానిలో తొందరగా ఒక బంగళాకట్టు" అని అన్నారు.
పురందరే మనసులో ఈ విధంగా అనుకున్నారు.
నేను నెలకు 35 రూపాయలు జీతంతో బతికేవాడిని, స్థలం కొని ఇల్లు కట్టడం అంటే మాటలా. బాబా
పురందరేను బాగా విసుక్కునేవారు. బావ్ నేను చెప్పిన మాట వినటం లేదు అని అందరికి చెప్పేవారు.
ఒకసారి బడే బాబాను పంపించి నేను మనిషిని అనుకుంటున్నాడా, రాక్షసుడు అనుకుంటున్నాడా! వాడికి
చెప్పు ఇల్లు కట్టమని. బడే బాబా వచ్చి పురందరేతో
మాట్లాడి ఆయన ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకుని బాబా ఇట్లా ఎందుకు చెప్తున్నారు అని
వెళ్ళిపోతాడు. బాబా ఒకసారి రాళ్ళు కూడా విసురుతారు. ఒకసారి నానా చందోర్కర్, కాకా దీక్షిత్
కలసి బాబా మేము ఇళ్ళు కొనిపెడతాము అని అంటే బాబా ఒప్పుకోలేదు. "ఎవ్వరినీ ఒక్క
పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను." అని బాబా అన్నారు.
తరువాత పురందరే ఆఫీసులో ఒకతను దగ్గర
500 రూపాయలు అప్పు తీసుకుని స్వంత ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ స్నేహితుడు
ఏ పత్రం లేకుండా అప్పు ఇచ్చాడు. ఈ స్థలం ఊరి చివర, అక్కడ మరేమి ఇళ్ళు లేవు. తరువాత కట్టే
గోడల్లో నెర్రులు వచ్చి పురందరే బాధ పడ్తాడు. కాని అన్ని సర్దుకుని చివరకు ఏ అవాంతరాలు
లేకుండా ఇళ్ళు పూర్తి చేస్తాడు. ఆ ఇళ్ళు పూర్తి చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది.
వాళ్ళు గృహప్రవేశం చేసి, ఉండటం ప్రారంభిస్తారు. కాని అది జన సంచారం లేని ప్రదేశం. పురందరేకు
భార్యను ఒక్కదానినే ఇంట్లో ఉంచేందుకు భయపడేవాడు. బాబా ఒక్కరోజు బావ్ ఎందుకు భయపడ్తావు
నేను మీ ఇంట్లోనే ఉన్నాను అని ధైర్యం చెప్తారు.
ఈ సంఘటన ద్వారా బాబా పురందరేను ఇళ్ళు
కొనేదాకా పరుషమైన మాటలతో తొందర పెట్టారు. బాబా మామూలుగా ఇలా ఎవరిని తొందర పెట్టిన సంఘటన
చూడలేదు. ఇక్కడ ఏదో మర్మం ఉంది. లేకపోతే బాబా ఇలా చెయ్యరు. ఆయన పురందరేను ఎప్పుడూ రక్షిస్తూ
వచ్చారు. పురందరే కూడా తనకు స్వంత ఇళ్ళు కొనుక్కునే స్థోమత లేకపోయినా కేవలం బాబా ఆజ్ఞను
పాటించి ముందుకు సాగాడు. పురందరేకు తెలుసు బాబానే తన భక్తులను రక్షిస్తారు అని.
బాబా పురందరే భార్యను కలరా నుంచి రక్షించుట
పురందరే
బొంబాయిలో ఇళ్ళు కట్టుకున్న తరువాత ఒకరోజు షిర్డి నుంచి తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి
వెళ్ళేసరికి తన భార్య కలరా వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమెకు చాలా విరోచనాలు అయ్యాయి. బాగా
నీరసించి పోయింది. ఒక డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఆమె నాడి బాగా లోతుగా కొట్టుకుంటుందని
ఆమె శ్వాస దాదాపు కష్టమై పోయిందని చెప్పి, ఆమె బతకటం కష్టమని దేవుడ్ని నమ్ముకోమని చెప్పి
డాక్టర్ వెళ్ళిపోతాడు. సాయినాధుడే పురందరేకు దైవం. ఇంతలో బయటికి వెళ్ళి చూస్తే తన ఇంటి
దగ్గర ఉన్న మారుతి ఆలయం దగ్గర బాబా నుంచుని ఉన్నారు. బాబా ఇలా చెప్పారు "ఆమెకు
ఊది తీర్ధం ఇవ్వు" అని మాయమయ్యారు. పురందరే ఇంట్లోకి వచ్చి తన దగ్గర ఉన్న ఊదిని
నీళ్ళలో కలిపి భార్యతో తాగించాడు. ఆమె ఒక గంటలో మామూలు మనిషి అయ్యింది. ఆమె శ్వాస బాగా
ఆడటం మొదలుపెట్టింది, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. తరువాత డాక్టర్ వచ్చి ఆమెను
చూసి ఆమెకు ఏమి మందు ఇచ్చారు? అని అడిగారు పురందరే వెంటనే బాబా ఊది తీర్ధం ఇచ్చాము
అని చెప్పాడు.
అట్లానే బాబా ఇంకోసారి కూడా పురందరే భార్యను రక్షించడం జరిగింది. ఒకసారి ఆమె
ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా వచ్చారు ధుని నుండి వెచ్చని ఊది తీసి
పెడుతున్నారు. నా శరీరం అంతా కాలిపోతుంది అంటూ కలవరించ సాగింది. తరువాత ఆమెకు ఆరోగ్యం
చేకూరింది. ఇలా ఆమెకు బాబా చాలా సార్లు కనిపించేవారు.
బాబా పురందరే తల్లికి విఠలునిగా దర్శనం
పురందరే
తల్లిపై చాలా ప్రేమను చూపించేవాడు. 1913 లో ఆమెకు పండరిపురం వెళ్ళాలని అనిపించి చాలా
ఒత్తిడి చేసింది. పురందరే ఈ విషయం బాబాకు చెప్పలేదు. తరువాత ఆమె మసీదుకు వచ్చినప్పుడు
అమ్మా! పండరి ఎప్పుడు బయలుదేరుతున్నావు? అని పురందరే తల్లిని బాబా అడిగారు. ఆ రోజు
మసీదులో పురందరే భార్యకు, తల్లికి బాబా రుక్మిణి సమేత విఠలునిగా దర్శనమిచ్చారు. వాళ్ళు
ఆనందంతో పులకరించి పోయారు. ఆపై పండరి ప్రయాణం మానుకున్నారు. బాబా ఆమెను తరచూ అమ్మా
పండరీపురం ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవారు. దానికి ఆమె నా దేవుడిక్కడే ఉన్నాడు,
షిర్డియే మా పండరీ అని ఆమె చెప్పేది.
No comments:
Post a Comment