In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, November 18, 2015

పురందరే - 2


Play Audio


ప్రేమయే ఆరాధన
పురందరే బాబాను అమితంగా ప్రేమించారు. ఆయన ఏ పని చేసినా నాకు బాబాపై ప్రేమ సరిగ్గా ఉందా లేదా! అనుకుంటూ ఆదుర్దాపడేవాడు. పురందరే అంటే ప్రేమకు ప్రతీకగా నిలిచారు. ఈ ప్రేమే ఆయనను మాటిమాటికి షిర్డికి వచ్చేట్లు చేసేది. బాబా ఒక్కోసారి పురందరేకు నువ్వు మాటిమాటికి ఇక్కడకు రావలసిన పనిలేదు. నేను అంతటా ఉన్నాను అని చెప్పారు. అలానే పురందరేను దీక్షిత్‌తో ఉండమని అతని సహచర్యం వదల వద్దని చెప్పేవారు. దీక్షిత్‌తో కలిసి షిర్డి వస్తే బాబా దీక్షిత్‌ను ఎక్కువ రోజులు షిర్డిలో ఉంచేవారు. అలానే పురందరే కూడా షిర్డిలో ఉండిపోయేవాడు. ఒకసారి ఇలా షిర్డిలో ఉండి ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ పనిచేసే ఫోర్‌మెన్ పైఅధికారికి పిర్యాదు చేస్తాడు. ఎందుకు పనికి రాలేదు, ఎక్కడకు వెళ్ళావు అని అడిగితే ఇదిగో నా రాజీనామా తీసుకో అని ఇస్తాడు. ఆపై అధికారి విల్సన్ అనే ఆయనకు పురందరే సంగతి తెలుసు, బాబా దగ్గరకు వెళ్తాడని తెలిసి, ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. పురందరే దైర్యంగా నా బాబా దగ్గరకు వెళ్ళాను అని చెప్తాడు. అప్పుడు ఆధికారి రాజీనామ పత్రం చించివేసి చెత్త బుట్టలో వేస్తాడు. తరువాత ఆరు నెలలకు పురందరేకు ప్రమోషన్ వచ్చి ఆ ఫోర్‌మెన్ తనకు క్రింది ఉద్యోగి అయ్యాడు. పురందరే తన జీవితంలో బాబాను ప్రేమించటం తప్ప ఇంకేమి లెక్కచేయలేదు. ఇదియే ఉత్తమ భక్తుని లక్షణం. మనమందరం పూజలు చేయవచ్చు, మంచి ఉపాసకులు అవ్వచు. కాని ఈ ప్రేమతత్వం లేనిదే మనము మంచి భక్తులము అవ్వలేము. 

              ఒకసారి పురందరేకు షిర్డికి వెళ్ళాలని అనిపించింది. పొద్దునే నిద్ర లేచి వెళ్తామని నిద్రలోకి జారుకున్నాడు. బాబా కలలో కనిపించి "నువ్వు షిర్డికి రావద్దు వచ్చావంటే నిన్ను నేను కొడతాను, రావద్దు. ఎందుకు ఇన్నిసార్లు షిర్డికి రావాలి? నేను నీ నుంచి దూరంగా లేను. నేను నీతోనే ఉన్నాను. పిచ్చి పనులు చెయ్యవద్దు" అని చెప్తారు. తరువాత పురందరే నిరుత్సాహ పడి బాబా ఎందుకు రావద్దని చెప్పారు అనుకుంటూ ఆరోజు పనికి వెళ్తాడు. అక్కడ ఉద్యోగులందరూ ధర్నా చేస్తూ ఉంటారు. తను కనుక షిర్డి వెళ్ళినట్లయితే అధికారులు ఈ ధర్నా వెనుక పురందరే హస్తం ఉంది అని అనుకునేవారు. ఆయన వెళ్ళడం మూలానా పురందరేను చూసి దానికి పురందరేకు ఏమి సంబంధం లేదని అనుకుంటారు. ఇలా పురందరేను కాపాడి బాబా తన ప్రేమను చూపించారు.


ఈ ప్రేమతత్వాన్ని ఇంకో ఘటన ద్వారా చూద్దాము.
ఒకసారి బాబా బాగా అస్వస్థులయ్యారు. అవి 1915వ సంవత్సరం. ఎవరి ఆసరా లేకుండా బాబా కదిలే పరిస్థితిలో లేరు. ఆయన శరీరం బాగా అలసిపోయినట్లు ఉంది. బాబా అనుభవించే బాధ చెప్పటానికి  వీలు అయ్యేది కాదు. ఇదే సమయంలో పురందరే తన భార్య, తల్లితో షిర్డికి రావాలని రైల్వే స్టేషన్‌కు వస్తాడు. కాని తన మనసు మార్చుకుని తల్లిని, భార్యను ఇంటికి పంపి తనొక్కడే షిర్డి బయలు దేరుతాడు. భార్య, తల్లి వద్దని చెప్పినా వినకుండా బయలుదేరతాడు. తీరావచ్చి చూస్తే బాబా అనారోగ్యంతో ఉంటారు. పురందరే మనసు కలవరపడుతుంది. పురందరేలో ఉన్న  ప్రేమే తనను బాబా దగ్గరకు లాక్కుని వచ్చింది. 

              ఒకసారి 1916 లో బాబా, రాధాకృష్ణమాయి ఒకేసారి అనారోగ్యానికి గురి అవుతారు. అదే సమయంలో పురందరే షిర్డికి వస్తాడు. తను కోపర్‌గావ్‌కి రాగానే హసన్ అనే టాంగా నడిపే అతను ఈ విషయం పురందరేకు చెప్తారు. ఇక క్షణం కూడా ఉండలేక సరాసరి మసీద్‌కి వెళ్తాడు. అప్పుడు దాదాపు ఉదయం 8:45 - 9:00 గంటలవుతుంది. బాబా శ్వాస భారంగా ఆడుతూ ఉంటుంది. ఇది చూసి పురందర్ చిన్న పిల్లవాని వలే ఏడ్వడం ప్రారంభిస్తాడు. బాబా అప్పుడు "భావ్ వచ్చావా! నేను చాలా అలసిపోయాను. నన్ను వదలి నువ్వు వెళ్ళవద్దు. మూడు, నాలుగు రోజులనుంచి నీ కోసం ఎదురుచూస్తున్నాను. కాకాకు కూడా చెప్పాను. నువ్వు వెళ్ళి రాధాకృష్ణమాయి  దగ్గర ఉండు! షిర్డి వదలి వెళ్ళవద్దు" అని చెప్తారు.

              పురందరే అంటే బాబాకు ఎంతటి ఇష్టమో ఇక వేరే చెప్పనక్కరలేదు. తరువాత రాధాకృష్ణమాయి దగ్గరకు వెళ్తే ఆమె కూడా అనారోగ్యంతో ఉంటుంది. పురందరే ఆమెను తన తల్లి లాగా భావించి ఆమె దగ్గర నుండి కూడా మాతృ ప్రేమను పొందాడు. బాబా ఇంత అనారోగ్యం ఉన్నా తను భిక్షకు బయలుదేరారు. కాని ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే కాని నడవలేని పరిస్థితి. బాబా లెండి దగ్గరకు రాగానే పురందరే బాబాను చూసి ఏడ్వడం ప్రారంభిస్తాడు. ఆయన మనసు విలవిలలాడి పోతుంది. అప్పుడు బాబా "భావ్ ఏడవకు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది, అల్లా మియ్యా నాకు ఈ బాధ అనుభవించాల్సిందిగా ఆదేశించాడు. దీన్ని ఈ శరీరం తట్టుకోవాల్సిందే ఏడవకు. మనము ఇక్కడ ఉన్న రెండు రోజులు  మంచి, చెడు రెండు అనుభవించాలి, భయ పడకూడదు. ధైర్యంగా ఉండాలి" అని చక్కటి వేదాంతాన్ని చెప్పారు. 


పురందరే పూల మొక్కల కథ
బాబా రోజూ లెండి వనము వైపు, తరువాత రోజు మార్చి రోజు చావడికి వెళ్తూ ఉండేవారు. రాధాకృష్ణమాయి బాబా కన్నా ముందే లేచి ఆయన నడిచే దారిలో రాళ్ళు లేకుండా ఊడ్చేది. అలానే పురందరే బాబా నడిచే దారికి ఇరువైపుల మంచి ఆహ్లాదకరమైన పూల మొక్కలు నాటాలని కష్టపడి మంచి మొక్కలను సేకరించి బాబాను అనుమతి అడుగుతాడు. కాని బాబా వైరాగ్యంతో ఉన్న పరబ్రహ్మ స్వరూపము. బాబా అనుమతి ఇవ్వరు. పురందరే దిగులుగా ఏమి దిక్కు తోచక ఉంటాడు. మూడురోజులు గడుస్తుంది. ఇంకా పురందరే మనసు ఆ మొక్కలపైనే ఉంటుంది. ఆ మొక్కలన్ని పూర్తిగా వాడిపోయి ఎండిపోతాయి. పురందరే ఇంకా దిగులు పడ్తాడు. బాబా సర్వాంతర్యామి తన వైరాగ్యాన్ని ప్రక్కన పెట్టి పురందరే ప్రేమనే గెలిపిస్తారు. అప్పుడు అనుమతి ఇస్తే పురందరే బాబాను ఈ మొక్కలన్ని వాడిపోయినవి బాబా ఇవి బ్రతుకుతాయా! అని అడుగుతారు. బాబా వాటిని ముట్టుకోగానే అవి మరల జీవాన్ని పోసుకుంటాయి. పురందరే ఉత్సాహంగా వాటిని వీధికి రెండు వైపులా నాటుతాడు.




పల్లకీకి షెడ్ నిర్మాణం-పురందరే పట్టుదల
ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ వాత్సల్యం, చొరవ ఉంటాయి. మనము తాత్యా, శ్యామా అలా చొరవ తీసుకోవడం చూశాము. పురందరే కూడా అదే కోవకు చెందుతాడు. బాబా దగ్గర తను చిన్న పిల్లవాడై పోతాడు. ఒకసారి పురందరే ఇంకా మిగిలిన వారు ఎంతో ఉత్సాహంగా బాబా పటం పెట్టేందుకు ఒక పల్లకిని తెచ్చి దానికి చక్కగా వెండి వస్తువులతో అలంకరణ చేస్తారు. ఆ పల్లకిని ద్వారాకామాయికి తీసుకువస్తే బాబా మండిపడి వాళ్ళను లోపలికి కూడా రానీయరు. పల్లకి వద్దు ఏమి వద్దు అని కసురుకుంటారు. ఆ పల్లకి రాత్రంతా బయటే ఉంచాల్సి వస్తుంది. రాత్రి దొంగలు వచ్చి ఆ పల్లకిలో ఉన్న వెండి వస్తువులను దొంగలిస్తారు. ప్రోద్దునే బాబా పల్లకీ కూడా తీసుకుపోయుంటే బాగుండేది అంటారు. అప్పుడు రాధాకృష్ణ మాయి,  పురందరే ఎట్లా అయిన ఒక షెడ్ నిర్మిస్తే ఆ పల్లకి సురక్షితంగా ఉంటుంది అని అనుకుంటారు. మసీదుకి ఒక ప్రక్కన కొన్ని గుంజలు పాతితే అవతల వైపు గోడకు దీన్ని కలపచ్చు అనుకుంటారు. కాని బాబాకి చెప్తే ఒప్పుకోరు. బాబా లేనప్పుడు ఆ గుంజలు పాతి మసీదు గోడతో కలుపుతారు. తరువాత బాబా వచ్చి పురందరేను చూసి నా మసీదు గోడను పగలకొట్టడానికి నిశ్చయించుకున్నావా! అప్పుడు పురందరే ధైర్యంగా మసీదు గోడలు ఏమీ కాకుండా చూడండి అని చెప్తాడు. బాబా అట్లానే తిట్ల వర్షం కురిపిస్తారు. కాని పురందరే పట్టు వదలడు. అక్కడ నుంచి కదలకుండా కూర్చుంటాడు. తిండి తిప్పలు లేకుండా అక్కడే ఉన్న పురందరేను చూసి బాబా వీడు భార్యను, తల్లిని పస్తులు ఉంచుతున్నాడు. వీడూ  పస్తులు ఉంటున్నాడు. వెళ్ళి తినిరా! అని అంటారు. పురందరే అప్పుడు బాబా నేను వెళ్ళిన తర్వాత మీరు ఇవన్ని పీకేస్తారు నేను వెళ్ళను అని కూర్చుంటాడు. ఇక గత్యంతరం లేక బాబా దానికి అనుమతి ఇచ్చి పల్లకిని లోపల పెట్టనిస్తారు. అప్పుడు అక్కడ ఉన్న వారితో ఇలా అంటారు. "మన పిల్లవాడు మన కాలు మీద మలవిసర్జన చేశాడని, కాలు తీసుకుంటామా లేక పిల్లవాడికి హానిచేస్తామా" దాన్ని భరించాల్సిందే కదా! అని అంటారు. దీన్ని బట్టి బాబా తన భక్తులపై ఎంత ప్రేమతో వ్యవహరిస్తారు అన్న విషయం అర్ధం అవుతుంది.

బాబా రథం 


పురందరే భార్యకు సద్గతి
1920లో పురందరే భార్యకు తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. అది ఇన్‌ప్లూయంజా అని నిర్ధారిస్తారు. ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఆమె రాబోయే ఉరుసు శ్రీరామనవమి ఉత్సవాలకు షిర్డికి వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. ఆ రాత్రి బాబా ఆమెకు కలలో కనిపించి "బాధ పడకు నిన్ను తప్పక ఉత్సవానికి తీసుకువెళ్తాను" అని చెప్తారు. మరుసటి రోజు ఉదయం ఆమె కొద్దిగా కోలుకుని ఈ కల విషయం పురందరేకు చెపుతుంది. కాని ఆమె అనారోగ్యంతోనే శ్రీరామ నవమి నాడు "బాబా బాబా" అని అంటూ తన తుది శ్వాస విడిచింది. ఈమెకు బాబా సద్గతిని ప్రసాదించారు.

పురందరేకు ప్రాణరక్షణ
1932వ సంవత్సరంలో పురందరేకు కీళ్ళ జబ్బు బాగా ముదిరి, తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యాడు. మృత్యువుకి చాలా దగ్గర అయ్యాడు. యమదూతలు అతని ప్రాణాన్ని తీసుకుపోవడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి పురందరే మంచం మీద కూర్చుని తనచేతిని బాబా మోకాలిపై ఉంచారు. దగ్గరకు వచ్చిన యమదూతలను తరిమికొట్టి ఆయనను రక్షించినట్టు పురందరే గారు స్వయంగా చెప్పారు. ఇలా బాబా వెన్నంటి తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. 

బాబా పురందరేకు చెప్పిన భోదలు
సత్యాన్నే అంటిపెట్టుకుని ఉండు అని బాబా పురందరేకు చెప్పేవారు. బాబా మహా సమాధి తరువాత ఒకరోజు పురందరేకు కలలో కనిపించి షిర్డి వెళ్ళి సంస్థాన్ విధులు నిర్వహించమని చెప్పారు. అలానే పురందరే సంస్థాన్ ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. బాబా దగ్గర ఉండి పురందరే చేత పనులు చేయించినట్లు పురందరేకు అనుభూతి కలుగుతూ ఉండేది.

              పురందరేకు ప్రేమతో పాటు కోపం కూడా ఉండేది. బాబా ఇలా అనేవారు. "ఎవరైనా దూషించినా, దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాదానం ఇవ్వు, లేదా
 ఆ చోటు వీడి వెళ్ళిపో అంతేగాని వారితో పోట్లాడవద్దు. మీరు ఎవరితోనైనా తగాదా పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది." అని హితబోధ చేసేవారు.

              ఇలా పురందరేలో మార్పులు తీసుకువస్తూ జీవితంలో అవసరమైన సహాయంచేస్తూ బాబా కలకాలం రక్షించారు. బాబా చెప్పినట్లు ఈ లోకంలో మంచి, చెడులు రెండు ఉన్నట్లు, పుట్టుక - చావు కూడా ఉంటాయి. కాని బాబా ప్రతిజన్మలో మనకు తోడు ఉండి నడిపిస్తారు.



ఓం శ్రీ సాయి రామ్!

No comments:

Post a Comment